శ్రీవర తృతీయ రాజతరంగిణి-19

1
4

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

తద్దుగ్ధపితృపక్షోపి స్వామిభక్తిం న సోత్యజత్!

తేనైనాన్త్యక్షణః శ్లాఘ్యస్తస్యాభూజ్జై న భూపవత్!!
(శ్రీవర రాజతరంగిణి, 101)

జైనులాబిదీన్ తండ్రికి వ్యతిరేకంగా పోరాడినప్పటికీ తండ్రి పట్ల గౌరవాన్ని, అభిమానాన్ని త్యజించలేదు. అతని తండ్రి చివరి రోజులు జైనరాజులా సుఖంగా గడిచాయి.

జైనులాబిదీన్ అధికారానికి ప్రశాంతంగా రాలేదు. అతని సోదరుడు రాజ్యం వదలి మక్కా వెళ్తుంటే, జైనులాబిదీన్ అధికారం చేపట్టాడు. మనసు మార్చుకుని సోదరుడు వెనక్కురాగానే రాజ్యం వదలి వెళ్ళాడు. సైన్యాన్ని కూడగట్టుకుని శ్రీనగరంపై దాడి చేసి సోదరుడిని తరిమి రాజ్యం చేపట్టాడు.

శ్రీవరుడి ప్రకారం జైనులాబిదీన్ సోదరుడు ‘అల్లీషా’ను జైనులాబిదీన్ సమర్థకుడు జస్రత్ యుద్ధంలో చంపేశాడు. పర్షియన్ రచయితల ప్రకారం అల్లీషా యుద్ధంలో ప్రాణాలతో బయటపడ్డాడు. మళ్లీ సమర్థకులను  కూడగట్టుకుని శ్రీనగరం పై దాడి చేశాడు. ఈ యుద్ధం లోనూ ఓడిపోయాడు. బందీ అయ్యాడు.. జైనులాబిదీన్ అతడిని చెరసాలలో ఉంచాడు. అక్కడే మరణించాడు అల్లీషా. మరికొందరు పర్షియన్ రచయితల ప్రకారం ఓడిపోయిన ‘అల్లీషా’ను ఖోఖర్లు చంపేశారు.

ఏది ఏమైనప్పటకీ జైనులాబిదీన్ సింహాసనారోహణ పర్వం శాంతియుతంగా కాలేదు. అతను పోరాడాల్సి వచ్చింది. సింహాసనం  పోరు సోదరుల నడుమ ఎంత భయంకరమో, ఎంత క్రూరమో, ఎంత దౌర్భాగ్యమో అతడికి తెలుసు. అది తన సంతానం పట్ల సంభవించకూడదనుకున్నాడు. కానీ తాను జీవించి, అధికారంలో ఉండగానే, తన సంతానం రాజ్యం కోసం పోరాడే దౌర్భాగ్యాన్ని జైనులాబిదీన్ అనుభవించాల్సి వచ్చింది. విధి బలీయమైంది అనుకోవచ్చు. కర్మ సిద్ధాంతం అనుకోవచ్చు.

ఇక్కడ హాజీఖాన్ మంత్రులు అతడికి జైనులాబిదీన్ సింహాసనం దక్కించుకోవటం కోసం జరిపిన పోరును గుర్తు చేస్తూ, ఎంతగా సోదరుడితో సింహాసనం కోసం పోరాటం జరిపినా, జైనులాబిదీన్ అతని తండ్రిని గౌరవించాడనీ, అతని తండ్రి చివరి రోజులు రోజుల ప్రశాంతంగా గడిచాయనీ గుర్తు చేస్తున్నారు.

స పితా త్వం సుతస్తస్య వయం సర్వే స్వ సేవకాః।
గత్యా చేతు కుర్మహే యుద్ధం జయోస్మాకం భవేత్ కథమ్॥

                                                                                       (శ్రీవర రాజతరంగిణి, 102)

. అతను తండ్రి, నువ్వు పుత్రుడివి; అతను మనల్ని సేవకులుగా భావించి యుద్ధం చేస్తే మనం గెలవగలమా అన్నారు.

హాజిఖాన్ గొప్పతనం అతను జైనులాబిదీన్ పుత్రుడవటం వల్ల అని పరోక్షంగా చెప్తున్నారు. జైనులాబిదీన్ హాజీఖాన్ ను పుత్రుడిగా భావించినంత కాలమే అతను క్షేమంగా వుంటాడు. అందరినీ సేవకులుగా భావించి యుద్ధం చేస్తే, గెలవటం అసంభవం అని వీలయినంత సున్నితంగా, స్పష్టంగా చెప్తున్నారు.

సౌహార్ద్ర మార్దవో పేతా యోగ్యా కార్యవిచక్షణా।
జానే తేనైవ పుణ్యేన సన్తతిస్తస్య రాజతే॥
(శ్రీవర రాజతరంగిణి, 103)

ఇంతటి సౌహార్ద్ర హృదయుడు కాబట్టి, హృదయం మార్దవం కలవాడు కాబట్టి, అతడిని మీలాంటి తెలివైన సంతతి లభించింది. వారి వల్ల అతని ఖ్యాతి ఇనుమడిస్తోంది.

మళ్లీ ఇక్కడ మంత్రులు భారతీయ కర్మ సిద్ధాంతాన్ని సూచ్యప్రాయంగా చెప్తున్నారు. రాజు ఉత్తముడు. మెత్తని హృదయం కలవాడు. ఎవరినీ ద్వేషించడు. ఎవరిపై కోపం పెట్టుకోడు. అలాంటి రాజుకు పుణ్యం వల్ల చక్కటి సంతానం కలిగారు అని అంటున్నారు. రాజు పుణ్యం మిమ్మల్ని రక్షిస్తోంది అని పరోక్షంగా చెప్తున్నారు.

భారతీయ సిద్ధాంతం ప్రకారం, ఎవరెవరి కర్మానుసారం,  పుణ్యఫలం వల్ల వారికి ఎలాంటి సంతానం కలగాలో అలాంటి సంతానం కలుగుతుంది. సంతానం కూడా తమ తమ కర్మఫలం వల్ల ఎలాంటి తల్లిదండ్రులను పొందాలో, అలాంటి తల్లిదండ్రులను పొందుతారు.

భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది.

అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః।
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః॥
(3వ అధ్యాయం, 14వ శ్లోకం)

ఆహారం నుంచి జీవులు ఉద్భవిస్తాయి. వర్షం నుంచి  ఆహారం ఉద్భవిస్తుంది. యజ్ఞం వల్ల వర్షం కురుస్తుంది. యజ్ఞం కర్మల వల్ల ఉత్పన్నమవుతుంది.

ఇంతకన్నా గొప్పగా కర్మ సిద్ధాంతాన్ని, జీవులు ఉత్పన్నమవటాన్ని ఎవరెవరి కర్మలను బట్టి వారు ఆయా తల్లితండ్రులకు సంతానంగా జన్మించటాన్ని, తల్లిదండ్రుల కర్మల ప్రకారం వారికి సంతానం జన్మించటాన్ని ఎవ్వరూ, ఏ వైజ్ఞానిక సిద్ధాంతం కూడా వివరించలేదు.

మనం తినే ఆహారం మనకు శక్తి అన్నది అందరికీ తెలుసు. ఆహారం నుండే వీర్యం, అండం తయారవుతాయని తెలుసు. జీవోత్పత్తికి కారణం వీర్యం, అండం కలయిక. ఇవి ఆహారం నుండి తయారవుతాయి. ఆహారోత్పత్తికి మూలం వర్షం. వర్షం వల్ల భూములలోని బీజాలు జీవం పోసుకుని వృక్షాలుగా ఎదుగుతాయి. మనకు ఆహారం అవుతాయి. ఆ ఆహారంనుండి వీర్యం, అండం తయారవుతాయి.  అయితే, భారతీయ ధర్మంలో వ్యక్తి మరణం తరువాత అతని ఆత్మ పంచభూతాలలో మిళితమై పోతుంది. ఆత్మకు ఏవీ అంటవు, కర్మఫలం తప్ప. అలా పంచభూతాలలో కలిసిన ఆత్మ, మళ్లీ వర్షం రూపంలో భూమి పైకే వస్తుంది. కర్మఫలం ప్రకారం ఏ వ్యక్తులకు జన్మించాలో, వారి ఆహారంలో చేరుతుంది. ఆహారం ద్వారా వారి శరీరంలో చేరుతుంది. వీర్యం, అండంలో చేరుతుంది. ఫలదీకరణం చెందుతుంది. శిశువు రూపం ధరిస్తుంది. కర్మఫలాన్ని అనుభవిస్తుంది. అంటే ఒకరికి ఒక సంతానం కలిగిందంటే అది అటు తల్లిదండ్రులు, ఇటు సంతానం కర్మఫలం ప్రకారం సంభవిస్తుదన్న మాట.

వైజ్ఞానిక దృష్టితో చూస్తే ఆహారం వీర్యం, అండం కావటంలో ఎలాంటి అభ్యంతరం లేదు. తల్లిదండ్రుల నుంచి జన్యుపరంగా సంతానానికి లక్షణాలు అందటం, ఆ జన్యు సంబంధిత లక్షణాల ప్రకారం ఆ సంతానం ఎదగటం, వ్యక్తిత్వాన్ని సంతరించుకోవటం సంభవిస్తుంది. కానీ వ్యక్తి ఎదుగుదల, ఆలోచనా విధానం, సర్వం జన్యుఫరంగా అందిన లక్షణాల పైనే ఆధారపడి ఉంటుంది.

అయితే, ఒక్కసారి ఉత్పన్నమయ్యే మిలియన్ల కొద్దీ స్పెర్మ్ కణాలలో ఆ ఒక్క కణం మాత్రమే అండాన్ని ఎందుకు చేరుతుందన్న సందేహానికి పలు రకాల కారణాలు చెప్తుంది విజ్జానశాస్త్రం. చివరికి ‘first among the equals’ అంటుంది. అయితే భారతీయ సిద్ధాంతం  సమాధానంగా  దీనిని ‘కర్మ’ అంటుంది. ఈ ఆత్మకు ఆ ఇద్దరి శరీరాల ద్వారా శరీరం లభించాలి కర్మఫలం అనుభవించటానికి. తమ కర్మ  ఫలం అనుభవించటానికి ఆ రెండు ఆత్మలూ ఈ ఆత్మకు శరీరాన్నివ్వాలి. అంతే! కాబట్టి ఎన్ని మిలియన్ల స్పెర్మ్ కణాలు తయారయినా ఈ ఒక్కటి మాత్రమే అండాన్ని చేరుతుంది. శరీరాన్ని ధరిస్తుంది.

కాబట్టి రాజు పుణ్యం వల్ల, మీ కర్మల వల్ల సౌహార్ద్రం కల తండ్రి లభించాడు అని మంత్రులు రాజుకు నచ్చచెప్తున్నారు. తండ్రితో యుద్ధం కూడదని హితవు చెప్తున్నారు.

హతాశ్చేత్ కోపి తద్‍భ్రుత్యాః బహుభృత్యస్య కా క్షితిః।
ఏక పక్షక్షయే కిం స్వాద్ గరుడస్య జవాల్యతా॥
(శ్రీవర రాజతరంగిణి, 104)

ఇంతకు ముందు ఒక శ్లోకంలో నువ్వు సంతానమయినా, రాజు తన సేవకుడిగా భావించి యుద్ధం చేస్తే మనం గెలవగలమా? అని ప్రశ్నించిన మంత్రులు ఇప్పుడు మరో రకంగా నచ్చచెప్పాలని ప్రయత్నిస్తున్నారు.

యుద్ధంలో రాజు తరఫున కొందరు సేవకులు మరణించినా రాజుకు నష్టం లేదు. గరుడ పక్షి రెక్కలకున్న ఈకలలోంచి ఒక ఈక నష్టమైతే గరుడుడికి ఏమైనా కష్టం ఉంటుందా? ఉండదు. కాబట్టి యుద్ధం వల్ల కష్టం మనకే, రాజుకు కాదు అని హితవు చెప్తున్నారు మంత్రులు.

న శివాః శకునాః సన్తిదేశాః పర్వత దుర్గమాః।
తత్రాపి జనకస్తేస్మాన్న కాలో విగ్రహస్య నః॥
(శ్రీవర రాజతరంగిణి, 105)

పైవాటన్నిటికి తోడు మనకు శుభశకునాలేం కనపడటం లేదంటున్నారు మంత్రులు. దేశం పర్వతాలతో దుర్గమమైనది. మనం పోరాడాల్సింది నీ తండ్రితో. మీ తండ్రిగారిని గెలవటం కష్టం. కాబట్టి ఇది యుద్ధానికి సమయం కాదు అంటున్నారు మంత్రులు.

భజత్వభ్యంతరం రాజా వయం బాహ్యం భజామహే।
తత్ప్రసాదాది హైవాస్తాం రాజ్యం ఛత్రం వినా న కిమ్॥
(శ్రీవర రాజతరంగిణి, 106)

తే చేద్యుద్ధార్థ మేశ్యన్తి న జేష్యన్త్యస్మదన్తికాత్।
వయం చేదన్తరం యామో న జేష్యామః కదాచన॥
(శ్రీవర రాజతరంగిణి, 107)

రాజు దేశంలో ఉన్నాడు. మనం దేశం బయట ఉన్నాం. ఒక ‘రాజు’ అన్న మాట లేదు కానీ, మనం ఇక్కడ బయట రాజ్యం చేస్తే అడిగేవారెవరు? మనం రాజుతో యుద్ధానికి వెళ్తే మనం దెబ్బతింటాం. ఇందుకు భిన్నంగా రాజు మనతో యుద్ధానికి ఇక్కడికి వస్తే, మనతో రాజు గెలవలేడు. కాబట్టి మనం రాజుతో యుద్ధానికి వెళ్ళే కన్నా మనతో యుద్ధానికి రాజు ఇక్కడికి వస్తే మనకే లాభం అన్న సలహా ఇచ్చారు మంత్రులు.

చక్కటి సలహా!

కశ్మీరం దుర్బేధ్యమైనది. చుట్టూ కొండలు, లోయలు. వేగంగా ప్రవహించే నదులు. చలి. సగం సంవత్సరం మంచుతో మార్గాలు మూసుకుపోతాయి. అలాంటి దుర్బేధ్యమైన రాజ్యంలో ఉన్నాడు జైనులాబిదీన్. అతడి దగ్గరకు యుద్ధానికి వెళ్ళినవాళ్ళే నష్టపోతారు. ఎందుకంటే రాజు తన ప్రాంతంలో క్షేమంగా, సురక్షితంగా ఉంటాడు. కష్టం, నష్టం పోరాటానికి వచ్చిన వారికే.

అలా కాక, తమ సురక్షిత స్థలాన్ని వదిలి రాజు బయటకు వచ్చి మన దగ్గరకు వచ్చి పోరాడితే, మనకే లాభం. మనం మన స్వస్థలంలో ఉంటాం. మనతో యుద్ధానికి వస్తే రాజును జయించటం సులభం. కాబట్టి మనం యుద్ధానికి వెళ్లవద్దు. రాజే తన సురక్షిత స్థలం వదిలి మనతో యుద్ధానికి వచ్చేట్టు చేయాలి అంటున్నారు మంత్రులు.

హాజీఖాన్‍కు మంత్రులు ఇస్తున్న సలహా, దాన్ని ఒక పద్ధతి ప్రకారం, తర్కబద్ధంగా, అన్ని కోణాల లోంచి సమస్యను స్పృశిస్తూ వివరించటం అద్భుతంగా ప్రదర్శించాడు శ్రీవరుడు.

ఇతి దర్పాత్ స శృత్వాపి ఖానః శూరస్పరాధ్వనా।
ఆగాద్ రాజపురీం త్యక్త్వా కశ్మీరాన్ పిషునే రితః॥
(శ్రీవర రాజతరంగిణి, 108)

ఇదంతా విన్న హాజీఖాన్ దర్పంతో, కొందరి ప్రేరణతో, రాజపురి వదిలి, శూరపురి మార్గంలో కశ్మీరు వైపు ప్రయాణించాడు.

మంత్రులు ఎంత చెప్పినా హాజీఖాన్ వినలేదు. ఆయన చుట్టూ చేరిన కొందరి మాటలు నమ్మాడు. వారు చెప్పింది నమ్మాడు. రాజపురి వదలి శూరపురి మార్గం గుండా కశ్మీరు ప్రయాణమయ్యాడు. ఇక్కడే కర్మ పనితనం  తెలుస్తుంది. జైనులాబిదీన్ సోదరుడితో పోరాడి రాజ్యం సాధించాడు. కానీ తన సంతానం పోరాడకూడదనుకున్నాడు. కానీ, కర్మ ఫలం అనుభవించాల్సిందే! అలాగే, తండ్రితో, సోదరుడితో రాజ్యంకోసం పోరాడవద్దని చక్కటి హితవు చెప్పినా అది హాజీఖాన్ తలకెక్కటంలేదు. అతని కర్మ ప్రకారం రాజ్యం కోసం తండ్రితో, సోదరుడితో అతడు పోరాడాల్సిందే. కాబట్టి, ఎవరేం చెప్పినా, ఎంత మంచి, ఎంత చక్కగా చెప్పినా వినడు. అతడు రాజ్యం కోసం తండ్రితో పోరాడాల్సిందే. విధి నిర్దేశించినట్టు నడవాల్సిందే!

శూరపురిని వర్తమానంలో ‘హూర్‍పూర్’ అంటున్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని హీర్‌పుర్, హరీపుర్ అని కూడా అనేవాళ్లు. అవంతివర్మ మంత్రి శూరుడు నిర్మించిన నగరం శూరపురం. రాజౌరీ (రాజపురి) నుండి కశ్మీరం వచ్చే దారిలో ఉంటుందీ ప్రాంతం. ఇప్పుడీ ప్రాంతం ప్రవేశ ద్వారాన్ని ‘ఇలాహీ దర్వాజా’ అంటున్నారు. ఒకప్పుడు ఇక్కడ కోట ఉండేదన్న ఆనవాళ్ళున్నాయి. శూరపురానికి దగ్గరలోనే పీర్‍పంజాల్ పర్వతాలు ఉన్నాయి. ఇక్కడి నదీ తీరంలో ఒకప్పుడు గొప్ప మందిరం ఉందేది. ఈ ప్రాంతాన్ని ‘పాద పావన గ్రామం’ అనేవారు. ఈ ప్రాంతంలో విగ్రహాలు లభించాయి.

మొత్తాన్ని ఎలాంటి హితవచనాలు వినకుండా, తన శక్తి మీద నమ్మకంతో, తన చుట్టూ ఉన్నవారి మాటలను విశ్వసించి హాజీఖాన్ – జైనులాబిదీన్  పై యుద్ధానికి బయలుదేరాడు.

ఒక రకంగా, జైనులాబిదీన్ ఏది వద్దకున్నాడో, అదే జరుగుతోంది. తన సంతానం నడుమ సింహాసనం కోసం పోరు జరగకూడదనుకున్నాడు. ఇద్దరినీ ఒక చోట కలసి ఉండనివ్వలేదు – ఒకరినొకరు కుట్రలతో చంపుకుంటారని. బలహీనుడైన ఆదమ్ ఖాన్‍ను తన దగ్గర ఉంచుకున్నాడు. కానీ కశ్మీరు బయట ఉన్న హాజీఖాన్ ఇది సహించలేక యుద్ధానికి వస్తాడని అనుకుని ఉండడు. కానీ అనుకున్నవి అనుకున్నట్టు జరగవు కదా! హాజీఖాన్ సైన్యంతో శ్రీనగరంపై దాడికి బయలుదేరాడు. ఇంత కాలం శత్రువులను ఎదుర్కుని పోరాడిన జైనులాబిదీన్‍కు ఇప్పుడు తన సంతానం నుంచే తన రాజ్యాన్ని, సింహాసనాన్ని రక్షించుకోవాల్సిన దుస్థితి సంభవించింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here