[చదువు – అన్వీక్షికి – ఉగాది నవలల పోటీ 2023 విజేతల సన్మాన సభ నివేదికని అందిస్తున్నారు శంకర కుమార్.]
[dropcap]చ[/dropcap]దువు అన్వీక్షికి ప్రచురణ సంస్థ నిర్వహించిన 2023 ఉగాది నవలల పోటీలో బహుమతులు పొందిన విజేతలకు సన్మానం, నగదు పురస్కారం, జ్ఞాపికల ప్రదాన కార్యక్రమం 4 ఆగస్టు 2024న బంజారాహిల్స్ లోని ప్రసాద్ లాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగింది. లబ్ధప్రతిష్ఠులైన సినీ, సాహితీరంగ ప్రముఖులు అతిథులుగా హజరై సభను సుసంపన్నం చేశారు.
బహుమతి గ్రహీతలలో కుమార యశస్వి (వేసవి కూలీ నవల) లాంటి పాతికేళ్ల కుర్రాళ్ళ నుంచి, వాణిశ్రీ, పాణ్యం దత్తశర్మ, వి. రాజారామ్మోహన రావు గార్ల వంటి ప్రముఖ రచయితలున్నారు. సర్వశ్రీ నాగసూరి వేణుగోపాల్, అట్టాడ అప్పలనాయుడు గార్ల వంటి ప్రముఖులు హాజరైనారు.
విజేతలకు శ్రీ తనికెళ్ల భరణి, శ్రీ వంశీ గార్లు సన్మానం చేసి అభినందించారు. మధురాంతకం నరేంద్ర గారు, సినీ దర్శకులు దేవా కట్టాగారు, మహమ్మద్ ఖదీర్ బాబు గారు కూడ కొందరిని సన్మానించారు.
ప్రయోక్త సిద్దారెడ్డి గారు ఆద్యంతం సభను ఆసక్తికరంగా నడిపారు. యువతరంలో పఠనాసక్తిని పెంపొందించడంలో అన్వీక్షికి పాత్రను వక్తలు ప్రశంసించారు. అత్యంత అరుదైన గ్రంథాలను తాను తన సొంత డబ్బుతో ప్రచురింప చేస్తున్నానని తనికెళ్ల భరణి తెలిపారు. మధురాంతకం నరేంద్ర ఆంగ్ల నవలా సాహిత్యాన్ని గురించి చెప్పారు. ప్రొఫెసర్ మృణాళిని గారు ఆహ్వానితులైనా, సభకు రాలేకపోయారు. దిగ్గజాల వంటి సినీ, సాహితీమూర్తులతో వేదిక పంచుకోవడం తన అదృష్టమని సినీదర్శకులు దేవా కట్టా అన్నారు.
మహ్మద్ ఖదీర్ బాబు గారు మాట్లాడుతూ, కోవిడ్ వల్ల మూతపడిన పత్రికలన్నీ, ఇతర భాషల్లో మళ్ళీ చక్కగా నడుస్తున్నాయని, ఒక్క తెలుగు భాషలోనీ అన్ని పత్రికలూ మూలపడ్డాయని, గురజాడ వారి “మనవాళ్ళొట్టి వెధవాయలోయ్” అన్న మాట ఈ సందర్భంలో నిజమైందని చమత్కరించారు. పోటీలు పెడితే తప్ప నవలలు బయటికి రాని పరిస్థితి శోచనీయమన్నారు. స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్’ అన్న చందాన వంశీగారేం మాట్లాడలేదు!
సన్మాన కార్యక్రమం, నవ్వులతో, ఛలోక్తులతో సందడిగా సాగింది. ‘వేసవి కూలీ’ నవలకు అత్యుత్తమ బహుమతి అందుకున్న యువకిశోరం కుమార యశస్వి, పాణ్యం దత్తశర్మగారి తమ్ముని కుమారుడే. వాణిశ్రీ గారు తమ ‘బ్లాక్ అండ్ వైట్’ నవల (చారిత్రిక ప్రేమకథ)కు బహుమతి అందుకున్నారు. పాణ్యం దత్తశర్మ గారు తమ క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ నవల ‘ఆపరేషన్ రెడ్’ కు బహుమతి అందుకున్నారు. బహుమతి పొందిన నవలలు అన్నింటినీ, అన్వీక్షికి సంస్థ ప్రచురిస్తుందని ప్రయోక్త తెలిపారు.
బహమతి, సన్మానగ్రహీతల స్పందన తెలుపమని నిర్వాహకులు కోరినపుడు డా. ఎమ్. సుగుణరావు, శ్రీమతి తటవర్తి నాగేశ్వరి, పాణ్యం దత్తశర్మ గార్లు ప్రసంగించారు. పాణ్యం దత్తశర్మ మాట్లాడుతూ సాహిత్యం మనోరంజకంగానే ఉంటూ, సమాజానికి సందేశం ఇవ్వాలన్న సర్ ఫిలిప్ సిడ్నీగారి మాటలను ఉదహరించారు. సైన్సుకు తన కర్తవ్యాన్ని బోధించేదే సాహిత్యమన్న బెర్ట్రాండ్ రస్సెల్ మాటలను ఆయన గుర్తుచేసుకొన్నారు. సాహిత్యానికి, పఠనాసక్తికి మళ్లీ మంచి రోజులు వచ్చాయన్నారు.
అన్వీక్షికి టీమ్ సభ్యులు చురుకుగా పాల్గొని సభను క్రమబద్ధంగా, నడిపారు. బహుమతి విజేతలందరికీ దాదాపు 1500/- రూపాయలు విలువైన తమ ప్రచురణలను అందజేయడం అన్వీక్షికి వారి ఉత్తమాభిరుచిని సూచించింది.