[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]
341
కలుషితాలకు కాదేది అనర్హం
పలు ఆహార పదార్థాలు కలుషితాలే
గాలి కలుషితం విపరీతంగా
పలు నీటి వనరులన్నీ కలుషితాలే
342
ఐశ్వర్యంతో కలుగు ఎంతో సంతోషం
ఆశతో కలుగు అత్యుత్సాహం
నశించు ధనమంతా తెలివితక్కువ తనంతో
వశమగు మంచి పనులు యుక్తితో
343
మూఢ నమ్మకాలకు బలైపోతున్న జనం
వాడ వాడలా ప్రచారం జరగాలి
కడ దాకా నిర్మూలించాలి
బడ బడామని చేస్తే ఉపయోగముండదు
344
నేను అంటే పంచభూతమయం
కనువిందు చేస్తుంది భౌతిక శరీరం
తనువు చూచుకొని తానే అనుకోకు
వనమందు చెట్ల మాదిరేగా నీ శరీరం
345
హిందువులకు ప్రకృతిలో అన్నీ దైవాలే
కాదేది దైవం, చెట్టు, పుట్ట, పక్షి, పశువు వగైరా
తదేకంగా పూజిస్తారు
వందనం ప్రకృతి ప్రేమికులకు
346
శాస్త్రవేత్తలు యెంత చెప్పినా, పెడ చెవిన పెట్టి
అసలు పట్టించుకోని జనం
బుసలు కొడుతున్న కాలుష్యం
ఏ స్థితి దాపురించునో ఎవరికెరుక
347
జంతు జాలం అంతరించి పోతున్నది
ఋతువులు ధర్మాలు గతి తప్పుచున్నవి
పంతుళ్లు వాళ్ళ విధులు మర్చిపోతున్నారు
నత్త నడకన ప్రభుత్వాలు
348
రామాయణం కధే అని అందరికి తెలుసు
రాముడు దేవుడని కొలిచే వారెందరో
రామకోటి వ్రాసేదెందరో
రామ్ ల్లల్లా కొలువైంది అయోధ్యలో
349
ప్రతి జీవికి మెదడు ఉంటుంది
అతిగా ఆలోచించేది మానవుడే
అతివలూ ఏమి మినహాయింపు కాదు
గతం గురించి ఆలోచించేది మానవుడే
350
జీవికి శక్తి భూమినుండి లభించు చున్నది
రవి జీవికి శక్తి నిచ్చు చున్నాడు
పవనుని సహాయం అవసరమే
అవసరాల్లో నీరు కూడా ముఖ్యమే
(సమాప్తం)