మహాభారత కథలు-72: పాండవ వనగమనము

0
4

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

అరణ్యపర్వము(మొదటిభాగము) – మొదటి ఆశ్వాసము

పాండవ వనగమనము

[dropcap]మ[/dropcap]హాభారత కథని సూతమహర్షి శౌనకుడు మొదలైన మహర్షులకి చెప్పాడు. జూదంలో ఓడిపోయిన పాండవులు అరణ్యవాసం కోసం ఉత్తరదిక్కుగా బయలుదేరారు. వాళ్ల వెంట పధ్నాలుగు వేల రథాలతో ప్రతివింధ్యుడు మొదలైన ఉపపాండవుల్ని తీసుకుని సుభద్ర, అభిమన్యుడు, ఇంద్రసేనుడు మొదలైనవాళ్లు వెళ్లారు. పాండవులు వెడుతున్నప్పుడు చూస్తున్న ఊరి జనం బాధపడ్డారు.

“రాజకుమారులు పాండవులు ప్రజారంజకంగా తమ రాజ్యభాగాన్ని ఏలుకుంటున్నారు. దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు వాళ్లని జూదానికి పిలిచి అన్యాయంగా ఓడించి అరణ్యాలకి పంపించడం మంచి పని కాదు. పాండలవుకి కౌరవులు అపకారం చేస్తుంటే కౌరవ వంశానికి పెద్ద అయిన భీష్ముడు, గురుదేవుడైన ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, విదురుడు వంటి పెద్దలు ఎందుకు అడ్డుకోలేదో? కర్ణుడు, సైంధవుడు, శకుని మొదలైన తన స్నేహితులతో కలిసి మంచి నడవడిక లేని దుర్యోధనుడు రాజ్యాన్ని ఏలుతుంటే మేమెల్లా జీవించగలం? ఈ భూమ్మీద ఇంక ధర్మం ఎక్కడ ఉంటుంది?” అనుకుని పాండవులు వెళ్లే చోటికి వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నారు.

పాండవులతో “వీరులారా! మీరు మమ్మల్ని విడిచి పెట్టి వెళ్లడం న్యాయం కాదు. మాకు మీరు తప్ప వేరే దిక్కు లేదు. దుర్జనులతో సహవాసం చెయ్యడం వల్ల మంచివాళ్లకి కూడా పాపం కలుగుతుందనడానికి సందేహం లేదు. నువ్వులు, నీళ్లు, గుడ్డలు, పువ్వులు పరిమళ సంపర్కం వల్ల సుగంధాన్ని పొందినట్టే సజ్జనులతో సహవాసం చెయ్యడం వల్ల జనులకి మంచి గుణాలు అలవాటు అవుతాయి.

మంచివాళ్లతో పొగడబడేంత మంచి గుణాలు మీకు ఉన్నాయి. మీ సహచర్యం వల్ల మేము కూడా ధర్మమార్గంలో నడుస్తూ ధన్యులమవుతాము. చెడ్డవాళ్లతో సాంగత్యం చెయ్యడం వల్ల మంచివాళ్లు కూడా ధర్మాన్ని వదిలి నడుస్తారు. మాకు దుర్యోధనుడి రాజ్యంలో నివసించడానికి ఇష్టం లేదు. మీతో రావడానికి మాకు అనుమతి ఇవ్వండి” అన్నారు.

వాళ్ల మాటలు విని ధర్మరాజు “మీరు మమ్మల్ని సద్గుణవంతులు అని చెప్తున్నారు. అందుకు సంతోషంగా ఉంది. కాని, మీరు మాతో వస్తే అరణ్యంలో నివసించేప్పుడు కలిగే కష్టాల్ని మీరు భరించలేరు. అందువల్ల మీరు మాతో రావడం మాకు ఇష్టం లేదు. మీరు దయచేసి వెనక్కి వెళ్లిపొండి” అని చెప్పి వాళ్లని వెనక్కి పంపించాడు. పురప్రజలందరు బాధ పడుతూనే తిరిగి హస్తినాపురానికి వెళ్లిపోయారు.

పాండవులు అరణ్యంలో ప్రయాణం చేస్తూ గంగానదీ తీరంలో ఉన్న ‘ప్రమాణం’ అనే పేరుగల మర్రి చెట్టు కింద విడిది చేశారు. గంగాస్నానం చేసి ఒక పగలు, ఒక రాత్రి అక్కడ గడిపారు. తెల్లవారుతూ ఉండగా వేదమంత్రాలు చదువుకున్నవాళ్లు, లోకంలో అందరితో పూజింపబడేవాళ్లు, బ్రహ్మదేవుడితో సమానులైన బ్రాహ్మణోత్తములు, బంధువులు, శిష్యులతో కలిసి తమ అగ్నిహోత్రాలు వెంట తీసుకుని పాండవుల దగ్గరికి వచ్చారు.

పాండవులు తమతోపాటు అరణ్యవాసం చెయ్యడానికి సిద్ధపడి వచ్చిన బ్రాహ్మణుల్ని పూజించి వాళ్ల ఆశీర్వాదం తీసుకున్నారు. తరువాత ధర్మరాజు వాళ్లతో “శత్రువులు చేసిన మోసం వల్ల సంపదలన్నీ పోగొట్టుకున్నాము. ఇప్పుడు అరణ్యంలో దొరికే పండ్లు, కూరలు, దుంపలు తిని జీవిస్తాము. మీరు మాతో వస్తే అనేక కష్టాలు పడాలి. మీరు ఇళ్లకి వెళ్లిపొండి. భయంకరమైన క్రూర జంతువులతో నిండి ఉండే అరణ్యంలో నివసించడం మీకు మంచిది కాదు” అన్నాడు.

అతడి మాటలు విని బ్రాహ్మణులు “అయ్యా! మాకు మీరు తప్ప ఇంకెవరూ దిక్కులేరు. మీరు మమ్మల్ని వదలడం ధర్మం కాదు. మీ ప్రాపకం కోరినవాళ్లం, భక్తి కలిగిన వాళ్లని ఎవరూ ఎప్పుడూ విడిచిపెట్టరు కదా? మీపట్ల భక్తి కలిగిన బ్రాహ్మణోత్తముల్ని మీ వంటి ధర్మపరులు విడిచిపెట్టడం భావ్యం కాదు. మమ్మల్ని పోషించడం గురించి మీరు బాధపడద్దు. అడవిలో దొరికే పండ్లు, కాయలు, దుంపలు మాకు మేమే తెచ్చుకుని తింటాము. జపతపాలు, యజ్ఞయాగాలు చేసి మీకు మంచి జరగాలని కోరుకుంటాము. మీకు అన్యాయం చేసిన దుర్యోధనుడు పాలించే రాజ్యంలో మేము ఉండలేము” అన్నారు.

ధర్మరాజు వాళ్లు చెప్పింది విని తమతో ఉండడానికి అంగీకరించాడు. కాని, రుచిగా, శుచిగా ఉండే వంటకాలతో తృప్తిగా భోజనం చేసే బ్రాహ్మణులు కూరగాయలు, పండ్లు మాత్రమే తిని జీవించడం చూడవలసి వచ్చినందుకు బాధపడ్డాడు.

ధర్మరాజుకి ధర్మాలు చెప్పిన శౌనకుడు

తమ పరిస్థితికి బాధపడి ధర్మరాజు దుఃఖంతో మూర్ఛపోయాడు. శౌనకుడు అనే బ్రాహ్మణుడు ధర్మరాజుని సేదతీర్చి జనకగీతాల్లో ఉన్న పరమార్థం గురించి వివరించి చెప్పాడు. “ధర్మరాజా! వివేకం కలవాడు దుఃఖము, భయము వంటి కష్టాలు కలిగినప్పుడు చలించకూడదు. సామాన్య మానవులే శారీరిక, మానసిక బాధలకు క్రుంగి కృశిస్తారు. బుద్ధిమంతులు ఆ రెండింటిని ప్రశాంతమైన బుద్ధితో నిగ్రహించుకుంటారు.

రోగం; అలసట; ఇష్టం ఉన్నవాటిని ముట్టుకోవడం; ఇష్టం లేని వాటిని వదులుకోవడం అనే నాలుగు విషయాల వల్ల శరీరదుఃఖాలు కలుగుతాయి. అవి అప్పటికప్పుడు చేసే విరుగుడుల వల్ల తాత్కాలికంగా ఉపశమిస్తాయి. నీటి వల్ల నిప్పు అణిగినట్టుగా.. స్నేహం వలన కలిగిన మానసిక తాపాలు, జ్ఞానం వల్ల ఉపశమనం పొందుతాయి.

స్నేహమనే సముద్రంలో మునిగిన మనిషి స్థైర్యం కోల్పోయి దుఃఖాన్ని పొందుతాడు. దుఃఖం పొందినవాడు ఆ బాధల వేడిలో ఉడికిపోయి స్పృహ తప్పుతాడు. అనురాగం మొదలైన బంధాలన్నీ స్నేహం నుంచే పుడతాయి. కనుక, చుట్టాలవల్ల, స్నేహితులవల్ల, ధనం సమకూర్చడం వల్ల ఏర్పడే స్నేహాన్ని విడిచిపెట్టాలి. తామరాకు నీటిని ఎలా అంటదో.. అలాగే జ్ఞాని ఎప్పుడూ స్నేహాన్ని కోరడు. స్నేహం వల్ల, అభిమానము; అభిమానం వల్ల కోరిక; కోరిక వల్ల కోపము; కోపం వల్ల ఆశ ఏర్పడతాయి.

ఆశ అన్ని దోషాలకి కారణమైందని, పాపపు పనులు చెయ్యడానికి కారణమవుతుందని, ఎప్పుడూ దుఃఖాన్నే కలిగిస్తుందని తెలుసుకుని వివేకవంతులు ఆశల్ని వదిలి పెడతారు. చెట్టు తొర్రలో ఉన్న నిప్పు వల్ల నాశనమైన చెట్టులా.. ఆశ, ధనం మీద కోరిక ఉన్నవాడు నాశనమవుతాడు. ధనాశ కలిగినవాడు, మరణానికి భయపడే ప్రాణిలా రాజులు, దొంగలు, చుట్టాలు, నీరు, నిప్పు అన్నింటివల్ల ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు.

నీటిలో ఉండే చేపలు, ఆకాశంలో ఉండే పక్షులు, మాంసాన్ని భక్షించినట్లు అందరూ ధనవంతుడి చుట్టూ చేరి, ప్రతి రోజూ అనేక విధాలుగా పీడిస్తారు. అన్ని కష్టాలకి ధనమే కారణం. ధనమనే మాయవల్ల మైకం ఏర్పడుతుంది. ధనం సంపాదించాలన్న కోరిక పెరిగిన మనిషి తన జన్మని వ్యర్థం చేసుకుంటున్నాడు.

ధనం వల్ల గర్వం, పిసినిగొట్టుతనం, అహంభావం, భయం, గర్వం కలుగుతాయి. అందువల్ల ధనం సంపాదించాలన్న కోరికని పెంచుకోవద్దు. అందం, యౌవనం, సంపద, ఇష్టమైన ఇంటిలో నివసించడం అనేవి తాత్కాలికమైనవి. కనుక, వివేకవంతులు అటువంటి వాటి కోసం ఆశ పడరు” అని చెప్పాడు.

శౌనకుడు చెప్పిన మాటలు విని ధర్మరాజు “నేను నా స్వార్థం కోసం, భోగాల కోసం ధనం కావాలని కోరుకోడం లేదు. ఈ మహారణ్యంలో నేను బ్రాహ్మణోత్తముల్ని ఎలా పోషించగలను అన్నదే నా మనోవ్యథ. నా బోటి గృహస్థుడికి తప్పని సరిగా చెయ్యవలసింది అతిథిపూజ. నా దగ్గరికి అతిథులుగా వచ్చేవాళ్లు బ్రాహ్మణోత్తములు, సాధుపురుషులు.

అటువంటి వాళ్లని ఊరికే పంపించకూడదు కదా? గృహస్థులైనవాళ్లు తమ సంపాదనలో కొంతభాగం అతిథుల కోసం ఖర్చు పెట్టాలి. మంచివాళ్లని రక్షించాలి. ఈ విధంగా అన్ని ఆశ్రమాల్లోకి గృహస్థాశ్రమం మంచిదని అంటారు. ఇక్కడ సాధువుల్ని రక్షించడం, అతిథి సేవ కలిసి వచ్చాయి. కనుక, గృహస్థాశ్రమ ధర్మాలు నెరవేర్చాలి కదా!

ఆర్తుడికి శయ్యాసుఖము, భయపడినవాడికి శరణము, దప్పిగొన్నవాడికి నీరు, అకలిగొన్న వాడికి తిండి, డస్సినవాడికి ఆసనము సమకూర్చడం గృహస్థుడు నిర్వహించవలసిన ధర్మాలు. ఇవి పూర్వం నుంచీ వస్తున్న ధర్మాలు, ఆచారం. అతిథుల మీద ఆదరాభిమానాలు చూపించవలసిన బాధ్యత గృహస్థుడిది.

పక్కన విస్తరి లేకుండ భుజించడం, తన కోసం మాత్రమే వంట చేయించడం, కారణం లేకుండా పశువుల్ని హింసించడం ఇవన్నీ పాపాలు. అంతేకాదు, అతిథులు, అగ్నిహోత్రాలు, చుట్టాలు, విద్వాంసులు, గురువులు, మిత్రులు, స్త్రీలు, వీళ్లందరికీ తగిన విధంగా మర్యాద చూపించకపోతే కీడు కలుగుతుంది. అందువల్ల గృహస్థుడు అందరికీ తృప్తి కలిగించక తప్పదు.

యజ్ఞశేషానికి ‘అమృతమని’ పేరు. అతిథి భుక్త శేషానికి ‘విఘసమని’ పేరు. గృహస్థుడు ‘అమృతాశి’, ‘విఘసాశి’ అవాలి. ఉదయాస్తమయ సమయాల్లో పక్షులకి, కుక్కలకి బలి ఆహారం వెయ్యాలి. దాన్ని వైశ్వదేవ యజ్ఞమని అంటారు. ఉత్తమ గృహస్థుడు నిర్వహించ వలసిన ఇటువంటి కర్తవ్యాలు ఉన్నాయి కదా!” అన్నాడు.

ధర్మరాజు చెప్పిన మాటలకి శౌనక మహర్షి “ఆకర్షించే ఇంద్రియ సుఖాల మీద కోరిక వల్ల ఎంత జ్ఞానం కలవాళ్లైనా తమ ఇంద్రియాలు తమకి వశం కావు కనుక, వికారాన్ని పొందుతూనే ఉంటారు. అగ్నిలో పడే మిడతల్లా చిత్తవృత్తి నుంచి పుట్టిన కోరికల్లో చిక్కుకున్న మనస్సుతో ప్రేరేపించబడిన ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు కలిగి ఉండే శరీరం వల్ల, ఇంద్రియాలకి సంబంధించిన కోరికలతో బాధించబడి; వెలుతురు మీద ఉన్న కోరిక వల్ల దుఃఖమనే అగ్నిలో పడి తనను తాను తెలుసుకోలేక అజ్ఞానంతో ఏవో పనులు చెయ్యాలనే కోరికతో సంసారచక్రంలో తిరుగుతూ ఉంటారు.

మహాత్ములు బ్రహ్మ మొదలు, గడ్డి వరకు ఉండే ప్రాణుల స్వభావాల పట్ల రాగద్వేషాలు విడిచి పెట్టి, ప్రేమ, అసూయల్ని వదిలిపెట్టి, వేదాల్లో చెప్పబడినట్టుగా సరైన చిత్తవృత్తిని ఏర్పరుచుకుని; ఇంద్రియాల్ని వశం చేసుకుని; యథావిధిగా ఉండవలసిన దీక్షని స్వీకరించి; గురుసేవ చేసి; ఆహారం తినడంలో నియమంగా ఉండి; చదువుల్ని వల్లె వేసి; ఫలితం పట్ల ఆసక్తి లేకుండా కర్తవ్యాల్నినిర్వహించి; మనస్సుని అదుపులో పెట్టుకుని తమ తమ తపస్సు ప్రభావంతో ఈ ఎనిమిది అంశాల్నిఆచరణలో పెట్టి సంసారాన్ని గెలుస్తారు.

ఓ ధర్మరాజా! నువ్వు కూడా గురుసేవ చెయ్యడం; గురువు చెప్పినదాన్ని వినడం; విన్నదాన్ని అర్థం చేసుకోవడం; అర్థం చేసుకున్న విషయాన్ని స్థిరంగా మనస్సులో నిలుపుకోవడం; అవసరమైనదాన్ని ఊహించడం; అనవసరమైనదాన్ని ఊహ నుంచి తొలగించడం; వస్తు జ్ఞానం, వేదాంతం వంటి శాస్త్రాల గురించిన జ్ఞానం అన్నీ తెలిసినవాడివి. కనుక, నువ్వు చేసే పనులన్నీఅభివృద్ధిని పొందుతాయి.

వసువులు, రుద్రులు, ఆదిత్యులు మొదలైనవాళ్లు తపస్సుచేసి ఐశ్వర్యాన్ని సంపాదించగలిగారు. నువ్వు కూడా తపస్సు చేసి కోరికల్ని నెరవేర్చుకో. దీక్షతో తపస్సు చేసినవాళ్లు తమ కోరికల్ని నెరవేర్చుకోగలరు. నువ్వు కూడా తపస్సు చేసి బ్రాహ్మణుల్ని అనుసరిస్తూ నీ కోరికల్ని తీర్చుకో” అని చెప్పాడు.

ఆయన మాటలు విని తమ్ముళ్లతో కలిసి కూర్చున్న ధర్మరాజు “నా మీద ఉండే ప్రేమతో నా కష్టాల్ని పంచుకోడానికి నాతో పాటు వనవాసం చెయ్యడానికి వచ్చిన ఈ బ్రాహ్మణోత్తముల్ని నేను విడిచిపెట్టలేను. వీళ్ల కోసం నేను ఏం చెయ్యాలి?” అని అడిగాడు.

అతడి మాటలకి పురోహితుడు ధౌమ్యుడు “పూర్వకాలంలో జీవకోటి ఉద్భవించి ఆకలితో మలమల మాడుతుంటే చూసి ఆ భయాన్ని పోగొట్టడానికి సూర్యుడు ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి భూసారాన్ని గ్రహించి, మేఘ రూపంలో వరి, గోధుమ మొదలైన పైరుల్ని బీజరూపంలో పొంది, రాత్రివేళ చంద్రుడి కిరణాల నుంచి స్రవించే అమృతంతో ఆ ఓషధుల్ని తడుపుతూ వృద్ధిచేసి వాటి నుంచి అన్నాన్ని పుట్టించాడు.

ఆ అన్నం ద్వారా ప్రజల ఆకలిని తీర్చి రక్షించాడు. అందువల్ల అన్నం సూర్యమయమని తెలుసుకుని పూర్వకాలంలో భీముడు, వైన్యుడు (పృథువు), కార్తవీర్యుడు, నహుషుడు సూర్యుణ్ని ఆరాధించి ఆహారాన్ని సాధించి ప్రజల్ని కాపాడారు.

కనుక, ధర్మరాజా! సూర్యుడు గొప్ప మహత్యం కలవాడు. అతణ్ని పూజస్తే నీ కోరికలు నెరవేరుతాయి. దేవతలు, పాములు, మునులు, చారణులు సూర్యుడికి నమస్కరించి పూజిస్తూ ఉంటారు. అతడు సమస్త వేదరూపుడు. విష్ణువుతో, శివుడితో, బ్రహ్మదేవుడితో సమానమైనవాడు. తన వెలుగులతో చిమ్మ చీకట్లను పోగొట్టి దిగంతరాలను ప్రకాశింప చేస్తాడు. గొప్ప దయ కలవాడు. మూడు లోకాల్ని రక్షించడమే పనిగా పెట్టుకున్నవాడు” అని చెప్పాడు.

పాండవ పురోహితుడైన ధౌమ్యుడు ధర్మరాజుకి నూట ఎనిమిది ఆదిత్య నామాలు చక్కగా అర్థాలు వివరించి సరైన ఉచ్చారణతో నేర్పించాడు. ఆ మంత్రాలు నారదుడు ఇంద్రుడికి, ఇంద్రుడు వసురాజుకి, వసురాజు ధౌమ్యుడికి ఉపదేశించారు. వాటినే ధౌమ్యుడు ధర్మరాజుకి ఉపదేశించాడు. ఆ మంత్రాల్ని ఉపాసించడం వల్ల అనుకున్నవి నెరవేరుతాయని చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here