ఆరు కథలు – కొన్ని జీవితాలు-2

0
12

[కొన్ని స్నేహాలు, కొన్ని బంధాలు అపార్థాలకి కారణమవుతాయి. ఆత్మీయులనుకున్న వారిలో కలతలు రేపుతాయి. కొందరికి సరైనదనిపించినది మరికొందరికి ఆమోదం కాకపోవచ్చు. కొందరికి సహేతుకమనిపించినది కొందరికి బరితెగింపులా అనిపించవచ్చు. చిన్న వయసులో జరిగితే ఏమాత్రం ఆక్షేపణ చెప్పని ఘటన మలివయసులో జరిగితే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. సంఘం, కుటుంబ సభ్యులు, బంధువులు నానా రకాల మాటలు అంటారు. మరి ఆసరా అవసరమైనప్పుడు తోడు నిలవని వారి మాటలకు విలువివ్వాలా, లేక అంతరాత్మ ప్రబోధాన్ని గౌరవించాలా – ఇలా కొన్ని కుటుంబాలలో చెలరేగిన ఉద్విగ్నతలను ఆరు కథలుగా అందిస్తున్నారు శ్రీ గూడూరు గోపాలకృష్ణమూర్తి. ఇది రెండవ కథ. ఒకటవ కథ ఇక్కడ.]

ఊసరవెల్లి

“సుమిత్రా! నీతో ఓ మాట చెప్పాలి.”

“చెప్పండమ్మా!”

“మన సూర్యం మాష్టారు నిన్ను ఇష్టపడుతున్నారు. నిన్ను పెళ్ళి చేసుకుందామనుకుంటున్నారు.  నీకు ఇష్టమయితే..” ఆ మాటలు వినగానే విప్పారిన నయనాలతో ఆవిడ  వేపు చూశాను నేను. ఆ మాష్టారికి నా మీద అటువంటి భావం ఉందా? ఎప్పుడూ నాకు అతని మీద  అటు వంటి భావం రాలేదు. ఇది వినగానే దీని గురించి ఆలోచించాలి. అతను చాలా మంచివాడని, ప్రేమ సమాజంలో పెరగడం వలన మంచితనం, మానవత్వం అతనిలో మెండుగా ఉన్నాయని నేను విన్నాను, అందరూ చెప్పుకుంటూ ఉంటే. మనిషి కూడా బాగుంటారు అనుకుంటున్నాను నేను.

“మౌనంగా ఉన్నవేంటి? ఒక్క విషయం. నీ కుటుంబ జీవితంలో ఎన్నో సవాళ్ళు, సమస్యలు ఎదురవుతాయి. వాటిని మనోధైర్యంతో ఎదుర్కోవాలి. అలా అని వాళ్ళని ఎదిరించమని చెప్పటం లేదు. వాళ్ళకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాలి. అప్పటికి వాళ్ళు వినకుండా మన భావాల్ని, పరిస్థితుల్ని అర్ధం చేసుకోకుండా తమ మాటే నెగ్గాలంటే అప్పుడే మనం ఎంచుకున్న దారిలో నడవాలి. అంతే కాని మన వాళ్ళు చెప్పిందే వేదం అంటూ జీవితంతో రాజీ పడి బ్రతక అవసరం లేదు” అన్నారు సంగీతం మేడమ్.

మళ్ళీ ఆవిడే మాట్లాడుతూ, “అదే నేను చెప్పేది. నీ ఇంటి సంగతి, నీ వాళ్ళ సంగతి తెలుసు. ఒకప్పుడు నిన్ను చులకనగా ఓ పురుగును చూసినట్లు చూసిన నీ వాళ్ళు ఇప్పుడు నిన్ను బంగారు గ్రుడ్లు పెట్టే ఓ బాతులా చూస్తున్నారంటే దాని అర్థం ఏమిటి? ఇప్పుడు నీవు సంపాదనాపరురాలివి అయ్యావు. వాళ్ళకి నీ డబ్బు మీదున్న మమకారం నీ మీద లేదు. స్వార్థపు మనుషులు. నీవు నా కూతరు లాంటి దానివి.. అందుకే మంచి చెడ్డల్ని విశ్లేషించి చెబుతన్నాను. సూర్యం మాష్టారుతో పెళ్ళికి ఒప్పుకో” అన్నారు.

“మా ఇంటి సంగతి తెలిసిన మీరు ఇలా సలహా ఇస్తున్నారా?” మేడమ్.

“తెలుసు. అందుకే చెప్తున్నాను. మేము చేసిన తప్పు మరొకరు చేయకూడదు. మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేశాము. వాళ్ళు మంచి వాళ్ళు అనుకున్నాం. మంచి చెడు ఎవరి ముఖం మీద వ్రాసి ఉండదు. మంచి వాళ్ళలా  నటించారనుకుంటాను. పెళ్ళయిన మరునాడు నుండే అత్తింటి ఆరళ్ళు ఆరంభమయ్యాయి.

అక్కడ అమ్మాయి ఏడుపు. మేము ఏడుపు ఇక్కడ. పులి నోట్లో అమ్మాయిని తోసేము. మేము ఏడుపు. ఆ పెళ్ళయిన తరువాతే నాకు బి.పి, థైరాయిడు, షుగరు వ్యాధులు పట్టుకుని నా ఆరోగ్యం పాడుయింది. మా అల్లుడు కూడా తన వాళ్ళను ఎదిరించలేక రాముడు మంచి బాలుడు అన్న విధంగా ఉండే మెతకవాడు. తన వాళ్ళను ఎదిరించలేడు. ఇది ఒకప్పటి సంగతి. ఇప్పుడు ఎదిరించి మాట్లాడుతున్నాడులే. అమ్మాయి జీవితం కూడా ఇప్పుడు పరవాలేదు.

ఈ సోది అంతా నీకు ఎందుకు చెప్పానంటే సూర్యం మాష్టారికి నా అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. అనాథగా పెరిగాడు. అలా పెరిగిన వాళ్ళకి కష్టనష్టాలు అన్నీ తెలిసి ఉంటాయి. మంచితనం, మానవత్వం ఉంటాయి. అంతే కాదు అతను రోజూ మన మధ్యనే ఉంటున్నాడు. అతను నడవడిక చూస్తున్నాము. పెళ్ళికి ఒప్పుకో అమ్మాయి!” అన్నారావిడ.

ఆవిడ చెప్పినవి సబబుగానే ఉన్నాయి. అయితే నా పరిస్థితి ఇంట్లో విచిత్రంగా ఉంది. కొన్నాళ్ళు ఆరళ్ళు. ఇప్పుడు ఆప్యాయతలు. ఇవి నిజమైనవి కాదు తాత్కాలికమే. ఊసరవెల్లుల్లు. రంగులు మారుస్తున్న వాళ్ళది నటన అని  తెలుసు. నా జీవితాన్ని నేనే ఏదో విధంగా చక్కబరుచుకోవాలి.

జీవిత ప్రయాణంలో కష్టం ఉంటుంది. సుఖం ఉంటుంది. సంతోషం, బాధ, నష్టం, లాభం ఒకదాని వెనుక ఒకటి వస్తూనే ఉంటాయి. అయితే ఏ ఒక్కదాని దగ్గర ఆగిపోతే జీవిత ప్రయాణం అక్కడే ఆగిపోతుంది.

ఇప్పుడు నా ఇంట్లో వాళ్ళు నా మీద చూపిస్తున్న ప్రేమ నిజమైనది కాదు. అది డబ్బు మహిమ. నేను నాలుగు రాళ్ళు తెచ్చుకుంటున్నాను కదా! అందుకే  ఈ ఆప్యాయతలు. డబ్బు వలన వచ్చిన ప్రేమ దీపం లాంటిది. దీపం నూనె ఉన్నంత వరకూ వెలుగుతుంది. ఆ తరువాత ఏంటవుతుంది. ఆరిపోతుంది. డబ్బు మహిమే వల్లే కుటుంబీకులు నన్ను ఆప్యాయంగా చూసుకోవడం. మనస్సు నుండి వచ్చిన ప్రేమ సూర్యుడు లాంటిది. అది సృష్టి ఉన్నంత వరకూ వెలుగుతూనే ఉంటుంది.

ఇక సూర్యం మేష్టారుగారి విషయానికి వస్తే విధి ఎంత విచిత్రమైనది కదా. ఒంటరిగా ఉన్న మనకి ఎక్కడెక్కడి వారినో తెచ్చి కలుపుతుంది. ఇష్టపడేలా చేస్తుంది. ఇష్టాన్ని పెంచుతుంది. ప్రేమగా మారుస్తుంది.

ఇక నేటి సమాజంలో మనుష్యుల తీరుతెన్నులు చూస్తే కొంతమందిలో స్వార్థం పడగ విప్పి బుసలు కొడుతోంది. ఎదుటి వాళ్ళ వలన వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది అంటే వాళ్ళని అందలం ఎక్కిస్తారు. వాళ్ళ వలన లాభం లేకపోతే కిరాతకంగా కర్కశంగా తోసేస్తారు. ప్రకృతిలో కూడా ఇదే వివక్ష మనకి కనిపిస్తోంది. పండ్లు, కాయలు కోసే చెట్టుకి మనం ఎంతో కష్టపడి నీరు తోడి పోస్తాము. అదే కాయలు కాయని వృక్షమలయితే నీళ్ళు పోయకుండా అలాగే వదిలేస్తాం.

ఇక నా జీవిత విషయానికి వస్తే పుట్టుకతోనే నేను అనాథను కాను. అంతటి స్థాయిలో కాకపోయినా ఆర్ధికంగా ఏ ఇబ్బందులు లేని కుటుబుం. అయితే దురదృష్టం వెంటాడుతుంటే, విధి మనతో ఆడుకుంటే ఏం చేయగలం? తల్లిదండ్రులకి నేను ఏకైక సంతానం.

సంక్రాంతి బట్టలు కావల్సినవి కొనుక్కుని నేను అమ్మ, నాన్నగారు బండి మీద వస్తూ ఉంటే ఓ కుదుపు. ఎదురుగా వస్తున్న ముసలి తాతను తప్పించబోయి నాన్నగారు నడుపుతున్న బండి స్తంభానికి గుద్దెయడం; నేను దూరంగా విసరి వేయబడం ఒక్కసారి కనురెప్పకాలంలో జరిగాయి.

అమ్మా నాన్నగారు విగత జీవులయితే నేను చిన్న దెబ్బలతో బయటపడ్డాను. అప్పుడు నాకు ఆరు ఏడు సంవత్సరాలుంటాయి. నా కళ్ళెదుటే అమ్మానాన్నలు మృత్యువు పాలవడం తట్టుకోలేకపోయాను నేను. నాకు తగిలిన దెబ్బలు బాధ పెడ్తున్నా పెద్దగా రోదిస్తున్నాన్నాను.

చుట్టూ గుమిగూడిన వాళ్ళు మా వాళ్ళకి కుబురు అందించడం, వాళ్ళు రావడం, పోస్టుమార్టం తంతు ముగించడం, వారి నిర్జీవశరీరాలు అగ్నికి ఆహుతి అయిపోవడం అంతా తొందరతొందరగా జరిగాయి. కలలో జరిగినట్టు.

“మా పిల్లల బాధ్యతలే మేము సక్రమంగా  నెరవేర్చటం లేదు. ఇటువంటి పరిస్థితిలో సుమిత్రను మాతో తీసుకువెళ్ళలేము.” అన్నారు నాన్న వేపు వాళ్ళు. అమ్మ వైపు మామయ్య, అతని భార్య వచ్చారు. “మీకు పిల్లలు లేరు కదా. సుమిత్రను మీరు తీసుకెళ్ళండి అక్కడే ఆ పిల్లకి భద్రత ఉంటుంది” అన్నారు తండ్రి తరుపు వాళ్ళు.

“మనకెందుకు కొచ్చింది ఈ లంపటం. పిల్లలు లేకపోయినా ఇద్దరం ఏ చీకూ చింతా లేకుండా చక్కగా ఉన్నాం. ఒప్పుకోకండి” అని మామయ్య చెవిలో తెగ పోరుతోంది అతని భార్య.

కాస్తో కూస్తో మానవత్వం ఉన్న మామయ్య ఆవిడ మాటలు లక్ష్యపెట్టలేదు. దానికి ఫలితమే నేను మమయ్య ఇంటికి వచ్చి చేరాను.

మామయ్య తన మాటకి విలువ ఇయ్యలేదన్న కోపం కసిగా మారి దాన్ని మామయ్య భార్య నా పై చూపించడం ఆరంభించింది. అక్కడ నుండే నాకు ఆరళ్ళు ఆరంభమయ్యాయి. జీవితం నరకంగా తయారయింది.

నా చేత పాచి పనులు చేయించేది. చదువుకోనిచ్చేది కాదు. సమస్త చాకరీ నాపై పడింది. పాచిపోయిన నాలుగు అన్నం ముద్దలు పడేస్తే అదే తిని కాలక్షేపం చేసుకోడం అలవాటు చేసుకున్నాను. సహనం.. సహనం ఇదే నా జపమంత్రం.

ఇంట్లో మామయ్య ఓ ఉత్సవ విగ్రహమే. అతని పెత్తనం అధికారం లేదు. ఆ ఇంట్లో అంతా అతని బార్య అజమాయిషిలోనే జరిగేది. అతనిది మెతక స్వభావం. అదే అతని బలహీనత.

సహనం.. సహనం.. కష్టపడాలి. ఉన్నత స్థాయికి వెళ్ళాలి అన్నదే నా ధ్యేయంగా మలచుకుని చివరికి జీవితంలో సఫలీకృతురాల్ని అయ్యాను. ఇంటర్ పూర్తి చేసిన తరువాత టీచరు ట్రైనింగుకి వెళ్ళడం. ఉత్తీర్ణత సాధించడం, అధ్యాపకురాలిగా అవతారం ఎత్తడం ఒక్కసారే జరిగాయి.

నాలుగు డబ్బులు సంపాదించే సంపాదనాపరురాల్ని అయ్యాను. అక్కడితో ఇంట్లో నా జీవిత విధానమే మారిపోయింది. నన్ను నానా యాతనలకి గురి చేసిన మామయ్య భార్యలో ఎంత మార్పు? అంత కాల మహిమ కాదు డబ్బు మహిమ అని అనుకున్నాను.

ఆవిడ రాచమర్యాదలు నాకు అక్కరలేదు. పిడికెడంత గుండెలో ఆప్యాయత నింపితే చాలు అనుకున్నాను. అనుకున్న వయస్సులో అవి లభించలేదు. ఇప్పుడు కృత్రిమ ఆప్యాయత లభిస్తున్నా సంతోషం లేదు.

అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు వీళ్ళ కపట ప్రేమను బయటపెట్టాలి అని కసిగా అనుకునే దాన్ని. ఆ అవకాశం కూడా తొందరలోనే వచ్చింది.

సుధాకర్ గారు, సంగీతం మేడమ్ – పెళ్లి పెద్దల అవతారం ఎత్తి మా ఇంటికి వచ్చారు. సూర్యం మాష్టారు నన్ను ఇష్టపడుతున్నట్లు, అతని తరుపున పెళ్ళి ప్రస్తావన తేవడానికి తాము వచ్చినట్టు. సుమిత్రని అతనికిచ్చి పెళ్ళి చేయమని అత్తయ్యతో మామయ్యతో చెప్పారు.

మామయ్య మౌనం వహించాడు. అదే అర్ధాంగీకారం. అతనేం వ్యతిరేకించలేదు. ఇన్నాళ్ళకి మా సుమిత్ర కష్టాలు గట్టెక్కబోతున్నాయి అని అన్నాడు. అయితే అతని భార్య మాత్రం “ఈ పెళ్ళి జరగదు” అని అంది.

అంత వరకూ ప్రేక్షకపాత్ర పోషిస్తున్న నేను నోరు మూసుకుని ఉండలేకపోయాను. “ఎందుకు జరగదు?” ఎదురు ప్రశ్నవేసాను.

“అదేంటే అమ్మాయ్! అలా అంటావు? చిన్న పిల్లని తీసుకుని వచ్చి నీళ్ళనా పాలనా చేసి కష్టపడి ఇంత ప్రయోజకురాల్ని చేస్తే ఇప్పుడు మమ్మల్ని నట్టేట ముంచి నీ దారి నీవు చుసుకుంటావా?” ముక్కు చీదుతుంది.

“పెళ్ళయిన తరువాత మీ జీవితానికి ఏ ఢోకా లేకుండా చేస్తాను అత్తయ్య!” అన్నాను. ఆవిడ వినలేదు. నాతో వాదించింది. నయానా భయానా నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది. అక్కడికీ నేను లొగంకపోయే సరికి శాపనార్థాలు పెట్టింది. అన్నిటికీ నా సహన గుణమే నన్ను ముందుకు నడిపించింది.

రిజిస్టారు ఆఫీసులో అన్ని లాంఛనాలు ప్రక్రియలు పూర్తి అయిన తరువాత శాస్త్రబద్ధంగా దండలు మార్చుకున్నాం. చట్టబద్ధంగా సూర్యం మాష్టారికి నాకు పెళ్ళి జరిగిపోయింది. అతను ఆప్యాయంగా, అనురాగంతో నా చెయ్యి అందుకుంటే జీవితాంతం నేను నీ చెయ్యి వదలను అన్న భరోసా నాకు ఇచ్చినట్టు అయింది.

మామయ్య మాత్రం వచ్చాడు. నిండు మనస్సుతో నన్ను ఆశీర్వదించాడు. అదే చాలు అని నేను అనుకున్నాను.

(మరో కథ వచ్చే వారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here