[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]
[ఉదయాన్నే నిద్ర లేచిన శాస్త్రి గారు అద్వైత్ పాండురంగలతో నదికి వెళ్లి స్నానం చేసొస్తారు. ఈలోపు నైవేద్యం సిద్ధం చేస్తుంది సావిత్రి. అందరూ పూజా మందిరంలో కూర్చొని పూజ చేస్తారు. పూజ పూర్తి చేసి అందరికీ తీర్థ ప్రసాదాలను అందిస్తారు శాస్త్రిగారు. రెడ్డి గారు కారు పంపిస్తారు. పెద్దలకి నమస్కరించి, పాండుకి, సీతకి జాగ్రత్తలు చెప్పి రైలు ఎక్కడానికి స్టేషన్‍కి వెళ్తాడు అద్వైత్. సావిత్రి, సీత తమ గదుల్లోకి వెళ్ళి బాధపడతారు. సుమతి సీతని ఓదార్చి ధైర్యం చెబుతుంది. శాస్త్రి గారు సావిత్రిని అనునయిస్తారు. సీత బయటకు వచ్చి, సావిత్రి దగ్గరకు వెళ్ళి ధైర్యం చెబుతుది. అందరినీ వరండాలో కూర్చోమని చెప్పి, చక్కని కాఫీ పెట్టి ఇస్తుంది. సీత లోపలికి వెళ్ళగానే, – అద్వైత్ తిరిగొచ్చకా, సీతతో పెళ్ళి జరిపించాలని భర్తతో చెప్తుంది సావిత్రి. సరేనంటారాయన. మద్రాస్ నుంచి ఓడలో లండన్‍కి బయల్దేరుతారు ఇండియా, ఆండ్రియా, మేరీ, మిస్టర్ మూన్, అద్వైత్‍లు. రాత్రి అందరూ పడుకున్నాక, బయటకు వచ్చి నలుదిశలా చూసేవాడు. చుట్టూ సాగరం. తనని లండన్‍కి పంపించడానికి తండ్రి ఎందుకు ఒప్పుకున్నాడో అద్వైత్ అర్థం కాదు. ఏదో కారణం ఉండే ఉంటుందని అనుకుంటాడు. సీతను గుర్తు చేసుకుంటాడు. అంతలో అక్కడికి ఇండియా వచ్చి అద్వైత్‍ని పలకరిస్తుంది. కాసేపు మాట్లాడుకుని ఎవరి గదుల్లోకి వారెళ్ళి నిద్రపోతారు. – ఇక చదవండి.]
అధ్యాయం 43:
[dropcap]ఆ[/dropcap]నాటి ఆద్వైత్ లండన్‍కు బయలుదేరి పదిరోజులు. అద్వైత్ వెళ్ళిన మరుసటి రోజు నుంచీ.. సీత సుమతి మాట్లాడుకొని.. వేకువనే లేచి యిరువురూ ఇంటి పనులన్నీ చకచకా చేసేవారు.
వారి చర్యలను చూచి సావిత్రి.. “ఏమిటే! అన్ని పనులూ మీరే చేస్తున్నారు.. నన్ను ముసలిదాని క్రింద లెక్కేశారా!..” అడిగింది సావిత్రి.
అక్కడికి వచ్చిన నరసింహశాస్త్రిగారు.. “వారి వయస్సుతో నీ వయస్సు పోల్చితే.. నీవు ముసలిదానివేగా సావిత్రీ!…” నవ్వాడు శాస్త్రిగారు.
“అత్తయ్యా!.. ఇప్పుడు నాకు శలవులు.. స్కూలు లేదు. కాబట్టి నా స్కూలు రీఓపెనింగ్ అయ్యేవరకూ మీరు విశ్రాంతిగా వుండండి. చేయవలసిన వంటవార్పు ఇతర పనులు నేను సుమతి చేస్తాము. మాకు మీరు డైరెక్షన్ చేయండి. అంతే!.. స్నానానికి వేడినీళ్ళు సిద్ధం చేశాను. స్నానం చేసి రండి. టిఫిన్ తిందురుగాని!..” అంది సీత.
“పెద్దమ్మా!.. వెళ్ళిరండి..” అంది సుమతి.
వసుంధర తన గది నుంచి బయటికి వచ్చింది. సీత, సుమతి మాటలను వింది.
“ఒసేయ్!.. సావిత్రి!.. చిన్న పిల్లలు. వయస్సులో వున్న వాళ్ళు వాళ్ళు సరదాగా మాట్లాడుకొంటూ పనులన్నీ చక్కబెడతారులే. నీవు ఓ పని చేయాలి!..”
“ఏమిటి వదినా!..”
“భాగవతాన్ని చదువు. నేను వింటాను. శ్రీహరి కథనాలను వింటే ఇంటికి ఒంటికి మంచిది. పుణ్యం పురుషార్థం కూడానూ!..”
“సావిత్రి!.. పిల్లల మాటలు.. నా అక్కయ్య మాటలు విన్నావుగా!..”
“ఆ విన్నానండీ!..”
“కర్తవ్యం ఏమిటో తెలిసిందిగా!..”
“ఆఁ.. ఆఁ.. తెలిసిందండీ!..”
“అయితే పాటించు మరి..” నవ్వుతూ చెప్పారు శాస్త్రిగారు.
“అలాగేనండీ!..”
సావిత్రి వాలకాన్ని చూచి నరసింహశాస్త్రి నవ్వారు.
“మీరంతా ఒకటైనప్పుడు నా మాట చెల్లదనే విషయం నాకు తెలుసు..” భర్తగారి ముఖంలోకి ఓరకంట చూస్తూ అంది సావిత్రి. స్నానం చేసే దానికి వెళ్ళిపోయింది.
రెడ్డి రామిరెడ్డిగారు వచ్చారు.
వారిని చూచి నరసింహశాస్త్రి వరండాలోకి వచ్చాడు.
“రండి!.. కూర్చోండి.. ఉదయాన్నే వచ్చారు ఏమిటి విషయం!..”
“మనం రేపు బయలుదేరి శ్రీమహాలక్ష్మి అమ్మవారి బంగారు విగ్రహాన్ని చూచి వస్తాము స్వామీ!..” చెప్పారు రెడ్డిగారు.
“విగ్రహం ఎక్కడ చేయిస్తున్నారు!..”
“అన్నవరం..”
“అన్నవరమా!..”
“అవును స్వామీ!..”
“అది చిన్న ఊరు కదా!..”
“ఊరు చిన్నదే.. కానీ.. గొప్ప పనిమంతులైన స్వర్ణకారులు వున్నారు”
“అలాగా!..”
“అవునండి..”
వసుంధర అన్నవరం అన్న మాటను విని.. వరండాలోకి వచ్చింది.
“నరసింహా!.. అన్నవరం వెళుతున్నావా!..”
“అవునక్కా!.. రెడ్డిగారు అమ్మవారి బంగారు విగ్రహాన్ని అక్కడే చేయించారట. చూచి వచ్చేదానికి రేపు వుదయం బయలుదేరుతాము”
“రామిరెడ్డి!..”
“ఏమ్మా!..”
“నేను మా సావిత్రి మీతో రావచ్చా!.. ఆ తండ్రి సత్యనారాయణ స్వామిని దర్శించుకొంటాము” అడిగింది వసుంధర.
“తప్పకుండా రండి. అందరం కలసి వెళదాం.. విగ్రహాన్ని స్వామినీ చూచి వద్దాం. ఏమంటారు శాస్త్రిగారూ!..” చిరునవ్వుతో అడిగాడు రెడ్డిగారు.
“మా అక్కయ్య కోర్కెను తీర్చడం.. నా ధర్మం కదా రామిరెడ్డి గారు!..”
“చాలా సంతోషం.. అమ్మా మనం టాక్సీలో రేపు ఉదయం ఆరుగంటలకు బయలుదేరుతాం. సరేనా!..”
“మంచిది రామిరెడ్డి..”
“శాస్త్రిగారూ!.. ఇక నే వెళ్ళొస్తాను. రేపు ఉదయం ఆరుగంటలకు కలిసికొందాం..”
“అలాగే!..” అన్నారు శాస్త్రిగారు.
రెడ్డిరామిరెడ్డిగారు వెళ్ళిపోయారు.
“నరసింహా!.. రామిరెడ్డి, వాళ్ళ నాన్నగారిలాగే చాలా గొప్ప మనస్సు వున్న వాడురా!.. ఏమంటావ్!..”
“మూటికి ముమ్మాటికీ నీవు చెప్పిన మాట పరమ సత్యం అక్కా!.. భోగభాగ్యాలు వుండవచ్చు. వాటిని పదిమంది మంచికి వినియోగించేలా చేయడానికి ఉదారభావం.. మంచి మనస్సు అవసరం. వీటి రెంటినీ రెడ్డిగారికి ఆ సర్వేశ్వరుడు చాలా గొప్ప స్థాయిలో ప్రసాదించాడు. వారి త్యాగ నిరతే వారికి వారి కుటుంబానికీ శ్రీ రామరక్ష..” చిరునవ్వుతో చెప్పారు శాస్త్రిగారు.
“అవునవును..” అంది వసుంధర.
సావిత్రి జలక్రీడ ముగించి, దుస్తులను మార్చుకొని, పూజా మందిరంలో కూర్చొని దీపారాధన.. కొన్ని నిముషాలు భగవంతుని ధ్యానించి అద్వైత్‍కు అనుక్షణం అండగా వుండమని కోరుకొని.. పావుగంట తర్వాత వరండాలోకి వచ్చింది.
నరసింహశాస్త్రి వసుంధర కూర్చొని వున్నారు. సావిత్రి వరండా వైపుకు వెళ్ళడాన్ని చూచిన సీత.. వారి ముగ్గురికీ కాఫీని తెచ్చి అందించింది. సుమతి పిలవగా విని లోనికి వెళ్ళింది.
“ఒసే సావిత్రి!.. మనం రేపు అన్నవరం వెళుతున్నాము” సంబరంగా చెప్పింది వసుంధర.
సావిత్రి.. నరసింహశాస్త్రిగారి ముఖంలోకి చూచింది.
“అవును సావిత్రి!.. రెడ్డిగారు శ్రీమహాలక్ష్మి బంగారు విగ్రహాన్ని అక్కడే తయారు చేయించారు. అక్క వారితో అన్నవరం సత్యనారాయణ స్వామిని చూడాలని చెప్పింది. వారు కలసి వెళదాం అన్నారు. మనం వారితో కలసి వెళతాము” అన్నారు శాస్త్రిగారు.
సావిత్రి.. వసుంధర ముఖాల్లో ఎంతో సంతోషం.
అధ్యాయం 44:
మరుదినం ఆరుగంటలకు రెడ్డి రామిరెడ్డిగారితో కలసి నరసింహశాస్త్రి సావిత్రి.. వసుంధర అన్నవరం బయలుదేరారు. పదిన్నరకల్లా అన్నవరం చేరారు.
శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించారు. తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వారి వారి కామితములను ఆ జగద్రక్షకుడికి విన్నవించుకొన్నారు. ఆనందంగా కొండ దిగి ఊర్లోని స్వర్ణకారుడు.. చిన్నయ్య ఇంటికి చేరారు.
చిన్నయ్య వారికి మాత విగ్రహాన్ని చూపించాడు. రెండు అడుగుల ఎత్తున జగన్మాత చిరునవ్వుతో.. అభయాస్తంతో అందరికీ నేత్రానందాన్ని కలిగించింది.
“అయ్యా!.. శిల్పాచార్యా!.. మాత బాల రూపంతో మా ముందు సాక్షాత్కరించినట్లు వుందయ్యా. మీ శిల్పకళ అద్భుతం.. అద్వితీయం..” పరమానందంతో చెప్పారు నరసింహశాస్త్రిగారు.
“శాస్త్రిగారు, అందులో నా ప్రతిభ అంటూ ఏమీ లేదు. అంతా ఆ మాత కరుణా కటాక్షం” వినయంగా చెప్పాడు చిన్నయ్య శిల్పి.
“సావిత్రీ!.. జగన్మాత ఎంత అందంగా వుందో చూడవే!..” పరవశంతో చెప్పింది వసుంధర.
“అవును వదినా!.. చాలా అద్భుతంగా వుంది..” అంది సావిత్రి నవ్వుతూ.
“రామిరెడ్డిగారూ!.. మీ సంకల్పం అనితరసాధ్యం. మాతకు పరిపూర్ణ ఆనందం. ఆ తల్లి ముఖ వర్చస్సును చూడండి..” అన్నారు శాస్త్రిగారు సంతోషంగా.
“శాస్త్రిగారూ!.. నేను నిమిత్తమాత్రుణ్ణి. నాకు నా యీ తల్లి ఆనతి ఇచ్చినట్లుగానే నేను నడచుకొన్నాను. మీరంతా రావడం.. తల్లిని దర్శించడం నా భాగ్యం..” ఆనందంగా చెప్పాడు రామిరెడ్డి.
చిన్నయ్యకు చెల్లించవలసిన పైకాన్ని యిచ్చాడు రామిరెడ్డి. కొయ్య మందసంలో మాత విగ్రహాన్ని పదిలంగా వుంచి.. చిన్నయ్య మందసాన్ని రెడ్డిగారి చేతుల్లో వుంచారు.
శ్రీ మహాలక్ష్మి విగ్రహంతో వారు బయలుదేరి రాజమండ్రికి రాత్రి తొమ్మిది గంటలకు చేరారు. నరసింహశాస్త్రిగారిని, సావిత్రి వసుంధరలను వారి యింటి వద్ద దించారు రెడ్డిగారు.
“శాస్త్రిగారూ! త్వరలో మాత విగ్రహ ప్రతిష్ఠాపనకు మంచి ముహూర్తాన్ని నిర్ణయించండి. వేద పండితులను మీకు సాయంగా పిలిపించండి. తల్లి ప్రతిష్ఠాపనను ఎంతో ఘనంగా చేద్దాము” అన్నారు రెడ్డిగారు.
“అలాగే రెడ్డిగారూ!.. నేను చేయవలసిన ఏర్పాట్లను సవ్యంగా అందరికీ ఆనందం కలిగించేలా చేస్తాను”
“చాలా సంతోషం స్వామీ!.. ఇక నే బయలుదేరుతాను” చెప్పి రెడ్డిగారు తన ఇంటివైపుకు కార్లో బయలుదేరారు. సావిత్రి వసుంధరలు స్నానం చేసి భోజనానికి సిద్ధం అయినారు. సీత వరండాలోకి వచ్చింది.
“మామయ్యా!.. వేడి నీళ్ళు తోడాను రండి స్నానం చేద్దురుగాని..” అని,
“అత్తయ్యా.. బామ్మా!.. భోజనానికి రెడీ!.. మీదే ఆలస్యం..” నవ్వుతూ చెప్పింది సీత.
సీత ముఖంలోకి చూచాడు నరసింహశాస్త్రి..
“ఏం మామయ్యా!.. అలా చూస్తున్నారు!..” బిక్కముఖంతో అడిగింది సీత.
నరసింహశాస్త్రిగారి పెదవులపై చిరునవ్వు..
“నాకెందుకమ్మా వేన్నీళ్ళు..”
“ప్రయాణంలో మీ శరీరానికి అలసట కలిగి వుంటుంది మామయ్యా!.. వేన్నీళ్ళ స్నానం చేస్తే.. హాయిగా వుంటుంది మామయ్యా!..” అనునయంగా చెప్పింది సీత.
సావిత్రి.. వరండాలోకి వచ్చింది.
“సావిత్రీ !.. సీత ఉపచారం మనకు..”
“అది ఎవరు!.. నా కోడలు కదా!..” సీత ముఖంలోకి చూచి నవ్వింది సావిత్రి.
తల ఆడిస్తూ.. నరసింహశాస్త్రి లోనికి నడిచారు.
(ఇంకా ఉంది)