[శ్రీ సముద్రాల హరికృష్ణ గారి ‘ఆదిత్య హృదయం!!’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]లి[/dropcap]ప్త ఆలశ్యం చేయడు.
అపరంజి చక్రం లాగా అందంగా ఆకాశంలో ప్రత్యక్షం, ప్రతీ రోజూ!
అనాది నుంచీ సాగుతున్న నిత్యనైమిత్తికం, జగత్పాలన మహా ప్రణాళికలో!
దీధితుల చక్రవర్తి వస్తున్నాడనగానే చీకటి ముష్కరం, పరారే!
ఒక్క కాంతి రేఖ చాలు, ఇరుల దుప్పటితో సహా ఆ వెలుగు కల్లరి పారిపోవటానికి!
అణువణువు శోధించే కోటికిరణ వీక్షణం, అంధ పటలానికి కాంతి కరవాలం!
అప్పటి వరకు నిదరోయిన జగతికి, చురుకు చకచక!
అందరినీ మించిన ఆదికవి. విశ్వాదికవి!
అన్ని వర్ణాలు కుక్షిలో నింపుకున్న అక్షరుడు!
ధవళ సామ్రాట్టు!
ఆ రామణీయకతను చూసిన, మురిసిన అనేక రసార్ద్ర మానసాల్లో కవితా క్షీరసాగరమథనం కల్గించ కలిగే దివ్య కుశలుడు!
కవి కుల ఆది దేశికుడు!
మౌన వ్యాఖ్యలే, కానీ అనంత పాఠాలు!
ఎన్ని రంగుల అల్లికలనైనా నేయగలడు, ఎన్ని వర్ణ చిత్రాలనైనా గీయగలడు, ఆకాశ పటం మీద!
రోజు కొక కొత్త!
సంధ్య కొక వింత!
ఏమి రాసిక్య వైశాల్యమో, ఏమి లేఖన వైశారద్యమో!
రెండు కళ్ళు చాలవు – ఆ అధిరోహించే, దిగే తరుణాల్లో, వీరి అదృశ్య తూలిక చేసే వర్ణ విన్యాసాలు చూడటానికి!
నయన మనోహరం!
మనసులు దోచి, ఏవో రసరమ్య అపూర్వ లోకాలకు ఊహలను పయనింపజేసే గారడీ!
సృష్టిలోనే ఓ అద్భుతం, అనితర సాధ్యం!
ప్రజావళిని నత మస్తక భంగిమ లోకి తానంతట అదే చేర్చివేసే వర్ణేంద్రజాలం!
***
ఆ రావటమే ఏమి ఠీవీ, ఏమి ఆభిజాత్యం?!
సర్వ సృష్టిలో, చరాచరాల్లో ఒక కదలిక, ఒక మేలుకొలుపు, ఒక సకారాత్మక భావోదయం!
ఆ సమయంలో, గగన సీమ అంతా ఒక ప్రశాంతత నింపుకున్న సాగరమే!
సదుద్యోగాలకై మానవ హృదయాలను నడిపింప చేసే తరంగ మాలికల మౌన ప్రసరణమే!
ఆకాశ సార్వభౌముడే.. కానీ, భూతల మంతా ఈ ప్రభువు రాకకు సన్నాహం, కోలాహలం!
వికసించే కమలాలు, మురిపించే మంద పవనాలు, విమల సలిల రాగాలు, విహగ లోక గాంధర్వాలు!
భువి అంతా సామ గానాల స్వాగతాలు, కర్షక సమాజాల దినారంభాలు, భక్త లోక పూజా పునస్కారాలు, నూత్న ప్రారంభాల కార్యోత్సాహాలు- అంతా నిర్మాణ నిమగ్నత ప్రదర్శించే రజోగుణ సంపన్నతే!
మరి, ఈయన కాదూ, మాకు అన్నిటినీ దర్శింపచేసేది, మా కళ్ళకు వెలుగుల సార్థకత ప్రసాదించేది?!
మా తరు సంపదకు హరితపు పూతలిచ్చి పోషించేది, మా పొలాల్లో పైడి పంటల నాట్యాలు చేయించేది!
ఆయన నెలవు అల్లంత పైన నింగినేమో కానీ మనసంతా మా మీదే, మా వసుంధర మీదే!
అది మా అదృష్టం!
ఎపుడైనా ఈ ప్రభువు, మేఘావృతమయ్యో, మంకు ముసురు పట్టో, కనిపించలేదా, మా పని సరి!
ముద్ద ముట్టని నైష్ఠికులు కొందరు!
ఎదలలో దిగులు రేగి, నీరసించే వారింకెందరో?!
ఆయన వచ్చి అక్కడ ఉండాలి అంతే, మా గుండెలు సజావుగా పనిచేస్తాయి. మా పనులు చురుకుగా సాగిపోతాయి!
ఆ వెలుగుల రాశిని చూడటమే గొప్ప ఫలం, వరం!
మాలో రోజుకు రోజు కొత్త ఆశలు చిగురింప చేసే ఉత్సాహపు కల్పవల్లి ఆయన!
ఈ అమృతవల్లికి అన్నీ వెలుగు పూలే!
అందుకే మా కృషికి నాందీ పఠనం ఆయన రాకతోనే, ఆది నమస్కృతీ ఆయనకే!
ఆయన సంధ్య దాటి ఇలు మరలితే, మా కోసం ఆయన చేసిన ఏర్పాటే- అందాల చందమామ!
మా మనసుకలువల నేలే, వెన్నెలల మామ!
ఈ మామ మాకు ఇంకా దగ్గరి వాడు, అన్ని విధాలా!
అయినా, ఈయనకూ కాంతి అరువిచ్చేది, ఆ దినరాజే!
అంత వాత్సల్యం ఆ గభస్తిమాలికి, మేమంటే, మా నేలంటే!
తాను లేనపుడు, తన చలువ ప్రతినిధి నియామకం!
అదీ, మా కోసం!
కానుకలు కాదు, కట్నాలూ కాదు దేనికో తెలుసా, ఈ మారాజు సంతోషించేది?!
కేవలం ఒక నమస్కారం.
ఆయన వైపు తిరిగి భక్తిగా, కృతజ్ఞతగా చేతులు జోడించి నమస్కార ముద్ర పట్టారో, ఇక అంతే,ఆయన మీ పట్ల ప్రసన్నుడైనట్టే!
అంత శంకర సహపాఠి, బహు ఆశుతోషుడు!
సరళ హృదయుడు!
ఆ మాత్రం చేయలేమూ, తప్పక చేయగలము!
ఇంతగా మనను కనిపెట్టి కాపాడుతున్న రేడికి మన కృతజ్ఞతాంజలి!
ప్రతి నిత్యం! ప్రేమగా! విధిగా!
ఆయన తన విధి చేసినంత క్రమంగా!
***
నమస్కార ప్రియో భానుః!