[శ్రీ చందలూరి నారాయణరావు రచించిన ‘ఒకరి ఆకలికి మరొకరి ఇష్టమే ఆహారంగా’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]రా[/dropcap]త్రయింది అంటే
ఓ రోజు బతుకు ఖాతాలో
జమైనట్లే..
రెండు జతల
గాజుకళ్ళు, ఓటికాళ్ళు
వయసును భుజానవేసుకుని
మంచం కొండనెక్కుతూ
రేపు ఉదయం ఇద్దరిదో?
ఇద్దరిలో ఏ ఒక్కరిదో మరి?
అన్న నడుము వంగిన ప్రశ్న
దిగులు భయంతో
బిక్కు బిక్కుమంటూ
అవకాశం దొరికనప్పుడల్లా
దేహాన్ని తట్టే బాధకు
చులకనయ్యే ఓపికతో
పండిన అనుభవంలో
ఒకరి ఆకలికి
మరొకరి ఇష్టమే ఆహారంగా
బతుకులో
ఒంటరితనం లేకుండా
ఏకాంతానందం సొంతమైనా
వృద్ధాప్యంలో ఏదో ఒక రోజు
ఒకరి మరణం
మరొకరికి నరకమనే
సత్యానికి రెపరెపలాడుతూ
ఆఖరిరోజుకూ ప్రేమను ధారపోసే
ధన్యజీవులు అమ్మానాన్నలు.
(తొంభై ఏళ్లకు దగ్గరౌతున్న ప్రేమ అనే ఔషధంతో ఉత్తమ దంపతులైన మా అమ్మా నాన్నల జీవితాన్ని చూస్తూ, వారి పాదాలకు కవితను అంకితం చేస్తూ..)
Image Source: Internet (Not poet’s parents)