[శ్రీమతి గీతాంజలి రచించిన ‘వచ్చేయి వెన్నెలా!’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]నీ[/dropcap] కోసం నేనూ., గులాబీలు ఎదురు చూస్తున్నాం
నా లాగా గులాబీలు కూడా నిన్నే ప్రేమిస్తున్నాయి..
చూడందుకే తోటమాలి కన్ను గప్పి..
తోట దాటి నీ కోసం తీరం వెంబడి నిరీక్షిస్తున్నాయి.
వెన్నెలా గులాబీలు కలిస్తే..
వెన్నెల పరమళిస్తుంది..
గులాబీ చల్ల బడుతుంది!
నీ కోసం ఎదురు చూస్తూ..
నాలా గులాబీలు కూడా అలిసి పోతున్నాయి.,
వాడిపోతున్నాయి .
వాడిపోయిన గులాబీలు
నిరీక్షణా సౌగంధంతో నిట్టూరుస్తున్నాయి.
ఇంటి నుంచి తెచ్చిన
నీకిష్టమైన మిఠాయి కొద్దిగా ముడుచుకుంది.
తీరం వెంబడి సుదీర్ఘమైన జుదాయి (వియోగం)
తరువాతి… ములాఖాత్‌లు., ఆలింగనాలు జరిగిపోతున్నాయి.
ఒంటికి రాసుకున్న అత్తర్లు శ్వాసల్లోకి చేరిపోతున్నాయి.
ద్వేషించుకునే వాళ్లు కూడా కనులు కలుపుకొని పోతున్నారు.
పిలుచుకునే వాళ్ళు.. కరచాలనాలు చేసుకునే వాళ్ళు..
ఎడబాటు దుఃఖానికి కలయికతో ముగింపునిచ్చే వాళ్ళు
అలా చేతిలో చేతులు వేసుకుని నడిచిపోతున్నారు!
వెలిగే కళ్ళు
వెలుగారిపోయే కళ్ళు నిట్టూరుస్తున్నాయి.
నువ్వింకా రావేంటి వెన్నెలా?
ఎదురు చూపుల దేహం నీరసపడిపోతుంది
ఈ కళ్ళు అలిసిపోతున్నాయి
ఇక ఈ చూపులకి దక్కు వెన్నెలా.. సాక్షాత్కరించు!
నువ్వలా వెళ్ళిపోయాక..
నాలోంచి వెన్నెల కూడా
దీపంలా ఆరిపోయింది.
నువ్వేం చేసావో తెలుసా..
వెళుతూ వెళుతూ
నా ఆకాశాన్ని కూడా తీస్కెళ్ళిపోయావు.
ఎంత పని చేసావు?
కొన్ని నక్షత్రాలనన్నా ఇచ్చి వెళ్లాల్సింది.
నా వాకిలి చీకటి నన్నా వెలిగించుకునేవాణ్ణి కదా!
ఎదురు చూస్తున్న వాళ్ళు…
వాళ్ళని చేరుకున్న ప్రేమికులు
అందరూ కలుసుకున్నారు.
నుదుటి ముద్దులు..
కన్నీటి కౌగిలింతలతో
వెళ్లిపోతున్నారు కూడా!
ఇంకా రావేంటి వెన్నెలా..
వచ్చేయి. నీకోసం నిలువెల్లా
ఎవరికీ ఇవ్వని కౌగిలింతయిపోయాను.
వచ్చేయి వెన్నెలా.. సముద్రంలా
వచ్చేసి నన్ను నీతో తీసుకుపో!
ఇప్పుడిక నేనే ఒడ్డున నావలా కూర్చున్నాను..
లోకమంతా వెతికినా దొరకని
స్వచ్ఛమైన ముద్దు ..
అమాయకపు ముద్దు..
నీ పెదవుల మీదే ఉంది.
ఇచ్చి పోదువు రా!