తెలంగాణ తెలుగు: ప్రాసంగికత – ప్రామాణికత

0
3

[29 ఆగస్టు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా – శ్రీ గాజుల రవీందర్ రచించిన ‘తెలంగాణ తెలుగు: ప్రాసంగికత – ప్రామాణికత’ అనే వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]తె[/dropcap]లంగాణ తెలుగు భాషకు ప్రామాణికతను కల్పించాలని, ఇంతవరకు ప్రామాణికంగా ఉన్న భాష ఆంధ్రుల రెండున్నర జిల్లాల భాష అని పలువురు అభిప్రాయపడుతున్న సందర్భంలో సాహితీవేత్తలందరూ ఆలోచించడం, చర్చించడం అవసరం.

భాష ఏదయినా జనవ్యవహారంలో ఉన్నంత వరకు బతుకుతుంది. అయితే స్థిరంగా ఉండదు. కాలమును బట్టి, జీవన శైలిలో పరిణామాలను బట్టి, పరిపాలనా ప్రభావాలను బట్టి, వలసల కారణంగా అనేక మార్పులకు లోనవుతుంది. ఈ జీవనవిధానంలో ఎంత వేగంగా మార్పులు వస్తే భాషలో అంత వేగంగా మార్సులు వస్తాయి. సాంకేతిక వస్తువినియోగం, పరదేశాలకు, పరరాష్ట్రాలనుండి వలస వచ్చిన వారితో చేరిన పదజాలం, వ్యవహార విధానం ప్రజల భాషలో మార్పులు కలిగిస్తాయి. అందువల్ల జనవ్యవహారభాషకు స్థిరత్వంగాని శాస్త్రప్రమాణం గాని కల్పించడం సాధ్యపడదు. పడినా అది ఎక్కువకాలం నిలువదు.

‘ప్రయోగశరణమ్‌ వ్యాకరణమ్‌’ అన్నారు కాబట్టి ప్రయోగమంటే కవులు రచయితలు ఉపయోగించినదనే అర్థం. ఇప్పటిదాకా దాన్నే ప్రమాణంగా భావిస్తున్నాం. అయితే ప్రాచీన కాలంలో తెలంగాణ ప్రాంతంలో జనంభాషకు, జన జీవనానికి, జనం పాటలకు దగ్గరగా ఉండే భాషను ఛందస్సును వాడి జనానికి సాహిత్యాన్ని దగ్గరకు చేర్చాలని ప్రయత్నించారు పాల్కురికి సోమన. అక్షరాస్యత తక్కువ ఉన్న కారణం కావచ్చు, ఎక్కువమందికి అందుబాటులో లేని కారణం కావచ్చు, పండితులు ఆదరించని కారణం కావచ్చు ఆ భాషలో తరువాతి కవులు రచనలు చేయలేకపోయారు. కేవలం గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం, తరువాత మరికొందరు మాత్రమే చేసినవి ప్రయోగాలుగానే మిగిలినాయి కాని అనుసరణీయాలు కాలేకపోయినవి.

ఆధునిక కాలంలో పత్రికలు, కథలు, నవలలు, వ్యాసాలు, రేడియోలు, టీవీలు, సినిమాలు భాషను బహుళ ప్రచారంలోకి తెచ్చినాయి. ఆ భాషంతా రెండున్నర జిల్లాలదే కావడం అదే పాఠ్యపుస్తకాల్లో చేరడం, అవే ఇప్పటికీ తెలంగాణలో కూడా పాటించడం జరుగుతున్నది. తెలంగాణకు సహజంగా ఉన్న పదజాలాన్ని, జాతీయాలను, సామెతలను ప్రచారంలోకి తెచ్చి తెలంగాణ తెలుగుతనాన్ని నిలబెట్టాలనే తపన తెలంగాణ భాషా సాహితీవేత్తలకు ఉంది. ఇది ఎక్కడ మొదలు పెట్టినా పాతతరాన్ని మురిపిస్తున్నదే కాని, కొత్త తరాన్ని ఆకట్టుకునే పని , ఆచరింపజేసే పని కూడా చేయాలి.

వచ్చిండు, పోయిండు వంటి క్రియారూపాలు తప్పులు కావు. ఒకానొకచోట కాళోజీ ‘అమ్మ వచ్చింది, అన్నది సరయినదయితే నాన్న వచ్చిండు తప్పెట్లా అవుతుంద’ని ప్రశ్నించారు. వీటిని ఇప్పటికీ వ్యవహారంలో చదువుకున్నవారు, అన్ని వర్గాల వారు వాడుతున్నారు. కాని రాయడానికి వెనుకాడుతున్నారు. ఆ వెనుకాడడం పోవాలి. అందుకు ఇవి తప్పులు కావని, వీటిని తక్కువగా చూడాల్సిన పనిలేదని వీటికి వెనుక శాస్త్రీయత ఉన్నదనే విశ్వాసాన్ని కలిగించాలి. రచయితలు, కవులు, పాత్రికేయులు, టీ.వీ., సినిమారంగాల వారు ధైర్యంగా ఉపయోగించాలి. విస్తృతంగా రాయాలి. అప్పుడు వీటికి ప్రాచుర్యం పెరిగి ఇప్పటి యువతరం ఇక ముందు రాయడానికి ముందుకు రావచ్చు. లేదా ఇప్పుడు వాడుకలో ఉన్న భాషలోనే రాసే అవకాశాలు ఎక్కువ.

గతంలో ఉన్న అనేక పదాలు మనం పోగొట్టుకున్నాం. ఒక వ్యవసాయంలోనే దొడ్లు, గొడ్లు, ఎడ్లు, బండ్లు, నాగండ్లు, పనతాళ్ళు, పగ్గాలు, ముగుదాళ్ళు, ములుగట్టెలు, ఇట్లా ఎన్నో పోతున్నాయి. వాటిని నిఘంటువులలో, వృత్తిపదకోశాలలో భద్రపరచుకోవలసి ఉంది.

క్రియలు, విభక్తి ప్రత్యయాలు, స్త్రీసమాలు, అచ్చతెలుగు పదాలు, నామ పదాలు, వాక్యనిర్మాణాలు, వీటన్నిటినీ ఇప్పుడున్న వ్యాకరణం నుంచి భిన్నంగా తెలంగాణ భాషకు అనుకూలంగా రూపొందించవలసి ఉంది. వాటికొరకు ఆ భాషలో సాహిత్యసృజన కూడా పెరగాల్సి ఉంది. సృజనకారులు, శాస్త్రకారులు కలిసి తెలంగాణ భాష అస్తిత్వాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఉన్నది.

ఉదాహరణకు బర్రె చెర్ల పడ్డది, ఎద్దు చేన్ల పడ్డది, పిల్లి పొయిల పన్నది. మనిషి ఇంట్ల ఉన్నడు. పిల్లలు బళ్ళె ఉన్నరు. సారు ఆఫీసుల ఉన్నరు. ..ఈ వాక్యాలలో ‘లో’, ‘లోపల’, లేదా అందు అనే విభక్తికి బదులు ‘ల’ అనే విభక్తినే మాట్లాడుతున్నం. అన్ని వర్గాల వారు, అన్ని ప్రాంతాలవారు (తెలంగాణలో) ఇట్లనే అంటరు. ఈ ‘ల’ అనే విభక్తి సప్తమీ అర్థంలో వాడబడుతున్నది. నిజానికి లో, లోపల కూడా షష్టీ విభక్తి అయినప్పటికీ సప్తమి అర్థంలోనే ఎక్కువ ప్రయోగంలో ఉన్నది. ఇది తెలుగుకు సహజం. నన్నయ కూడా ‘నూతి లో వెలువడ దిగిచె’ అని లో నే ప్రయోగించినాడు కాని నూతి యందు అనలేదు. అంటే తెలంగాణలో ఉన్న ఈ విభక్తుల ప్రయోగం తెలుగు భాషకు సహజమని భావించాలి. తత్సమాల వలె సప్తమి ప్రయోగించడం కారక తార్కికతను చూపడమే అవుతుంది. ఇట్లా మనవైన అనేక అంశాలు వ్యాకరణంలో పొందుపరచే అవకాశం ఉంది. అవసరం ఉంది. ఈ దిశలో విశ్వవిద్యాలయాల ఆచార్యులు, భాషావేత్తలు ఎక్కువ పనిచేయాలి.

సృజనకారులు ఆధునిక కాలంలో సురవరం ప్రతాపరెడ్డి, కాళోజీ, వానమామలై జగన్నాధాచార్యులు, దాశరథి రంగాచార్యులు, వట్టికోట ఆళ్వారు స్వామి,సినారె, యశోదారెడ్డి, సదాశివ, గూడూరి సీతారాం మొదలైన వారు వ్యవహార భాషను ఎక్కువగా తమ రచనల్లో చేర్చారు. ఆ తరువాత తరంలో, తెలంగాణ ఉద్యమకాలంలో చాలామంది కవులు తెలంగాణ పదాలను, పాత వస్తుపరికరాలను, పద్ధతులను యాదికి చేస్తూ రచనలు చేస్తున్నారు. ఇవన్నీ భాషాపరంగా శోధన చేసి ప్రయోగ నైపుణ్యాలను, శాస్త్రీయతలను నిరూపించాలి. అప్పుడు తెలంగాణ తెలుగు రూపం అచ్చంగా అందంగా కనపడే అవకాశముంది.

తెలంగాణ వృత్తి పదకోశాలు, జిల్లా పదకోశాలు, కవుల పదప్రయోగ కోశాలు, నిఘంటువులు, తత్సమ తద్భవాల వలె అన్యదేశ్యాల ఆదాన ప్రదానాల కోశాలు, నిఘంటువులు రూపొందించుకొన వలసిన బాధ్యత నేటి భాషాసాహితీవేత్తల పైన, విశ్వవిద్యాలయాల పైన ఉన్నది. లేదా తెలంగాణ ప్రభుత్వం ఒక అకాడమిని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని భావిస్తున్నాను.

ఈ పనికి సహకరించడానికి పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాల స్థాయిలో తెలంగాణ సాహిత్యాన్ని తెలంగాణ తీరులోనే చదువుకునే వీలు కల్పించాలి.

ఈ తెలంగాణ విశ్వవిద్యాలయం వారు తెలుగు శాఖలో స్నాతకోత్తర స్థాయిలో తెలంగాణ సాహిత్యాన్ని పాఠ్యప్రణాళికలో చేర్చడం కూడా ఒక అవసరం. పాల్కురికి ద్విపదలు, పోతన్న పద్యాలు, శేషప్ప శతకాలు తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి. తెలంగాణ పలుకుబడులు గల రచనలు ఎంపిక చేసి చేర్చాలి.

తెలంగాణ భాష, సాహిత్యం ప్రయోగాల పుట్టలు. మొదటి ఛందోరచన కవిజనాశ్రయము మొదలుకొని శాస్త్ర గ్రంథాలు వెలువడ్డాయి. ద్విపదకావ్యాలు ప్రజల పాటలకు దగ్గరగా ఉండే శైలిలో మన కవులు రచించారు. శతకాలు, కందాలు, కందార్థాలు, యక్షగానాలు, నిరోష్ఠ్యాలు, చిత్రకవిత్వము, కథాకావ్యాలు ఎన్నో ప్రయోగాలు ఇక్కడ అవతరించినాయి. వాటన్నిటినీ పరిచయం చేయాలి.

వ్యాకరణం చిన్నయసూరి, బహుజనపల్లి రచనలు మాత్రమే ఉన్నా వాటిలో మనవాటిని చేర్చి , వీలయిన చోట్ల మార్చి రాసి వ్యాప్తిలోకి తేవాలి. తెలంగాణ భాషకు అనుకూలంగా వ్యాకరణ రచన జరగాలి.

యక్షగానాలు మొదలుకొని బూరుగుపల్లి వేంకటనరసయ్య, చెర్విరాల భాగయ్య నాటకాల వరకు తెలంగాణ భాషలో సంభాషణలు సాగిన రచనలు అనేకం ఉన్నాయి.

కథలు, నవలలు, వ్యాసాలు, విమర్శలు, వ్యాఖ్యానాలు, పత్రికా రచన, మొదలైన ఆధునిక ప్రక్రియల్లో తెలంగాణ రచనలను పరిచయం చేయాలి.

విమర్శకు ప్రాక్పశ్చిమ శాస్త్రాలు పరిచయం చేయాలి.

సాహిత్యానికి సంబంధించిన ఏ అంశమైనా తెలంగాణ భాష ప్రత్యేకతను నొక్కి చెప్పుకోవడం తప్పనిసరి.

అనుభవం ఉన్న పండితులతో చర్చించి పాఠ్యప్రణాళికలను రూపొందించుకోవాలని సూచన.

తెలంగాణ రాష్ట్ర సాధన ఎంత పోరాటమో తెలంగాణ భాష నిలబెట్టుకోవడానికి అంత ఆరాట పడాల్సిన అవసరం ఉంది.

ఈ చర్చలను ఎంత ఎక్కువ వీలయితే అంత ఎక్కువగా జరపాలి. సాహితీవేత్తలు, భాషాపండితులు, అధ్యాపకులు, ఆచార్యులు తెలంగాణ భాష గురించిన విస్తృతమైన చర్చతో పాటు ప్రామాణికతను రూపొందించే దిశగా శాస్త్రీయతను కల్పించాలి.

తెలంగాణలో పుట్టిన తెలుగే మొదటి తెలుగు. శాతవాహనుల గాథాసప్తశతిలోని తెలుగుమాటలే అందుకు సాక్ష్యాలు. గాథాసప్తశతి పుట్టింది గోదావరీ తీరంలోని కోటిలింగాల ప్రాంతం అని పండితుల, చరిత్రకారుల నిర్ధారణ. ఈ గోదావరి సమీపంలోనే కుర్క్యాలలో కందపద్యం పుట్టింది. వేములవాడలో పంపభారతం వెలువడింది. ఇట్లా తెలుగు భాష, సాహిత్యాలకు పుట్టినిల్లయిన కరీంనగర్‌లో మళ్ళీ ఇవాళ తెలంగాణ తెలుగు ప్రామాణికతను గురించి చర్చించుకోవడం ఈనాటి చారిత్రక సందర్భం.

తెలంగాణ తెలుగును వాడుకుందాం. కాపాడుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here