దంతవైద్య లహరి-8

19
4

[దంత సంరక్షణ కోసం డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారు నిర్వహిస్తున్న ప్రశ్నలు జవాబులు ఫీచర్ – ‘దంతవైద్య లహరి’.]

దంతాలు ఊడిపోవడం

ప్ర: దంతాలు ఊడిపోవడం అనేది మనిషిలో సాధారణ విషయం! అయితే, దంతాలు ఊడిపోవడానికి వయసు కారణం కాకపోవచ్చు. ఎందుకంటే చాలామంది వయసుమళ్ళిన వారిలో దంతాలు ఆరోగ్యంగా, పటిష్టంగా ఉండడం చూస్తుంటాం. అలాగే పూర్తిగా దంతాలు లేకపోవడమూ చూస్తాం. ఈ నేపథ్యంలో దంతాలు ఊడి పోవడానికి, కారణం అశ్రద్ధనా? లేక అది ఏమైనా జన్యుపరమైన కారణాల వల్ల జరుగుతోందా? తెలియజేయగలరు.

-రాజ్ కుమార్. నల్లి, సీతారాం నగర్, సఫిల్ గూడ, సికింద్రాబాద్ -56.

జ: ఆర్యా, మీ సందేహం సమంజసం గానే వుంది. వినడానికి/చదవడానికి వింతగా ఉండొచ్చు గానీ, ఇది అందరూ తెలుసుకొనవలసిన విషయమే మరి!

జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే, మనం మంచి ఆహారం తీసుకోవాలి. తీసుకున్న ఆహారం సజావుగా జీర్ణమై రక్తరూపంలోకి, తద్వారా శక్తి రూపం లోకి రావాలంటే, తీసుకున్న ఆహారం చక్కగా నమలబడాలి. ఆహారం నమాలడానికి ఆరోగ్యమైన, పటిష్టమైన పళ్ళు/దంతాలు కావాలి. అందుచేత బ్రతికినంత కాలం వాటిని సంరక్షించుకోవాలి, అంటే ఊడిపోకుండా చూసుకోవాలి. మరి పళ్ళు ఎందుకు ఊడిపోతాయి?

పళ్ళు మనిషి జీవితంలో రెండు సందర్భాలలో ఊడిపోతాయి. మొదటిసారి బాల్యంలో పాలపళ్ళు ఊడిపోతాయి. ఇక్కడ పాలపళ్ళు ఊడిపోవడం తప్పనిసరి! అవి ఊడినప్పుడే, వాటి స్థానంలో జీవితాంతం దౌడలలో ఉండాల్సిన స్థిరదంతాలు వస్తాయి.

రెండవ సందర్భంలో – మన అశ్రద్ధ వల్ల వయసుతో సంబంధం లేకుండా ఊడిపోతాయి. ఒకసారి స్థిరదంతాలు వచ్చాక అవి సహజంగా ఊడిపోవడం ఉండదు! వ్యాధిగ్రస్థమై ఊడదీయవలసిన పరిస్థితి రావడమో, రకరకాల చిగురు/దంతవ్యాధుల వల్ల పళ్ళు కదిలి రాలిపోవడమో జరుగుతుంది. పళ్ళు ఊడిపోవడం అంటే అది ఒకరమైన అంగవైకల్యం లాంటిదే, పైగా చేతులారా కొనితెచ్చుకున్నది.

బాల్యంలో వచ్చిన పాలపళ్ళు, ఆరు సంవత్సరాల వయసు వచ్చేవరకు దౌడల్లో స్థిరంగా ఉంటాయి. ఆరు – ఏడు సంవత్సరాల మధ్యకాలంలో, ముందరి కొరుకుడు పన్ను (ఇన్సిసార్) ఊడిపోవడం మొదలు పెట్టి, ఒక్కో వయసులో ఒక్కో పన్ను ఊడి వాటి స్థానంలో స్థిరమైన పళ్ళు వస్తాయి. అయితే ఈ రాబోయే స్థిరదంతాలు ఆరోగ్యంగా పటిష్టంగా ఉండాలంటే, పాలపళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎలాగూ ఊడిపోయే పళ్ళు కదా, అని అశ్రద్ధ చేయకూడదు.

అందుకే పాలపళ్లను, రాబోయే స్థిరదంతాలకు పునాదిరాళ్ళుగా చెబుతారు. ఇక్కడ సకాలంలో పాలపళ్ళు ఊడకపోతే ఊడదీయవలసి ఉంటుంది. అలాగే కొన్ని దంత చికిత్సలకు సంబంధించి, ఆరోగ్యంగా గట్టిగా వున్న పళ్ళను తీయవలసి ఉంటుంది.

పన్నెండు సంవత్సరాల వయసు వచ్చేసరికి, జ్ఞాన దంతాలు (థర్డ్ మోలార్స్) నాలుగు తప్ప మిగతా అన్ని పళ్ళు వచ్చేస్తాయి. జ్ఞానదంతాలు మాత్రం 17-21 సంవత్సరాల వయసులో వస్తాయి. కానీ ఇవి ఆహరం నమిలే (మాస్టికేషన్) విషయంలో ఉపయోగానికి రావు కదా, కొన్నిసార్లు ఇబ్బందులు కూడా కలుగజేస్తాయి. అవసరాన్ని బట్టి వాటిని కూడా తీసివేయ వలసిన పరిస్థితి ఏర్పడుతుంది.

అయితే, మరి పళ్ళు ఎందుకు ఊడిపోతాయి?

దంతవ్యాధులు, చిగురు వ్యాధులు, కొన్ని దురలవాట్ల వల్ల పళ్ళు ఊడిపోయే పరిస్థితులు ఏర్పడుతుంటాయి.

దంతవ్యాధులు – చిగురు వ్యాధులు రావడానికి ముఖ్య కారణం ‘నోటి అపరిశుభ్రత’ (బ్యాడ్ ఓరల్ హైజీన్). నోటి అపరిశుభ్రతకు ప్రధాన కారణం, శాస్త్రీయ పద్ధతిలో దంతధావనం చేసికొనక పోవడం, ఆహార పదార్థాలు, చిరుతిండ్లు తిన్న వెంటనే నోరు సరిగా పుక్కిలించకపోవడం. అలాగే పళ్లరసాలు, ఇతర పానీయాలు త్రాగిన వెంటనే నోరు పుక్కిలించక పోవడం. దీనివల్ల పిప్పిపన్ను వ్యాధి, చిగురువ్యాధులు వచ్చి సరైన చికిత్స సకాలంలో తీసుకొనక పోయినట్లయితే, పళ్ళు కదిలి ఊడిపోయే ప్రమాదం వుంది.

అందుచేత దంతధావనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎన్నిసార్లు లేదా ఎంత సేపు దంతధావనం చేశామన్నది కాదు, ఎంత జాగ్రత్తగా, ఎంత శాస్త్రీయంగా పళ్ళు తోముకున్నామన్నది లెక్క! అందుచేత స్థిరదంతాలు రాలిపోవడానికి – వయసుకి సంబంధం లేనేలేదు. అందుకే దంతసంరక్షణ విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండవలసిందే!

ఇకపోతే, ఒకసారి వచ్చినపళ్లు రాలిపోవడానికి జన్యుపరమైన కారణం లేకపోవచ్చును గానీ, అదే జన్యుపరమైన (జెనెటిక్ ప్రాబ్లెమ్) కారణాల మూలంగా, అసలు పాలపళ్లు గానీ, స్థిరదంతాలు గాని రాని పరిస్థితులు గాని ఏర్పడతాయి. జనాభాలో ఇలాంటివారు అతి తక్కువశాతం కనిపిస్తారు. అలా అసలు దంతాలు లేకపోవడాన్ని ‘ఈడెంట్యులస్’ అంటారు. ఇలాంటివారిలో, అందమైన ఆడపిల్లలు కూడా వుంటారు. అందుచేత వృద్ధాప్యం వచ్చేసరికి పళ్ళు ఊడిపోవడానికి, మన అశ్రద్దే ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

సరిగా దంతధావనం చేసుకోవడం, చిగుళ్లు వేలితో గట్టిగా రుద్దుకోవడం, ఎలాంటి ఆహారము నమిలినా, ఎలాంటి పానీయాలు త్రాగినా, వెంటనే నోరు పుక్కిలించే అలవాటు ఉంటే, మనం బ్రతికినంత కాలం, మన దంతాలు ఆరోగ్యంగా, పటిష్టంగా వుండి, విధి నిర్వాహణలో సముచితంగా సహకరిస్తాయి.

~

జంతువుల్లో దంత సమస్యలు:

ప్ర: దంతసమస్యలు వస్తే, మానవులకు దంతవైద్యం ఉపకరిస్తుంది. మరి జంతువులకు, అంటే ముఖ్యంగా పెంపుడు జంతువుల పరిస్థితి ఏమిటి?

జ: మంచి సందేహం వచ్చింది మీకు. నిజమే, ఇది ఆలోచించదగ్గ అంశమే మరి! అది సృష్టి రహస్యమే అనుకోవాలి. అవి తీసుకునే ఆహారాన్ని బట్టి, సహజంగానే, జంతువుల పళ్ళు శుభ్రపడతాయి. ఒకవేళ ఏదైనా పంటి సమస్య వచ్చినప్పుడు అవి ఆహారం తీసుకోవడం మానేయడాన్ని బట్టి, వెటర్నరీ వైద్యులు పరీక్షించి తగిన సూచనలు చేసే అవకాశం ఉంది. కొందరు పెంపుడు జంతువుల యజమానులు ప్రతిరోజూ, తడిగుడ్డతో, తర్వాత పొడిగుడ్డతో జంతువుల పళ్ళు శుభ్రం చేస్తుంటారు.

ఏమో.. భవిష్యత్తులో జంతువులకు కూడా ప్రత్యేకంగా దంతవైద్యులు వస్తారేమో, చెప్పలేము, ఎదురుచూడాలిసిందే!

డా. కె. ఎల్. వి. ప్రసాద్, సివిల్ సర్జన్ (రిటైర్డ్), 9866252002

~

పాఠకులు తమ దంత సమస్యలకు సంబందించిన ప్రశ్నలు (ఎన్నైనా, ఇందులో ఎలాంటి నియమం లేదు) ‘సంచిక’ సంపాదకులకు kmkp2025@gmail.com అనే మెయిల్ ఐడికి, ప్రతి గురువారం లేదా అంతకంటే ముందు పంపవచ్చు. ప్రశ్నలు పంపేవారు విధిగా తమ పూర్తి పేరు, ఊరు, మొబైల్ నంబరు రాయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here