[త్వరలో సంచిక ప్రచురించనున్న ‘సైనిక కథలు’ సంకలనం కోసం శ్రీ బి.వి. శివ ప్రసాద్ పంపిన కథ. కొత్తగా రాసి పంపిన కథలు ముందు సంచికలో ప్రచురితమవుతాయి. ప్రతిపాదిత సంకలనంలో, ఇప్పటికే ప్రచురితమైన కథలతో బాటు, సంపాదకుల ఎంచుకున్న ప్రమాణాల ప్రకారం కొత్తగా రాసి పంపిన కథల్లోంచి కొన్ని స్వీకరించబడతాయి.]
[dropcap]“అ[/dropcap]మ్మా! నాన్నెప్పుడొస్తారు?” అడిగింది ఐదేళ్ల అభినయ.
గీత సమాధానం చెప్పేలోపలే “నాన్న కావాలి,” అంటూ మరో గొంతు లోలోతులనుంచి వినిపించింది. వెంటనే గీత ఎత్తుగా వున్న తన పొట్టను మృదువుగా స్పృశించింది. అయితే రెండు ప్రశ్నలకీ సమధానం చెప్పే స్థితిలో ఆమె లేదు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ సంగతి తర్వాత చూసుకోవచ్చు. నాన్న ఇక తిరిగి రాడని చిన్నారి అభినయకు ఎలా చెప్పాలి?
***
తనకు, సంజయ్‌కు ఆరేళ్ళ క్రితం పెళ్ళయ్యింది. అతనిది హైదరాబాద్. ఆమెది నరసాపురం. చిన్నప్పటినుంచీ ఆమెకు సైనికులంటే విపరీతమైన ఇష్టం. అందుకే అమ్మా, నాన్నల్ని ఒప్పించి మరీ మాట్రిమోనియల్ ద్వారా బి.ఎస్.ఎఫ్.లో పనిచేస్తున్న సంజయ్‌ని పెళ్ళి చేసుకుంది. సైనికులంటేనే దేశం కోసం ప్రాణాలివ్వడానికైనా సిధ్ధమైనవాళ్ళు. సంజయ్ వాళ్ళ కుటుంబంలో సైన్యంలో పనిచేస్తున్న వాళ్ళెవరూ లేరు. కానీ అతనికి తను పదవ తరగతిలో ఉన్నప్పటి నుంచే ఐతే డాక్టర్ లేదా సైనికుడై దేశానికి సేవ చేయాలనే కోరిక ఏర్పడి, అది పెద్దవాడయ్యే కొద్దీ చాలా బలాన్ని పుంజుకుంది.
సంజయ్ ఆర్నెల్లకొకసారి ఇంటికి వచ్చేవాడు. అప్పుడు తను ఏయే ప్రాంతాల్లో విధులు నిర్వర్తించాడో, ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నాడో, తన అనుభవాలను వివరించి గీతకు చెప్పేవాడు. పెళ్ళైన సంవత్సరానికి అభినయ పుట్టింది. ఇప్పుడు తను ఆరు నెలల గర్భిణి. సంవత్సరం క్రితం నుంచి సంజయ్‌ని ఇండియా, పాకిస్తాన్ బార్డర్ దగ్గర నియమించారు. రెండు మూడు నెలలనుంచి ఇరు దేశాల మధ్యా తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. పొరుగు దేశం నుంచి కవ్వింపు చర్యలు, దాడులు మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. మన సైనికులు ప్రాణాలకు తెగించి సరిహద్దులో పహరా కాస్తున్నారు. అలా జీవితం సాగుతున్నప్పుడు అకస్మాత్తుగా ‘యూరీ’ అనే ప్రాంతంలో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు దాడి చేసి దాదాపుగా ఇరవై మంది భారత సైనికులను పొట్టన పెట్టుకున్నారు. సంజయ్ అప్పుడు అదే ప్రాంతంలో ఉన్నాడు. ఆ సంఘటన తర్వాత సంజయ్ గీతకు ఒక ఉత్తరం ఈమెయిల్ ద్వారా పంపాడు. అందులో ఇలా రాశాడు..
“గీతా
నువ్వు, అమ్మా, నాన్నా అభినయ కులాసానే కదా! ఆరు మాసాలుగా నీ పొట్టలో పవళిస్తున్న మన భావి భారత పాపాయి మామూలుగానే నీతో మాట్లాడుతున్నదా? నాన్నెప్పుడొస్తారని ఎప్పుడైనా అడిగిందా? నీ జ్ఞాపకాల తడితో గుండె బరువైనప్పుడు అది చెరువుగా మారి, పొంగి నా కళ్ళ గట్లను తెంచుకుని, నా ముందున్న వర్తమానాన్ని సస్యశ్యామలం చేస్తూవుంటుంది. నిన్న తెల్లవారుఝామున సరిహద్దుకావలి శత్రువర్గంలోని ఉగ్ర మూకలపై, శత్రు శిబిరాలపై ఉపాయంగా మేం ఉరుములు, మెరుపుల్లేని పిడుగుల దాడి చేశాం. యూరీలో ఉత్తి పుణ్యానికే మన సైనిక సోదరులను కడతేర్చిన కాలకేయులపై కలకాలంగా రగులుతున్న మన పగను తీర్చుకున్నాం. దాయాది దేశం దిమ్మర పోయేలా మళ్ళీ మనపై దాడి చేయాలంటే దడ పుట్టేలా వైరి మూకలపై విరుచుకుపడ్డాం. సర్వ వేళలా మనం సహనానికి ప్రతీకలైనా, కారణం లేకుండా కయ్యానికి కాలు దువ్వుతూ ద్వేషాగ్ని జ్వాలలతో మనపై దాడి చేస్తుంటే ఎలా ఊరుకుంటాం? ఎంతకాలం ఏమీ పట్టనట్లు శాంతంగా సర్దుకుపోతాం?
అప్పుడప్పుడూ కంటికి కన్ను, పంటికి పన్ను, విషానికి విషమే కదా విరుగుడు! మేం ఇప్పుడు కళ్ళల్లో వత్తులు వేసుకుని సరిహద్దును సంరక్షించడానికి జాగిలాలై మరింత జాగ్రత్తగా జాగారం చేయాలి. ప్రాణాలైనా ఒడ్డి ప్రత్యర్ధుల నడ్డి విరవాలి. వాళ్ళు మళ్ళీ మనపై ఏ క్షణంలోనైనా ప్రతీకార దాడులు చెయ్యవచ్చు. ఈ సమరంలో గెలుపు మనదే కావచ్చు. కాదంటే నా ప్రాణాలు అనంత వాయువుల్లోకి ఆవిరిగా ఇగిరిపోవచ్చు. నేను ఎప్పటికీ ఇంటికి తిరిగి రాకపోతే అమ్మా, నాన్నల్ని భద్రంగా చూసుకో. మన పిల్లల్ని ధైర్యవంతులుగా, త్యాగశీలురుగా తీర్చిదిద్దు. ఎవ్వరికీ, దేనికీ భయపడనీయవద్దు. మిమ్మల్నందరినీ మళ్ళీ కలుస్తానన్న ఆశతో, కలవకపోయినా వీర మరణం పొందుతానన్న తృప్తితో
సంజయ్”
ఆ ఉత్తరం అందుకున్న వారం రోజులకే దాయాదులు ఇండియాపై దాడి చెయ్యడం. ఆ దాడిలో దేశాన్ని రక్షించే బాధ్యత నిర్వర్తిస్తున్న సంజయ్ తీవ్రంగా గాయపడి రెండు రోజుల తర్వాత మరణించడం జరిగింది. ఆ విషయం గీతా వాళ్ళకు ఫోన్ ద్వారానూ, మీడియాలో వస్తున్న వార్తల మూలంగా తెలిసింది. సంజయ్ అమ్మా, నాన్నలు కుప్పకూలిపోయారు. గీతను ఒక్కసారిగా శూన్యం ఆవరించింది. ఆ నేపథ్యంలో అభినయ అడిగింది. “అమ్మా నాన్నెప్పుడొస్తారు?” అని.
***
కొన్నిరోజులు పోయాక ఆర్మీ వాళ్ళు సంజయ్ బాడీని ఇంటికి పంపించారు. సంస్కార కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇల్లంతా బోసిగావుంది. అభినయకు జరిగిందంతా పూర్తిగా అర్ధం కాకపోయినా నాన్న ఇక కనిపించడు, ఇదివరకటిలా సెలవుల మీద వచ్చినప్పుడు తనతో ఆడుకోడు, ముద్దు చెయ్యడు అన్న సంగతి అవగాహనకొచ్చింది. గీతకు తమ బెడ్రూములో గోడకు వేళ్ళాడుతున్న ఆలివ్ గ్రీన్ యూనిఫార్మ్ చూసినప్పుడల్లా సంజయ్ చెప్పే మాటలు గుర్తుకు వస్తున్నాయి. అతనెక్కువగా “సంతృప్తిగా బతకాలి. దేశం కోసం ఏదైనా చెయ్యాలి” అని చెప్పేవాడు. ఇప్పుడు ఆ మాటలు ఆమెలో మార్మోగుతున్నాయి. భర్త వేసుకున్న యూనిఫార్మ్‌ను తాను ధరించి దేశం కోసం పోరాడుతున్నట్లు కూడా ఆమెకు కలలొస్తున్నాయి. ఆమెలో ఒక ఆలోచన కలిగింది. అయితే తను ఇప్పుడు కడుపులో బిడ్డను మోస్తూవుంది. పాప పుట్టి ఒక సంవత్సరమైనా గడవాలి. అప్పుడు తను కోరుకున్నట్లుగా చెయ్యవచ్చు.
గీతకు నెలలు నిండాయి. బాబు పుట్టాడు. వాడికి భరత్ అని పేరు పెట్టారు. నెమ్మదిగా ఒక సంవత్సరం గడిచింది. గీతలో ఇదివరకు దేశం కోసం ఏదో చెయ్యాలన్న కోరిక ఇప్పుడు ఒక స్పష్టమైన రూపాన్ని సంతరించుకుంది. సైన్యంలో చేరాలన్నది ఆమె కోరిక. అందుకు శరీర దారుఢ్యం, మానసిక ఆరోగ్యం తప్పనిసరి. రెండో యేడు కూడా పూర్తయ్యింది. ఆసమయంలో గీత స్కూల్లో టీచరుగా పనిచేసింది. స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఆమెకు చాలా ఆసక్తి. అందుకని ఊర్లోవున్న అంధులు, బధిరులు అయిన పిల్లల పాఠశాలలో ఉపాధ్యాయినిగా చేరింది. ఆసమయంలోనే ఆర్మీలో చేరాలంటే అవసరమైన శారీరక దారుఢ్యతను, రాత పరీక్షకు అవసరమైన జ్ఞానాన్నీ సంపాదించింది. తర్వాత తన వాళ్ళని ఒప్పించి పూణేలోని ‘అపెక్స్ కరీర్స్’ లో చేరింది. పిల్లల్ని అత్తా, మామలు చూసుకుంటున్నారు. వారి అండ ఆమెకు కొండంత బలంగా ఉంది. వాళ్ళు తమ కుమారుడు సంజయ్ దేశంకోసం ప్రాణాలర్పించినందుకు గర్వపడుతున్నారు.
గీత ‘సర్వీస్ సెలెక్షన్ బోర్డ్’ పరీక్షకు తయారవ్వడం మొదలుపెట్టింది. ఆమెకు సైన్యంలో భర్తను కోల్పోయిన భార్యలకు ఇచ్చే వయసు మినహాయింపు కూడా లభించింది. రాత పరీక్ష, శారీరక బల పరీక్ష, ఇంటర్వ్యూలు పాసయ్యింది. పుస్తకాలు బాగా చదివింది. కష్టపడి వ్యాయామాలు చేసింది. పరీక్ష పాసవ్వంగానే చెన్నైలోని ‘ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ’కి వెళ్ళమన్నారు. ఇప్పుడు తను ట్రైనింగ్ తీసుకుంటోంది. అది పూర్తవ్వంగానే ఆర్మీలో పోస్టింగ్ ఇస్తారు. ఎంతదృష్టం? ఎంత మంది భార్యలకు తనలాగా బాధ్యతాయుతమైన, దేశమాతకోసం పనిచేసే అవకాశం లభిస్తుంది? తను ధన్యజీవి. సంజయ్ చనిపోయినా, అతని ఆశయం మేరకు పనిచెయ్యడానికి తనువుంది. రేపు భవిష్యత్తులో తన పిల్లలు ఎవరైనా ఆర్మీలో చేరాలనుకుంటే వాళ్ళను ఆనందంగా ప్రోత్సహిస్తుంది.
చెన్నైలోని ‘ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ’లోకి అడుగుపెట్టంగానే గీతకు దాదాపు ఏడువందల ఎకరాల్లో విస్తరించిన పచ్చదనం ఆహ్వానించింది. తనలాగా అక్కడ వందమంది స్త్రీలు శిక్షణ కోసం ఎంపిక చెయ్యబడ్దారు. అయితే అది ప్రస్తుతానికి తాత్కాలిక ప్రాతిపదిన మాత్రమే. అక్కడి కలనల్ రఘువీర్‌ను గీత
“కలనల్ నేను శాశ్వత ప్రాతిపదికన ఆర్మీలో దేశంకోసం పోరాడే బృందంలో ఉండాలనుకుంటున్నాను. అందుకు నేనేమి చెయ్యాలి?” అని అడిగింది.
అందుకు కలనల్ “గీతా, నువ్వు ముందు శిక్షణ తీసుకో. అది ముగిసే సమయానికి మాకు మీమీద ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. అప్పుడు మేము మిమ్మల్ని ఏ విభాగంలోకి కమీషన్ చెయ్యాలి? ఎవరిని శాశ్వత ప్రాతిపదికన ఎంపిక చెయ్యాలి? అన్న నిర్ణయం తీసుకుంటాము. శిక్షణ పొందుతున్న మీ అభిప్రాయాలను కూడా తెలుసుకుంటాము,” అని వివరంగా చెప్పాడు.
అంతకు ముందు వరకు స్త్రీలను ఇంజనీరింగ్, మెడికల్, ఎడ్యుకేషన్ విభాగాలలోకి మాత్రమే తీసుకునేవారు. అయితే ఇప్పుడు వాళ్లకు కూడా సమాన అవకాశాలివ్వాలి అన్న ఉద్దేశ్యంతో గీతా వాళ్లకు ఆయుధాలను ఎలా వాడాలి అన్నదాని మీద కుడా ప్రాథమిక స్థాయిలో శిక్షణనివ్వడం ప్రారంభించారు. అందుకు గీత చాలా సంతోషపడింది. శిక్షణ తీసుకుంటున్న వాళ్ళలో గీతలాగే కొంత మంది, భర్తలను దేశ రక్షణా విధుల్లో కోల్పోయిన వాళ్ళూ, మరి కొంతమంది తమ సమీప బంధువులు ఆర్మీలో పనిచేస్తున్న వాళ్ళూ ఉన్నారు. మరికొంతమంది ఏ ఆర్మీ, నేవీ తదితర సర్వీసుల నేపథ్యమూ లేకపోయినా, సైన్యంలో పనిచెయ్యాలనే ఒక తపనతో, ఆశయంతో అక్కడ చేరారు. మొత్తం మీద వాతావరణం అకాడెమీలో స్ఫూర్తిదాయకంగా, ఉత్తేజభరితంగావుంది.
వేకువ ఝామునే పి.టి(ఫిజికల్ ట్రైనింగ్) సెషన్స్ మొదలౌతాయి. ఆ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ సర్వ్ చేసేవారు. అదయ్యాక డ్రిల్ పరేడ్ ఉండేది. ఈ విధమైన కార్యక్రమం శిక్షణ పూర్తయ్యేంత వరకువున్నది. శిక్షణనిస్తున్న సుబేదార్ మేజర్ చాలా కఠినంగా వుండేవాడు. ఐతే అందరు కాడెట్స్ ఆయన చెప్పేటట్లు చేస్తుండడం వల్ల ఆయన తర్వాత స్నేహపూర్వకంగా ఉండడం మొదలెట్టాడు. చివరికి ‘పాసింగౌట్ పెరేడ్’ రోజు వచ్చింది. గీతా, మిగతా కేడెట్లందరూ చక్కగా యూనిఫాం వేసుకుని సిధ్ధంగా వున్నారు. గీతకు తన గతం, సంజయ్ గుర్తుకు వచ్చి భావావేశానికి గురయ్యింది. చివరగా ‘పిప్పింగ్ సెరిమనీ’ జరిగింది. ఆ తర్వాత గీతా, మిగిలిన క్యాడెట్లను ఇండియన్ ఆర్మీ ఆఫీసర్లుగా ప్రకటించారు.
గీతకు తను కోరుకున్నట్లుగానే పర్మనెంట్ కమీషన్ లభించింది. తనని సియాచిన్ ప్రాంతంలో ఒక మెడికల్ టీముకు సహాయ సిబ్బందిలో సభ్యురాలిగా నియమించారు. కొన్నిరోజులు పోయాక ఇంకా కీలకమైన బాధ్యతలు అప్పగించవచ్చు. ఆమె చాలా యేళ్ళ కల ఇప్పుడు నెరవేరింది. ఇప్పుడు గీతా వాళ్ళింట్లో సంజయ్ ఆలివ్ గ్రీన్ యూనిఫార్మ్ పక్కనే గీతా యూనిఫార్మ్ కూడా దర్జాగా తగిలించబడివుంది. ఆ ప్రక్కనేవున్న ఫోటోలోంచి సంజయ్ “గీతా! దేశం కోసం నేను లేకపొయినా, నువ్వు ఆ లోటు భర్తీ చేస్తూ మన కుటుంబం తరపున ఆర్మీలో పనిచేస్తున్నావ్. అందుకు నా అభినందనలు,” అంటూ నవ్వుతూ ఆశీర్వదిస్తున్నట్లుగా గీతకు అనిపిస్తూ వుంటుంది.