[స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘స్వేచ్ఛా పవనాలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]తె[/dropcap]ల్లదొరలను తరిమికొట్టటానికి
శాంతి అహింసలు ఆయుధమ్ములుగా
సత్యాగ్రహమే అంతస్సూత్రంగా
ధర్మచక్రం పరిభ్రమణం ఆదర్శంగా
ఒకేమాటగా అడుగులు కదిపిన
నాయకుల మార్గమే బాసటగా
స్వతంత్ర సంగ్రామం నడిచింది
కదం తొక్కిన కళాకారులు
స్వేచ్ఛా గీతం పాడిన గాయకులు
కలం కదిపిన మేధావుల ఆలోచనలు
ఊతకర్రగా చేసుకున్న భరతజాతి
తెల్లవారను ముష్కరమూకలను
దేశం నుండి తరిమి కొట్టి
భరతమాత శతాబ్దాల
దాస్య శృంఖలాలను తెగ నరికి
సాధించిన స్వేచ్ఛాభారతం
మహాత్ముని త్యాగనిరతికి దర్పణం
మహావీరుల ప్రాణార్పణాల వెలుగులలో
మసిబారిన చీకటి రోజులు ముగిసిపోయి
నవ భారత నిర్మాణం జరిగింది
స్వేచ్ఛాభారతం ఆనంద హేలలతో
రజతోత్సవ స్వర్ణోత్సవ సంబరాలు గడిచి
అమృతోత్సవ పండుగను జరుపుకుని
శతవసంతాల ఉత్సవాలకై పరుగులు పెడుతూ
ఎర్రకోటపై మువ్వన్నెల జెండా
గగనతలాన స్వతంత్ర గాలులలో
స్వేచ్ఛా పవనాలు వెదజల్లుతూ
దేశప్రగతి దిగంతాలకు చాటుతున్నది
స్వతంత్రభారతికి జై జై జై అంటూ
ముక్తకంఠంతో నినదిద్దాం అందరము.