[పాణ్యం దత్తశర్మ గారు రచించిన ‘ద్రౌపది’ అనే ఏకపాత్రాభియం పాఠ్యాన్ని అందిస్తున్నాము.]
ఏకపాత్రాభినయము:
(తెర తీయగనే, ద్రౌపదీ దేవి ప్రవేశిస్తుంది. ఆమె వదనంలో ఒక ఆత్మవిశ్వాసం; లోకాన్ని లెక్కచేయని తెంపరితనం. తన వ్యక్తిత్వం మీద తనకున్న అపారమైన నమ్మకం ప్రతిఫలిస్తుంటాయి)
ఆహా! నాకెన్ని పేర్లు? దృపదరాజపుత్రిని కాబట్టి ద్రౌపది. కృష్ణను యజ్ఞమునుండి ఉద్భవించితిని కావున యాజ్ఞసేనిని. పాంచాల దేశపు రాకుమారిని గనుక పాంచాలిని! కానీ ధూర్త శిఖామణులు కొందరు దానిని ఐదుమందికి ‘ఆలి’గా దురర్థంతో ప్రయోగిస్తారు. వారి అజ్ఞానానికి నా జోహారు!
లావణ్యం, సౌందర్యం, ధైర్యం నా సొత్తు. చరిత్రలో, బహుశా, నా మీద జరిగినంత చర్చ, ఏ లలనామణిపైన కూడ జరగలేదేమో?
దుర్మార్గుడైన దుర్యోధనుడు, నన్ను, తన అంకపీఠమధిరోహించమని, వెకిలి సైగ చేసెను. దుశ్శాసనుడు, ఏక వస్త్రనైన నా ఉడుపులు లాగి నన్ను కురుసభలో ఘోరావమానమునకు పాలుచేసెను. అప్పుడు, నా అన్నయ్య, కృష్ణయ్య, నన్ను రక్షించి ఉండకపోతే, నా గతి ఏమయి ఉండెడిది? పరమాత్మా! జగద్రక్షకా! నీ అండ లేని మేము దండగ కదా!
ఉ॥
నీరజనాభ! నన్ను భవదీయ కృపారసమున్ ఘటించుచున్
క్రూరులనుండి గాచితివి! కృష్ణ ! పరాత్పర ! దీనరక్ష ! నిన్
చేరెడు సద్గతిన్ తుదకు శేముషిగా కరుణించుమయ్య! నా
ధీరత కీవె కారణము, దేవ మునీంద్రనుతా! విరాజితా!
నన్ను శీలవిహీనను చేయుటకు యత్నించిన వారెందరో? కీచకుడు, సైరంధ్రినామమున, సుధేష్ణదేవి అంతఃపురమున, సేవిక వృత్తి నవలంబించిన నన్ను, చెరబట్టబోవ, సుధేష్ణాదేవి, యాతనినే మనుటకు ధైర్యము చాలక, మిన్నకున్నది. అప్పుడు అపారబల సమన్వితుడైన మదీయ ప్రాణనాథుడు, భీమసేన మహారాజు, ఉపాయము చేసి, వానిని మట్టుబెట్టె గదా! ఇక జయద్రధుడు! సైంధవునిగా వాడు అన్వర్థనామధేయుడు. నన్ను మానహీన జేయుటకు వాడు చేసిన ప్రయత్నమును నా పతులు భగ్నము గావించిరి. ఏయుగమునందైన మానినీ మణుల గతి ఇంతేనా? ఇన్ని అవమానములను భరించి, మొక్కవోని ధైర్యముతో మనుచున్నాను. దానికి కారణమునా ఆత్మస్థైర్యము తప్ప వేరొకటి కాదు.
నా పతులు ఐదుమందియని, నేను బహు భర్తృక నని, దుర్యోధనునాదులు నీచమైన పరిభాషతో నన్ను, పరిహసించుచుందురు. మా వివాహములోని పరమార్థము వారికేమి యెరుక? మాయత్త కుంతీదేవి, స్వయంవర నిర్జతయైన నన్ను, అర్జున వీరాగ్రణి తోడ్కొని రాగా, సరిగా పరికించక, “అందరును సమానముగా పంచుకొనుడు” అని నందున, నేను వారైదుగురికి భార్యనైతినను మాట సత్యదూరము. ఆమె నిమిత్త మాత్రురాలు.
అసలు విషయం ఎందరెరుగుదురు? నేను శచీదేవి పాక్షిక అంశను వ్యాస మహర్షి నన్ను సాక్షాత్ శ్రీలక్ష్మియని పలికినాడు. గత జన్మమున నేను మౌద్గల్యమహాముని పత్నిని. నాలాయనిని. నాకు ఇంద్రసేన యను నామాంతరము కూడ అప్పుడు గలదు. నా భర్త కుష్టు వ్యాధిగ్రస్థుడు. ఒకసారి భోజన సమయమున, ఆయన వేలొకటి. తెగి నా పళ్లెరమున పడగా, నిర్వికారమున, నేను దానిని తీసివైచి, నా భోజనమును కొనసాగించితిని.
ఆయన నా పాతివ్రత్యమునకు కడుంగడు సంతసించి, ఏదైన వరము కోరుకొనుమనియెను. శృంగార సుఖమునకు నోచుకోని నేను “స్వామీ! మీరు ఐదు రకములుగా సుందర రూపులై, నాకు సంసార సుఖమును ప్రసాదింపుడు” అని వేడితిని. ఆయన “సాధ్వీమణి! నీవు మరుజన్మమున పాంచాల రాజకుమార్తెగా జనించి, ధర్మదేవ, వాయు, ఇంద్ర, అశ్వనీ దేవతల అంశలైన పంచ పాండవులకు పత్నివై, నీ ఈప్సితమును పొందగలవు.” అని వరమిచ్చెను. మహర్షుల వాక్కు అమోఘముగదా! ఆయన ఇట్లు సెలవిచ్చినాడు.
తే.గీ.॥
ఐదు మందినిగూడియు నతివ నీవు
నీదు కన్యాత్వమును వీడవదియుగాక
పతికి పతికిని కన్యవై ప్రాభవమున
పంచకన్యల నొకరుగా బరగు దేవి!
ఆ విధముగా నేను “అహల్యా, ద్రౌపదీ, కుంతీ, తారా, మండోదరీ, తథా; పంచకన్యాః స్మరేత్ నిత్యం, మహా పాతకనాశనమ్” అను ఆర్యోక్తిలో భాగమైనాను.
నేను ధర్మజుని ద్వారా ప్రతివింద్యుని, భీముని ద్వారా సుతసోముని, అర్జునుని ద్వారా శృతకర్మను, నకులు నిద్యారా శతానీకుని, సహదేవుని ద్వారా శృతసేనుని, తనయులుగా బడసి, మాతృత్వ ధన్యతనొందినాను. దీనికి నేనెంతయు గర్వపడెదను. కానీ, ద్రోణుపుత్రుడైన అశ్వత్థామ, వారిని, నిద్రపోతుండగా నిర్దయగా, సంహరించి, నాకు గర్భశోకము కల్గించినాడు!
అర్జునుడు వాడిని బంధించి తెచ్చినా పాదముల మీద బడవైచి, “వీనిని నీ కనులముందే వధించెద!” అన్నపుడు ఆ మహావీరుని నేను వారించితిని. ఏలయన, వానిని చంపినచో, వాని తల్లి, ద్రోణపత్ని, గర్భశోకముతో కుములును గదా! నాకొచ్చిన దుఃఖము ఇతరులకు రాకూడదు. భారతీయ సనాతన ధర్మము నా రక్తనిష్టమునైయున్నది గావున, దురాత్ముడైన అశ్వత్థామను వదిలివేయుడని చెప్పితిని.
నేను ఔద్ధత్యప్రకృతినని, కుండబద్దలు కొట్టినటుల మాట్లాడెదనని, పురుషాధిక్యతను సహింపని, చరిత్రలో ప్రథమ స్త్రీవాదినని, విమర్శకులు నన్ను గురించి చెప్పుచుందురు. అవును! నిజమే! పరమాత్మ, రాయబారమునకేగు సమయమున, భీమునితో సహా, నా పతులందరును. తమ తమ ప్రతిజ్ఞలను విస్మరించి సంధి చేసుకొని రమ్మని, సాత్యకీ సోదరుని కోరినపుడు నా రక్తము సలసల మరిగినది. వారిని తీవ్రముగా అధిక్షేపించితిని. నా ప్రతీకారేచ్ఛను వాసుదేవునకు స్పష్టము చేసితిని.
తే.గీ.॥
దుస్ససేనుడు నా కొప్పు తొలగజేసె
నాదు కేశంబులను బట్టి; నన్ను తొడను
అధివసింపగ బిలిచెను వానియన్న
వారి భీకరమరణంబె కోరుచుంటి
అని శ్రీకృష్ణునికి విన్నవించితిని. ఆయన నాకు అన్నయే కాదు, హితుడు, స్నేహితుడు. వేదాంతి, మార్గదర్శి! కానీ మొదటి నుండి నా మదిలో నొక అనుమానము మెదలుచుండును. దుష్టశిక్షణ కొరకు, దుర్మార్గులైన కౌరవుల వినాశనము కొరకు, సాక్షాత్తు నారాయణ స్వరూపుడైన ఆ శ్రీహరి, నన్ను సాధనముగా వాడుకొనెనా ఏమి? అయినను, నాకు సంతసమే. పరాత్పరుని దుష్ట సంహార క్రతువులో నేను సైతము ఒక సమిధనైనందుకు నా జన్మ ధన్యము!
ఆధునికులు, నా బహుభర్తృత్వములోని ఆధ్యాత్మిక కోణమునెరుగక, రకరకములుగా నా వ్యక్తిత్వమును వక్రీకరించి, నా వ్యక్తిత్వహననమునకు పాల్పడు చుండుట నాకు విచారకారణము. అట్టివారికి ప్రభుత్వములు పురస్కారముల నొసంగుట అతి విచిత్రము! ఇక చలన చిత్రములలో, సృజనాత్మకత శృతిమించి, ‘నేను కర్ణుని ఆరవ భర్తగా పొందుటకు ఉవ్విళ్లూరుచుంటిన’ని నా అంతరంగమును శ్రీకృష్ణునకెరిగించినట్లు కల్పించినారట. హతవిధీ! ఇంత కన్న ఘోరముండునా? పురాణ స్త్రీలను తమ కువ్యాఖ్యలతో కించపరచి, వారేమి బావుకొందురో మరి! ఒక్క విషయము చెప్పి, విరమించెద!
చం॥
జననము యజ్ఞమందు, భుజశాలురు ప్రకృతి యంశలైన నా
ఘనులగు ప్రాణనాథులకు, కన్యతనంబును వీడకుండగన్
మనమున నెట్టి కల్మషము మాని చరించితి ధర్మపత్నిగాన్
కనియెద లోకమందున సుగౌరమున్, మహితాత్మురాలిగన్
“యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్రదేవతాః” అని వేదోక్తి. నారీమణులను పూజించకపోయినా, గౌరవిస్తే చాలు!
స్వస్తి!