మహాభారత కథలు-69: శకునితో జూదమాడిన ధర్మరాజు

0
3

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

రాజ్యం మొత్తాన్ని ఓడిన ధర్మరాజు

[dropcap]బ[/dropcap]లవంతంగా జూదమాడడానికి కదా పిలిచారు.. వచ్చాక ఆడకుండా వెనక్కి వెళ్లిపోవడం మంచిది కాదు అనుకున్నాడు. తప్పని తెలిసి కూడా విధిని తప్పించుకోలేక ధర్మరాజు జూదం ఆడడానికి అంగీకరించాడు.

జూదమాడే స్థలంలో మంచిగంధం, కస్తూరి, కర్పూరం కలిపిన నీళ్లు చల్లారు. గంధము పువ్వుల్తో పాచికలకి పూజ చేశారు. శకుని, వివింశతి, చిత్రసేనుడు, వికర్ణుడు సిద్ధంగా కూర్చుని ఉన్నారు. వాళ్లని చూసి ధర్మరాజు “వీళ్లల్లో నాతో ఎవరు జూదమాడుతున్నారు?” అని అడిగాడు

దుర్యోధనుడు “ధర్మరాజా! నా వైపు నుంచి శకుని ఆడతాడు. అతడు ఏ ధనరాశులు ఒడ్డినా వాటిని నేను కాదనకుండా ఇస్తాను” అన్నాడు.

ఆట మొదలైంది. దుర్యోధనుడు విలువైన రత్నాలతో చేసిన తన కంకణాల్ని ఒడ్డాడు. ధర్మరాజు సముద్రం నుంచి పొందిన అమూల్యమైన మణులతో చేసిన తన మణుల హారాన్ని పణంగా పెట్టాడు.

స్నేహభావంతో ఆట నడుస్తుండగా అక్కడికి భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, కృపుడు, ద్రోణుడు, అశ్వత్థామ వచ్చి ఎత్తైన ఆసనాల మీద కూర్చున్నారు. మనస్సుకి సంతోషం కలగక పోయినా ఆట చూస్తున్నారు.

పాచికల్ని తనకి వీలుగా తయారు చేసుకున్న శకుని ధర్మరాజుని జయించాడు. నేను కూడా నిన్ను ఓడిస్తాను అని చెప్తూ ధర్మరాజు జూదమాడుతున్నాడు. ధర్మరాజు ఆట ఓడినప్పుడల్లా కోపం పెరిగి ఒకదాని తరువాత ఒకటి పణంగా పెట్టేస్తున్నాడు.

వేలకొద్దీ వరహాలతోను, పదివేలకి పైగా బంగారంతో నిండిన కుండలు కలిగిన భాండాగారాలు (బొక్కసాలు); వజ్రాలు, వైడూర్యాలు, మరకతాలు, ముత్యాలు, ఇంద్రనీలాలు, పగడాలు, పద్మరాగాలు మొదలైన అనేక రత్నాలతో నిండిన రత్న భాండాగారాలు; ప్రత్యేకంగా ఐదు తూముల బంగారంతో ఉన్న నాలుగు వందల నిధుల్ని పణంగా పెట్టి ఓడిపోయాడు.

మణుల రాశులతోను, చిరుగజ్జెల రాశులతోను అలంకరించబడిన గుర్రాల్ని; బంగారు కవచాలతోను, నడుముకు కట్టే బంగారు మోకులతోను, మీద పరిచే బంగారు చిత్ర కంబళ్లతోను ఉన్న మదపుటేనుగుల్ని; అర్జునుడికి గంధర్వరాజు బహుమానంగా ఇచ్చిన గంధర్వుల అశ్వాల్ని; పాలుతాగుతూ వరిబియ్యం తింటూ పెరుగుతున్న పదివేల మేలుజాతి గుర్రాల్ని; మేకలు, గుర్రాలు, గోవులు, గేదెలు, గాడిదలు, కంచర గాడిదల గుంపుల్నీ; విలువైన రత్నాలు కలిగిన ఆభరణాలతో అలంకరించబడిన వేలకొలదీ స్త్రీలని; ప్రతిరోజూ అతిథుల భోజన పాత్రల్ని చేతుల్లో పట్టుకునే నూరువేలమంది సేవకుల్ని; ఒక్కొక్కటిగా ఓడిపోతున్న ధర్మరాజుని చూస్తున్నాడు విదురుడు.

ధృతరాష్ట్రుడితో రహస్యంగా “దుర్మార్గుడైన దుర్యోధనుడు పుట్టడమే దుర్మార్గంతో పుట్టాడు. వీడు పుట్టినప్పుడు నక్కల అరుపులు వినిపించాయి. ఎన్నో చెడు శకునాలు కనిపించాయి. ఇదివరకు పాపము అంటే ఏమిటో తెలియని మహాభిష, భీమసేన, ప్రతీప, శంతనుల వంశం ఈ దుర్యోధనుడి వల్ల పాప పంకిలమవుతోంది.

ఒకడి వల్ల వంశం మొత్తానికి కీడు కలిగితే అతణ్ని నిందించి వంశాన్ని రక్షించడం ధర్మమని శుక్రాచార్యుడు చెప్పాడు. వంశాన్ని రక్షించుకోడం కోసమే కదా యాదవ, వృష్ణి, అంధక వీరులు శ్రీకృష్ణుణ్ని పంపించి కులానికి చెడ్డ పేరు తెస్తున్న కంసుణ్ని చంపించారు.

ధృతరాష్ట్రమహారాజా! ఇప్పుడు నువ్వు దేవేంద్రుడి కొడుకైన అర్జునుణ్ని పంపించు. అతడు ధర్మం తెలిసినవాడు. నువ్వు ఆజ్ఞాపిస్తే వివేకంలేని దుర్యోధనుణ్ని ఆపగలడు. దీని వల్ల నీ కులము, భూమ్మీద ఉన్న ప్రజలు కూడా భయం లేకుండా సుఖంగా జీవిస్తారు.

పెద్ద యుద్ధాలు చెయ్యడం ఎందుకు? నీచుడు, గుణంలేనివాడు దుర్యోధనుడు. అతణ్ని వదిలేసి ధర్మమార్గంలో కౌరవ వంశాన్ని కాపాడు. పాండవుల ప్రతాపం పెరిగేలా పాలించు.

నీకు పాండవులు పరాయివాళ్లు కాదు. ధనం మీద అత్యాశతో పూలతోను, పండ్లతోను నిండిన ఎత్తైన పెద్ద చెట్లని బొగ్గు కోసం కాల్చేసే బొగ్గులవాడిలా కురువంశానికి కీడు కలిగిస్తున్నాడు దుర్యోధనుడు. పొగరెక్కిన ఎద్దు కొండచరియని చీల్చడానికి ప్రయత్నించినట్లు.. దుర్యోధనుడు మహాబలవంతులతో యుద్ధం చెయ్యడానికి తయారవుతున్నాడు. ఇంకా చూస్తూ కూర్చోక ఈ దుర్మార్గపు జూదాన్ని ఆపు” అన్నాడు.

విదురుడు చెప్పినదాన్ని విని కూడా విననట్టు కూర్చున్నాడు ధృతరాష్ట్రుడు. విదురుడు దుర్యోధనుడి వైపు తిరిగి “శకుని మాటలు విని భరతవంశంలో బలవంతులైన పాండవుల సంపదల్ని అన్యాయంగా మాయాజూదంలో దోచుకుంటే నిన్ను లోకులు ఛీ కొట్టకుండా ఉంటారా? ధైర్యవంతులు, పరాక్రమవంతులు అయిన పాండవుల్ని జూదంలో ఓడిపోయేట్లు చేశావు. ఇతరులని మోసం చెయ్యడం మంచి పని కాదు” అన్నాడు.

విదురుడి మాటలు విని దుర్యోధనుడు కోపంతో “నువ్వు ఎప్పుడూ శత్రువుల్నే మంచివాళ్లు అని పొగుడుతావు. పాండవులవైపే మాట్లాడుతావు. ధృతరాష్ట్రుడి కొడుకుల్ని ఎప్పుడూ నిందిస్తావు. తిన్న ఇంటికి అనుకూలంగా ఎప్పుడూ మాట్లాడవు. నువ్వు మా దగ్గర ఉంటే ఒడిలో భయంకరమైన విషసర్పం ఉన్నట్టే ఉంటుంది.

శత్రువుల సంపదల్ని ఉపాయంతో తీసుకోడం రాజులకి సహజ లక్షణమే! స్నేహితుడికి అడగకుండానే సలహా ఇవ్వచ్చు. కాని, నువ్వు మాత్రం ఎప్పుడూ ఇలా చేశావు, అలా చేశావు అని తప్పులు ఎంచుతూ ఉంటావు. మాకు బుద్ధులు చెప్పకుండా నీ హద్దుల్లో నువ్వు ఉండు” అన్నాడు.

విదురుడు దుర్యోధనుడితో “అసలే చెడ్డవాడివైన నీకు ఇంకా చెడిపోయేలా చెడ్డ బుద్ధులు నేర్పించేవాళ్లే స్నేహితులు. మా వంటివాళ్లు చెప్పే మాటలు నీకు ఎందుకు ఉపయోగిస్తాయి. మంచి కోసం చెప్పే మాట వినడానికి ఎవరికీ ఇష్టం ఉండదు. మంచి కాని మాటలే చెవులకి వినడానికి ఇంపుగా ఉంటాయి.

మంచి జరుగుతుంది అని తెలిసినప్పుడు వినడానికి ఇష్టపడక పోయినా స్నేహితులు, బంధువులు మొహమాట పడకుండా బలవంతంగానైనా చెప్పాలి. అటువంటి వాళ్లే రాజుకి సహాయం చేసిన వాళ్లవుతారు. నేను ధృతరాష్ట్రుడి మేలు కోరేవాణ్ని. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుని నా మాటని కాదన్నావు. పాండవులతో శత్రుత్వం నీకే మంచిది కాదు” అని చెప్పి మౌనంగా ఉండిపోయాడు.

శకుని “ధర్మరాజా! నీ దగ్గర ఉన్న సంపదంతా ఓడిపోయావు. ఇంకా ఆడాలంటే నీ దగ్గర ఏదైనా ధనం ఉంటే చూపించు!” ఆడడం మానేసి పాచికలు ధర్మరాజు ముందర పడేశాడు.

ధర్మరాజు జూద వ్యసనానికి లొంగిపోయి రాజ్యం మొత్తం పణంగా పెట్టి ఓడిపోయాడు.

తమ్ముళ్లని, ద్రౌపదిని ఓడిన ధర్మరాజు

ధర్మపరులు, విశాలమైన భుజాలు కలవాళ్లు, యుద్ధంలో ఓటమి తెలియనివాళ్లు, సూర్యుడి తేజస్సుతో సమానమైన తేజస్సు కలవాళ్లు, ఎప్పుడూ నిజాన్నే మాట్లాడేవాళ్లు, ఆత్మగౌరవం కలిగినవాళ్లు అయిన తన తమ్ముళ్లు సహదేవ, నకుల, అర్జున, భీమసేనుల్ని నలుగుర్నీ వరుసగా జూదంలో ఓడిపోయాడు ధర్మరాజు. శకుని చేసిన కుట్ర వల్ల తనకు తానుగా కూడా పందెంలో ఒడ్డి ఓడిపోయాడు.

శకుని “ధర్మరాజా! నీ దగ్గర ఉన్న నీ భార్య ద్రౌపది కూడా నీ సంపదే కదా!” అన్నాడు.

వెంటనే ధర్మరాజు పాచికల మీద ప్రేమతో అప్పటి వరకు జరిగిన మోసాన్ని గ్రహించలేక పట్టపురాణి ద్రౌపదిని కూడా ఒడ్డి ఓడిపోయాడు. ఇంక పందెంలో ఒడ్డడానికి తన దగ్గర ఏది లేక ఆటని ఆపేశాడు.

జూదమనే వ్యసనం అన్ని ధర్మాలు తెలిసిన మహారాజు ధర్మరాజు జీవితాన్నే తారుమారు చేసింది. వ్యసనానికి అంత బలం ఉంటుంది.

తన సర్వస్వాన్ని పోగొట్టుకున్న ధర్మరాజుని చూసి ద్రోణ, కృప, భీష్ముడు మొదలైన పెద్దలందరూ నోట మాట రాక, శ్వాస ఆగిపోయిన వాళ్లులా నిశ్చేష్టులయ్యారు. విదురుడు ముఖం పక్కకి తిప్పుకుని తల దించుకుని మనస్సులో దుఃఖిస్తున్నాడు. సభలో ఉన్న మిగిలినవాళ్లు కన్నీరు కార్చారు. ఉన్నట్టుండి సముద్రంలోంచి వచ్చే భయంకరమైన శబ్దంలా కలకలం మొదలైంది. ఆ సమయంలో ఏం చెయ్యాలో తెలియని స్థితిలో అందరి ముందు తలవంచుకుని కూర్చున్నాడు ధర్మరాజు.

అన్యాయంగా విజయాన్ని సాధించి ఒకళ్ల వైపు ఒకళ్లు చూసుకుంటూ పకపక నవ్వుతున్న దుర్యోధనుడు, శకుని, కర్ణుడు, దుశ్శాసనుడు.. అన్యాయాన్ని అడ్డుకోలేక బాధపడుతూ నిస్సహాయంగా కళ్లనీళ్లు నింపుకున్న భీష్మ, ద్రోణ, విదురుల వంటి పెద్దలు ఉన్న పరిస్థితిలో సభలో కలకలం మొదలయింది.

ఆ శబ్దం విన్న ధృతరాష్ట్రుడు “విదురా! సభలో ఏం జరుగుతోంది? ఎవరు ఎవర్ని ఓడించారు? ఏ వస్తువుల్ని ఒడ్డారు?” అని అడిగాడు.

పాండవుల్ని గెలుచుకుని తన దాసులుగా చేసుకున్న ఆనందంలో ఉన్నాడు దుర్యోధనుడు. ఆ గర్వంతో దాసీలందరితో కలిసి ద్రౌపదితో ఇల్లు ఊడ్పించాలని అనుకున్నాడు. వెంటనే విదురుణ్ని పిలిచి ద్రౌపదిని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు.

విదురుడు దుర్యోధనుడి మాటలు సహించలేక “దుర్యోధనా! నీ వంటి మూర్ఖులు లోకంలోనే ఉండరు. ఇటువంటి క్రూరమైన పని చెయ్యమని నాకు చెప్తున్నావా? ద్రౌపది సమస్త భూమండలానికి పట్టపురాణిగా పట్టాభిషేకం పొందతగిన స్త్రీ. పాండవులకి ధర్మపత్ని.

ఆమెని అవమానం చేస్తే అడ్డుకునేవాళ్లు లేరని అనుకుంటున్నావా? మూర్ఖుడిలా ప్రవర్తించి పాములకి కోపం తెప్పించకు. మోసంతో ఇతరుల ధనాన్ని తీసుకోవడం ధర్మం కాదు. శకుని మాటలు విని పాపపు పనులు చెయ్యకు. జూదం ఆడడం వల్ల చెడు జరుగుతుంది. దాని వల్ల కలిగే ఫలితం వేళ్లతో సహా నాశనం చేస్తుంది” అన్నాడు.

విదురుడి మాటలు విని దుర్యోధనుడు విదురుణ్ని నిందించాడు. ‘ప్రాతికామి’ అనేవాణ్ని పిలిచి “ఈ విదురుడు ఎప్పుడూ చెడుగానే మాట్లాడతాడు. పాండవులంటే విదురుడికి భయం. నువ్వు వెళ్లి ద్రౌపదిని తీసుకునిరా!” అన్నాడు.

ద్రౌపదిని సభకి తీసుకుని వచ్చిన ప్రాతికామి

దుర్యోధనుడు ఆజ్ఞాపించడం వల్ల సూతుడి కొడుకు ‘ప్రాతికామి’ ద్రౌపది దగ్గరకు వెళ్లి భక్తితో నమస్కారం చేశాడు. మహాపతివ్రత అయిన ద్రౌపదితో “ధర్మరాజు కౌరవులతో జూదమాడి ధన సంపదలే కాకుండా రాజ్యాన్ని, తమ్ముళ్లని, తనని, నిన్ను ఓడిపోయాడు. దుర్యోధనుడు నిన్ను వెంటనే తీసుకుని రమ్మని నన్ను పంపించాడు. తీసుకుని వెళ్లడానికి నేను వచ్చాను” అని చెప్పి తనతో రమ్మన్నాడు.

అతడి మాటలు విని ద్రౌపది “ఏ యుగంలో అయినా ఎంత చెడ్డ జూదగాడయినా భార్యని పణంగా పెట్టి ఓడిపోయినవాడు ఉన్నాడా? చంద్రవంశానికి ప్రభువైన ధర్మరాజు ఇలా చేశాడని అంటే వినడానికే ఆశ్చర్యంగా ఉంది. అన్నా! ధర్మరాజు ముందుగా తను ఓడి తరువాత నన్ను ఓడిపోయాడా? ముందు నన్నే ఓడిపోయి తరువాత తను ఓడిపోయాడా? ఈ విషయం గురించి నీకు తెలిస్తే నాకు చెప్పు!

ఒకవేళ ఈ విషయం నీకు తెలియకపోతే ఆ జూదగాడి దగ్గరికి వెళ్లి అడిగి నన్ను అక్కడికి తీసుకుని వెళ్లడం ధర్మమనిపిస్తే తీసుకుని వెళ్లు” అని చెప్పింది

ప్రాతికామి తిరిగి వెళ్ళి ద్రౌపది అడిగిన విషయం ధర్మరాజుకి చెప్పాడు. కాని, జూదంలో ఓడిపోయిన బాధలో ఉన్న ధర్మరాజు సమాధానం చెప్పలేదు. అప్పుడు దుర్యోధనుడు “నువ్వు అడిగినదానికి సరయిన సమాధానం చెప్పడానికి వీలుకాని న్యాయం ఇంతమంది ముందు అడిగావు. సభలో ఉన్న వాళ్లు అందరూ తెలుసుకునేలా ద్రౌపదిని వెంటనే తీసుకుని రా!” అన్నాడు.

ప్రాతికామి మళ్ళీ ద్రౌపది దగ్గరికి వెళ్లాడు. “నువ్వడిగిన న్యాయాన్ని నిర్ణయించి చెప్పడానికి సభ్యులు నిన్ను రమ్మని ఆజ్ఞాపించారు రా!” అన్నాడు. ద్రౌపది దుర్యోధనుడు చేస్తున్న దుర్మార్గానికి, ధర్మరాజు అంగీకరించడం చూసి పరిస్థితిని అర్థం చేసుకుంది. అప్పటి వరకు ధైర్యంగా ఉన్న ద్రౌపది ఆగకుండ ప్రవహిస్తున్న కన్నీళ్లతో ప్రాతికామి వెంట కౌరవ సభకి వెళ్లింది.

కురువంశపు కోడలి మానమర్యాదలు కాపాడవలసిన బాధ్యత అతడిదే అన్నట్టుగా కురువృద్ధుడు, స్వార్థం లేనివాడు, ధర్మాన్ని ఆచరించేవాడు అయిన ధృతరాష్ట్రుడి పక్కన నిలబడింది.

ద్రౌపది పరిస్థితిని చూసి పాండవులు దుఃఖంతో తలలు వంచుకున్నారు. సిగ్గుతోను, దుఃఖంతోను తలలు వంచుకున్న పాండవుల్ని చూసి దుర్యోధనుడు సంతోషపడ్డాడు.

ప్రాతికామికి భీముడంటే భయం. అందువల్ల దుర్యోధనుడు దుశ్శాసనుడితో “నువ్వు వెళ్లి ద్రౌపదిని ఇక్కడికి తీసుకునిరా!” అని ఆజ్ఞాపించాడు. దుర్మార్గుడైన దుశ్శాసనుణ్ని చూసి ద్రౌపది భయంతో పరుగెత్తి గాంధారీ దేవి దగ్గర నిలబడింది.

దుశ్శాసనుడు ద్రౌపది వెంట పరుగెత్తి “జూదంలో శకుని నిన్ను గెలిచాడు. నువ్వు ఇప్పుడు కురుశ్రేష్ఠుడైన దుర్యోధనుడు చెప్పినట్టు వినాలి. నీ భర్తలు జూదంలో నిన్ను రాజ్యాన్ని, తమను ఓడిపోయారు” అంటూ దగ్గరగా వచ్చాడు.

ద్రౌపది “నన్ను తాకకూడదు. ఒకే బట్ట కట్టుకుని ఉన్నాను. పెద్దలు, బంధువులు ఉన్న సభలోకి ఎలా వస్తాను?” అంది.

దుశ్శాసనుడు “ఎలాగైనా నిన్ను నేను తీసుకుని పోతాను!” అన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here