[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
శకుని పందెం- అంగీకరించిన ధర్మరాజు
[dropcap]జ[/dropcap]రిగినదాన్ని దుశ్శాసనుడు దుర్యోధనుడికి చెప్పాడు. అది విని కర్ణుడు, శకుని, సైంధవులతో కలిసి ఆలోచించి దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లాడు. “మహారాజా! అసలు శత్రువుల్ని లేకుండా చెయ్యడమే వివేకమని దేవతలకి రాజైన దేవేంద్రుడికి మంచి చెయ్యడం కోసం దేవతల్లో గొప్పవాడైన బృహస్పతి ప్రేమతో చెప్పాడు.
ఆ పాండవులకి ఎంత మేలు చేసినా మనం వాళ్లకి మంచివాళ్లం అవుతామా? పాములకి కోపం తెప్పించి కంఠం మీద పడేసినట్టు వాళ్లని వదిలేసి తప్పు చేశాము.
ప్రపంచంలో గొప్ప పరాక్రమం కలిగిన శత్రువుల్ని ఓడించ గలిగినవాడు సవ్యసాచి అర్జునుడు. అతడు గాండీవాన్ని, భీముడు ఒడుపుగా గదని, గొప్ప భుజబలం కలిగిన నకుల సహదేవులు కత్తి, డాలు, కవచాల్ని ధరిస్తే.. ఆ బలవంతుల్ని యుద్ధంలో జయించడం మనకి సాధ్యం కాదు. కనుక, పాండవుల్ని మళ్లీ జూదానికి పిలిచి ఓడించి దేశం నుంచి వెళ్లగొట్టడమే మనం చెయ్యగలిగిన పని” అన్నాడు.
ధృతరాష్ట్రుడు అందుకు అంగీకరించాడు. ధర్మరాజుని మళ్లీ జూదమాడడానికి పిలుచుకుని రమ్మని ప్రాతికామిని పంపించాడు. తండ్రి ఆజ్ఞ దాటలేడు కనుక దైవనిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకుని ధర్మరాజు తమ్ముళ్లతోను, ద్రౌపదితోను కలిసి మళ్లీ హస్తినాపురానికి వచ్చాడు.
అందరూ హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు నిర్మించిన ద్యూతసభలో కూర్చున్నారు. జూదగాడు మొసగాడు అయిన శకుని పాచికలతో ముందే వచ్చి కూర్చున్నాడు. ధర్మరాజుతో “మీకు ధనము, రాజ్యము దృతరాష్ట్రుడు ఇచ్చాడు. కనుక జూదంలో వాటిని ఒడ్డి ఆడకూడదు. నేను చెప్పబోయేది ఇంతకు ముందు ఎప్పుడూ లేని పందెం. ఓడిపోయినవాళ్లు జింకచర్మం, నారచీరలు ధరించి అడవుల్లో దుంపలు, పళ్లు ఆహారంగా తీసుకుంటూ, బ్రహ్మచర్యంతో పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యాలి.
తరువాత పదమూడవ సంవత్సరం ఏదో ఒక దేశంలో అజ్ఞాతవాసం చెయ్యాలి. అజ్ఞాతవాసంలో ఎవరికేనా కనబడితే మళ్లీ పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. ఈ పందెం వెయ్యడానికి నువ్వు అంగీకరిస్తే జూదం ఆడుదాం” అన్నాడు శకుని.
జూదంలో అధర్మంగా ఓడిన ధర్మరాజు
రెండోసారి జూదం ఆడడానికి మళ్లీ పిలిచాడు పినతండ్రి. రానని చెప్పి వెనక్కి తిరిగి వెళ్లిపోవడం మంచి పనికాదు. పినతండ్రి ఆజ్ఞని పాలించాలి అని అనుకుని ధర్మరాజు మళ్లీ జూదం ఆడడానికి వెళ్లాడు. పందెం వేసి శకుని చేతిలో అధర్మంగా ఓడిపోయాడు. దైవనిర్ణయాన్ని మనిషి మార్చలేడు.
రెండవసారి జూదంలో ఓడిపోయిన పాండవులు రాజ్య సుఖాల్ని వదిలి బ్రాహ్మణులు, మిత్రులు, బంధువులు, ప్రజలు తమ వెంట వస్తుండగా అరణ్యానికి బయలుదేరారు. వెళ్లేటప్పుడు దృతరాష్ట్రుడు, భీష్ముడు, ద్రోణుడు, విదురుల దగ్గర సెలవు తీసుకున్నారు.
విదురుడు “ధర్మరాజా! భోజమహారాజు కూతురు కుంతీదేవి అరణ్యవాసంలో కలిగే కష్టాల్ని తట్టుకోలేదు. అందువల్ల ఆమె నా ఇంట్లో ఉంటుంది. ఆమెని నేను చాలా గౌరవంగా చూసుకుంటాను. నువ్వు అన్ని ధర్మాలు తెలిసినవాడివి; భీముడు గొప్ప పరాక్రమవంతుడు; అర్జునుడు యుద్ధ విశారదుడు, కీర్తిమంతుడు; నకులుడు న్యాయమంతుడు; సహదేవుడు వినయశీలి; పుణ్యాత్ముడైన థౌమ్యుడు ఆధ్యాత్మిక విద్య బాగా తెలిసినవాడు. ద్రౌపది ధర్మార్థాల్లో చక్కని వివేకం కలది.
ఎన్నో గొప్ప గుణాలు కలిగి ధైర్యవంతులై, ఒకళ్లంటే ఒకళ్లకి ఇష్టం కలిగిన మీరు ఎవరితోనూ శత్రుత్వాన్ని పెంచుకోలేరు. మీరు కృష్ణద్వైపాయనుడి బోధలు విన్నవాళ్లు, నారదుడి రక్షణలో ఉన్నవాళ్లు. మీకు పురోహితుడు ధౌమ్యుడు. దివ్యత్వం, మానవత్వం కలవాళ్లు. బలపరాక్రమాలతో రాజుల్ని, ధర్మప్రవర్తనతో ఋషుల్ని, గొప్పతనంతో కుబేర దేవేంద్రాదుల్ని జయించినవాళ్లు. మిమ్మల్ని నేల, గాలి, చంద్రుడు, సూర్యుడు ఎప్పుడూ రక్షిస్తూ ఉంటారు. అన్ని పనుల్లోను జాగ్రత్తగా నడుచుకుంటూ ఉండండి. మిమ్మల్ని మళ్లీ మేమందరం క్షేమంగా చూడాలి వెళ్లిరండి!” అని విదురుడు బోధించాడు.
గురువుల, పెద్దల అనుమతి పొందిన పాండవులు కుంతీదేవి పాదాలకి నమస్కరించారు. ఆభరణాలు, వస్త్రాలు పోగొట్టుకుని, సిగ్గుతో ముఖాలు దించుకుని, నార చీరలు కట్టుకుని, జింకచర్మాలు చేత్తో పట్టుకుని మునివేషంలో, సూర్యుడి తేజస్సుతో సమానమైన తేజస్సు కలిగిన ధర్మపరులైన తన కొడుకులు పాండవుల్ని చూసి ఆమె దు:ఖించింది.
“నాయనలారా! ఇలా జూదమాడి ఈ స్థితికి వచ్చిన మిమ్మల్ని చూడకముందే పుణ్యాత్ముడైన పాండురాజు స్వర్గస్థుడయ్యాడు. పూర్వ జన్మలో గొప్ప తపస్సు చెయ్యడం వల్ల మాద్రి భర్తతో సహగమనం చేసింది. నేను దురదృష్టవంతురాల్ని. వాళ్ల వెంట వెళ్లలేకపోవడం వల్ల ఇవన్నీ చూస్తున్నాను” అని కుంతి దుఃఖించింది.
“సుగుణవంతులైన పాండవులు ఇలా దిక్కు లేని వాళ్లుగా మునివేషాల్లో ఉండడమా! హా! ద్వారకానాథా! కేశవా! రాక్షససంహారా! భూమిని ధరించినవాడా! శ్రీకృష్ణా! నీ పాదపద్మాల్ని నమ్ముకున్న ఈ పాండవుల్ని రక్షించక పోవడం నీకు ధర్మమా? మహాబలవంతులు, ధర్మమూర్తులు, సూర్యడిలా తేజస్సు కలవాళ్లు, శత్రువులకి భయంకరమైన నిప్పు వంటివాళ్లు భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, కృపాచార్యుడు ఉండగా ధర్మం మార్గం తప్పడం న్యాయమా?
కౌరవులు చేసిన మోసం వల్ల గొప్పవాళ్లైన పాండవులు దేశాన్ని వదిలి అరణ్యాలకి వెళ్లడం తగిన పనా? నాయనా! సహదేవా! నువ్వు కూడా నీ అన్నలతో అడవులకి వెడతావా? నువ్వు ఒక్కడివీ ఉంటే చాలు. అందరూ నా దగ్గర ఉన్నట్టే అనిపిస్తుంది. నా మనస్సుకి ఊరటగా ఉంటుంది” అని దుఃఖపడుతోంది కుంతీదేవి.
తనకు తల వంచి నమస్కరిస్తున్న ద్రౌపదిని చూసి “ద్రౌపదీ! నువ్వు పుట్టడం వల్ల ద్రుపద వంశము, నువ్వు మెట్టడం వల్ల పాండువంశము లోకంలో గొప్పగా ప్రకాశిస్తున్నాయి. నీ భర్తలు పురుషులందరిలో గొప్పవాళ్లు. నువ్వు వాళ్లతో ఉండి సేవ చెయ్యగలగడం నీ పుణ్యం” అని ప్రేమతో కౌగలించుకుంది.
కోడల్ని, కొడుకుల్ని దీవించి కుంతీదేవి విదురుడి ఇంట్లో ఉండిపోయింది. జుట్టు విరబోసుకుని భర్తల వెంట నెమ్మదిగా నడిచి వెడుతున్న ద్రౌపదిని చూసి కౌరవరాజు అంతఃపురంలో ఉన్నవాళ్లు దుఃఖంతోను, భయంతోను తలలు వంచుకున్నారు.
ధర్మరాజు వెనుక వెడుతున్న నలుగురు తమ్ముళ్లు సభలో అందరూ వినేలా అమితమైన కోపంతో కఠినమైన మాటలు మాట్లాడారు. “నా చేతి గద దెబ్బతో లోకానికే ద్రోహం తలపెట్టిన దుర్యోధనుణ్ని అతడి అనుచరుల్ని హరిహరాదులు అడ్డమైనా మహాభయంకరమైన యుద్ధంలో హతమారుస్తాను. దుష్టాత్ముడు పాపి అయిన దుర్యోధనుణ్ని నేలకూల్చి అతడి తలని తన్ని గాని వదలను.
నీచుడైన దుశ్శాసనుణ్ని చంపి అతడి వేడి నెత్తురు తాగుతాను. పధ్నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాక యుద్ధభూమిలో మేరుపర్వత శిఖరాల్లా.. నిగ్గుతేలిన గాండీవం నుంచి ప్రయోగించిన బాణాలతో చంపి అతడి రక్తాన్ని తాగుతాను. తరువాత మిగిలిన రక్తాన్నికాకులు గ్రద్దలు తాగుతాయి. నన్నెదిరించి పోరాడే దుర్మార్గుల్ని కర్ణుడితో సహా శత్రు శేషం లేకుండా సంహరిస్తాను.
కపట జూదంలో మమ్మల్ని ఓడించి మాకు ఈ స్థితి కలగడానికి కారణమైన దుర్మార్గుడు అన్యాయపరుడు అయిన శకునిని యుద్ధంలో మా బాణలతో ఓడించి చంపుతాము” అని భీమార్జున నకుల సహదేవులు అమితమైన కోపంతో ప్రతిజ్ఞలు చేశారు.
ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్న పాండవులు ఆయుధాలు ధరించి హస్తినాపురం నుంచి బయలుదేరారు.
దృతరాష్ట్రుడి అంతఃపురంలో పట్టపగలే నక్కలు అరుస్తూ పరుగెత్తాయి. అపసవ్యంగా తోకచుక్కలు పడ్డాయి. మేఘాలు లేకుండానే ఆకాశంలో వేలకొలదీ మెరుపులు మెరిసాయి.
గ్రహణం రోజు కాకపోయినా రాహువు సూర్యుణ్ని పట్టుకున్నాడు. భూమి కంపించింది. ఆ సమయంలో సభలో వాళ్లంతా వింటూ ఉండగా “పధ్నాలుగవ సంవత్సరంలో భారతయుద్ధం జరుగుతుంది.. పరాక్రమవంతులైన పాండవులు భీమార్జునుల బలపరాక్రమాల వల్ల విజయం పొందుతారు!” అని నారదుడు పలికిన మాటలు అందరూ ఆశ్చర్యంతో విన్నారు.
పాండవులు అడవికి వెళ్లిన విధానం
ధృతరాష్ట్రుడు జరిగినదంతా విన్నాడు. కొడుకుల చెడు ప్రవర్తనవల్ల ఇంకా ఎటువంటి అశుభాలు కలుగుతాయో అని భయపడ్డాడు. విదురుణ్ని పిలిచి ధౌమ్యుడు, ద్రౌపదితో కలిసి వెళ్లేటప్పుడు పాండవులు ఎలా వెళ్లారని అడిగాడు.
విదురుడు ధృతరాష్ట్రుడు అడిగినదానికి సమాధానం చెప్తూ “మహారాజా! “ప్రజలు అందరూ దుఃఖసముద్రంలో మునిగి పోయి ఉన్నారు. ధర్మరాజు అందమైన తన ముఖాన్నిగుడ్డకొంగుతో కప్పుకుని వెళ్లాడు.
మహాబలవంతుడైన భీముడు భయంకరమైన తన చేతులు రెండూ రెండు వైపులకి చాచి నడిచాడు. ఇంద్రుడి కుమారుడు అర్జునుడు ఇసుక చల్లుతూ వెళ్లాడు.
నకులుడు దుమ్ము నిండిన శరీరంతో నడిచాడు. సహదేవుడు కుంతి అడిగినట్టు ఆమె దగ్గర ఉండకుండా సిగ్గుతో ముఖం దించుకుని అన్నల వెంట అరణ్యవాసానికి వెళ్లాడు. ద్రౌపది తల వెంట్రుకలు విరబోసుకుని తన భర్తల వెంట నడిచింది. ధౌమ్యుడు రుద్రుడికి, యముడికి సంబంధించిన మంత్రాలతో సామగానం చేస్తూ ముందు నడిచాడు” అని చెప్పాడు.
విదురుడు చెప్పింది విని ధృతరాష్ట్రుడు వాళ్లు అలా ఎందుకు వెళ్లారని అడిగాడు. విదురుడు “నీ కొడుకు చేసిన మోసం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకున్న ధర్మరాజు కోపంగా చూస్తే ప్రజలు అగ్నిలో పడిన వాళ్లులా మాడిపోతారని భయపడ్డాడు. తన దృష్టి ఎవరి మీదా పడకుండా ఉండాలని బాధలో ఉన్నా ప్రజల క్షేమం కోరి మొహం మీద గుడ్డ కప్పుకుని వేగంగా వెళ్లిపోయాడు.
భీమసేనుడు యుద్ధంలో బాహుబల పరాక్రమాన్ని చూపించే అవకాశం తనకు కలగబోతోందని తెలియచేస్తూ చేతులు విశాలంగా చాచి శత్రువులకి భయం కలిగిస్తూ వెళ్లాడు. ఓటమి అంటే ఏమిటో తెలియని అర్జునుడు ఇసుక చల్లుతూ యుద్ధంలో ఇంతకంటే ఎక్కువగా బాణాలు వేసి శత్రువుల్ని సంహరిస్తాను అని నిర్లక్ష్యంగా నడిచాడు. నకులుడు తన అందమైన ముఖం దుఃఖంతో ఉంటే ప్రజలు చూసి బాధపడతారని దుమ్ముతో ఉన్న శరీరంతో వెళ్లాడు. తన ముఖం దీనంగా కనిపిస్తే చూసిన వాళ్లకి కీడు కలుగుతుందని సహదేవుడు ముఖం వంచుకుని వెళ్లాడు.
ద్రౌపది తడిసిన ఒంటిబట్ట కట్టుకుని వెండ్రుకలు విరబోసుకుని తొట్రుపడుతూ దుఃఖిస్తూ.. భర్తలు, మిత్రులు, పుత్రులు, బంధువులు మహాయుద్ధంలో మరణించినప్పుడు కౌరవుల భార్యలు కూడా ఆ విధంగానే వెడతారని సూచిస్తూ వెళ్లింది. మహాభారతయుద్ధంలో కౌరవ వీరులు మరణించాక పరలోక క్రియలు ఎలా ఉంటాయో తెలిసేలా వాటి గురించి పూర్తిగా తెలిసిన ఆలోచనాపరుడైన ధౌమ్యుడు రుద్రుడికి యముడికి సంబంధించిన సామవేదాన్ని గానం చేస్తూ వెళ్లాడు” అని వివరంగా చెప్పాడు.
అది విని ధృతరాష్ట్రుడు చాలా దుఃఖపడ్డాడు. బాధపడుతున్న ధృతరాష్ట్రుడితో సంజయుడు “ధృతరాష్ట్ర మహారాజా! పాండవులు గొప్ప ధర్మాత్ములు. అది తెలిసి కూడా వాళ్లని దేశం నుంచి వెళ్లగొట్టావు. బంగారంతో నిండిన ఈ భూమిని మొత్తాన్ని తీసేసుకున్నావు. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు వద్దని ఎంత చెప్పినా నువ్వు వినలేదు. కర్ణుడి మాటలు విని నీ కొడుకు పాండవులకి అపకారం చేశాడు.
జరుగుతున్నది చెడు అని తెలిసి కూడా అవివేకంతో గొప్పవాళ్లతో శత్రుత్వాన్ని కోరి తెచ్చుకున్నావు. నువ్వు నీ కొడుకులు దేన్నైనా సాధించగలరు. ఇప్పుడు బాధ పడడం ఎందుకు?” అన్నాడు
సంజయుడి మాటలు విని విదురుడు “ధృతరాష్ట్ర మహారాజా! ఎందుకు బాధపడుతున్నావు? ఇప్పటికైనా మించి పోయింది లేదు. పాండవుల్ని పిలిపించి అరణ్యానికి వెళ్లకుండా తమ రాజ్యం పాలించుకుంటూ ఎప్పటిలా సుఖంగా ఉండమని ఆజ్ఞాపించు. మోసం చెయ్యడం మంచి పని కాదు. ఇతరుల సంపదల్ని అపహరించి హద్దు మీరి ప్రవర్తించిన నిన్నుఎవరూ మెచ్చుకోరు” అన్నాడు.
విదురుడు చెప్పిన మాటలు విని కూడా ధృతరాష్ట్రుడు విననట్టు ఉండిపోయాడు. అడవులకి వెడుతున్న పాండవుల్ని వెనక్కి రప్పించలేడు. ద్రోణుడికి పాండవుల మీద ప్రేమ ఉంటుంది. తనకు శత్రువైన ద్రుపదుడి కుమారుడు పాండవులకి బంధువు. తనకి ద్రుపదుడు శత్రువు. అతడితో యుద్ధం జరుగుతుందని తెలుసు కనుక పాండవుల వెంట వెళ్లకుండా ధృతరాష్ట్రుడితో ఉండిపోయాడు.
పాండవులు ఇంద్రప్రస్థపురంలో రాజ్యం చేసి అప్పటికి ఇరవై మూడు సంవత్సరాలు గడిచాయి. మాయా జూదంలో ఓడిపోయి అరణ్యవాసానికి వెడుతున్న వీరులు, బుద్ధిమంతులు, సత్యవంతులైన పాండవుల వెంట వేలాదిమంది బ్రాహ్మణులు బయలుదేరారు అని జనమేజయుడికి వైశంపాయన మహర్షి శ్రీమదాంధ్ర మాహభారతంలో రెండవ ఆశ్వాసంతో సభాపర్వాన్ని పూర్తి చేశాడు.
సభాపర్వంలోని రెండవ ఆశ్వాసం సమాప్తం
సభాపర్వం సమాప్తం