[ప్రముఖ రచయిత్రి చివుకుల శ్రీలక్ష్మి గారు రచించిన ‘గిరిపుత్రులు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[నర్మదకి లెక్కలంటే బాగా ఇష్టం. ఓ రోజు లంచ్ బ్రేక్‍లో వెనక బెంచీలో కూర్చుని ఓ లెక్కతో కుస్తీ పడుతూంటుంది. అందులో లీనమైపోయిన నర్మద – ఓ అమ్మాయి వచ్చి తననే గమనిస్తూ ఉండడాన్ని గుర్తించదు. చివరికి ఆ అమ్మాయి పలకరించి – తన పేరు ఇంద్రాణి అనీ, కొత్తగా చేరాను అని పరిచయం చేసుకుంటుంది. ఆ క్షణం నుంచే ఇద్దరూ ఆప్తమిత్రులయిపోతారు. సాయంత్రం ఇంటికి వెళ్ళి తన కొత్త స్నేహితురాలి గురించి అమ్మకీ, అమ్మమ్మకీ చెబుతుంది. స్కూలు టీచరుగా పనిచేసిన అమ్మమ్మని – ఆమె స్కూలు గురించి, పిల్లల గురించి చెప్పమని అడుగుతుంది నర్మద. తమది సాధారణ పాఠశాల కాదని చెబుతూ, కళింగ ప్రాంతం గురించి, పాలకుల గురించి, శాసనాల గురించి, తన నేస్తం రాజ్యలక్ష్మి గురించి, స్నేహం కట్టే పద్ధతి గురించి మనవరాలికి అర్థమయ్యేలా చెబుతుంది సుభద్రమ్మ. తరువాత తన తండ్రి తనని టీచర్ ట్రైనింగులో వేయడం, చదువు పూర్తయ్యాకా మౌలిక శిక్షణ ఇప్పించి, తమ ఊరి ప్రాథమిక పాఠశాలలోనే ఉద్యోగం ఇప్పించడం గురించి చెబుతుంది. ఆడా మగా నేస్తం కట్టిన నేస్తులు ఉన్నారా అని నర్మద అమ్మమ్మని అడిగితే దూరం నుంచి నర్మద తల్లి అన్నపూర్ణ చెప్పవద్దన్నట్టుగా తల్లికి సైగ చేస్తుంది. తల్లిని చెప్పవద్దనా, గతం గుర్తుకొచ్చి, మనసులో అలజడి రేగి, కాసేపు వీధు గుమ్మం దగ్గర నిలబడుతుంది అన్నపూర్ణ. అక్కడ్నించి పశువుల కొట్టంలోకి వెళ్ళి, ఆవు, దూడలకు దగ్గరగా తీసుకుని ఏడుస్తుంది. అమ్మ దగ్గరకు రాబోయిన నర్మద అక్కడే ఆగిపోతుంది. అన్నపూర్ణ గతం గుర్తు చేసుకుంటుంది. ఇక చదవండి.]
అధ్యాయం-3:
[dropcap]మం[/dropcap]డువేసవి. గ్రీష్మ తాపానికి పక్షులు గూటిలోంచి బయటకు రావడంలేదు. చెట్టు కూడా ఆకులను కదిలించడం లేదు. ఇంటిముందు ఉంచిన నీళ్ళగోలెంలో నీళ్ళు తాగాలని ఉన్నా పశువులు చల్లగా ఉన్న కొట్టంలోంచి బయటకు రావడం లేదు.
పెరట్లో బాదంచెట్టు కింద చలపతి, అన్నపూర్ణ కూర్చుని ఏదో సీరియస్‌గా మాట్లాడుకుంటున్నారు.
“అను! మీ నాన్నగారిని కలిసి ఒక ముఖ్యవిషయం చెప్పుదామని వచ్చాను.”
“ఎండవేళ కదా! నాన్నగారు పడుకున్నారు. పోనీ నాకు చెప్పు.”
ఏదో చెబుదామనుకుని మొహంలోకి చిరునవ్వు తెచ్చుకుంటూ
“సీతారాముల ఆట ఆడుకుందామా?” చిలిపిగా చూస్తూ అడిగాడు.
“నీతో నేను ఆడను. ఫో” అంది.
“అదేం?”
“ఈ ఆటలో ఎప్పుడూ నువ్వే గెలుస్తావు.”
“అదేం కాదు. ఆటలో గెలుపు- ఓటములు సహజం. ఓడిపోతామని భయంతో ముందే వదిలేస్తే ఎలా? ఆడితే కదా తెలిసేది.” అంటూ
చలపతి: “వామనగుంటలాడుదమా వనితా జానకీ!”
అన్నపూర్ణ: “సామజవరద రావయ్య స్వామి రాఘవా!
ముత్యాల వామనగుంటల పీటలుంచుకునీ/
ముగ్ధా సీతా మనిద్దరమే ఆడుదామటే/”
పాడుతూనే ఇద్దరూ ఆట ప్రారంభించారు. రెండు వైపులా ఏడు గుంటల చొప్పున ఉన్న పీటలు ఇద్దరు ఆడడానికి బాగుంటుంది. ఏజన్సీ ప్రాంతం కనుక చింతపండు పిక్కలు తీసినప్పుడు కొన్ని కడిగి ఆటకోసం దాచుకుంటారు. ఒక్కో గుంటలో అయిదేసి పిక్కలు చొప్పున సర్దింది అన్నపూర్ణ.
ముందుగా ఆట తానే ప్రారంభించింది. ఒక గుంటలో చింతపిక్కలు తీసి ఒక్కో దానిలో ఒక్కోటి వేసుకుంటూ వెళ్ళింది. తరువాత చలపతి తీసుకుని అలాగే ఆడాడు. ఒక్కొక్క గుంటలో నాలుగు పిక్కలు చేరడాన్ని ‘ఆవు’ అంటారు. ఎవరి వంతు ఆటలో ఆవు అవుతుందో వారు ఆ కాయలను గెలుపుకు సూచకంగా తీసుకుంటారు. ఆట గెలిచి గుంటలోని కాయలను తీసుకోవడాన్ని ‘డిబ్బీ తీయడం’ అంటారు. ఆడుతున్నంతసేపు ఇద్దరూ గెలుస్తూనే ఉంటారు.
ఆడుతున్నంతసేపు సన్నగా పాడుతూనే ఉన్నారు.
“రెంచాము ముంచాము ఆవులను చూచి/రాముడే తా చేసెను.”
“పసిడి డిబ్బిలన్నీ పందెముల /గెల్చె పరమాత్ముడే..” ఈ విధంగా రాముడు గెలుస్తాడు.
ఇక్కడ రాముడిగా చలపతి, సీతగా అన్నపూర్ణ.
సీత ఓడిపోతుంది. సీతను గెలిపించాలనే రాముడి ప్రయత్నం. కానీ.. ఆటలో అడ్డదారులు ఉండవు. వాళ్లు ఆటలో మునిగిపోయి సమయం చూసుకోలేదు.
సంజె వాలుతోంది. అన్నపూర్ణ తండ్రి దశరథరామయ్య నిద్రలేచి మొహం కడిగి వాలు కుర్చీలో కూర్చున్నారు. భార్య ఇచ్చిన టీ తాగుతూ పరిశీలనగా అన్నపూర్ణను, చలపతిని చూస్తున్నారు.
“చూడు నాన్నా! చలపతి ఎప్పుడు వామనగుంటలు ఆడదామంటాడు. నేనెప్పుడూ గెలవను. ప్రతిసారి తానే గెలుస్తాడు.” బుంగమూతితో తండ్రికి ఫిర్యాదు చేసింది అన్నపూర్ణ.
తండ్రి మాట్లాడకపోవడం గమనించి “నీతో మాట్లాడదామని వచ్చాడట. నువ్వు పడుకున్నావని మేమిద్దరం కాసేపు ఆడుకున్నాం.” అంటూ ఇంట్లోకి వెళ్లిపోయింది.
చూస్తూనే తన కూతురు పెద్దదైపోయింది. మాటలో, అలంకరణలో, ముగ్ధత్వం చేరి, బాల్యపు ఛాయలు కనుమరుగవుతున్నాయి. తను ఇంక ఈ బంగారు బొమ్మకు వరుడిని అన్వేషించే పని మొదలుపెట్టాలి. ఒకవేళ వీళ్ళిద్దరూ.. ఇంత చేరికగా.. ఇంత చేరువగా.. తన అనుమానం అర్ధరహితమేమోనని దశరథరామయ్య మనసును సమాధాన పరుచుకున్నాడు. కానీ అతడు భవిష్యద్రష్ట కాలేకపోయాడు.
దశరథరామయ్య చేతికర్రతో ముందు నడుస్తుండగా చలపతి మౌనంగా అనుసరించాడు. దశరథరామయ్య అసలుసిసలైన గాంధేయవాది. ఎప్పుడు మొదలు పెట్టాడో తెలియదు.
అతి చిన్న వయసులోనే పంచెకట్టు, కమీజు, భుజాన కండువా, చేతిలో కర్ర, కాళ్ళకు కిర్రుచెప్పులు ఇది అతని వేషధారణ. మాటలలో స్వచ్ఛమైన తెలుగు, గళములో అత్యంత మాధుర్యమైన పౌరాణిక పద్యాలు, దేశభక్తి గీతాలు జాలువారుతూనే ఉంటాయి, వినే వాళ్ళందరికీ ఆహ్లాదాన్ని కలిగిస్తూ.
‘చలపతి’ లాంటి యువకులకు ఘనమైన మన్యప్రాంతం గత చరిత్ర, మన వైభవం విశదపరచి వారిని దేశానికి ముఖ్యంగా ఆ ప్రాంతానికి బలమైన యువశక్తిగా తయారు చేయాలి’ అన్నది దశరథరామయ్యగారి కోరిక.
గత 40/50 సంవత్సరాలుగా ఆ కొండల్లో తిరిగి, వారి జీవన విధానాన్ని గురించి తెలుసుకుంటూ, వారి సంస్కృతి సంప్రదాయాలను, ఆధ్యాత్మిక భావనలను, పండుగలను గురించి వ్యాసాల రూపంగా వ్రాస్తూ, మిగతా ప్రపంచానికి వారి గురించి తెలియచెప్తూ ఉంటాడు.
తాను చేయాల్సినది ఇంకా ఎంతో ఉందనీ, అప్పుడే వయసు మీద పడుతోందనీ, తన వారసులను తయారు చేయాలనే తపన ప్రారంభమైంది. కానీ ఈ మారుమూల తనకు సహకరించేవారు ఎవరు? అని అన్వేషణలోనే సంవత్సరాలు గతించిపోతున్నాయి.
మైదానప్రాంతాలలో హైస్కూల్ వరకు చదివిన వాళ్లు ఆ ప్రాంతంలో ఉండక పట్టణ ప్రాంతాలకు వలస పోతుంటారు. మిగిలిన వారిలాగా కాకుండా హైస్కూల్ స్థాయి నుండే చలపతి తన ప్రాంతానికి తన ప్రజలకు ఏమైనా చేయాలి అనే ఉద్దేశంతో చిన్న చిన్న కవితలు, కథలు రాస్తూ పత్రికలకు పంపిస్తూ ఉంటాడు.
వారి కోసం ఏం చేయాలి? అని దిశా నిర్దేశం చేసే ఉద్యమ పాటలను రాసే దశరథరామయ్య చాలా బాగా నచ్చారు. అతను రాసిన పాటలు తన మధురమైన గొంతుతో మైదానప్రాంతంలో సంత జరిగే సమయంలో పాడుతూ ఉండేవాడు. అతని గొంతు బాగుండడంతో అందరూ మూగి వినేవారు.
దశరథరామయ్య, చలం నడుచుకుంటూ కొంతదూరం చేరేటప్పటికి కొండవాలులోని చెట్టు క్రింద శుభ్రపరచిన జాగాలో, నెగడు వేసి దాని చుట్టూ కొంతమంది కూర్చున్నారు. వీరిరువురూ రాగానే అందరూ నిశ్శబ్దంగా లేచి నిలుచున్నారు. వారి చేతులలో ఏవో కాగితాలున్నాయి. ఎప్పటిలాగే దశరథరామయ్య ఒక ఎత్తైన రాయిపై కూర్చుంటే అందరూ చుట్టూ చేరారు.
“మనం ఎవరిలో మార్పు రావాలని కోరుకుంటున్నామో వారు ఆ అమాయక గిరిజనులు మన చుట్టూ ఉన్న ఈ కొండలలో అసంఖ్యాకంగా ఉన్నారు. మన సంఖ్య చాలా పరిమితం. మనం వారిలోని అజనానాని పారద్రోలి, అవగాహన తీసుకొచ్చి, చైతన్యాన్ని నింపాలి. అందుకు మనం పక్కా ప్రణాళిక వేసుకోవాలి.”
వింటున్న ఒకరిద్దరి మనసులలో వ్యతిరేక భావం పొడచూపింది. అది అతని ప్రణాళిక గురించి కాదు. ‘గతమెంతో ఘన కీర్తి కలవోడా!’ అంటూ అతను తాతల నాటి కబుర్లు చెప్పడమే కాబోలు. భౌగోళికం, చారిత్రకం అంటూ గత చరిత్ర చెప్పడం బ్రిటిష్ వారూ, రాజులూ, పోరాటాలూ, గిరిజనులూ అంటూ మొదలు పెడితే గంటలు గంటలు చెపుతారు. అందుకు వారు వ్యతిరేకం కాదు.
ప్రస్తుతం ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారంటే కొండలమీది గిరిజనులకు పండించుకునేందుకు భూములు కావాలి. తరతరాలుగా ఇక్కడ నివసిస్తున్నా తమ కొండలనూ, భూములనూ ఎక్కడో ఉన్న రాజకీయ నాయకులు 500 ఎకరాలూ, 1,000 ఎకరాలూ చవకగా కొని పడేసుకున్నారు. తాము ఆ కామందుల మొహాలు చూసిందీ లేదు. వాళ్ళు ఈ నేలతల్లి మొహం చూసిందసలే లేదు. కానీ.. తమ కష్టార్జితమంతా ఎప్పుడో ఎవడో ఒకడు వచ్చి లాక్కుని పోతాడు.
తండాల పెద్ద ‘నాయక్’ అయినా అతడికీ ఏ అధికారమూ ఉండదు. తమ దగ్గర ధనము ఎలాగూ ఉండదు. తాము కొండల్లో ప్రయాసపడి తిరిగి తిరిగి ఏరుకొచ్చిన వనమూలికలూ, కుంకుళ్ళూ, చింతపండూ అన్నీ అర్పించడమే! అందుకే దీన్ని ఎదిరించి, తమకు న్యాయం చేయగల నాయకులు కావాలి. ఈ దశరథరామయ్య పెద్దమనిషే గానీ తాము పండించుకుందికి భూములు శాశ్వతంగా ఇప్పించే ఏర్పాట్లు చేయడు. చేయలేడు. ఇవాళ తాడో పేడో తేల్చుకోవాలని వచ్చినవారు అనుకున్నారు. తామంతా అతడు రాస్తాడని కాగితాలను పట్టుకొచ్చి కూర్చున్నారు.
అందులో ఒకడు నోరు విప్పాడు. “అయ్యా! ఎక్కడో పట్టణాలలో ఉంటూ అన్నీ సుఖాలూ అనుభవించేవారికి అన్నివేల ఎకరాలేమిటి? కొండలలో, కొండవాలులలో ఎంతో కష్టపడి పోడు వ్యవసాయం చేసుకునే మనకు మనం నిలుచున్న మన కాళ్ళ కింది భూవి మనది కాకపోవడమేంది? ప్రభుత్వానికి కాయితాలు రాయండయ్యా! ఇంతకుముందు మీరు రాసిన కాయితాల వల్లేగా మనం ఇక్కడ నుంచి వలసలు పోకుండా ఆదుకున్నారు” అన్నారు.
“అలాగే రాసిస్తాను” అన్నాడు దశరథరామయ్య వాళ్ళందరి వేలిముద్రాల దగ్గరా నిశానీ అని రాయబడిన కాగితాలు అందుకుంటూ.
“అయ్యా! మీరు చీకటిపడినాక తిరగబోకయ్యా! కూసింత జాగ్రత్తగా ఉండుడి. దండాలయ్యా!” అంటూ వెళ్ళిపోయారు.
తనకు హెచ్చరికా! ఎవరి వలన ప్రమాదం ఉంటుంది? అనుకుంటూ చలపతీ, దశరథరామయ్యా తిరుగు ముఖం పట్టారు.
చలంతో ఎప్పుడూ అంటూ ఉండేవాడు, “గిరిజనులలో మార్పు కోసం మనం ఉపన్యాసాలు, ప్రవచనాలు చెబితే వారికి అర్థం కాదు. అందుకోసం మనం వారికి అర్థమయ్యే విధంగా చిన్న చిన్న పల్లవులు, అనుపల్లవులతో కూడిన పాటల రూపంలో అందిస్తే తొలుత సరదాగా ప్రారంభించి పాడుకుంటారు. తర్వాత మెల్లమెల్లగా అందులోని విషయం అర్థం కావడం మొదలవుతుంది. అందుకే నేను వీరికోసమే అనేకమైన పాటలు రాశాను. జీవితాన్ని జీవనాన్ని కూడా కళాత్మక దృష్టితో చూడగలిగే వాడు మాత్రమే ఇతరులలో మార్పులను తీసుకు రాగలడు అని నమ్ముతాను.” అంటూ ముందుగా తాను ఇన్ని సంవత్సరాలు చేసిన కృషి, తాముండే ప్రాంతం యొక్క మూలాలను తెలియచెప్పే ప్రయత్నం చేశాడు దశరథరామయ్య.
“చలం! చూడు బాబూ! ఈ భూమిపై ప్రతి ప్రాంతానికి ఒక అద్భుతమైన చరిత్ర ఉంటుంది. భౌగోళికంగా దొరికే వనరులను బట్టి కూడా ఒకోసారి దాని గొప్పతనం నిర్ణయించబడుతుంది.”
దశరథరామయ్యగారి వెనకాతలే ఆయన చెప్పే భౌగోళిక, చారిత్రక విషయాలు వింటూ నడుస్తున్నాడు చలపతి. చెపుతూ ఉన్న ఆయన మాటలు ఆపేసి మౌనం వహించడం చూసి “గురువుగారూ! ఏమైంది?” అని అడిగాడు.
“అది కాదు చలపతీ! మనం బ్రిటిష్ వారి పాలనలో ఉండేటప్పుడు దేశమంతా విస్తరించి, వాళ్లు అన్ని విధాలుగా మనలను దోచుకుంటూ ఉన్నప్పుడు మనం కష్టాలు అనుభవించామన్నా అర్థం ఉంది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన గిరిజన ప్రాంతాలలో ఏ మార్పు రాకపోవడం నాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది.
బ్రిటిష్ వారు మనలను ఎంతగా మానసికంగా బలహీనులుగా, శారీరకంగా బానిసలుగా చేసారంటే మనం స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తరువాత కూడా ఆ బానిసత్వపు భావనల నుండి బయట పడలేకపోతున్నాము. మనం వారి కంటే ఏ విధంగానూ తక్కువ కాము. మనం కూడా అన్ని రకాలుగా ఉన్నతులమనే భావాన్ని అంగీకరించలేకపోతున్నాము. అందుకే మన ప్రజలు ముందు భావస్వేచ్ఛను పొందాలి. ఆత్మన్యూనతా భావాన్ని విడనాడాలి. నేనెందులోనూ తక్కువ కాను అనే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి.
కానీ ‘భావస్వేచ్ఛ’ అంటే మనవారు ఎవరికీ భయపడకుండా అవినీతి పనులు చేయడం, మాదకద్రవ్యాలకు బానిసై సమాజానికి ఏమాత్రం ఉపయోగంలేని చీడపురుగులా తయారవడం చేస్తున్నారు. అటువంటి వారిని చూసి అందరూ అసహ్యించుకుంటారే తప్ప వాడు ఎంత స్వేచ్ఛా ప్రియుడో అని మురిసిపోరు కదా!ఇక్కడ గిరిజనులు కూడా అంతే సంతలో తన మాట చాతుర్యంతో ఒక పది రూపాయలు ఎక్కువ వచ్చేసరికి ఆ డబ్బును తాటికల్లు కొనడానికి వాడుతాడే తప్ప కుటుంబం గురించిన ఆలోచన ఉండదు.
ఇక్కడ వీరి అమాయకత్వాన్ని చూసి జాలిపడాలి తప్ప అసహ్యించుకుంటే మొత్తం వృథా!చెడు వ్యసనాల పట్ల వాటి ఫలితాల పట్ల సక్రమమైన అవగాహన కల్పిస్తే మారుతారు. మార్పు అనేది ఒక్కరోజులో రాదు. అందరిలో ఒకేసారి రాదు అన్న సత్యాన్ని దృష్టిలో ఉంచుకొని మనం అడుగులు వేయాలి. మొదటిలో సత్ఫలితాలకు బదులుగా వ్యతిరేకత ఎదురు కావచ్చు. ఆ సమయంలో మనం కొంత కఠినంగా ఉండక తప్పదు.
ఆ సంఘర్షణలో మనం ఒక విషయం మరిచిపోకూడదు. వారిని మనతో సమానంగా చూడడం కోసమే కఠినంగా ఉండాలి తప్ప, వాడి నాశనాన్ని చూడడం కోసం జరిగే సంఘర్షణ కాదు. వారు మనలను నిజమైన స్నేహితునిగా భావించి ఆత్మీయంగా మనం అందించే స్నేహహస్తం అందుకునే రోజు వచ్చేవరకు మన ప్రయత్నం ఆపకూడదు.
అసలు అప్పుడు బ్రిటిష్ వారి పాలనలో ఎటువంటి కష్టాలు మన గిరిపుత్రులు అనుభవించారో మీలాంటి యువత తెలుసుకోకపోతే మార్పు కోసం మీరు ఎలాగ ప్రయత్నిస్తారు?” ఆవేదనగా అన్నారు దశరథ రామయ్య.
“చెప్పండి గురువుగారూ! ఏం చేయమంటారు? మీ మనసులో ఉన్న మాట చెబితే నేనూ, అన్నపూర్ణా తప్పకుండా సహాయం చేస్తాము.” అన్నాడు. యధాలాపంగా అన్నా చలపతి నోటి వెంట అన్నపూర్ణ పేరు రాగానే ఒక్కసారి ఉలికి పడ్డారాయన.
“అదేంటి? తన కూతురు పేరు ఎత్తాడు?” అనుకుంటూ ఉండగానే చలం ఇలా అన్నాడు.
“గురువుగారూ! మన గిరిజన ప్రజల జీవనవిధానం మీకు పూర్తిగా తెలుసు. మీరు రోజూ కొంచెం కొంచెం చెప్తూ ఉంటే ఇంటిదగ్గర అన్నపూర్ణగారు రాస్తారు. ఇక్కడ సాయంత్రం సమయంలో ఒక దగ్గర కూర్చుని మీరు చెప్తూ ఉంటే నేను రాస్తాను. మనం దీన్ని అక్షరబద్ధం చేద్దాము.
మనం ఒక పత్రికలాగా రాతప్రతిలో అందజేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువమందికి చేరుతుంది. ‘గిరిపుత్రులు’ పేరుతో లిఖితపూర్వకమైన మన పత్రికను మైదానప్రాంతంలోని ప్రజలకు అందేటట్లు చేస్తే వాళ్లు మన గురించి మన కష్టాలను గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది కదా!” అన్నాడు.
“అవును చలపతీ! నా మనసులోని మాటను గ్రహించావు. తప్పకుండా మనం అలాగే చేద్దాం. ఎందుకంటే నేను ఇదివరకులాగా ఆ కొండలూకోనలూ తిరగలేను కదా! పెద్దవాడిని అయ్యాను.
చలపతీ! ఇందాక చెప్పాను కదా! మన్యం ప్రాంతం సముద్ర మట్టానికి 5,000 అడుగుల ఎత్తున, నదులు, కొండవాగులూ, జలపాతాలతో కనువిందు చేస్తాయి. ‘ఆదివాసులు’గా పిలువబడే ప్రజలు జాతాపు, కోయ, సవర, చెంచు, ఎరుకలు, బొంగ, బాన, కోన, నొగం, పంగు, బొడియా శాఖలకు చెందిన వారు. అలాగే గిరిజన తెగలకు చెందిన భగవత, వాల్మీకి, పైడి, కొండదొర, కొండ కాపు, కొండ రెడ్డి, మన్నెదొర, గొడియా, గదబ, ఖోండు మొదలైన గిరిజన తెగలు వారున్నారు.
వీరు ఆ కొండకొమ్మున ఒక ఐదు కుటుంబాలు, ఈ కొండ దిగువన ఒక పది కుటుంబాలుగా విసిరేసినట్లుంటారు. మైదానప్రాంతాల్లో కోటలు కట్టుకుని వీరిని పాలించేవారిని ‘కొండ జమీందారులు’ అంటారు.
బ్రిటిష్ వారు తాము పరిపాలించేటప్పుడు భారతదేశంలోని ప్రజల నుండి పన్నులు వసూలు చేసుకుందికి అనేకరకాల విధానాలు అనుసరించారు. పన్ను కట్టనివారిని కఠినంగా శిక్షించేవారు. ఎలాగంటే రక్తం వచ్చేలా కొరడాదెబ్బలు కొట్టడం, వారి ఇల్లూ, పశుసంపదా, భూములు జప్తు చేయడం.. అంతేనా! వారి భార్యా పిల్లలపై అత్యాచారం చేయడం, నగ్నంగా వారిని గ్రామంలో తిప్పడం, వారి భూములను ఇంకొకరికి ఎక్కువ పన్నువేసి ఇచ్చేయడం మొదలగునవి చేసేవారు.
ఈ కొండ జమీందారులు తన అధీనంలో ఉన్న రైతులూ, గిరిజనులూ హింసించబడటం చూడలేకపోయేవారు. జమీందార్లు కఠినంగా ఉండకపోతే వారి పరిస్థితి కూడా అలాగే ఉండేది. ఎందుకంటే జమీందారులను మంచి చేసుకుందికి వారి భూభాగాలపై శాశ్వత హక్కులు ఉన్నాయని చెప్పేవారు. కానీ వసూలు చేసిన శిస్తులో 90% సర్కారు వారికి ఇచ్చేయాలి. ఇవ్వకపోతే వారి భూములను కూడా వేలం వేయడం లేదా బ్రిటిష్ సర్కారులలో కలిపేసుకోవడం చేసేవారు. కొన్నిసార్లు ఆ జమీందారుకి కారాగారవాసం కూడా శిక్షగా విధించేవారు. ఎదిరించడానికి జమీందారుల వద్ద సరైన బలగం ఉండేది కాదు. ఉన్నవి కూడా పాతకాలం నాటి ఈటెలూ, కత్తులు, అవి మరఫిరంగుల దగ్గర నిలువలేక నేలకూలేవారు. సుమారుగా దేశమంతటా ఇదే పరిస్థితి.” చెబుతున్న దశరథరామయ్యగారి గొంతు బాధతో రుద్దమయింది. ఇంతలో ఇల్లు చేరారు.
రాత్రి భోజనాలయ్యాక వాలుకుర్చీలో కూర్చుని ఆలోచించుకుంటున్న దశరథరామయ్య దగ్గరకు అన్నపూర్ణ వచ్చింది.
“నాన్నగారూ! సాయంత్రం నుంచి మీరు ఏదో ఆలోచిస్తున్నారు కదా! నాకు చెప్తారా?” అని అడిగింది.
“అవునమ్మా! ఒక విషయంలో నువ్వు కూడా నాకు సహాయం చేయాలి. చలం, నువ్వు, నేను కలిపి ప్రణాళికాబద్ధంగా ఈ ప్రాంతపు భౌగోళిక, చారిత్రక, ఆర్థిక, సంస్కృతి సంప్రదాయాలను అక్షరబద్ధం చేయవలసిన బాధ్యత మనపై ఉంది. నేను వయసురీత్యా పెద్దవాడిని. నేను చెప్తూ ఉంటే మీరు రాయాలని అనుకుంటున్నాను. చిన్న చిన్న పుస్తకాలుగా రాసి మనం అందరికీ అందించాలి అన్నది నా కోరిక. కానీ చలపతి రాతప్రతితో పత్రికా రూపంగా అందిస్తే బాగుంటుందని అన్నాడు. కొంతమంది పెద్దలను కూడా ఇందులో చేర్చుదాము. నీ అభిప్రాయం ఏమిటి తల్లీ!” అడిగాడు.
“పత్రికా? అందుకు చాలా ఖర్చు అవుతుంది కదా?” ఆశ్చర్యంగా ప్రశ్నించింది.
“ప్రచురణ కాదమ్మా! చేత్తో రాసి అందించే లిఖిత పత్రిక. పత్రిక పేరు కూడా ‘గిరిపుత్రులు’ చలం ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నాడో!” చిరునవ్వుతో దశరథరామయ్య మాటలు విన్న అన్నపూర్ణ వెంటనే,
“తప్పకుండా! నాన్నగారూ! అలాగే చేద్దాము. రేపే మంచిరోజు. ఉదయాన్నే మొదలుపెట్టి మీరు చెప్పండి. నేను కూడా మంచి వ్యాసాలూ, పాటలూ రాస్తాను. మీరు కూడా గత చరిత్రనూ, వర్తమానానికి పోలుస్తూ భవిష్యత్తులో ప్రశ్నార్థకంగా మారిన వీరి జీవితాలను గురించి చెపుతూంటే రాస్తాను.” తండ్రి పాదాలకు నమస్కరించింది.
(సశేషం)