[శ్రీమతి శాంతిశ్రీ బెనర్జీ రచించిన ‘పుస్తకం జిందాబాద్!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]చే[/dropcap]తిలో పుస్తకం ఉంటే
ఇక కావాల్సిందేముంది?
బాధలు బరువులు కోపతాపాలు
చుట్టూ ఉన్న ప్రపంచపు
నీడలు జాడలు సమస్యలు
మరచి మరో లోకానికి
రెక్కల పక్షిలా ఎగిరి పోవచ్చు!
నిద్రలేమితో అవస్థ పడే రాత్రిళ్ళు
పుస్తకం చదువుతూ పవ్వళిస్తే
కళ్ళు వాలిపోయి సుషుప్తి లోకి పయనం!
పుస్తకమెప్పుడు జారిపోయిందో తెలియని స్థితిలో
కమ్మని కలల ప్రపంచానికి ప్రస్థానం!
పుస్తక పఠనం —
మెదడుకు పదును పెట్టి
చురుకుగా ఆలోచింపజేసే
అమోఘ వ్యాయామం!
అల్జీమర్స్ లాంటి వ్యాధులను
నివారించే వ్యాపకం!
మొబైల్ ఫోన్ వ్యామోహంలో
పుస్తకాన్ని చిన్నచూపు చూడకు
సెల్ తెచ్చే దుష్పరిణామాలు లేని
అద్వితీయ అభ్యాసం పుస్తకాలను ఆశ్రయించడం!
పాత పుస్తకాల వాసనలు
కొత్త పుస్తకాల రెపరెపలు
కలిగిస్తాయి ఆత్మీయ భావనలు
కొత్తపాతల జీవన రీతులు
మారుతున్న తాత్విక సిద్ధాంతాలు
సమాజపు వైవిధ్యాలు వైరుధ్యాలు
కళ్ళ ముందుకొచ్చేను!
రాత్రంతా నవలా పఠనంలో లీనమై
నిద్రలేమితో అలసి పోయినా
ఉద్వేగభరిత మస్తిష్కంలో
పాత్రలు గిరగిరా తిరుగుతుంటే
రోజంతా ఇట్టే గడిచిపోయేను!
ఒక్కోసారి ముగింపు ఏమిటోనని
ఆరాటంగా ఆఖరి పేజీ తిరగెయ్యడం
ఆశించినట్లు లేకపోతే నిరాశగా నిట్టూర్చడం!
చివరికి ఊహించిన సమాప్తమే
బాగుందని సంతృప్తి పడటం!
పుస్తక ప్రేమికుల కలయిక
అవుతుంది చర్చా వేదిక!
వాదోపవాదాల వరవడి
పుస్తకాల మార్పిడి
అద్భుతమైన ఆనవాయితీ!
పుస్తకం నెచ్చెలి!
పుస్తకం బంధువు!
పుస్తకం సమస్తం!
పుస్తకాలు చదవని జీవితం నిరర్థకం!