[శ్రీ రోచిష్మాన్ సృజించిన సరికొత్త కవితా ప్రక్రియ ‘వాక్కులు’ అందిస్తున్నాము.]
వాక్కు ప్రక్రియలోని నిర్మాణం లేదా విధం:
[dropcap]వా[/dropcap]క్కులో ఒక అభివ్యక్తి రెండు వరుసల్లో ఉంటుంది. మొదటి వరుసలో క్రియా పదాలతో ఒక సంపూర్ణమైన పంక్తి ఉంటుంది. ఇది ఒక పంక్తిగా మాత్రమే అంటే 30 అక్షరాల లోపు ఉండాలి.
ఈ పంక్తి ఒక వాస్తవ పరిస్థితిని, ఒక ఊహను, ఒక భావుకతనూ, ఒక విషయాన్ని ఒక భావాన్ని ప్రకటించేదిగా ఉంటుంది. ఆ పంక్తిలో చెప్పడం పూర్తవుతుంది. రెండవ వరుసలో ఒక పదం, లేదా రెండు, మూడు విడివడి పదాలలో సూచనాత్మకంగా ఒక తీర్మానం ఉంటుంది. ఈ వరుసలో క్రియా పదాలు ఉండవు. ఈ రెండో వరుస మొదటి వరుసకు కొనసాగింపు కాదు. ఈ రెండో వరుస వాక్కును సంపూర్ణం చేస్తూ కవిత్వావిష్కరణకు మూలకం ఔతుంది.
శిల్పాత్మకమైన లఘురూప కవితాప్రక్రియ వాక్కు.
ఈ శిల్పాత్మక ప్రక్రియ వాక్కులో వస్తువు ఏదైనా కావచ్చు.
వాక్కు అన్న పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. అవి అందరికీ తెలిసినవే. అవి నిఘంటువుల ద్వారా తెలుసుకోగలిగినవే. అన్ని అర్థాలకు సంబంధించిన అభివ్యక్తులకూ ఈ వాక్కు ప్రక్రియలో అవకాశం ఉంటుంది.
వాక్కులు
~
271
ఉదయమూ, వెలుగూ శబ్దం చెయ్యకుండా వచ్చాయి.
“పాఠం”
272
తన తీరుకు తను దెబ్బతిని పోతున్నాడు మనిషి.
“మనుగడ”
273
మనిషికి, మనిషికి మధ్య విషసర్పం సంచరిస్తోంది.
“చెడ్డతనం”
274
ఆకాశంలోని మంచితనం మనకు కానుక అయింది.
“లేయెండ”
275
లోకానికి ఏ హాని చేయని ప్రదేశం విదేశీమతాలతో గాయపడుతూనే ఉంది.
“భారతదేశం”
276
ప్రజ, ప్రభుత్వ వ్యతిరేకంగా తోడేళ్లు దేశాన్ని గాయపఱుస్తున్నాయి
“మేధావులు”
277
మట్టిలో కవిత నడయాడుతోంది.
“రైతు”
278
మనిషి తనకు తాను బలైపోతున్నాడు.
“జీవితం”
279
కవిత్వం కోసం తెలుగు కవుల్ని తెఱిచి చూశాడు పామరుడు.
“మేడిపళ్లు”
280
నోట్లోంచి నిప్పు వస్తోంది.
“మతోక్తి”
281
ఒక తలలోని తలపు మఱో తలకు నిప్పంటిస్తోంది.
“మేధ”
282
ఇంగువ కట్టిన గుడ్డ ఎవరికీ అక్కఱ్లేదు.
“ఇంగితం”
283
శ్రుతి, తాళం లేని గానం వికృతంగా వినిపిస్తూనే ఉంది.
“ప్రవర్తన”
284
మనిషిలో మనసుంది.
“విరోధాభాస”
285
తలలో తలపు తిరుగుతోంది.
“మనుగడ”
286
తలపులు చితికిపోయాయి.
“శోకిష్టి”
287
అందఱినీ కదిలిద్దామని ఓ కవిత కదిలి వచ్చింది.
“సూర్యోదయం”
288
అజ్ఝల్లుల ప్రజ్వలనంలో అతడు తనను తాను పొందుతున్నాడు
“సుకవి”
289
గాఢమైన గానం మౌనంగా సాగుతోంది.
“ధ్యానం”
290
నిజమూ అదే, అబద్ధమూ అదే.
“జీవితం”
291
జంతువులకు రాని రోగాలు మనుషులకు వస్తాయి.
“అభిప్రాయాలు”
292
శబ్దం నిశ్శబ్దంగా నినదించింది.
“కవిత”
293
భావం వీచింది భాష అందుకో లేకపోయింది.
“రసజ్ఞత”
294
తత్త్వం కృతిలో చెఱగని భావం చిత్రించబడ్డది.
“సత్యం”
295
తెలుగు కవితను ప్రపంచం చదివింది.
“వేమన”
296
తెగబడి తెలుగును ధ్వంసం చేస్తున్నారు.
“కవులు, రచయితలు, అధ్యాపకులు”
297
దేశంలో కత్తులు దిగుతున్నాయి.
“మేధావులు”
298
చాల తప్పులు చలామణిలో ఉన్నాయి.
“పాఠాలు”
299
శబ్దంలేని సంగీతం హృదయంగమంగా ఉంది.
“విరితావి”
300
మస్తకానికి నేస్తాల సంపద ఉంది.
“పుస్తకాలు”
(మళ్ళీ కలుద్దాం)