పొద్దుటూరులో పాణ్యం దత్తశర్మ ధార్మిక ప్రవచనాలు – నివేదిక

0
3

[ప్రొద్దుటూరులో పాణ్యం దత్తశర్మ చేసిన ధార్మిక ప్రవచనాలపై నివేదికని అందిస్తున్నారు శ్రీ గోట్ల యోగానంద స్వామి.]

[dropcap]ఆం[/dropcap]ధ్రప్రదేశ్ ప్రభుత్వం, దేవదాయ ధర్మదాయ శాఖవారి ఆహ్వానం మేరకు, ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్ట్, పాణ్యం దత్తశర్మ, కడప జిల్లాలోని పొద్దుటూరు పట్టణంలో 10 రోజుల పాటు ఆధ్యాత్మిక, ధార్మిక ప్రసంగాలు చేశారు. ఇవి ఆగస్టు 13 నుండి 22 వరకు జరిగాయి.

ఆగస్టు 13 నుండి 18 వరకు అగస్త్యేశ్వరస్వామి వారి దేవస్థానంలో తొలి ఆరు రోజులు జరిగాయి. దానిని స్థానికులు శివాలయం అంటారు. అగస్త్యమహాముని ప్రతిష్ఠించిన శివలింగం అక్కడి ప్రత్యేకత. 3 అడుగుల ఎత్తుతో లేత బూడిద రంగులో ఉంటాడు స్వామి. రాజరాజేశ్వరీ దేవి అమ్మవారు. ఉపాలయాలలో గణేశుడు, దక్షిణామూర్తి, ఆదిశంకరులు కొలువై ఉంటారు.

హైదరాబాదు నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో కడప చేరుకుని అక్కడ నుంచి పొద్దుటూరు చేరుకొన్న ప్రవచనకర్త పాణ్యం దత్తశర్మకు ఎండోమెంట్స్ శాఖ ఉద్యోగులు శ్రీ శివ ప్రసాద్, శ్రీ విజయ్ స్వాగతం పలికి, కృష్ణ గీతాశ్రమంలోని (నామా ఎరుకలయ్య స్వామి ఆశ్రమం) గెస్ట్ హౌస్‌కు ఆయనను తీసుకుని వెళ్లారు.

13 సాయంత్రం 6 గంటలకు అగస్త్యేశ్వర స్వామి వారి దేవస్థానంలోని సత్కాలక్షేపమంటపంలో, (స్వామి, పార్వతీదేవి వారి కల్యాణమంటపం కూడ) ఆలయ చైర్మన్ శ్రీ క్రొత్తమిద్దె రఘురామి రెడ్డిగారు (రఘన్న) దత్తశర్మకు పూలమాల వేసి, శాలువా కప్పి సత్కరించి, ప్రవచన కార్యక్రమాలను పారంభించారు.

మొదటి ఆదిశంకరాచార్యుల జీవితం, బోధనలు, అయిన రచించిన స్తోత్రములపై ప్రవచనం జరిగింది. రెండవరోజు భాగవతంలోని రుక్మిణీ కల్యాణం, వామన చరిత్ర, గజేంద్రమోక్షం, ప్రహ్లాద చరిత్రం మొదలగు ఘట్టాలపై శర్మ ప్రసంగించారు. మూడు, నాల్గవ రోజులు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి బోధనలను తత్త్యాలను వివరించారు. ఐదవ రోజు కూడా భక్తుల కోరికపై భాగవత ప్రవచనం సాగింది. ఆరవరోజు పొద్దుటూరు పట్టణ వైశిష్ట్యాన్ని, అక్కడ సుప్రసిద్ధులై వెలిగిన వివిధ రంగాల వ్యక్తులు, సరస్వతీపుత్ర శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు. గణిత బ్రహ్మ శ్రీ లక్కోజు సంజీవరాయశర్మ, శతావధాని, అవధానిపితామహ శ్రీ సి.వి.సుబ్బన్న, వారి గురువు గారు ‘శివభారత’ కావ్యకర్త శ్రీ గడియారం వెంకటశేష శాస్త్రి గారు, దుర్భాక రాజశేఖర శతావధాని, అవధాని, బహుగ్రంథకర్త, శ్రీ డా ప్రభాకర రెడ్ది గారు, వేద విద్యా పోషకులు తిప్పాభట వెంకట శేషయ్యగారు, కవిపండిత విమర్శకాగ్రేసర శ్రీ ఎ.కె.ముని గారు, వారి కుమారుడు పద్మశ్రీ ఎ.ఎస్ రామన్ (అవధానం సీతారామశాస్త్రి) (వీరు ‘ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’ పత్రికకు తొలి సంపాదకులు) మొదలగు వారిని గురించి ప్రసంగించారు.

 

ప్రఖ్యాత రంగస్థల నటులు శ్రీ స్థానం నరసింహారావుగారు ఈ నగరం ప్రక్కనే ప్రవహించే పినాకినీ (పెన్న) నది ఒడ్డునే తమ ‘మీరజాలగలడా నా యానతి’ అన్న పాటను రాశారని, పుట్టపర్తివారు తమ శివతాండవ కావ్యాన్ని ఈ దేవాలయం లోనే, అగస్తేశ్వరునికి ప్రదక్షిణాలు చేస్తూ రచించారని పాణ్యం దత్తశర్మ చెప్పారు. 16న కల్యాణమండపంలో జరిగిన సాముహిక వరలక్ష్మీ వ్రతాలకు హాజరైన దత్తశర్మ, ఆ రోజు ప్రవచనంలో వరలక్ష్మీవ్రత మహాత్మ్యాని భక్తులకు వివరించి, ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన ‘మహలక్ష్మి, కరుణారస లహరి’ అన్న కీర్తనను ‘మాధవమమనోహరి’ రాగంలో, ‘వరముల నొసగే దీవి వరలక్ష్మీ జయతి’ అన్న తన స్వీయరచనను సావేరి రాగంలో పాడి శ్రోతలనలరించారు. 6 వ రోజు, ‘రెడ్డి పరివార్’ పత్రిక సంపాదకులు, గండి క్షేత్ర మాజీ ధర్మకర్త, శ్రీ అంజన్ రెడ్డిగారు, ఉపాలయం ఛైర్మన్ శ్రీ క్రొత్తమిద్దె రఘురామిరెడ్డి గారు, ఎండోమెంట్స్ శాఖ ఉద్యోగి శ్రీ శివప్రసాద్ గారలు, ప్రవచనకర్తను ఘనంగా సన్మానించారు.

***

ఆగస్టు 19 నుండి 22 వరకు శ్రీ కృష్ణ గీతాశ్రమంలో ప్రవచనాలు సాగాయి. శ్రీమద్రామాయణము – వ్యక్తిత్వ మార్గ దర్శనము, శ్రీ దత్తాత్రేయ మహత్మ్యము, భగవద్గీతలపై దత్తశర్మ ప్రసంగాలు చేశారు. ఆయనకు కీబోర్డుపై శ్రీ కృష్ణమూర్తి, శ్రీనివాస రాజు గారలు, తబలా పై భాస్కర్, మధు గార్లు వాద్య సహకారాన్ని అందించారు. ప్రవచనం మధ్యలో సందర్భానుసారంగా కీర్తనలు, పద్యాలు, శ్లోకాలు పాడి, వాద్యసహాకారంతో ప్రవచనాన్ని రక్తి కట్టించారు పాణ్యంవారు.

స్థానిక అన్నమయ్య కళాసమితి అధ్యక్షులు, హరికథకులు, టి.టి.డి విద్యాంసులు శ్రీ రమణాచారిగారు రెండు చోట్ల ప్రయోక్తగా వ్యవహరించి, దత్తశర్మ గారిని పరిచయం చేసి, ప్రవచనాంశాలను క్లుప్తంగా వివరించారు. వారి సంస్థ తరపున శర్మగారికి పంచముఖ రుద్రాక్షమాల ( కేదారనాథ్ నుంచి తెప్పించినది) బహుకరించి సత్కరించారు. గీతాశ్రమంలోని ప్రవచన కార్యక్రమాలను ఎండోమెంట్స్ ఉద్యోగి శ్రీ విజయ్ పర్యవేక్షించారు.

ఈ మొత్తం కార్యక్రమానికి సూత్రధారి, కడప జిల్లా అసిస్టెంట్ కమిషనర్ (ఎండోమెంట్స్), శివాలయం, గీతాశ్రమం ఇ.ఓ. (ఇన్‍ఛార్జ్) శ్రీ శంకర బాలాజీ గారు. ఆయన దత్తశర్మగారి శిష్యులు.

అలా ప్రొద్దుటూరులో ఆధ్యాత్మిక ధార్మిక శోభ, సంగీతంతో సుసంపన్నమైంది.

– గోట్ల యోగానంద స్వామి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here