స్ఫూర్తిప్రదాత మన వీరేశలింగం

0
4

[శ్రీమతి గాడేపల్లి పద్మజ గారి ‘స్ఫూర్తిప్రదాత మన వీరేశలింగం’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]త[/dropcap]రగతిలో ఉపాధ్యాయుడు ఇంగ్లీషు పాఠం చెబుతున్నాడు. పాఠంలో తప్పు దొర్లింది. ఒక విద్యార్థి లేచి అది తప్పు అని చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ తప్పు ఒప్పుకునే ధైర్యం ఆ ఉపాధ్యాయుడికి లేదు. “నేను చెప్పిందే కరెక్ట్” అని వాదించాడు. దాంతో ఆ విద్యార్థి ఈ విషయంపై వ్రాతపూర్వక ఫిర్యాదు పై అధికారులకు పంపాడు. అప్పుడు ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. అంతటి నిజాయితీ, ధైర్యంగల విద్యార్థి ఎవరో కాదు. శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులుగారు. ఈయన పేరు వినగానే ‘సంఘసంస్కర్త’ అని ఎవరైనా చెప్పేస్తారు. వీరి సంస్కరణలను గుర్తించిన ప్రభుత్వం ‘రావుబహదూర్’ బిరుదునిచ్చి సత్కరించింది.

ఆచారాలు, కట్టుబాట్లు మనిషిని సంకెళ్ళు వేసి వెనక్కు లాగుతున్న రోజులవి. మనిషి తనకేం కావాలో, సౌకర్యవంతంగా బ్రతకాలంటే తనేమి చేయాలో తెలియని కాలం. ఈ కాలాన్ని శాస్త్రసాంకేతికతకు అంధయుగంగా భావిస్తారు. దురాచార నిర్మూలన, వితంతు వివాహాలు, బాల్యవివాహాల నిర్మూలన, ముఖ్యంగా మహిలోద్ధరణకై నడుం బిగించి ధైర్యంగా ముందుకు అడుగువేసిన మహోన్నతుడు కందుకూరి. వీరు ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరంలో జన్మించారు. ఆ రోజుల్లో బజారుకో భూతవైద్యుడుండేవాడు. దయ్యాలంటే జనం, చాలా భయపడేవారు. ఓ రోజు దయ్యాన్ని చూపించమంటూ భూతవైద్యుడిని అడిగారు. “భూతాలు, దయ్యాలు శ్మశానంతో ఉంటాయి, వెళ్ళి చూడు” అన్నాడాయన. శ్మశానానికి వెళ్ళారు వీరేశలింగం. కాలుతున్న శవాలు, మంటలు, ఎముకలు, బూడిద తప్ప అక్కడేమీ కనిపించలేదు. ఊళ్ళోకి వచ్చి. “దయ్యాలు లేవు, భూతవైద్యుడు చేసేదంతా మోసం” అనీ అందరికీ చెప్పాడు. దాంతో భూతవైద్యులకు రాబడి తగ్గింది. దాంతో ఒక భూతవైద్యుడు వీరేశలింగం గారితో “నేను నీ మీద దయ్యాన్ని ప్రయోగిస్తాను” అంటూ బెదిరించాడు. “నాకు దయ్యాలంటే భయం లేదు. నేను శ్మశానంతో దయ్యాల దగ్గర పెద్దపెద్ద విద్యలన్నీ నేర్చుకున్నాను. అవన్నీ నేనే నీ మీద ప్రయోగిస్తాను” అని బెదిరించడంతో, ఆ భూతవైద్యుడు భయపడి పారిపోయాడు. వితంతు వివాహాలు జరుపుతున్నపుడు సనాతనవాదులనుండి తీవ్రమైన వ్యతిరేకత చోటు చేసుకుని అనేక ఘర్షణలకు దారి తీసింది.

సనాతనవాదులను చర్చకు పిలిచి, వేదాలతో ఎక్కడా స్త్రీ అణచివేత లేదని, పురుషుడితో సమంగా ఆమె ముందడుగు వేసిందని వారితో వాదించి, శాస్త్ర చర్చలు జరిపి, బుద్ధిబలంతో గెలిచారు. ‘హితకారిణి’ సంస్థను స్థాపించి, మహిళాభ్యుదయానికి ఎనలేని కృషిచేశారు పంతులుగారు. వితంతువులు పారిపోయి వచ్చి, అక్కడే తల దాచుకుని తమకు వివాహం చెయ్యమని కోరేవారట. ఈ పాఠశాల ద్వారా అనేక మంది బాలికలను విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘనత వీరేశలింగం గారిదే. తెలుగులో మొదటి నవల, మొదటి చరిత్ర, మొదటి ప్రహసనం, వ్యాకరణం, తర్కం, జ్యోతిష్యం ఇలా అన్ని రచనలకు ప్రథముడు కందుకూరివారే. తెలుగు, ఇంగ్లీషు, సంస్కృత భాషల్లో అద్వితీయ ప్రతిభ ఈ మేధావి సొంతం.

వీరి తొలి తెలుగు నవల ‘రాజశేఖర చరిత్ర’ ఓ అపూర్వమైన రచన. “నాసికాత్ర్యంబకములో పుట్టిన గోదావరి మెల్లమెల్లగా ముందుకు ప్రాకుతూ, తల్లివేళ్ళను విడిచి మిగిలిన వేళ్ళను తాకుతూ, దారి పొడవున కలిసిన వారందరినీ పలకరిస్తూ, అడుగడుగునా సస్యశ్యామలం చేస్తూ, ఫల, వృక్షములకు జీవనమునిస్తూ, తనను చేర వచ్చిన మంజీర, పిన్నగంగ వంటి ఉపనదులను ఆహ్వానిస్తూ, చివరకు తననాధుడైన జనార్ధనస్వామి పాదాలను చేరి మురిసిపోయింది” అంటూ మనోహరమైన గోదావరి ప్రయాణం ఈ నవలలో అద్భుతంగా సాగుతుంది. ఉత్సవాల సమయంలో మాత్రమే విగ్రహాలకు పులికాపు చేసి, దర్శనం కోసం వచ్చిన భక్తులను డబ్బు పుచ్చుకుని లోపలికి పంపేవారనీ, మిగిలిన రోజులతో చతుష్పాద జంతువులు మాత్రం మిక్కిలి భక్తి కలవై నిత్యము స్వామిని దర్శించుకునేవనీ, మానవుని లోని భక్తి వైఖరిలోని లోపాన్ని దుయ్యబట్టారు కందుకూరివారు. ఆ రోజుల్లో బ్రాహ్మణులు, కుడిచేతిలో తాటాకుల మీద వ్రాసిన పంచాంగమును బట్టుకుని, నీర్కావి ధోవతి కట్టుకుని, మడత పెట్టిన చిన్న అంగవస్త్రమును భుజం మీద వేసుకుని, దేహము మీద విభూతి రేఖలు స్పష్టంగా కనిపింప, నిమ్మకాయలంత రుద్రాక్షలతో, రెంటికి బెట్టుకున్న పొడుముకాయ కనబడక, గట్టుమీది నుండి పోవుచు ‘గోదావరిలో స్నానము చేయువారెవ్వరా’యని కనులకు చేయి అడ్డము పెట్టుకుని నిదానించి చూసి గిరుక్కున మళ్ళీ, దక్షిణ కోసం గోదావరి మెట్లు దిగివచ్చేవారంటూ నాటి సామాజిక పరిస్థితులను కళ్ళకు కట్టిన తీరు అద్భుతం.

రాజశేఖర చరిత్రలోని రాజశేఖరం గారు అల్పసంతోషి. పొగడ్తలకు లొంగేవాడు. ఆయన పెద్దకూతురు రుక్మిణికి ఆనాటి ఆచారాల ప్రకారం బాల్యవివాహం జరిపించారు. ఆమె భర్త ఆమెను వదిలి ఎటో వెళ్ళిపోయాడు. అతడు చనిపోయినట్లు వార్త అందడంతో, ఆమెను వితంతువుగా మారుస్తారు. ఈ దుస్సంఘటన నుండి వారు ఏమి నేర్చుకొనక రెండవ కూతురు సీతను కూడ బాల్య వివాహం చెయ్యాలనుకుంటారు. ఆ ఇంట్లో రాజశేఖరం గారి పెద్దరికం, పిల్లల క్రమశిక్షణ చాలా గొప్పగా, ఈ తరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఎవరేది చెప్పినా నమ్మే రాజశేఖరం గారి స్వభావం, అమాయకత్వానికి నిదర్శనం. అందరినీ మంచివాళ్ళని నమ్మి మోసపోవడం, తలకు మించిన అప్పులు చేయడం, వాటి వల్ల జైలు పాలవడం, చివరకు కుటుంబాన్ని రోడ్డు మీద నిలబెట్టి నిస్సహాయుడౌతాడు. ఈ నవల ద్వారా ఒక్కొక్క సాంఘిక దురాచారాన్ని హేళన చేసి, విమర్శించి, వాస్తవాన్ని కనుల ముందుంచారు పంతులుగారు. ప్రశ్న చెప్పేవారి ద్వారా పోయిన వస్తువును తెలుసుకోవాలనుకోవడం, ఎరుక చెప్పేవారి మాటల్లోని కపటం తెలియని అమాయకత్వం, అంజనం ద్వారా దొంగను పట్టుకోవడం, స్వర్ణ యోగం తెలుసునని బైరాగి మోసంచేయడం, గ్రామదేవతలకు చేసే శాంతి, మఠాధిపతుల ఆర్భాటాలు, ఆనాటి జీవన విధానమంతా అశాస్త్రీయమే అని ఋజువు చేసే ప్రయత్నం చేశారు పంతులుగారు.

నీళ్ళు తెచ్చుటకు చెరువులోకి దిగిన వనితల మాటలు కందుకూరివారి వాక్యములతో పూజారి పాపమ్మ ఎంత వయ్యారముగా నడుచునో, అయ్యగారి రావమ్మకంత గర్వమో, పుల్లమ్మ కసలు నగలు లేవు, కనకమ్మకు మెల్లకన్ను ఇలా సాగేవి. విద్య లేకపోవడమే స్త్రీ వెనుకబాటుతనానికి కారణమంటూ దానికై అవిరళ కృషిసల్పిన ధీశాలి శ్రీ వీరేశలింగం. ఈ నవల ద్వారా నూట యాభై సంవత్సరాల క్రింద సమాజపు స్థితిగతులను అర్థం చేసుకునే అవకాశం మనకు దక్కింది. అంతేకాక అమోఘమైన ఆయన వ్యక్తిత్వం, ఎవరికీ భయపడని ధీరత్వం, సమాజంలోని అంధత్వాన్ని పోగొట్టాలనే పట్టుదల నేటి యువతకు స్ఫూర్తిదాయకాలు. శ్రీ కందుకూరి వీరేశలింగంగారి చరిత్రను ప్రతి ఒక్కరు చదివి తరించాలనే నా సంకల్పం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here