మనం ఏం కోల్పోతున్నామో తెలిపే కథాసంపుటి ‘శిశిర సుమాలు’

0
4

[శ్రీమతి వారణాసి నాగలక్ష్మి గారి ‘శిశిర సుమాలు’ అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు శ్రీధర.]

[dropcap]ర[/dropcap]చయిత్రి వారణాసి నాగలక్ష్మి గారి పదునాలుగు కథల సంపుటి ‘శిశిర సుమాలు’. ఈ కథలన్నీ ఇదివరలో పత్రికల్లో ప్రచురింపబడినవే. కొన్ని బహుమతులు పొందినవి కాగా మరికొన్ని పాఠకుల మెప్పు పొందినవి.

‘శిశిర’ పదానికి ‘వెన్నెల వలే చల్లనైనది’ అనే అర్థం కూడా ఉంది. ఈ కథలను చదివినపుడు వెన్నెల కాంతి లాంటిదేదో చదువరుల మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది కనుక ఆ అర్ధమూ ఈ కథలకు అన్వయింపదగినదే.

వారణాసి నాగలక్ష్మిగారి కథలు చాలావరకు ఎగువ మధ్యతరగతి కుటుంబాల నేపథ్యం గలవే అయినా, కథావస్తువు పరంగా చాలా విభిన్నమైనవిగా కనిపిస్తాయి. పాత్రలన్నీ మనకు బాగా పరిచయమైనవిగానే అనిపించటంతో పాఠకుడు తేలికగా వాటితో మమేకం అయిపోతాడు.

‘ఆకు కదిలినా పాటే’ అన్నట్లుగా ఏ మనిషిని కదిపినా కథే అవుతుంది. నాగలక్ష్మిగారి కథలు కల్పిత కథలుగా అనిపించవు. ఎత్తుగడ దగ్గర నుంచీ ప్రతి కథ లోనూ వాస్తవ సంఘటనలే ఆవిష్కృతమవుతాయి. పాఠకుడిని ఆద్యంతమూ ఉత్కంఠతో చదివించగల మెస్మరిజం ఆమె శైలిలో ఉంది. పదాల ఆడంబరం కనిపించదు. కానీ ఇట్టే ఆకట్టుకునే లక్షణం పుష్కలంగా ఉంటుంది. కథా గమనం, సంభాషణలు, పాత్రల మనస్తత్వ చిత్రీకరణ, తగుమాత్రంగా వర్ణనలు, ఊహించని ముగింపు – కథలకు పరిణతిని తెచ్చిపెడతాయి.

గృహహింస, బాలికలపై అత్యాచారాలు వంటి సామాజిక సమస్యలను రచయితలు వ్యాసాలుగా వ్రాస్తారు గానీ కథలుగా వ్రాయటానికి ఇష్టపడరు. ఎందుకంటే సమస్య, పరిష్కారాలు కూడా అందరికీ తెలిసినవే గనుక కథలో కొత్తగా చెప్పేది ఏమీ ఉండదు. అయినా నాగలక్ష్మిగారు అలాంటి సామాజిక సమస్యలనూ, వాటికి పరిష్కారాలనూ సూచిస్తూ కథలు వ్రాసి, బహుమతులు పొందటం విశేషం.

నాగలక్ష్మిగారి కథల్లో హీరోలు, హీరోయిన్లూ ఉండరు. సమస్యలకే ప్రాధాన్యతనిచ్చినందువల్ల పాత్రలన్నీ ప్రముఖమైనవిగానే ఉంటాయి. ముఖ్యంగా భావోద్వేగాలను తగుపాళ్లలో కలబోసినందువల్ల ప్రతి కథకూ ఆద్యంతమూ ఆసక్తిదాయకంగా చదివించే లక్షణం సమకూరుతుంది. ముగింపులో ఎప్పుడూ సానుకూలతే గాని ప్రతికూలత ఉండదు.

చదవటానికి అరగంట కన్నా ఎక్కువ సమయం పట్టని కథ ఆరునెలల తరువాతనో, ఆరేళ్ళ తరువాతనో స్మృతిపథంలో మెదిలిందంటే అది గొప్ప కథ అయితీరుతుంది. నాగలక్ష్మిగారు ఎప్పుడో పదిహేనేళ్ల క్రితం వ్రాసిన ‘ఆసరా’ కథ ఇప్పటికీ పాఠకులందరికీ గుర్తొస్తూనే ఉంటుంది. మల్లెపందిరిలాంటి మమతలతో అల్లుకున్న ‘శిశిర సుమాలు’ కథల్లో కనిపించే శశిధర్, లావణ్య, ముత్యాలు, కుసుమ, శిశిర, కల్పవల్లి, సుమాళి, వనిత మనకు ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ గుర్తుకురాక మానరు.

ఇక కథల్లోకి వస్తే – ఒకరి సాయంతో జీవితంలో పైకి వచ్చాక సాయం చేసిన వారిని మర్చిపోగూడదన్నది ‘మళ్ళీ మనిషిగా’ కథలోని సారాంశం. శశిధర్ కారు కొనాలనుకోవటం, వెంకట్రామయ్యగారు డబ్బు సాయం చేయమని అడగడానికి రావడం, స్నేహితుడి తమ్ముడు యాక్సిడెంట్ లో చనిపోవటం, పెద్దాయన శశిధర్‌ని చెంపదెబ్బ కొట్టటం – ఒకేరోజు వెంటవెంటనే జరిగిన సంఘటనలు. ఒకదానితో మరొకదానికి పొంతన లేదు. కానీ శశిధర్ గుణపాఠం నేర్చుకునేలా కథని అల్లడం రచయిత్రి నేర్పు. కథలో అంతిమంగా తానేం చెప్పదలచుకున్నారో దానికి ఊతమిచ్చే సంఘటనలను ముందుగా ప్రస్తావించటం ద్వారా ముగింపుకు బలం చేకూర్చుతారు. దీన్ని padding అంటారు. కథలో ఈ టెక్నిక్ చక్కగా కుదిరింది.

ప్రతిదానిలోనూ చివరకు పెళ్ళికొడుకు ఇంటిపేరు విషయంలో కూడా పక్కవాళ్ళతో పోటీపడే చిత్రమైన మనస్తత్వాన్ని ‘పొరుగింటీ మీనాక్షమ్మను’ కథలో హాస్యస్ఫోరకంగా బొమ్మకట్టిస్తారు రచయిత్రి. సిటీలో ఉంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ, క్షణం తీరుబడిలేకుండా ఉండే జంట, అయిష్టంగానే ఓ పదిరోజులు పల్లెటూరిలో తాతగారి ఆలనా పాలనా చూస్తూ ఉండాల్సొస్తుంది. ఆ పదిరోజుల్లోనే జీవితంలో తాము పోగొట్టుకుంటున్న ఆత్మీయత, అనుబంధం గురించి తెలుసుకుని, అసలైన దాంపత్య మాధురిని చవిచూడగలుగుతారు- ‘కలువకొలనులో వెన్నెల’ కథలో.

భర్త మరణం తర్వాత ఒంటరిదైన కుసుమ కొడుకు దగ్గర కాకుండా కూతురి దగ్గర ఉంటున్నందుకు న్యూనత చెందుతూండగా కూతురి కొడుక్కి భార్యగా వచ్చిన శిశిర ఆమె మనస్తాపాన్ని పోగొడుతుంది. ఈ కాలం అమ్మాయిలు తెలుసుకోవలసిన ఎన్నో విషయాలు ‘శిశిరంలో విరిసిన కుసుమం’ కథలో ఉన్నాయి. పసిపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలకు పరిష్కారం చూపే కథ ‘రేపటి వెలుగు’. వయసు మీదపడి భార్య మీదే ఆధారపడే అవసరం వచ్చినపుడు, అప్పటి దాకా భార్య కోరికలూ అవసరాలూ పట్టించుకోని పురుషుల్లో వచ్చే మార్పుని వ్యంగ్యంగా ఎత్తిచూపే కథ ‘వృద్ధపురుషః’. తల్లీ కూతుళ్ళ సంబంధంలో- ఆత్మీయతతో అల్లుకునే అనుబంధానికీ, ఊపిరాడకుండా చుట్టుకునే బంధానికీ తేడా తెలియజెప్పే కథ ‘చుట్టుకునే బంధాలు’. పక్కింటివాళ్ళు తమను అవసరాలకు వాడుకుంటారేమో అని దూరంగా ఉంచిన ఒక జంటకు, అవసరమైనపుడు ఆత్మీయంగా ఆదుకున్న పొరుగింటివాళ్ళ వల్ల, ఒకే చోట నివసించే వాళ్ళ మధ్య ఉండాల్సిన సత్సంబంధాల గురించిన అవగాహన కలగడం ‘ఇరుగూ పొరుగూ’ కథలో కనిపిస్తుంది.

‘వాక్యం రసాత్మకం కావ్యం’ అన్నారు. నాగలక్ష్మి గారి ప్రతి కథలోనూ రసాత్మకమైన వాక్యాలు సందర్భానుసారంగా చోటుచేసుకుంటూ ఉంటాయి. ఉదాహరణకు ఈ వాక్యాలు చూడండి.

ఉత్సాహం ఒకవైపు, ఆందోళన మరోవైపు పొట్టలో సీతాకోకచిలుకల్ని ఎగరేశాయి (మళ్ళీ మనిషిగా) , అంతరంగం మరుగుజ్జులా కనిపిస్తుంటే నేనూ లేచాను, సిగ్గుపడుతూ (ఓ మూగ మనసా), మెల్లగా వీస్తున్న చల్లని గాలీ, ఒకటొకటిగా వికసించడానికి సిద్ధమవుతున్న కలువపూలూ.. మనసుకేదో మంత్రం వేసినట్లయింది (కలువకొలనులో వెన్నెల), కుసుమ మనసులో పొంగిన దుఃఖ సముద్రానికీ, ఆమె కార్చిన దోసెడు కన్నీటికీ సంబంధం లేదు (శిశిరంలో విరిసిన కుసుమం), చెడు నించీ మనల్ని రక్షించేది సరైన జ్ఞానమే (రేపటి వెలుగు,) ప్రేమతో అల్లుకునే అనుబంధాలకీ, ఊపిరాడనివ్వకుండా చుట్టుకునే బంధాలకీ తేడా ఉంటుంది (చుట్టుకునే బంధాలు), నైతికతా, ఔదార్యం, తనకున్నది నలుగురితో పంచుకుతినే అలవాటూ- ఈ లక్షణాలు కూడా పెద్దలనించీ పిల్లలకొచ్చే ఆస్తులే (పూలపల్లి విత్తనాలు), ఇచ్చిపుచ్చుకోవడానికి ఇష్టపడనివాళ్ళు ఒంటరి ద్వీపాలైపోతారు( భూపాలం).

ఈ సంపుటిలోని కథలు చదువుతున్నపుడు కాలప్రవాహంలో క్రమంగా మనం ఏం కోల్పోతున్నామో తెలుస్తుంది. వాటిని తిరిగి ఎలా సమకూర్చుకోవచ్చో అర్థమవుతుంది. రచయిత్రి నాగలక్ష్మి గారితో పరిచయం ఉన్న ప్రతివాళ్ళకీ, ప్రతి పేజీలోనూ, ప్రతిపేరాలోనూ ఆమె ప్రతిబింబమే కనిపిస్తుంది. ఆమె శైలిలోని విశిష్టత అది. ఇంత మంచి కథలను అందించినందుకు వారణాసి నాగలక్ష్మిగారికి అభినందనలు.

***

శిశిర సుమాలు (కథలు)
రచన: వారణాసి నాగలక్ష్మి
ప్రచురణ: అన్వీక్షికి పబ్లికేషన్స్, హైదరాబాద్.
పేజీలు: 162
వెల: ₹250.00
ప్రతులకు:
అన్వీక్షికి పబ్లికేషన్స్, ఫోన్: 9705972222, 9849888773
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్: 9000413413
ఆన్‍లైన్‍లో:
https://vana.mini.store/products/5b6f9ac6-e1b9-4274-bcf2-1d041cf7c1a9?slug=vana

 

 

~

శ్రీమతి వారణాసి నాగలక్ష్మి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mrs-varanasi-nagalakshmi/

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here