[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[సున్నిపెంటలో శకుంతల అనే కొలీగ్‍తో కల్సి గది అద్దెకు తీసుకుంటుంది మేరీ. రెండు నెలలకే ఆమెకి పెళ్ళి కుదిరి వెళ్ళిపోతుంది. మరో ఇల్లు చూసుకుని అమ్మానాన్నలను పిలిపించుకుందామనుకుంటుంది మేరీ. దసరా సెలవలకి ఇంటికి వెళ్తుంది. ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉన్న మేరీని చూసి అమ్మానాన్నలు సంతోషిస్తారు. తిరిగి ఊరు వెళ్తున్నప్పుడు మిమ్మల్ని కూడా నాతో తీసుకువెళ్తానని చెప్తుంది. వాళ్ళు కాదన్నా, ఒప్పిస్తుంది. సున్నిపెంటలో ఇల్లు వాళ్ళకి బాగా నచ్చేస్తుంది. సాక్షి గణపతి అనే సారు నుంచి ప్రేరణ పొంది ఎం.ఎ. ఇంగ్లీషుకు ప్రైవేటుగా చదివి పాసవుతుంది మేరీ. పెళ్ళి చేసుకోమని తల్లిదండ్రులు పోరుతుంటారు. సర్వీస్ కమీషన్ పరీక్షలో కూడా నెగ్గి, పలమనేరు జూనియర్ కాలేజీలో లెక్చరర్‍గా చేరుతుంది. అక్కడ్నించి ట్రాన్స్‌ఫర్ మీద ముదిగుబ్బ కాలేజీకి, ఆపై నందలూరు జూనియర్ కాలేజీకి బదిలీ అవుతుంది. తమతో తన తల్లిదండ్రులను కూడా చూసుకునే సంబంధమయితేనే పెళ్ళి చేసుకుంటానని మెలిక పెట్టేసరికి – ఏ సంబంధమూ ఖాయం కాదు. ఓ కుర్రాడిని డిబార్ చేస్తే, మాల్ ప్రాక్టీస్ కేసు బుక్ చేయద్దని ఎమ్మెల్లే చెప్పినా వినకపోయేసరికి, ఆమెను మైదుకూరు కాలేజీకి ట్రాన్స్‌ఫర్ చేయిస్తాడు. ఇక్కడే శశాంక్ బాటనీ లెక్చరర్‍గా పనిచేస్తాడు. అతనో అనాథ. దాతలెవరో చదివిస్తే ఆశ్రమంలో ఉండి చదువుకుని ఉద్యోగం తెచ్చుకున్నాడు. అతనికి మేరీ నడవడి నచ్చుతుంది. ఆమె షరతూ తెలుసుకుంటాడు. ఓ రోజు ఇంటికి వెళ్ళి దావీదు తోనూ, మార్తమ్మ తోనూ మాట్లాడుతాడు. పెళ్ళయ్యాక, మీరు మాతో ఉండవచ్చనీ లేదా నేనే మీతో ఉంటానని అంటాడు. మేరీ కూడా ఒప్పుకోవటంతో రిజిస్టర్ మేరేజ్ చేసుకుని, రిసెప్షన్ ఇస్తారు. అనంతపురంలో పద్మనాభశాస్త్రి ప్రభ వెలిగిపోతుంటూంది. పుండరి కూడా బాగా వృద్ధిలోకి వచ్చాడు. అన్నదమ్ములిద్దరూ కార్లు కొనుక్కున్నారు. కేదార రీసెర్చ్ పూర్తవగానే పూణె లోని న్యూక్లియర్ రియాక్టర్ సెంటర్‍లో జూనియర్ సైంటిస్ట్‌గా ఉద్యోగం వస్తుంది. కేదారకు సీనియర్ వైద్యనాథన్ అనే తమిళుడు. అతను కేదారను తమ్ముడిగా చూసుకుంటాడు. ఓ రోజు కారులో కేదారని ఓ చోటకి తీసుకెళ్తాడు వైద్యనాథన్. ఇక చదవండి.]
[dropcap]కా[/dropcap]రు ఒక ఆశ్రమము ముందు ఆగింది. ‘ఆత్మవిజ్ఞాన్ కేంద్ర – ది అబోడ్ ఆఫ్ హిజ్ హైనెస్ ప్రభు దత్తమహరాజ్’ అని మరాఠీలోను, ఇంగ్లీషు లోను వ్రాసి ఉంది.
బయట కాట్ల కడుక్కోడానికి కొళాయిలున్నాయి. ఒక సన్యాసి వీండ్లను చూసి మందహాసము చేసినాడు.
“వైద్యాజీ, చలియే. అల్పాహార్ తేజియే” అని చెప్పినాడు.
‘ప్రసాదాలయ్’ అని బోర్డున్న కుటీరములోకి వెళ్లినారిద్దరు. ఎక్కడా కాంక్రీటు భవనాలు లేవు. అన్నీ వెదురు బొంగులతో, తడికలతో, బోదెగడ్డి పైకప్పుతో ఏర్పాటు చేసినవే. ఫ్లోరింగు మాత్రము శాండ్ స్టోన్ పరిపించినారు.
అల్పాహారంలో పండ్లు, కీరదోస, క్యారట్ ముక్కలు ఇచ్చినారు. రాగి జావలో మజ్జిగ కలిపినది చిన్న కుండలతో ఇచ్చినారు. ఎక్కడా ప్లాస్టిక్ వస్తువులు వాడటం లేదు.
కొద్దిదూరంలో గోశాల ఉన్నాది. దాంట్లో సుమారు నూటికి పైగా గోవులున్నాయి. వాటి పేడనూ, ఇతర సహజ ఎరువులను వాడి, ఆశ్రమానికి కావలసిన కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. ఒక పక్కన గోబర్ గ్యాస్ ప్లాంటు కూడా ఉంది.
అక్కడి నుంచి ధ్యాన మందిరానికి వెళ్లినారు. కొంతమంది సిరిచాపల మీద కండ్లు మూసుకొని కూర్చుని ధ్యానం చేస్తున్నారు. కొందరు యోగాసనాలు వేస్తున్నారు.
వీండ్లలో చాలామంది సిటీ నుంచి వచ్చిపోయేవారేనని, దురాభారం నుంచి వచ్చి కొన్ని రోజులు ఉండి పోవాలనుకున్నవాండ్లకు కుటీరాలు ఉన్నాయని చెప్పినాడు వైద్య.
ఆశ్రమాన్ని ఆనుకొని ఒక పెద్ద వాగు పారుతుంది. దాంట్లోని నీళ్లనే లిప్ట్ పంపుల ద్వారా ఆశ్రమానికి సరఫరా చేస్తారు.
తర్వాత స్వామిజీ ఉన్న ప్రధాన కుటీరానికి వెళ్లారు. అక్కడ స్వామిజీ అనుగ్రహ భాషణం చేస్తారట. ఆయనను అందరూ ‘మహరాజ్’ అని సంబోధిస్తారు.
సమావేశమందిరం విశాలంగా ఉంది. ఎక్కడా కనీసం ఫ్యాన్లు లేవు. పెద్ద పెద్ద కిటికీలున్నాయి వెదురుతో చేసినవి. వాటికి తలుపులు లేవు. పేము తెరలున్నాయి. వాటిని చుట్టి కిటికీ పైన బిగించినారు, అవసరమైతే దింపుకోవచ్చు.
ఒక్కొక్కరూ సమావేశమందిరానికి చేరుకోబట్నారు. కింద కూర్చోడానికి సిరిచాపలు వేసి ఉన్నాయి. కూర్చోలేని వారికి పక్కన వెదురు బొంగులతో చేసిన చెంచీలున్నాయి. వాటి మీద పల్చని గోనె పట్టలలో బోదెగడ్డిని నింపిన మెత్తలున్నాయి.
ఎదురుగ్గా చిన్న వేదిక. దాని మింద మహరాజ్ కూర్చోడానికి – వెదుళ్లతో చేసిన ఒక విశాలమైన అరుగు. వెనక గోడ మింద విలియమ్ వర్డ్స్‌వర్త్ రాసిన ‘లెట్ నేచర్ బీ యువర్ టీచర్’ అన్న కవితాత్మక వాక్యము ఇంగ్లీషులో, దాని మరాఠీ అనువాదము వ్రాసిన బ్యానర్ ఉంది.
“మహరాజ్ వస్తున్నారు!” అని ఒక శిష్యుడు వచ్చి ప్రకటన చేశాడు.
హిజ్ హోలీనెస్ ప్రభు దత్తమహారాజ్ వెనక తలుపులో నించి వేదిక మీదికి వచ్చారు. ఆయనను చూడగానే అందరూ లేచి నిలబడినారు. కొందరు ఉన్న చోటు నుంచే మోకాళ్ల మీద వంగి ఆయనకు నమస్కారం చేసినారు. కొందరు నిలబడే చేతులు జోడించినారు. వైద్యనాథన్, కేదార కూడా నిలబడే మొక్కినారు.
ఆయన రెండు చేతులతో అందరినీ ఆశీర్వదించి, అరుగు మీద కూర్చున్నారు.
‘ప్రకృతిమాతా కీ జయహో!’ అని నినదించారు. ఆయన స్వరం మంద్ర గంభీరంగా ఉంది. అనుగ్రహభాషణం ఇంగ్లీషులో సాగుతుంది. ఒక శిష్యుడు ప్రతి రెండు నిమిషాలకొకసారి, దాన్ని మరాఠీలోకి అనువదించి చెబుతున్నాడు
మహారాజ్‌కు డెబ్బై సంవత్సరాలుంటాయి. పచ్చని పసిమి ఛాయ. విశాలమైన నుదురు. క్లీన్ షేవ్ చేసిన వదనము. పొడుగ్గా ఉన్న జుట్టును వెనక్కు దువ్వి సిగ చుట్టినాడు. కుడి చేతికి రాగి కడియము ధరించినాడు. మెడలో తులసిపేరుల మాల.
లేత పసుపురంగు లుంగీ ధరించి, దాని మీద కాషాయ రంగు జుబ్బా వేసుకున్నాడు. వృద్ధాప్యపు ఛాయలు ఆయన శరీరం మీద ఏ మాత్రం కనబడటం లేదు. మేను దృఢంగా వుంది. విశాలమైన రొమ్ము, ఉన్నతమైన భుజస్కందాలు!
మహరాజ్ తమ ప్రబోధాన్ని మొదలుపెట్టారు.
“ది చిల్డ్రన్ ఆఫ్ ది అల్‍మైటీ! భగవంతున్ని చేరాలంటే కేవలం పూజలు, పునస్కారాలు, యజ్ఞయాగాలు, రకరకాల క్రతువులు చేయాల్సిన పని లేదు. గుళ్లు గోపురాల వెంట తిరగాల్సిన అవసరం లేదు. సాటి మానవునితో ఆయన్ను దర్శించండి.”
ఆయన ఆపగానే శిష్యుడు మరాఠీలో దాన్ని అనువదించి చెప్పాడు. “సర్వాంతర్యామి సంతానమైన ధన్యాత్ములారా..”
పూర్తిగా ఆచార సంప్రదాయాలు, పూజలు, నోములు, ఉపవాసాలు, ఇలాంటి వాటితో కూడిన వాతావరణంలో పెరిగిన కేదారకు ఆయన మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఇంటి నుంచి వచ్చి, అణుభౌతిక శాస్త్రంలో పి.హెచ్.డి చేసినా, రక్తనిష్ఠమైన సంస్కృతి అతన్ని వీడలేదు.
మహరాజ్ కొనసాగించారు – “విశ్వకవి టాగోర్ మాటలు ఇక్కడ గుర్తు చేసుకుందాము. ఎందుకంటే ఆయన చెప్పాడంటే మీకు మరింత విలువగా అనిపిస్తుంది..” అని నవ్వినారు.
“ఎవర్నిపూజిస్తున్నావు ఆ చీకట్లో?
దేవుడు అక్కడ లేడను సంగతి తెలియదా?
రోడ్డు వేయడం కోసం రాళ్లు పగలకొట్టే కూలీలో
నాగలి పట్టి భూమిని దున్నే రైతులో,
వాండ్లు చిందించే నీ చెమట చుక్కల్లో
ఆయనను దర్శించండి!”
“గీతాంజలి లోని ఈ కవిత సుప్రసిద్ధం. గీతాంజలి కావ్యం అంతా ప్రకృతినీ భగవంతునిగా చూపిస్తుంది. మనకు ప్రత్యక్షంగా కనబడే పరమాత్మే ప్రకృతి. ఎటువంటి ప్రయోజనాన్ని ఆశించకుండా మనకు సేవల నందిస్తుంది. ‘గాడ్ మ్యానిఫెస్ట్ హిమ్ సెల్ఫ్ ఇన్ నేచర్’ అంటాడు వర్డ్స్‌వర్త్. తెలుగు కవి వేమన కూడా గుడ్డిగా చేసే పూజలను నిరసించాడు
వివేకానందస్వామి ‘యువర్ భక్తి ఈజ్ నథింగ్ బట్ సెంటిమెంటల్ నాన్‌సెన్స్!’ అని గర్జించలేదా? ‘దేరీజ్ నో రెలిజియన్ ఫర్ ఎంప్టీ బెల్లీస్’ అన్నాడా మహానుభావుడు.
భగవద్గీత ఏమి చెబుతుంది? ‘యోగః కర్మ సుకౌశలమ్’ అని. నీవు చేసే పనిని త్రికరణశుద్ధిగా సమర్దవంతంగా చేయడమే యోగము. కర్మయోగమైనా, రాజయోగమైనా అదే అని తెలుసుకోండి నాయనలారా!
అన్ని మతాల సారాంశం ఒక్కటే ‘ఏకం సత్, విప్రాః బహుధా వదన్తి’ అంటూ ఘోషిస్తున్నాయి ఉపనిషత్తులు. కులమత ధన వృత్తి భేదాల కతీతంగా అందర్నీ సమదృష్టితో చూడగలగడమే సత్యనిష్ఠ! ‘సర్వత్ర సమదర్శినః’ అని భగవాన్ శ్రీకృష్ణ అటువంటి వారిని పేర్కొన్నాడు. సత్యమంటే కేవలం అబద్ధాలు చెప్పకపోవడం మాత్రమే కాదు. నైర్మల్యం, పరోపకారం, సుఖదుఃఖాలకతీతంగా ఉండడం ఇవన్నీ సత్యపాలనలే. జాతిపిత గాంధీ జీవిత చరిత్ర చదవండి. దాని పేరుమని పెట్టుకున్నాడాయన? ‘సత్యముతో నా ప్రయోగాలు’ (మై ఎక్స్‌పరిమెంట్స్ విత్ ట్రూత్) అని. దాని నిండా ఆత్మపరీక్ష, ఆత్మపరిశీలనా ఉంటాయి. ఆయన చేసిన తప్పుల పట్ల సీరియస్ అండ్ సిన్సియర్ కన్ఫెషన్ ఉంటుంది. వాటిని దిద్దుకోవడానికి ఆయన పడిన తపన ఉంటుంది.
గాంధీజీకి అభిమాన రచయిత ‘లేవ్ టాల్‌స్టాయ్’ – ‘రష్యాను పాలించే జార్ చక్రవర్తి ఐనా, రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకునేవాడైనా భగవంతుని దృష్టిలో ఒకటే’ అని ప్రవచించాడు. ఆయిన సాహిత్యం చదవండి. ఇదే భావన అంతర్లీనమై ఉంటుంది.
‘మానవసేవే మాధవసేవ’, ‘అత్మవత్సర్వభూతాని’ అన్న మాటలు మనం నిజంగా ఆచరిస్తే మన హృదయాలు పరిఫుల్లములవుతాయి. స్వచ్ఛములవుతాయి. ప్రకృతి మాతాకీ జయహో!” అని ముగించారు మహరాజ్. కేదార అలవాటు ప్రకారం చప్పట్లు కొట్టబోయి ఆగిపోయినాడు. ఎందుకంటే ఎవ్వరూ కొట్టలేదు. కొట్టగూడదని ఆశ్రమ నియమమంట!
‘స్పెల్ బవుండ్’ అనే మాట కేదార మానసిక స్థితికి చక్కగా సరిపోతుంది మహరాజ్ మాటలు అతన్ని కదిలించాయి. చెప్పేవారిని బట్టి మాటల ప్రభావం ఉంటుందంటారు.
ఆశ్రమం కార్యకలాపాల గురించి చాలా తెలుసుకున్నాడు కేదార. ఎక్కడా దేవాలయాలు కట్టించరట. పెద్ద పెద్ద విగ్రహాలు నెలకొల్పరట. భజనలు, నామ సంకీర్తనలు ఉండవట. మహరాజ్ శిష్యులంతా తమ ఆదాయంలో పదోవంతు ఆశ్రమానికి స్వచ్ఛందంగా ఇస్తారట. మహారాష్ట్ర అంతటా మాత్రమే గాక, ఇంకా కొన్ని రాష్ట్రాలలో కూడా ఆశ్రమం శాఖలున్నాయట. పండరీపుర్‍లో ఒక అనాథాశ్రమం, పుణేలో స్కూల్ ఫర్ ది బ్లైండ్, కొల్హాపూర్‌లో వృద్ధాశ్రమం ఉన్నాయట. ఒక ఇంజనీరింగ్ కాలేజీ కల్యాణ్‌లో, ఐదారు పాలిటెక్నిక్ కాలేజీలు వివిధ పట్టణాల్లో నడుస్తున్నాయట.
‘కమ్యూనిటీ సర్వీస్ సోల్జర్స్’ అనే వింగ్ ఒకటి ఉందట. మారుముల పల్లెలకు పోయి ప్రజలకు ఆరోగ్యం, పారిశుద్ధ్యం లాంటి విషయాలు చెబుతారట. సుమారు ఇరవై ఉచిత సంచార వైద్యశాలలు తిరుగుతుంటాయట.
‘ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్‌మెంట్’ అని ఒక మిషన్ ఉన్నదట. మొక్కలు నాటటం, వాటిని పరిరక్షించడం, అడవులను రక్షించడం, ఔషధ మొక్కలు పెంచడం, రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా తిండిగింజలు, కూరగాయలు పండించడం చేస్తారట. పెద్ద పారిశ్రామికవేత్తలు, ధనవంతులు విరాళాలే కాకుండా, భూదానాలు కూడా చేస్తారట. ‘ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్‌మెంట్’ ను సంక్షిప్తంగా ఇ.ఎఫ్.ఇ (EFE) అంటారట.
భోజనం కూడ అక్కడే చేసినారు. మృదువుగా, పొరలుగా ఉన్న పుల్కాలు, కూటు వడ్డించినారు. కొంచెం అన్నం, ఆర్గానిక్ కూరగాయలతో చేసిన మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ పెట్టినారు. చివర్లో పెరుగు కప్పులతో ఇస్తే, దాంట్లో చక్కెర వేయించు కొని తిన్నారు చాలామంది. కేదార అన్నంలో కలుపుకుంటుంటే విచిత్రంగా చూసినారు కొందరు.
సెంటరుకు తిరిగి వచ్చినా ఆశ్రమము, ప్రభు దత్తమహరాజ్ కేదారకు కండ్ల ముందు కనబడుతున్నారు. ఇంకా ఆయన చెప్పిన విషయం పూర్తిగా కొత్తదేమీ కాదుగాని, చెప్పిన విధానం అద్భుతం. ఆచరించి చూపిస్తున్నాడు కాబట్టి మరింత ప్రభావవంతం.
తర్వాత వీకెండ్ మళ్లీ వెళదామని వైద్యనాథన్‌ను అడిగితే రానన్నాడు. పెళ్లిచూపులకు తన ఊరు రామనాథపురం వెళుతున్నానన్నాడు.
ఈసారి ఒక్కడే పోయినాడు కేదార. అక్కడ కొందరు పరిచయమైనారు. మహారాజ్ సందేశము విన్నాడు.
అనంతపురము నుంచి నాన్న ఫోన్ చేసినాడు. “చదువు పూర్తయి ఉద్యోగములో చేరినావు కాబట్టి, నీ పెండ్లి చేయాలని అనుకుంటున్నాము. రెండు సంబంధాలు వచ్చినాయి. ఒకసారి వచ్చి పిల్లలను చూస్తే, ముందుకు పోదాము” అని.
ఇంతవరకు, వాండ్లు కూడా ఏమి అనలేదు. “సరే, నాన్నా వస్తాను. శుక్రవారం సాయంత్రం బయలుదేరి ఫ్లయిట్‌లో బెంగుళూరుకు వచ్చి, రాత్రికి అనంతపురం చేరతాను. సోమవారం సెలవు పెట్టినాను. మూడు రోజులుంటాను. మళ్లీ సోమవారం సాయంత్రము తిరిగి వస్తాను”అని చెప్పినాడు.
ఒక సంబంధము బెంగుళూరు వాండ్లే. అది సోమవారం చూసి అక్కడే విమానం ఎక్కొచ్చు. రెండోది తాడిపత్రి వాండ్లు.
శుక్రవారం రాత్రి యిల్లు చేరినాడు. చదువు, ఉద్యోగ హోదా తెచ్చిన కొత్త కాంతితో కేదార శానా బాగున్నాడు. తల్లి కొడుక్కు దిష్టి తీసింది. నిమ్మకాయ చిత్రాన్నము, ఉర్లగడ్డ ముద్దకూర చేసి, పొట్లకాయ బజ్జీలు వేసింది. కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రపోయినాడు కేదార.
శనివారం మద్యాహ్నం భోజనాలు చేసి ఒక గంట తర్వాత తాడిపత్రికి బయలుదేరినారు కారులో. గట్టిగా గంట ప్రయాణము. వీళ్లు చేరేటప్పటికి నాలుగైంది.
పిల్ల తండ్రి తాడిపత్రిలో పురోహితుడు. ఆయన పేరు విశ్వనాథశాస్త్రి. సొంత యిల్లుంది. ఇద్దరు పిల్లలు. మొదట కొడుకు. ఇంజనీరింగు చేసి హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడు. చెల్లెలి పెండ్లి కాందే తాను చేసుకోనన్నాడట. మంచిదే!
తర్వాత ఈ పాప. పేరు పరాన్ముఖి. అమ్మవారి పేరు. చాలా అరుదైన పేరు పెట్టినారని పద్మనాభయ్య వాండ్లను మెచ్చకున్నాడు. స్వీటు క్యారెట్ హల్వా, బోడంచి (జీడిపప్పు) పకోడి చేసి ఇచ్చినారు. ఇంట్లో చేసినవేనని చెప్పినారు కూడా. వీండ్లూ ఆచారసంపన్నలే కదా!
పిల్లకు ఇరవై ఒకటి నిండినాయట. తాడిపత్రి డిగ్రీ కాలేజీలో బి.కాం చదువుకున్నది. ఉద్యోగము చేయించడము ఇష్టం లేదు. పెండ్లయిన తర్వాత భర్త యిష్టమన్నారు. వంట చక్కగా చేస్తుంది. సంగీతము నేర్చుకోలేదు గాని, బాగా పాడగలదట.
“ఏదీ ఒక పాట చెప్పమ్మా”అని అడిగింది మీనాక్షమ్మ.
పిల్ల తెల్లగా, సన్నగా ఉంది. పెద్దకండ్లు. చక్కగా జడ వేసుకుని కనకాంబరం మాల సిగలో పెట్టుకుంది. నశ్యం కలరు చీర, గులాబి రంగు రవికె ధరించింది. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబాల్లో ఆడపిల్లలు ఎట్లుంటారో అట్లనే ఉంది.
తల్లి పక్కకు చూచింది పరాన్ముఖి. “పాడు తల్లీ” అనగానే ‘పూజ’ సినిమాలో పి. సుశీలమ్మ పాడిన త్యాగరాజ కీర్తన ఎత్తుకుంది. ‘నీ.. దయ రాదా! రామ, నీ.. దయరాదా!’ అనే పాట. గొంతు బాగుంది. ఎక్కడా తడబడకుండా, శృతి తప్పకుండా పాట పూర్తి చేసి తల్లి పక్క చూసింది.
చప్పట్లు కొట్టబోయి, ప్రభు దత్తమహరాజ్ గారి ఆశ్రమం గుర్తొచ్చి నవ్వుకున్నాడు కేదార. ఆ పిల్ల వైపు మెచ్చుకోలుగా చూసినాడు.
రెండ్రోజుల్లో ఏ విషయమూ ఫోన్ చేస్తామని చెప్పి వెనక్కు తిరిగినారు. పరాన్ముఖి నచ్చిందని తల్లిదండ్రుల ముఖాలు చెబుతున్నాయి.
“అమ్మణ్ణి బాగుందిరా! చదువు, సంస్కారం, సంగీతం అన్నీ లక్షణంగా కుదిరినాయి. ఈ కాలం పిల్లల మాదిరి తిక్కవేషాలు లేవు” అన్నాది తల్లి.
“అవునవును. నాకు అదే అనిపించింది” అన్నాడు తండ్రి. కేదార నవ్వి ఊరుకున్నాడు. ఆ పిల్ల అన్ని రకాలా బాగుంది. కాని చూసిన వెంటనే ఆ పిల్లవానిలో ఏ స్పందనా కలుగలేదు..
(ఇంకా ఉంది)