[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘తొలి నడక’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]అ[/dropcap]ది ఎప్పుడు మొదలైందో చెప్పే
పాదాలకు మాటలు లేవు
ముందో వెనుకో మరి నాదో నీదో
తడబడు అతిమెత్తని కాళ్ళలో వెదికే
సుతిమెత్తని నురుగు గలగల
కొందరికి నడక పసితనం పరుగెత్తే
సంభ్రమాశ్చర్యాల సంగమం
మరికొందరికి తప్పెట అడుగే తొలి లెర్నింగ్ లైసెన్స్
ఇంకొందరికి నొప్పి మానినా
మాయని నవ్వుల అనుభవాల పూలబాల్యం
ఎందరికో నడకల చలనం గొప్ప జీవితం
మొత్తంగా అందరికీ
వద్దూ పడుతవ్ ఆయి దెబ్బ దారుల చౌరస్తా
బతుకు రుచి కోరికల అందించే నిచ్చెన
నడక పిల్లలది అమ్మానాన్నలకు
అనిర్వచనీయ ఆనందం
ఆత్మవిశ్వాస ఆయుధం చేబూనిన బతుకున
రాజూ మంత్రీ సేనానీ ప్రజలు చేసే చిన్న కవాతు
బతుకు పోరుకు చుక్కాని
కనిపించే లేత నడకల కాలం రేపటి దిక్సూచి
ఉద్వేగాల జీవ దృశ్యం కమనీయం
బుడిబుడి అడుగుల కమ్మని కావ్యం
తొలి అడుగుల పడిలేచే ఆట