సిరివెన్నెల పాట – నా మాట – 58 – మనసుకు పసందైన విందు లాంటి పాట

1
3

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

శ్రీకారం చుడుతున్నట్టు

~

చిత్రం: కుదిరితే కప్పు కాఫీ

సంగీతం: యోగీశ్వర శర్మ

సాహిత్యం: సిరివెన్నెల

గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, నిహాల్

~

పాట సాహిత్యం

పల్లవి:
శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కలనాహ్వానిస్తూ
నీ కనులెటు చూస్తున్నాయో మాక్కూడా చూపించమ్మా
ప్రాకారం కడుతున్నట్టు రాబోయే పండగ చుట్టూ
నీ గుప్పిట ఏదో గుట్టు దాక్కుందే బంగరు బొమ్మా ॥శ్రీకారం॥

జలజలజల జాజుల వాన కిలకిలకిల కిన్నెర వీణ మిలమిల మిన్నంచుల పైన మెలి తిరిగిన చంచలయాన
మధురోహల లాహిరిలోన మదినూపే మదిరవె జాణ

చరణం:
నీ నడకలు నీవేనా చూశావా ఏనాడైనా నీ మెత్తని అడుగుల కింద పడి నలిగిన ప్రాణాలెన్నో
గమనించవు కాస్తైనా నీ వెనకాలేమౌతున్నా
నీ వీపుని ముళ్ళై గుచ్చే కునుకెరుగని చూపులు ఎన్నో లాస్యం పుట్టిన ఊరు లావణ్యం పెట్టని పేరు
లలనా తెలుసో లేదో నీకైనా నీ తీరు
నీ గాలే సోకిన వారు గాలిబ్ గజలైపోతారు
నీ వేలే తాకిన వారు నిలువెల్లా వీణాతారు
కవితవో యువతివో ఎవతివో గుర్తించేదెట్టాగమ్మ

చరణం:
నక్షత్రాలెన్నంటూ లెక్కెడితే ఏమైనట్టు
నీ మనసుకు రెక్కలు కట్టు చుక్కల్లో విహరించేట్టు ఎక్కడ నా వెలుగంటూ ఎప్పుడు ఎదురొస్తుందంటూ చిక్కటి చీకటినే చూస్తూ నిద్దురనే వెలివేయద్దు వేకువనే లాక్కొచ్చేట్టు వెన్నెలతో దారం కట్టు
ఇదిగో వచ్చానంటూ తక్షణమే హాజరయేట్టు
అందాకా మారాం మాని జోకొట్టవే ఆరాటాన్ని
పొందిగ్గా పడుకో రాణి జాగారం ఎందుగ్గానీ
నళినివో హరిణివో తరుణివో మురిపించే ముద్దులగుమ్మ..

సౌందర్య వర్ణన చేయాలంటే మనసు ఎంతో తాదాత్మ్యత చెందాలి, తన్మయత్వం పొందాలి. సాధారణ వ్యక్తులైతే, ఆ ఉద్వేగాన్ని, తన్మయత్వాన్ని మాటల్లో చక్కగా తమ హావభావాల సహాయంతో చెప్పడానికి ప్రయత్నిస్తారు. అదే కళాకారులైతే.. వారికి నైపుణ్యమున్న కళ ద్వారా ఆ భావాన్ని ఉత్తమంగా వ్యక్తీకరించగలరు. అలాంటి వారి ద్వారా అది ఒక అందమైన గీతంగా, శిల్పంగా, కళాకృతిగా, చిత్రలేఖనంగా, కవితగా ఉప్పొంగి జాలువారుతుంది. సిరివెన్నెల వంటి భావుకత కలిగిన కవులైతే, ఆ సౌందర్య వర్ణనకు ఊహాతీతమైన ఉపమానాలను జోడించి.. అత్యున్నతమైన కవితాత్మక శిల్పాలను మలచగలరు.

Beauty is a central motif of this poem, which explores the nature of aesthetic perfection and its relationship to mortality. మనందరికీ బాగా పరిచయమైన, John Keats poem ని మరొక్కసారి గుర్తు చేసుకుందాం.

A thing of beauty is a joy for ever:
Its loveliness increases; it will never
Pass into nothingness; but still will keep
A bower quiet for us, and a sleep..

‘కుదిరితే కప్పు కాఫీ’ సినిమాలో, ప్రతి పనికి ఒక ప్రణాళికను రచిస్తూ, మనసులో ఊహా చిత్రాలను గీసుకుంటూ భవిష్యత్తు కోసం బంగారు కలలు కంటూ జీవితాన్ని ఎంతో ఉల్లాసంగా గడిపే, లాస్య అనే పేరుతో వున్న కథానాయిక వర్ణించే నేపథ్యంలో ‘శ్రీకారం చుడుతున్నట్టు..’ అన్న పాట మనకు వినిపిస్తుంది. బాలు గారి అమృతగళంలో ఈ సిరివెన్నెల బాణి, మరిన్ని సొబగులు దిద్దుకొని మన ముందుకు వచ్చింది.

పల్లవి:
శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కలనాహ్వానిస్తూ
నీ కనులెటు చూస్తున్నాయో మాక్కూడా చూపించమ్మా ..
ప్రాకారం కడుతున్నట్టు రాబోయే పండగ చుట్టూ
నీ గుప్పిట ఏదో గుట్టు దాక్కుందే బంగరు బొమ్మా ॥శ్రీకారం॥

ఎవరైనా వ్యక్తులు ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తున్నారు అంటే, వారు వర్తమానంలో జీవిస్తున్నారనీ, లేదా భవిష్యత్తుపై స్థిరమైన భరోసా కలిగి ఉన్నారనీ, అర్థం. గతానికి సంబంధించిన దిగులతో బాధలతో ఉన్న వారు ఎప్పుడూ ముడుచుకుని ఉంటారు. Face is the index of the soul కాబట్టి, వారి మనసులోని దిగుళ్ళు ముఖంలో కనిపిస్తూ ఉంటాయి. సిరివెన్నెల గారి మాటల గారడి ఎలా ఉంటుందంటే, అమ్మాయి అందాన్ని వర్ణిస్తున్నట్టు కనిపిస్తూ, అందరికీ ప్రేరణ నిచ్చే వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పినట్టు! ఆయన ఏ పాట, ఏ కవిత వ్రాసినా, అంతర్లీనంగా ఒక ప్రేరణాత్మక సందేశమో, మానవత్వపు పరిమళమో దానిలో విరబూయాల్సిందే! Sirivennela is a juggler of concepts and verbal expressions.

సాంప్రదాయకంగా మనం చేసుకునే పండుగలు, మన సంస్కృతికి సంబంధించినవి. అయితే ప్రతివారి జీవితంలో వచ్చే అతి గొప్ప పండుగ, వాళ్ళు కన్న కలలను వాళ్ళు సాకారం చేసుకున్నప్పుడు వచ్చే శుభ తరుణం. అలాంటి గొప్ప సందర్భానికి శ్రీకారం చుడుతున్నట్టుగా, కమ్మని కలలకు (ఆశయాలకు) ఆహ్వానం పలుకుతున్నట్టుగా, ఆ కథానాయిక కళ్ళు భవిష్యత్తులోకి తొంగి చూస్తున్నాయట. నువ్వు చూస్తున్న కలని మాకు కూడా చూపించు.. మేము కూడా ఆనందిస్తాం.. అంటున్నారు, సిరివెన్నెల. ‘రాబోయే పండుగ చుట్టూ ప్రాకారం కడుతున్నట్టు..’ అసలీ expression ఎంత ఉత్తేజపూరితంగా ఉందో చూడండి! పండుగకి ప్రకారం కట్టడం ఏంటి? ఏదైనా పండుగ, అంటే శుభం, కలల సాకారం, అటువంటి ఆ పండుగ చుట్టూ ప్రాకారం కట్టి, అది జీవితంలో నిత్యనూతనంగా ఉండిపోయేలాగా జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం.. అలా దృఢమైన ప్రాకారాన్ని నిర్మించే గుట్టేదో ఆమెలో దాక్కొని ఉందట! ఆ గుట్టు కాస్త బయటపెట్టు.. మాక్కూడా అది తెలిసేటట్టు.. అంటున్నారు సిరివెన్నెల.

కోరస్:
జలజలజల జాజుల వాన కిలకిలకిల కిన్నెర వీణ మిలమిల మిన్నంచుల పైన మెలి తిరిగిన చంచలయాన
మధురోహల లాహిరిలోన మదినూపే మదిరవె జాణ

అమ్మాయి అందాల వర్ణనను పల్లవిలో కాకుండా కోరస్‌లో ముచ్చటైన తెలుగు జంట పదాల జడివానను కురిపించారు మన పాటల మేస్త్రి. ఆ అమ్మాయి అందాల పరిమళాలు వెదజల్లుతూ- జలజల రాలే జాజుల వానలాగా, కిలకిలలు పలికే కిన్నెర వీణలాగా, గగనపు అంచుల పైన మిల మిల మెరిసే మెరుపు తీగలాగా.. ఒకచోట నిలవకుండా అలా తళుక్కుమని మెరిసి, మాయమయ్యే చంచలయానలాగా ఉందట. మదిరాపానం చేస్తే.. మనసు మత్తులో తూలిపోతుంది. అలాంటి స్థితిలో మనసు మధురమైన ఊహల్లో తేలిపోతుంది. అలాంటి ఊహల లాహిరిలో మమ్మల్ని ముంచి వేసే మదిర వంటి జాణవు నీవని.. ఆమె అందానికి కితాబునిస్తున్నారు సిరివెన్నెల.

ఒక అందం ప్రకృతిలోని మరో అందంతో కలిసినప్పుడు ఎలా ఉంటుంది అన్న భావాన్ని Rupert Brook ఒక హృద్యమైన పద్యంలో ఇలా వర్ణిస్తారు. ఈ కవితలో కూడా beautyని వర్ణించడంలో drunken laughter, dizzying, blossoming, scented winds, అని similar similes మనకు కనిపిస్తాయి.

When Beauty and Beauty meet
All naked, fair to fair,
The earth is crying-sweet,
And scattering-bright the air,
Eddying, dizzying, closing round,
With soft and drunken laughter;
Veiling all that may befall
After – after –

Where Beauty and Beauty met,
Earth’s still a-tremble there,
And winds are scented yet,
And memory-soft the air,
Blossoming, folding glints of light,
And shreds of shadowy laughter;
Not the tears that fill the years
After – after –

~

చరణం:
నీ నడకలు నీవేనా చూశావా ఏనాడైనా
నీ మెత్తని అడుగుల కింద పడి నలిగిన ప్రాణాలెన్నో
గమనించవు కాస్తైనా నీ వెనకాలేమౌతున్నా
నీ వీపుని ముళ్ళై గుచ్చే కునుకెరుగని చూపులు ఎన్నో లాస్యం పుట్టిన ఊరు లావణ్యం పెట్టని పేరు
లలనా తెలుసో లేదో నీకైనా నీ తీరు
నీ గాలే సోకిన వారు గాలిబ్ గజలైపోతారు
నీ వేలే తాకిన వారు నిలువెల్లా వీణౌతారు
కవితవో యువతివో ఎవతివో గుర్తించేదెట్టాగమ్మ

ఒక హృద్యమైనా కవితా సుందరికానీ, ఒక అందమైన స్వప్న సుందరి కానీ మనసుపై ఒకే ప్రభావాన్ని చూపిస్తాయి. అందమైన ఆ హీరోయిన్ గురించిన ఉనికిని తనకే చూపించేలా.. ప్రశ్నలు సంధిస్తారు సిరివెన్నెల. ఈ నడకలు నీవేనా? లేక ప్రకృతిలోని సౌందర్యానివా? నీ మెత్తని అడుగుల కింద పడి నలిగిపోతున్న ప్రాణాలను ఎప్పుడైనా గమనించావా? నిద్రను మరిచిపోయి, నీ చుట్టే తిరుగుతూ, నీ వీపును గుచ్చుతున్న కళ్ళని ఎప్పుడైనా గుర్తించావా? గమనించావా.. అని కాకుండా, ఎంతో ముచ్చటగా, ప్రేమగా, అసలు ఇవన్నీ నువ్వు గమనించుకోవేంటి.. అన్నట్టు లాలింపుగా అడుగుతారు.

ఆ ప్రశ్నలకు ఆయనే మళ్లీ సమాధానాలు కూడా ఇస్తారు. ఎందుకు ఇంతమంది నీ అందం వెంటపడుతున్నారు అంటే.. ఆమె లాస్యం అనే ఊర్లో పుట్టిందట.. లావణ్యం తనకు పెట్టని పేరట! తన అందం గురించి తనకు అసలు తెలిసినట్టే లేదని చెబుతూ.. తాను ఎంత గొప్ప అందగత్త అంటే.. తన గాలి సోకిన వారు కూడా.. అతి గొప్ప గాలిబ్ గజల్ లాగా మారిపోతారు.. అంటున్నారు. తన చేతి స్పర్శ సోకినవారు, నిలువెల్లా రాగాలు పలికే వీణలాగా మారిపోతారట. ఎన్ని మాయలు చేస్తున్న నువ్వు, మత్తు చల్లుతున్న నువ్వు, కవితవా, యువతిగా, అసలు ఎవరివి? నిన్నెలా గుర్తించాలి? అని మరో ముక్తాయింపు ఇస్తున్నారు.

గాలిబ్ ఉర్దూ కవి సామ్రాట్. ఆయన పూర్తి పేరు మిర్జా అసదుల్లాఖాన్. కలం పేరు గాలిబ్. ఉర్దూ, పారశీ భాషలలో కవిగా, రచయితగా ఖ్యాతినొందాడు. బహాదుర్ షా జఫర్ (2వ బహాదుర్ షా) ఆస్థానకవి, గురువు. గజల్ వ్రాయడంలో దిట్ట. ద్విపదల లాగా ఉండే ఈ గజళ్ళను దాశరథి కృష్ణమాచార్యులు తెలుగులోకి అనువదించి గాలి గీతాలు అనే పుస్తకాన్ని ప్రచురించారు. మచ్చుకు కొన్ని అనువాద పద్యాలు.

  • ఏను స్వయముగా కవితన్ వరింపలేదు, తానె వరియించె కైతల రాణి నన్ను.
  • ప్రతిది సులభముగా సాధ్యపడదు లెమ్ము, నరుడు నరుడౌట యెంతో దుష్కరమ్ము సుమ్ము.
  • వేరులోనుండి కొమ్మలు వెలసినట్లు, అన్నిశబ్దాలు నిశ్శబ్దమందె పుట్టె.
  • స్వీయలోపమ్ము లెరుగుట పెద్ద విద్దె; లోప మెరిగినవాడె పూర్ణుడగు నరుడు.
  • అన్ని రోగములకు నౌషధం బుండియు ప్రణయరోగమునకు కనము మందు.
  • భిక్షుకునివంటి వేషము వేసినాను; దాతలగువారి చేతలు చూతునింక.

చరణం:
నక్షత్రాలెన్నంటూ లెక్కెడితే ఏమైనట్టు
నీ మనసుకు రెక్కలు కట్టు చుక్కల్లో విహరించేట్టు ఎక్కడ నా వెలుగంటూ ఎప్పుడు ఎదురొస్తుందంటూ చిక్కటి చీకటినే చూస్తూ నిద్దురనే వెలివేయద్దు వేకువనే లాక్కొచ్చేట్టు వెన్నెలతో దారం కట్టు
ఇదిగో వచ్చానంటూ తక్షణమే హాజరయేట్టు
అందాకా మారాం మాని జోకొట్టవే ఆరాటాన్ని
పొందిగ్గా పడుకో రాణి జాగారం ఎందుగ్గానీ
నళినివో హరిణివో తరుణివో మురిపించే ముద్దులగుమ్మ..

ఇక రెండో చరణానికి వచ్చేసరికి.. సిరివెన్నెల మార్క్ స్ఫూర్తిదాయక వచనాలు.. పాటలోకి స్పేస్ తీసుకుని చొప్పించేశారు. నక్షత్రాల్ని, కలల్ని, ఊహల్ని దూరం నుండి చూస్తూ లెక్కించడం వల్ల లాభం ఏంటి? మనసుకు రెక్కలు కట్టుకొని, అనుకున్న చోట వాలిపోవాలి, అనే బలమైన సందేశం ఇస్తున్నారు. అనుకున్న దానికోసం వేచి చూస్తూ ఉంటే కాలం దొర్లిపోవడం తప్ప ఏమీ జరగదు. చీకటిని చూస్తూ.. నా వెలుగు ఎప్పుడు వస్తుందని, నిద్ర మానుకొని ఎదురు చూస్తూ.. కాలాన్ని కరిగిపోనియ్యకూడదు.

మరొక హృదయాన్ని హత్తుకునే భావవ్యక్తీకరణ గమనించండి. వెన్నెలను దారంగా కట్టి, తక్షణమే మనం కోరుకున్న వేకువ ప్రత్యక్షమయ్యేలాగా, మన ముందుకు మనమే లాక్కుని రావాలనే ధృడమైన సంకల్ప శక్తిని మనకు అందిస్తున్నారు. అలా నిద్రలేని రాత్రులు గడపకుండా, ఆరాటాన్ని కాస్త జోకొట్టి, చక్కగా నిద్రపో, అని బుజ్జగిస్తున్నారు.

మొదటి చరణంలోలాగా, నళినివో.. హరిణివో.. తరుణివో… ముద్దుల గుమ్మ, అన్న పర్యాయపదాల పోహళింపుతో ఆ రెండవ చరణాన్ని ముగిస్తున్నారు. ఆడవారి సౌందర్యాన్ని వర్ణించడంలో.. ముచ్చటైన ప్రాస పదాలను రసవత్తరంగా ఉపయోగించారు సిరివెన్నెల. ఉదాహరణకు నళిని అంటే కలువ, ఆనందం, అమృతం, వంటి ఎన్నో నానార్థాలు ఉన్నాయి.

ఈ విధంగా, అమ్మాయిని వర్ణించే పాటలో ఒకవైపు భాషా సౌందర్యాన్ని, పదాల పొందికను, బలమైన అంతరార్థాలను, వికాస సూత్రాలను, లలన, తరుణి, చంచలయాన.. వంటి పర్యాయపదాలను; ఒకేసారి కలిపి వడ్డించి, రసాస్వాదకుల మనసులకు పసందైన తృప్తికరమైన, విందును అందించారు సిరివెన్నెల.

Images Source: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here