[డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘సమాజం ఎటు పోతున్నది’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]మ[/dropcap]నిషి మృగంగా మారుతున్నాడు
ఆటవిక సమాజం ఆవిర్భవిస్తున్నది
అందులోనే ఈనాటి జనజీవనం
ఒంటి మీద తెల్ల కోటుతో
పెదవులపై చెరగని చిరునవ్వుతో
ఓదార్పు నిచ్చే మాటలతో
మానవత నిండిన మనసుతో
తన పర భేదాలు చూపక
కుల మతాల పొరపొచ్చాలు లేక
అందరికీ సేవలందించే శాంతి దూతని
క్రూరమృగాలు కూడా విస్తుపోయే విధంగా
మానవమృగాలు అమానుషంగా బలిగొన్నాయి
ఎందరికో ప్రాణం పోసిన అమాయిక
విగతజీవిగా మారింది
శాంతికి రూపమైన తెల్లకోటు
ఎర్రటినెత్తురు ప్రవాహమైంది
గాయాలతో, ఛిద్రమైన శరీర భాగాలతో
చూపురులకే భీతి గొలిపే విధంగా
ఒంటరి పోరాటం చేసి ఓడిపోయి
అలసి అన్యాయానికి బలైపోయింది
అడుగడుగునా కీచక లోకం పెరిగింది
కాపాడాల్సిన వారే కాలయములైనారు
అధికారగణం అండదండలతో
చట్టం తమనేమి చేయలేదన్న ధైర్యంతో
కాలర్ ఎత్తుకు తిరుగుతున్నారు
ప్రాణాలను కాపాడే దేవత
బంగారు భవిష్యత్తును కాలరాశారు
కొవ్వొత్తులు వెలిగించటం,
ఊరేగింపులు ధర్నాలు చేయడం,
చర్చలతో టీ.వీ. రేటింగ్‌లు
పెంచుకోవడం కాదు చేయాల్సింది
అన్నీ మొన్న, నిన్నలలో కలిసిపోతున్నాయి
రాబోయే రేపటికి ధైర్యం కలగాలంటే
దోషికి సరైనశిక్ష పడే విధంగా
చట్టం రావాలి వ్యవస్థ మారాలి
దానికోసం పాటుపడండందరు
అందుకోసం నడుం కట్టాలందరు.