[షేక్ కాశింబి గారు రచించిన ‘నిత్యవందనం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]క[/dropcap]ళవళ పడుతున్న పేగుల్ని
కష్టమ్మీద కూడగట్టుకుని
కారుతున్న కన్నీటి ధారల్ని
కనురెప్పల మాటున కట్టడి చేసుకుని..
మెలిపెట్టే గుండె గాయపు సలుపుని
ఓర్పు మలాము పట్టీతో తట్టుకుని
సుడులు తిరుగుతూ పొర్లే వాత్సల్యపు పొంగుని
దిటవు చన్నీటితో చల్లార్చుకుని..
అనుక్షణం ఆత్మ చేసే మమకారపు రోదనని
భరించడాన్ని అలవాటుగా మలుచుకుని
దేశ రక్షణ కోసం కంటి వెలుగులైన
కన్నవారిని కానుకగా సమర్పించి..
వారెక్కడున్నా.. పక్కనున్న అనుభూతితో
కొనసాగే పరంపర నాచరిస్తున్న
సైనికుల తల్లిదండ్రుల త్యాగాలను
తలుచుకుంటూ చెయ్యాలి నిత్యవందనం!
వారికి తోడ్పడితే..
అవుతాయి.. మన జన్మలు ధన్యం!
వారి కుటుంబాల నాదుకుంటే..
నెరవేరుతుంది మన కనీస ధర్మం!