దంతవైద్య లహరి-9

12
4

[దంత సంరక్షణ కోసం డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారు నిర్వహిస్తున్న ప్రశ్నలు జవాబులు ఫీచర్ – ‘దంతవైద్య లహరి’.]

జ్ఞానదంతాలు

ప్ర: డాక్టర్ గారూ.. నాది ఒక సందేహం. జ్ఞానదంతాలు అనేటివి అందరికీ వస్తాయా? లేక కొందరికేనా? ఏ వయసులో ఈ దంతాలు వస్తాయి?వాటివల్ల ప్రత్యేకమైన ఉపయోగాలు ఉన్నాయా? అసలు ఆ దంతాలను జ్ఞానదంతాలు అని ఎందుకు అంటారు? వీటిని తీయించుకోవడం వల్ల లాభనష్టాల గురించి చెప్పండి.

జ: మీ ప్రశ్నకు సమాధానం చెప్పేముందు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుచేతనంటే, మీరు క్రమం తప్పకుండా దంతవైద్యలహరి శీర్షిక చదువుతూ మీరు ఈ సందేహాన్ని వెలిబుచ్చినందుకు!

మనం అనుకునే ‘జ్ఞానదంతాలు’ అందరిలోనూ వస్తాయి. కొందరికి దౌడలో పైకి కనిపిస్తే, కొందరిలో దౌడలో పైకి రాకుండా, దౌడలోనే దాగి ఉంటాయి. అవి పైకి రాకపోవడానికి గల ముఖ్య కారణం, వాటికి సరైన అనుకూల పరిస్థితులు లేకపోవడమే! అతి కొద్ది శాతం మందిలో అసలు ఈ దంతం ఏర్పడక పోవచ్చు. మన దౌడలలో వచ్చే ప్రతి దంతానికి ఒక వయసు అంటూ ఉంటుంది. అందుకే ఈ దంతం రాకకూ ఒక వయసు ఉంటుంది. అలా, సాధారణంగా ఈ పన్ను లేదా పళ్ళు లేదా దంతాలు, పదిహేడు -ఇరవైఒక్క సంవత్సరాల మధ్యవయస్సులో రావచ్చును. కొంతమందిలో కాస్త అటుఇటుగా కూడా రావచ్చును. కొంత మందికి తొంబై ఏళ్ళు వయస్సులో కూడా జ్ఞానదంతాలు రాకపోవచ్చు. దానికి దౌడలో స్థలం సరిపడినంత లేకపోవడమే! జన్యుపరమైన సమస్యల వల్ల అసలు ఈ దంతాలు లేకపోవచ్చు కూడా!

నిజానికి దంతాలు అనేవి పదార్థాలను మెత్తగా నమలడానికి ఉపయోగపడాలి. కానీ ఇవి ఆహరం నమిలే విషయంలో ఉపయోగపడవు. కారణం పై దంతం క్రింది దంతంతో, ఆనుకోలేక పోవడమే! అలా, ఈ దంతాలు ఉపయోగపడవు సరికదా, కొంతమందిలో అనారోగ్య సమస్యలు, తద్వారా ఇబ్బందులను కలుగజేస్తాయి. అసలు జ్ఞానదంతం అంటే ఏమిటి? ఈ దంతానికీ జ్ఞానానికీ సంబంధం ఉందా? అలా అయితే ఈ దంతాన్ని కోల్పోయినా, ఈ దంతం రాకపోయినా, మనిషి జ్ఞానాన్నీ కోల్పోతాడా? అన్నవి సామాన్యుల మదిలో మెదిలే సందేహాలు!

జ్ఞానదంతం చుట్టూరా చిగురు వాపు (Pericornaitis)

నిజానికి దంత వైద్య చరిత్రలో ఎక్కడా జ్ఞానదంతం అనే పదం కనిపించదు. ఇది దౌడలోని మూడవ విసురుడు దంతం (థర్డ్ మోలార్). కానీ మిగతా రెండు విసురుడు దంతాలకు భిన్నంగా, ఈ దంతం యవ్వన దశలో రావడం మూలానా, ఆ వయసులో కాస్త జ్ఞానసంపద పొందే అవకాశం వస్తుంది కనుక అలా.. ఆ పేరు వచ్చింది అనుకోవాలి తప్ప, ఈ పంటికి జ్ఞానంతో సంబంధం లేదు. పై దౌడలో రెండు (కుడి ఒకటి, ఎడమ ఒకటి) క్రింది దౌడలో రెండు (కుడి ఒకటి, ఎడమ ఒకటి) మొత్తం నాలుగు (జ్ఞాన)దంతాలు ఉంటాయి.

పై దౌడ లోని జ్ఞానదంతాలతో పెద్ద సమస్య ఉండదు గాని, క్రింది దౌడకు చెందిన (మాండిబ్యులార్) జ్ఞానదంతాలు మాత్రం, చాలా మందిలో ఇబ్బందులను కలుగజేస్తాయి. దౌడలో చివరి పన్ను కనుక ఈ మూడవ విసురుడు దంతం వచ్చే సరికి, దౌడలో తగినంత చోటు ఉండక పోవడం వల్ల పన్ను పాక్షికంగా బయటికి వచ్చి చుట్టూరా చిగురు అల్లుకుని ఉంటుంది ఇలా పన్ను పూర్తిగా బయటికి రాకపోవడాన్ని ‘ఇంపెక్టెడ్ టూత్’ అంటారు. అలా ఈ దంతాలు నిటారుగా సగం వచ్చి ఆగిపోతే ‘వెర్టికల్ ఇంపెక్షన్’ అని, నిటారుగా కాకుండా దంతం దౌడలో కుడివైపు వంగితే, ‘రైట్ లాటరల్ ఇంపెక్షన్’  అని, ఎడమవైపు వంగితే, ‘లెఫ్ట్ లాటరల్ ఇంపెక్షన్’  అని, దౌడలోపలే, దౌడకు సమాంతరంగా దాగివుండే దంతాన్ని ‘హారిజంటల్ ఇంపెక్షన్’ అని అంటారు. ఇది బయటకు అసలు కనిపించదు. కానీ నొప్పిని కలిగించడం వల్ల, ఎక్స్‌రే ఫిల్మ్‌లో కనిపిస్తుంది. ఇలా లోపల దాగివున్న జ్ఞానదంతాలు, ఒక్కోసారి ఎలాంటి ఇబ్బంది కలిగించకపోవడం మూలాన వాటి గురించి ఆలోచించము. కానీ మనకు తెలియకుండానే అది దౌడ ఎముకలో కాన్సరు వంటి సమస్యలను గాని చీము తిత్తి (సిస్ట్) సమస్యలను గాని సృష్టించవచ్చు. ఇకపోతే ఇవి పాక్షికంగా దౌడలో వచ్చినప్పుడు, చిగురు పంటి చుట్టూరా సంచి మాదిరిగా వుంది, మనం తినే ఆహారపదార్ధపు అణువులు ఆ సంచిలోనికి చేరి, అక్కడ కుళ్ళి బాక్టీరియా సహకారంతో చిగురు వ్యాధిగ్రస్థమై, చిగురు వాయడం జరుగుతుంది. దీనిని ‘పెరి కార్నైటిస్’ అంటారు. ఈ చిగురువ్యాధి మరింతగా ముదిరితే, చిగురు నుండి చీము, నెత్తురు కారడం, విపరీతంగా నొప్పిరావడం, నోటి నుండి దుర్వాసన రావడం (చెడు శ్వాస/హలిటోసిస్) జరుగుతుంది. ఇంకా అశ్రద్ధ జరిగితే, దౌడ వాయడం, నోరు మూసుకుపోవడం, నొప్పి-జ్వరం, ఆహారం తీసుకోలేని పరిస్థితి ఏర్పడడం జరుగుతుంది. ఇలా నోరు కదలకుండా మూసుకు పోవడాన్ని ‘ ట్రిస్‌మస్’ అంటారు. చికిత్స: సమస్యను సృష్టించే జ్ఞానదంతాలను తీయించుకోవడమే (ఎక్స్‌ట్రాక్షన్) సరైన పరిష్కారమార్గం.

నిజానికి ఈ చికిత్స మూడు రకాలుగా ఉంటుంది.

  1. ఔషధపరమైన చికిత్స. మందులద్వారా సమస్య తాత్కాలికంగా తగ్గినా, పునరావృతం అయ్యే అవకాశం వుంది.
  2. పాక్షికంగా వచ్చిన పన్ను చుట్టూతా వుండే, చిగురును శస్త్ర చికిత్స ద్వారా తొలగించడం. అయినా చిగురు తిరిగి చిగురించే అవకాశం వుంది.
  3. శస్త్ర చికిత్స ద్వారా పన్నును తొలగించడం.

జ్ఞానదంతాలు ఇబ్బంది పెట్టనంత కాలం, వాటిని కూడా మామూలు దంతాలు మాదిరిగానే జాగ్రత్తగా కాపాడుకోవాలి. నమలడంలో వాటి పాత్ర శూన్యం కనుక, సమస్యలను సృష్టిస్తున్నప్పుడు వాటిని తొలగించడమే మంచిది. వీటిని తొలగించడం దౌడలకు ఎలాంటి నష్టమూ కలుగదు.

దంతవైద్యుల సలహాతో తగిన చికిత్స పొందడం ఆరోగ్యదాయకం.

~

మధుమేహ వ్యాధిగ్రస్థుల దంత సంరక్షణ:

ప్ర: డాక్టర్ గారు, దంతసంరక్షణ విషయంలో మధుమేహ వ్యాధిగ్రస్థులుఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

– శ్రీ సూర్యనారాయణ రావు, డి.జి.ఎం /ఎస్.బి.ఐ. (రి), హైదరాబాద్.

జ: రావు గారూ.. మంచి ప్రశ్న అడిగారు.

మధుమేహ వ్యాధిగ్రస్తులు శరీరంలోని, అన్నిభాగాలపై శ్రద్ధపెట్టాలి. దంతాలు దీనికి అతీతం కాదు!

నోరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆహారపదార్ధాలు తీసుకున్నప్పుడు, పానీయాలు త్రాగినప్పుడు ఎక్కువసార్లు నోరు పుక్కిలించాలి. రాత్రి పడుకునేముందు తప్పనిసరిగా, మౌత్ వాష్‌తో గానీ, ఉప్పు నీటితో గానీ నోరు పుక్కిలించాలి.

హార్డ్ టూత్ బ్రష్‌తో గంటలకొద్దీ గట్టిగా రుద్ది బ్రష్ చేయకూడదు. అంటే చిగుళ్లు గాయపడేలా పళ్ళు తోముకోకూడదు.

మధుమేహ వ్యాధిగ్రస్తుడి గారపట్టిన పళ్లు

చిగురు వ్యాధులు – పంటివ్యాధులను సకాలంలో గుర్తించి తక్షణమే తగిన చికిత్స పొందడానికి, ముందస్తు దంతవైద్య పరీక్షలు (సమస్యలు లేకున్నా) ఆరు నెలల కొకసారి తప్పక చేయించుకోవాలి.

పళ్లకు పాచి/గార, పట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అవసరమైనప్పుడు స్కేలింగ్ పద్దతిలో పళ్ళు శుభ్రం చేయించుకోవాలి.

అరిగి సూదిగా మారిన పళ్లు ఉన్నట్టు గ్రహించిన వెంటనే, దంతవైద్యులకు చూపించుకోవాలి. లేకుంటే సున్నితమైన బుగ్గలకు, నాలుకకు, గాయాలై ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి.

నోటి సమస్యలు ఇతర శరీర సమస్యలపై ప్రభావం చూపిస్తాయన్న సంగతి మరువరాదు.

~

నోటి పరిశుభ్రత

ఆరోగ్యానికి భద్రత!

డా. కె. ఎల్. వి. ప్రసాద్, సివిల్ సర్జన్ (రిటైర్డ్), 9866252002

~

పాఠకులు తమ దంత సమస్యలకు సంబందించిన ప్రశ్నలు (ఎన్నైనా, ఇందులో ఎలాంటి నియమం లేదు) ‘సంచిక’ సంపాదకులకు kmkp2025@gmail.com అనే మెయిల్ ఐడికి, ప్రతి గురువారం లేదా అంతకంటే ముందు పంపవచ్చు. ప్రశ్నలు పంపేవారు విధిగా తమ పూర్తి పేరు, ఊరు, మొబైల్ నంబరు రాయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here