[చెన్నూరు హరి నారాయణ రావ్🌿 గారు రచించిన ‘ఆఖరి నవ్వు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]నే[/dropcap]నెప్పుడూ ఒంటరివాణ్ణి కాదు.
దిక్కుతోచక మండుటెండలో అటూఇటూ
తెగిన గాలిపటంలా ఎగురుతూంటా అటూఇటూ.
సగం ఆకలితో నా శరీరం వీధుల్లో తిరుగుతున్నా
స్నేహితులు అపరిచితులు వింతగా నవ్వుతున్నా
ఆకలి తోడుండగా నాకేవీ అర్థమయ్యేది కాదు.
అర్థం కాక సిగ్గు పడాలని తెలీక తిరిగి నవ్వేవాణ్ణి!
ఎవరినీ నిందంచను.
గాల్లోకి రాళ్ళు విసరను.
ఆకాశంకేసి చూస్తూ గావుకేకలు పెట్టను.
దారేపోయేవాళ్ళని నొటికొచ్చినట్టు తిట్టను.
వచ్చీరాని భాషలో నాలో నేను గొణుక్కోను.
ఆశగా చూసే ఆడపిల్లలకి నేనొక ఎన్నటికీ
అర్థం కాని నాకే తెలియని ఆమడదూరం.
అందరూ నన్నొక జెంటిల్-మేన్ అనుకుంటే
అది మరొక మూర్ఖత్వం.
అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ
నేను ఒంటరివాణ్ణి కాదు.
పేదరికం అనేది నేరం అని నాకు ఎవరూ చెప్పలేదు.
నేను దాన్ని పెట్టి పోషించకపోయినా
నాతోనే పెరిగి తిరిగిన దానికి పూర్తిగా నేనే బాధ్యుణ్ణి.
ఇందులో దాపరికం లేదు.
నా మోచేతి నీళ్ళు తాగి నాకంటే ఎంతో ఎదిగినా
ఎన్నోసార్లు అది నన్ను కబళించాలనీ చూసింది.
భయం వేసేది కాదు కానీ ఏదో వింతగా
కొత్త పరిచయంలా అనిపించేది. ఎందుకోమరి,
నేను భయపడలేదు, ఎటూ పారిపోనూలేదు.
బహుశా, ఆ నమ్మకం కుదిరాకనేమో
అది నన్ను భయపెట్టడం మాని
నాతో సహజీవనం చెయ్యడం మొదలిపెట్టింది.
పేదరికం మహమ్మారి.
దానికి గుర్తు లోతైన కళ్ళున్న కదిలే మనిషి.
అతడి రెక్కలు చాలా పొడుగు.
కానీ ఎందుకో ఎగరలేడు.
చక్కటి పలువరస.
గట్టిగా నవ్వాలంటే కారణాలు వెతుకుతాడు.
తనకి తానే అద్దంలో చూసుకుని అదిరిపడే భయస్థుడు.
ప్రతీ సాయంత్రం మసక వెల్తుర్లో కనిపించే విధి ఆనవాలు.
అతడొక చీకటిదొంగ కాకపోయినా పగలంటే భయం.
నేరం చెయ్యకపోయినా అతగాడే ఒక జాడ్యం.
అందుకే ‘నన్ను’ ఉరి తీయండి.
మళ్ళీమళ్ళీ ఉరి తీయండి.
కాసేపు ఆగండి.
కొనఊపిరి ఉందేమో కాస్త చూడండి.
ఉన్నా లేకున్నా మళ్ళీమళ్ళీ ఉరి తీయండి.
వందలు వేల సార్లు.
ఊళ్ళో అందరూ తలోసారి.
నాక్కూడా కసి తీరేంతవరకు.
అదిగో అది ఇంకా నవ్వుతోంది.
ఇంకా ఇంకా కసి తీరా బిగ్గరగా.
నా చెవులు పగులుతున్నాయి.
మళ్ళీమళ్ళీ ఉరి తీయండి.
వందలు వేల సార్లు.
ఊళ్ళో అందరూ తలోసారి.
నాక్కూడా కసి తీరేంతవరకు.
అదిగో తొలిపొద్దు పొడిచింది.
ఇదిగో పేదరికం చచ్చింది.