సిల్క్ థ్రెడ్ జువెల్లరీ

0
3

[డా. కందేపి రాణీప్రసాద్ గారి ‘సిల్క్ థ్రెడ్ జువెల్లరీ’ అనే రచనని అందిస్తున్నాము.]

ఈ రోజుల్లో ప్రతిదీ మాచింగ్ తోనే చేస్తున్నారు. బట్టలైనా, రంగులైనా, పర్నిచర్ అయినా ఏదయినా మాచింగ్ లోనే ఉండాలంటున్నారు. ఇంతకు పూర్వం చీరకు మాచింగ్ జాకెట్టు వేసుకుంటే సరిపోయేది. ఇప్పుడలా కాదు. చీర జాకెట్‌తో పాటు బొట్టు, లిప్‌స్టిక్, హెయిర్ బ్యాండ్స్ గాజులు, నెక్లెస్‌లు, చెవి రింగులు అన్నీ మాచింగ్ వేస్తున్నారు. ఆఖరుకి చెప్పులు కూడా మాచింగ్ వేస్తూ ఇల్లు చెప్పుల షాపు చేస్తున్నారు. ఇంకా తల్లీ కూతుర్లు ఒకే రకమైన డ్రెస్సులు వేయడం కూడా వచ్చింది. అవి కూడా మారిపోయి ఫ్యామిలీ మొత్తం ఒకే రంగులో డ్రెస్సులు వేస్తున్నారు. పార్టీలో ఏ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు అని అడక్కుండా తెలిసేలా బాగానే ఉందనుకోండి. పెళ్ళిళ్ళ వంటి ఫంక్షన్లలో అబ్బాయి తరపు వాళ్ళు, ఒక రంగును, అమ్మాయి తరపు వాళ్ళు ఒక రంగును సెలెక్ట్ చేసుకుని ఆయా రంగుల్లో మెరిసిపోతే భిన్నత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. మాచింగ్ చేసే వింతలు చాలా బాగుంటున్నాయి, మీరూ చూడండి.

ఒక చీర కొనుక్కుంటే దానికి మాచింగ్ పెట్టికోట్ దగ్గర నుంచి బ్లౌజు, గాజులు, నెక్లెస్‌లు, చెవి రింగులు కనీసం వాడుతున్నారు. కాబట్టి వాటిని కొనడం కంటే కొన్నింటిని మనమే ఇంట్లో తయారుచేసుకుంటే బావుటుంది. డబ్బును ఆదా చేయవచ్చు. నచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చు. మొదటగా గాజుల్ని తయారుచేద్దాం.

నేను నిన్న గాజులు కొనుక్కోవడానికి వెళితే డజను మూడు వందల అరవై తీసుకున్నాడు. ఇది చూసిన మా డ్రైవరు ఏమన్నాడో తెలుసా? “ఈ ఏరియాలో పాపులకు అద్దెలు ఎక్కువ కాబట్టి ముప్పై రూపాయల గాజులు మూడు వందలకు అమ్మాడు. అదే ఇనార్బిట్ మాల్ కెళితే మూడు వేలకు అమ్ముతాడు” అని అన్నాడు. అదీ నిజమేననిపించింది.

రంగు రంగుల సిల్క్ దారాలు దారాలు కొనుక్కొని ఇంటికి వచ్చాను. ఇంట్లో ఉన్న పాత మెటల్ గాజుల్ని ముందేసుకున్నాను. చీరకు సరిపోయే రంగు గల దారాన్ని తీసుకుని ఇరవై పోగులు పోసుకుని సన్నని మెటల్ గాజుకు చుట్టుకుంటూ వచ్చాను. చివర్లు ఫెవికాల్‌తో అతిరించాలి. దీనిపైన అక్కడక్కడా చిన్న పూసా వచ్చేలా అతికించుకోవచ్చు. లేదంటే స్టోన్ చైన్‌ను తీసుకుని గాజుకు అతికిస్తే రాళ్ళ గాజు తయారవుతుంది. లావుపాటి గాజులకు రాళ్ళ చైను బాగుంటుంది. సాదా గాజులకు అక్కడొక పూస, అక్కడొక పూస వేస్తే చాలు, బాగుంటాయి.

అద్దాలు, రాళ్ళు బిగించి బాగా వెడల్పుగా ఉండే మార్వాడీ గాజుల సెట్‌ను కూడా ఇంటిలో చేసుకోవచ్చు. దీనికి దాదాపు వెయ్యి పదిహేను వందలు తీసుకుంటున్నారు. ఇంట్లో చాలా చీప్‌గా అయిపోయింది. బజార్లో బట్ట లేసులు దొరుకుతున్నాయి. ఈ లేసుకు మధ్యలో బంగారు రంగు పూల డిజైను ఉంటుంది. వెడల్పాటి ప్లాస్టిక్ గాజును తీసుకుని దాని మీద ఈ లేసును పెట్టి అతికించాలి. పూర్తిగా ఫెవికాల్ ఆరిన తర్వాత అదే రంగు దారంతో గాజు లోపలి భాగంలో సూదితో కుట్లు వేసుకోవాలి. ఇప్పుడు గట్టిగా అమిరిపోతుంది. ఇది చక్కగా వేసుకునేందుకు ఉపయొగపడుతుంది.

ఇంట్లో వర్క్ బ్లౌజుల్లో మిగిలిన ముక్కలతో కూడా గాజులు తయారుచేయవచ్చు. నెట్టెడ్ క్లాత్ ముక్కతో కూడా గాజుల్ని డిజైన్ చేయవచ్చు. పట్టు చీరలు ఖరిదైనవి కొన్నప్పుడు వాటి జాకెట్ల లోని మిగిలిన ముక్కల్ని దాచుకోవాలి. లేదంటే చీరకు చివరగా కుచ్చుల కోసం దారప్పోగులు వదిలేస్తారు. దాన్ని కొద్దిగా బట్టతో పాటు కత్తిరించుకుంటే అదే రంగు గాజులు తయారు చేసుకోవచ్చు. లేసులు, బట్ట ముక్కలు, పాటిన్ రిబ్బన్లు వంటి అనేక మెటీరియల్ తో గాజుల్ని అలంకరించుకొని మాచింగ్ వేసుకోవచ్చు.

చిన్న చిన్న బీడ్స్ తెచ్చుకొని నెక్లెస్‌లు, చోకర్‌లు, చీరకు మాచింగ్‌గా పెట్టుకోవచ్చు. చాల మంది మహిళలు ఇంటి వద్ద వాటిని తయారు చేస్తూ, ఉపాధిని పోoదుతున్నారు. సిల్క్ థ్రెడ్, సిల్క్ రిబ్బన్లతో తయారయే నగల్ని ప్రజలు పిచ్చిగా కొనుక్కంటున్నారు. పేపర్ జ్యూవెల్లరీనే కొనుక్కుంటున్న జనం దారాల జువెల్లరీని ఎందుకు కొనుక్కోరు. షాపుల్లో గొలుసుల చివర అతకాల్సిన కుండీలు, హుక్‌లు, రింగులు వంటివన్ని అమ్ముతున్నారు. అవన్ని తెచ్చుకొని అందంగా తయారు చేసుకోవటమే. పూసలు, ముత్యాలు, బంగారు బీడ్స్, క్రిస్టల్స్ ఎన్ని రకాలు వచ్చినా మహిళల మెడ వంపుల్లో చేరి వయ్యారాలు పోతుంటాయి. పూర్వం నల్ల పూసల్లోకి బంగారు గుండ్లు అక్కడొకటి అక్కడొకటి గుచ్చుకుని మురిసిపోయేవాళ్ళు. ఇప్పుడు కో అంటే కోటి డిజైన్లు.

ఇప్పుడు నేనోక కొత్తరకం చోకర్‌ను చూపిస్తాను. ముప్పై, నలభై పోగుల్లో దారాలను తీసుకొని జడ అల్లినట్లుగా అల్లుతూ రావాలి. మూడు పాయలతో కాదు, నాలుగు పాయల జడను అల్లాలి. ఇలా అల్లిన దండ పక్కన పెట్టి మరొక రంగులో మరల అల్లాలి. ఈ రెండు దండలను పక్కన పెట్టి అతికించాలి. ఇప్పుడు బంగారు గుండ్ల చైనును తీసుకొని దీనికి కిందివైపుకు అతికించాలి. రెండు రంగుల దారాలు బంగారు పూసలలో చోకర్ తయారైంది. మూడు వేర్వేరు రంగు దారాలతో మూడు పాయల జడలు అల్లి కూడా మెడలో పెట్టుకోవచ్చు.

ఇప్పుడు చెవి పోగులను తయారుచేద్దాం. వేలాడేలా, రింగుల్లా, బుట్టల్లా రకరకాలు చేసుకోవచ్చు. వీటికి కావాల్సిన బుట్టలు తగిలించుకునే రింగులు, తీగలు కావాల్సిన వన్ని షాపుల్లో దొరుకుతాయి. వాటిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మనమే స్వర్ణకారులమై రకరకాల డిజైన్లు సృష్టించవచ్చు. తీగలను వంపడానికి చిన్న పట్టకారు షోర్ సెప్స్ లాంటివి, తీగల్ని కత్తికించడానికి కొనుక్కొవాలి. బంగారు తీగతో ముత్యాల దండల్ని చుట్టించుకుని వేసుకునే వాళ్ళం. అలా తీగల్లో కాపర్, గోల్డ్, సిల్వర్ కలర్లు దొరుకుతున్నాయి. నచ్చిన తీగలు కొనుక్కొని కాపర్ జువెల్లరీ, సిల్వర్ జువెల్లరీ గోల్డ్ జువెల్లరీ తయారు చేయివచ్చు. రింగులు చేయడం చాలా సులువు ఐదు నిమిషాల్లో అయిపోతుంది.

బుట్టలకు సిల్క్ థ్రెడ్‌లు అతికించి వాటికి వేలాడే ముత్యాలు, పూసలు పెట్టుకుంటే అందంగా ఉంటుంది. లేదంటే సిల్క్ దారాలను పొడుగ్గా కుచ్చుల్లా కట్టి వేలాడిన పైన చెవిలో దూర్చే పోగుల్లాంటివి తగిలించేసుకోవచ్చు.

వేలాడే బుట్టలకు ముత్యాలను బాగా సన్నని తీగతో చుట్టుకోవాలి. మూడు మూడు పూసలు కలిపి ఒక చోట చుడితే అందంగా వస్తుంది. నీరెండకు మెరుస్తూ అమ్మయిల చెవి పోగుల్లోని రాళ్ళు తుళుక్కుమంటాయి. బంగారం ఖరీదు ఎక్కువ అవడంలో ఎన్నో రకాల జూవెల్లరీ అందుబాటులోకి వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here