[శ్రీ గోపగాని రవీందర్ రచించిన ‘నూతనోషస్సులు..!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]ఆ[/dropcap]కర్షించే ముఖచిత్రంతో
వెలువడిన కొత్త పుస్తకమెప్పుడు
చదవాలనే ఉత్సుకతను పెంచుతుంది
మరువని మాతృ స్పర్శను కలిగిస్తుంది..!
పూల సువాసనలు
తోటంతా వ్యాపించినట్లుగా
సృజనాత్మకమైన అక్షర కాంతిరేఖలు
తనువంతా వ్యాపిస్తున్నట్లుగా ఉంటుంది..!
పేజీ తర్వాత పేజీలను తిప్పుతుంటే
పేరాల్లోని జీవనానుభూతులు
ఒక్క దగ్గర కుదురుగా కూర్చోనివ్వవు
అనర్గళమైన ముచ్చట్లతో ఊరడిస్తుంది..!
ఆకర్షించే నింగిలోని మేఘాలు
కురిసే వర్షపు చినుకుల ప్రేమతో
నేల దాహాన్ని తీర్చినట్లుగా
అజ్ఞానపు తిమిరాన్ని పాతర వేస్తుంది.!
కొత్త పుస్తకాన్ని అక్కున చేర్చుకోవడమంటే
ఒక కొత్త స్నేహితుడిని పొందినట్టు
జీవనోత్సాహానికి దారులు వేస్తూనే
నూతనోషస్సులకు ఆహ్వానం పలుకుతుంది..!