[dropcap]ఆం[/dropcap]ధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ వారి ఆహ్వనం మేరకు ప్రముఖ కవి, రచయిత, పండితులు, విమర్శకులు, గాయకులు, కాలమిస్ట్, బ్రహ్మశ్రీ పాణ్యం దత్తశర్మ, కడపజిల్లా, బ్రహ్మంగారి మఠం (బి.మఠం), శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవస్థానం లోని ముఖమంటపంలో 25-7-24 నుండి తేది 30-7-24 వరకు (6 రోజులు) ధార్మిక, ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు. కడప జిల్లా అసిస్టెంట్ కమిషనర్ (ఎండోమెంట్స్) శ్రీ శంకర బాలాజీ గారు, బి.మఠానికి ప్రత్యేక ఇన్‍చార్జి, ఫిట్ పర్సన్ కూడా. మైదుకూరులో ఆయన, తన సిబ్బందితో పాణ్యం దత్తశర్మకు స్వాగతం పలికి, ప్రభుత్వవాహనంలో బి.మఠానికి తీసుకొని వెళ్లారు. అక్కడ టి.టి.డి వారి గెస్ట్ హౌస్‌లో ఆయనకు బస ఏర్పాటు చేశారు.
25 జూలై సాయంత్రం మహాయోగి, కాలజ్ఞాన ప్రవక్త, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ప్రత్యేక దర్శనం, శేష వస్త్ర, శేషమాలా ప్రదానం, వేదాశీర్వచనం తర్వాత పాణ్యం దత్తశర్మ, సా. 6.00 గంటలకు తమ ప్రవచనాలను ప్రారంభించారు. రోజూ రెండు గంటల పాటు, 6 గం॥ నుండి 8 గం. వరకు అవి 6 రోజులు కొనసాగాయి.
ప్రవచనకారునికి శ్రీ రమణాచారి గారు కీబోర్డు, శ్రీ వేణుగారు తబలా పై చక్కని వాద్య సహకారం అందించారు. వారి సేవలను దేవస్థానం వారే సమకూర్చారు.
మొదటి రెండు రోజులూ, వీరబ్రహ్మేంద్ర స్వామివారి దివ్యమాహత్మ్యాన్ని, వారు రచించిన ప్రసిద్ధమైన తత్త్వాలను (పాటలు), సమాజంలోని మూఢనమ్మకాలను నిర్మూలించడానికి ఆయన చేసిన కృషిని, దత్తశర్మ చక్కని శ్లోకాలను పద్యాలను, పాటలను, కీర్తనలను శ్రావ్యంగా పాడుతూ, వివరించారు. రోజు విఘ్నేశ్వరస్తుతితో, ఒక ప్రసిద్ధ కీర్తనతో ప్రవచనం ప్రారంభమయ్యేది. జ్యోతి స్వరూపుడై సజీవసమాధిలో ప్రకాశిస్తున్న స్వామిని ఆయన ప్రస్తుతించారు.
12 సం॥వయస్సులో తన తల్లి ప్రకృతాంబకు పిండోత్పత్తి, పెరుగుదల, జననమరణ చక్రం, సాంఖ్య యోగం, తారక యోగం, అమనస్కం ఆధ్యాత్మిక ప్రక్రియలను స్వామివారు వివరించారని, తాను దైవాంశసంభూతుడని రుజువు చేసుకొన్నారని ప్రవక్తగా భావికాలాన్ని దర్శించి, కాలజ్ఞానం ద్వారా దాన్ని అతి సులభ గ్రాహ్యమైన భాషలో ప్రజలకు చెప్పారని, ప్రవచనకర్త తెలిపారు. వారి ‘కాళీ మకుట కందముల’ ను కొన్నింటిని గానం చేశారు. గృహస్థాశ్రమ ధర్మం, సన్యాసాశ్రమ ధర్మం కంటి క్లిష్టమైనది. ఈ సందర్భంలో “Being an ideal householder is much more difficult than being an ideal Sanyasi” అన్న స్వామి వివేకానంద మాటలను దత్తశర్మ ఉటంకించారు. ముస్లిం కులానికి చెందిన దూదేకుల సయ్యద్ సాహెబ్ అను కుర్రవాడిని శిష్యుడిగా స్వీకరించి అతనికి తత్త్వబోధ చేశారు. అతడే సిద్ధయ్య, మాదిగ కక్కయ్యకు, అతని భార్య మృతశరీరమునందే షట్చక్రములు, అధిష్టాన దేవతలను చూపారు. కక్కయ్యకు ఇలా బోధించారు.
ఆ.వె.:
“అఖిలలోకములకు నాధారమైనట్టి
దేవ దేవుడెల్ల దేహములను
నిండి నేత్రములకు ఏనాడు కనరాక
జీవి కానందమై చెలగుచుండు”
భోజనాలలో కుల, పంక్తి భదములను వీరబ్రహ్మీందులు నిరసించారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఇట్లు నంద్యాల బ్రాహ్మణులకు బోధించారు.
ఆ.వె.:
“అన్నమయము లైన వన్ని జీవములును
కూడు లేక జీవకోటి లేదు
కూడు తినెడి కాడ కులభేద మేలొకో
కాళికాంబ! హంస! కాళికాంబ”
పుష్పగిరి అగ్రహార బ్రాహ్మణ పండితులలో “జన్మనా జాయతీ శూద్రః కర్మణా జాయతే ద్విజః” అన్న సత్యాన్ని బోధించి కనువిప్పు కలిగించారు.
“ఇలకు దిగెడువేళ కుల మెవ్వరికి లేదు
మొదలు శూద్రుడుగను పుట్టువందు
శ్రుతులు చదువువెనుక శూద్రుండె విప్రుడే
కాళికాంబ! హంస! కాళికాంబ!”
స్త్రీలను శక్తి స్వరూపిణులుగా నిర్వహించారు స్వామి. వారికి వేదాధికారం లేదన్న వాదాన్ని ఇలా పూర్వపక్షం చేశారు.
“వెలదులను మీద విద్యాధికారంబు
లేదటంచు బ్రహ్మ లిఖతమంచు
నోరు తెరచినారు ‘వాణిని’ నిన్ను
కాళికాంబ! హంస! కాళికాంబ”
జంతు బలులను ‘మానవ మౌఢ్యం’ గా అభివర్ణించారు. స్వామివారి కాలజ్ఞానానికి ‘సాంద్ర సింధు మథనం’ అన్న పేరు కూడా ఉందని దత్తశర్మ తెలిపారు. పోలేరమ్మ తల్లి, వీరబ్రహ్మేందులు పిలిస్తే, ఒక చిన్న పిల్ల రూపంలో వచ్చి, వారి యింట పొంగళ్ళు (భోనాలు) గ్రహించింది. కర్నూలు నవాబుగారు. అసంఖ్యాక ప్రజలు ఈ దివ్య దృశ్యాన్ని కనులారా చూచి తరించారు
‘ఆత్మకు స్వరూపం జ్ఞానమని, aది స్వయంప్రకాశకమని, సచ్చిదానంద స్వరూపమని, దేహమే దేవాలయమని, ఆత్మయేపర బ్రహ్మమ’ని వీరబ్రహ్మేంద్ర యోగివర్యులు చెప్పిన దానిని ప్రవచనకర్త శ్రోతలకు వివరించారు. ఆయనను సిద్ధయ్య ఇలా స్తోత్రం చేశాడు:
“సంశయంబులు విడదీసి సద్గతిచ్చు
పరమ సామ్రాజ్యమును జూపి భయము దీర్చు
మరపురానట్టి గోప్యముల్ మరుగు లిప్పు
శాంతినిచ్చెడి సద్గురు సాటి గలరె”
అతి లోతైన ఆధ్యాత్మ జ్ఞానాన్ని పామరులకు, అతి సులభ భాషలో అందించిన యోగులలో, భారతదేశంలో, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రులవారు అగ్రగణ్యులని దత్తశర్మ కొనియాడారు. వారిపై తాను వ్రాసిన పద్యాన్ని గానం చేసి శ్రోతలను ముగ్ధులను చేశారు.
సీ.
సూక్ష్మంబునైనట్టి శుద్ధరూపము దాల్చి
యెవ్యండు వెలుగొందు దివ్వె వోలె
భావమాత్రము చేత భవమెల్ల సృష్టించి
యెవ్వండు నేర్పించు నియమపథము
లేనిదానిని నమ్మి లేమి గ్రుండెడి వారి
నెవ్వండు నభయంబునిచ్చి బ్రోచు
పరమార్థమును దెల్ప పరమాత్మ తత్త్వంబు
నెవ్వండు బోధించు నేర్పుగాను
తే.గీ.
వీరబ్రహ్మేంద్రుడతడె విఖ్యాతగురుడు,
కనగ వేదాంతి, నిత్యమౌ కాంతి పథము
మోక్షపథ దర్శి యాతడే రక్షకుండు
గురుని నమ్మిన బాయు దాగున్న వెతలు.
~
ప్రతిరోజూ స్వామివారు రచించిన ప్రముఖ కీర్తనలను దత్తశర్మ పాడారు. వాద్య సహకారం అందించిన రమణగారు, వేణగారు సంగీతజ్ఞులు. వారి వలన ప్రవచనం మరింత రక్తి కట్టింది.
కొన్ని తత్త్వములు:
1) చెప్పలేదంటనక బొయ్యేరు 2) ఎందుకుర నీ కింత బాధ 3) చిల్లర రాళ్లకు మొక్కుతు ఉంటే 4) ఇల్లు ఇల్లాలని యేవు.
ఇవి కాక త్యాగరాజు, రామదాస, దీక్షితార్, అగత్తియార్, అన్నమాచార్య కీర్తనలని కూడ సందర్భానుసారంగా దత్తశర్మ ఆలపించి శ్రోతలను రంజింపచేశారు.
ఒకరోజు పోతన భాగవతాన్ని, మకరందముల వంటి ఆయన పద్యాలను పాడుతూ వివరించారు. రుక్మిణీకల్యాణం, వామనావతారం, గజేంద్ర మోక్షం, ప్రహ్లాద చరిత్ర లోని కొన్ని ఘట్టాలను వివరించారు. మరొకరోజు శ్రీమద్రామాయణము లోని ధర్మములను, సూక్తులను, వ్యక్తిత్యములను వివరించారు. మొల్ల రామాయణంలోని చమత్కారాలను తెలిపారు. మన కావ్యేతిహాసాలలోని కొందరు అద్భుత వ్యక్తులను గురించి, వారి ద్వారా మనం మన వ్యక్తిత్వాన్ని ఎలా మలచుకోవచ్చో పాణ్యం దత్తశర్మ తెలిపారు.
చివరిరోజు కడప జిల్లా అసిస్టెంట్ కమిషనర్, బి.మఠం స్పెషల్ ఫిట్ పర్సన్ శ్రీ శంకర బాలాజీగారు, ఆయన సిబ్బంది పాణ్యం దత్తశర్మను ఘనంగా, శాలువ, జ్ఞాపిక, నగదు పురస్కారంతో సన్మానించారు. ఆరోజు మఠాధిపతిగారు కూడా విచ్చేసి, ప్రవచన కర్తనాశీర్వదించారు. స్థానిక భజన బృందాలవారు కూడా ఆయనకు సన్మానం చేశారు.
వందలాది భక్తలు ప్రతిరోజూ ప్రవచనాలను హాజరై, ఆధ్యాత్మిక ధార్మిక ఆనందాన్ని పొందారు. చుట్టుపక్కల ఊర్ల వాళ్లు, క్షేత్ర దర్శనానికి వచ్చిన యాత్రికులు కూడా ప్రవచనాలను విన్నారు. మైకులో దాదాపు 3 కిలోమీటర్ల వరకు వినబడుతూన్న ప్రవచనాలను బి.మఠం గ్రామం ఇళ్ల అరుగుల మీద, మిద్దెల మీద కూర్చుని ఎంతో మంది విన్నారు.
ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలు, పత్రికా విలేఖరులు, కూడా హాజరై ప్రవచనాలను విన్నారు. ఈ అవకాశం కలిగించిన ధ్యాన యోగి శ్రీ వీరబ్రహ్మేంద్రులకు, సహాయ కమిషనర్ శంకర్ బాలాజీకి, పాణ్యం దత్తశర్మ కృతజ్ఞతలు తెలిపారు.
“శ్రీ విరాట్పదవిఖ్యాతం
సిద్ధానంద ప్రదాయకం
కాలజ్ఞాన ప్రవక్తారం
వీరబ్రహ్మ గురుం భజే!”