[యర్రమిల్లి విజయలక్ష్మి గారి ‘చిలకలంచు జరీకోక’ నవలకి తాను వ్రాసిన ముందుమాటను పుస్తక పరిచయంగా అందిస్తున్నారు శ్రీమతి శీలా సుభద్రాదేవి.]
ఒక చీర కొనాలని షాపుకి వెళ్తే ముందు చీరలో పడుగు, పేకల నేత చీరంతా ఒకే తీరుగానే వుందా లేకపోతే కొన్ని చోట్ల జాడలు జాడలుగా వచ్చిందా అని పరిశీలిస్తాం. తర్వాత నూలు నాణ్యతను గమనిస్తాం. దుకాణదారుడు చెప్పిన నాణ్యతగల నూలుతోనే చీర నేయబడిందా అని చూస్తాం. ఆ తర్వాతే రంగునూ, రంగుల మేళవింపునూ, డిజైన్ నేయటంలోని పనితనాన్నీ, కొంగులోని అందాల్నీ పట్టి పట్టి చూస్తాం. మనం అనుకుంటున్నట్లుగా ఉండి, ధర సంతృప్తి కలిగిన పిమ్మట చీరని కొనుక్కుంటాం.
అట్లాగే ‘చిలకలంచు జరీకోక’ మన ముందు పరచి ఒక్కొక్క పొరనే విప్పి చూపుతూ, నూలులోని రకాలు మొదలుకొని, చీర నేయటంలోని కష్టనష్టాల్నీ, గుంతలో కూర్చున చిరుగుపాతలు ధరించి జనం కోసం తన సర్వశక్తులూ సమకూర్చుకొని నేస్తున్న నేతన్నల పనికౌశలాన్నీ, బడుగు శ్రామికుల జీవితాల్లోని చీకటి కోణాల్నీ, కులవృత్తినే నమ్ముకొని ఆర్థిక విధ్వంసాల నడుమ జీవితాన్ని భారంగా వెళ్ళబుచ్చుతోన్న నేత కార్మికుని వెతలను, నేతపరిశ్రమ తీరుతెన్నులను పండు వలచి చూపిన తీరులో యర్రమిల్లి విజయలక్ష్మి తన ‘చిలకలంచు జరీకోక’లో చక్కని కథనాన్ని మన ముందు పరిచారు.
నవల ఆసాంతం ప్రధానంగా నేత కుటుంబంలోని పలు జీవనకోణాల్ని తెరిచి చూపటంతో పాటూ, నేత పరిశ్రమలో వాడే నూలు రకాలూ, ఏ రకం నూలుతో ఏ రకం వస్త్రాలు నేస్తారో వంటి సూక్ష్మవిషయాల్ని సైతం తెలిపారు. నేత కొరకు వాడే అనేకానేక పనిముట్లు తయారీలో పాలుపంచుకునే ఇతర ఉత్పత్తి కులాల సహకారం, నేతలో రకాలు, చీరాలనుండి పోచంపల్లి వరకూ మారే విభిన్న నేత డిజైన్ల వివరాలూ, ఆ డిజైన్లు నేయటంలోని సులువు, బులువులు – ఇలా నేత పరిశ్రమ యావత్తూ దారం వడికిన దగ్గరనుండి రాట్నానికి చుట్టటం, ‘సరి’ పోయటం, పోగులకు గంజి పట్టించే విధానం, ఆసు పోయటం, మగ్గానికి అమర్చటం, మగ్గంపై చీరగా మారేందుకు గల వివిధ దశలనూ; ఆ క్రమంలో మొత్తం కుటుంబసభ్యులందరూ సామూహికంగా పనిలో పాలుపంచుకోవలసిన పరిస్థితులనూ సవివరంగా, పరిశోధనాత్మకంగా రచయిత్రి సోదాహరణంగా పాఠకుడికి బోధిస్తున్నట్లుగా నడుస్తుందీ నవల.
రచయిత్రి నేత పరిశ్రమ గురించే చెప్తున్నారని పాఠకుడికి అనిపించే సమయానికి చటుక్కున కథలోకి లాక్కొచ్చేస్తారు విజయలక్ష్మి.
నవల సగం వరకూ నేతపరిశ్రమలోని కష్టనష్టాల్నీ, తీరుతెన్నుల్నీ వివరిస్తూ వచ్చిన రచయిత్రి సమయానుకూలంగా ఆర్థిక ప్రాతిపదికను బడుగు జీవుల జీవన విధ్వంసాలను ఎన్నింటినో సంఘటనాత్మకంగా కళ్ళముందు దృశ్యమానం చేశారు.
ఆడపిల్లలను రజస్వలానంతరం ఆగిపోయే చదువులు, మగపిల్లాడిని తమలా కాకుండా ఉద్యోగస్థుడిగా చూడాలనుకునే తల్లులు, తమ కలల్ని సాకారం చేసుకోలేని అసహాయత, ఆడపిల్లల పెళ్ళికి కట్నకానుకలు సమకూర్చుకోలేక తల్లిదండ్రులు పడే తాపత్రయం, తల తాకట్టు పెట్టి పెళ్ళి చేసినా ఆగని వరకట్న వేధింపులు, ఆడపిల్లను కన్నందుకు ఎదుర్కొనే నిరసనలు, వరకట్న వేధింపులు, ఆడపిల్లను కన్నందుకు ఎదుర్కొనే నిరసనలు, వరకట్న హత్య, కన్న తల్లిదండ్రుల వృద్ధాప్యం సమస్యలు, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తల్లిదండ్రుల్ని కూడా అన్నదమ్ములు పంచుకోవాల్సి రావటం – ఇలా సమకాలీన సామాజిక సమస్యలనెన్నింటినో నవలలో విడమరచి చూపటంలో రచయిత్రికి సామాజిక సమస్యల పట్లగల అవగాహన, సామాజిక బాధ్యత వ్యక్తమౌతుంది.
ముందు సాదాసీదాగా మొదలైన కథనం, సంఘటనలూ మందగమనంతో నడచిన కథ చివరికి వచ్చేసరికి వేగం పుంజుకొని నేత కార్మికుడి జీవనయానంలో సుడులు తిరిగిన పాఠకుడి గుండె ద్రవించేలా రాశారు రచయిత్రి.
విక్టోరియా రాణికి అగ్గిపెట్టెలో చీరని బహూకరించే నైపుణ్యంగల చేనేత కళ, ఆ నేత కార్మికులకు రోజు రోజుకూ ప్రోత్సాహం కొరవడి పాలకుల నిర్లక్ష్యం, యాంత్రీకరణల మధ్య, మధ్య దళారుల కపటత్వంతో ఎంత భారంగా మారిందో అర్థమయ్యేలా రాయటంలో రచయిత్రి నేర్పు కనిపిస్తుంది.
వృత్తిపనివారల జీవితాలపై తెలుగు సాహిత్యంలో కవిత్వం ఎక్కువగా వచ్చింది. కథలు కూడా కొన్ని వచ్చాయి. కానీ మొత్తంగా ఒక వృత్తి నేపథ్యంలో సాగిన నవలలు తక్కువగానే వున్నాయి. నేత కార్మిక జీవనంపై ఇంతకుముందు పోరంకి దక్షిణామూర్తి, వనం నరసింహారావు, మంథా భానుమతిగారు రాసిన నవలలు నాకు తెలిసినంతవరకూ గ్రంథరూపంలో వచ్చాయి. ఆ కోవలోనిదే యర్రమిల్లి విజయలక్ష్మిగారి ‘చిలకలంచు జరీకోక’ నవల.
ఉత్పత్తి కులాలలో కవయిత్రులు ఎక్కువమందే వున్నారు. కానీ నవలలు రాసే రచయిత్రులు వేళ్ళమీద లెక్కపెట్టే అంతమంది మాత్రమే ఉండటం వల్ల కావచ్చు, ఆయా అంశాలపై రాసే సాహసం చేసినవారు లేరు. అటువంటిది ఉత్పత్తి కులానికి చెందకపోయినా యర్రమిల్లి విజయలక్ష్మిగారు ఎంతో సన్నిహితంగా ఆ పరిసరాలలో అత్యధిక సంఖ్యాకులైన నేత కుటుంబాలను దగ్గరగా చూడటం, సునిశితంగా వారి జీవనవిధానం పరిశీలించినట్లుగా నవల చదివిన పాఠకుడికీ అర్ధమౌతుంది.
ఒక మంచి అంశాన్ని నవలకు ఎంచుకోవటం ఒక ఎత్తైతే, దాన్ని ప్రతిభావంతంగానూ, అంశాన్ని బలంగానూ చెప్పటానికి తగినరీతిలో సంఘటనల అల్లికనీ, సంభాషణల సమకూర్పునీ బట్టి రచయితా, రచయిత్రుల రచనా సామర్థ్యం తెలుస్తుంది. ఆ రకంగానే యర్రమిల్లి విజయలక్ష్మి కష్టసాధ్యమైన అంశాన్ని స్వీకరించి, ఒక వృత్తిని గూర్చిన అనేకానేక విషయాంశాలు గుదిగుచ్చి పరిశోధనాత్మక నవలగా ఈ ‘చిలకలంచు జరీకోక’ను కలనేతగా నేసి మనకి అందించారు. ఒకనాడు ‘ఆంధ్రప్రదేశ్’ ఉగాది నవలల పోటీలో బహుమతి అందుకోవటంలోనే ఈ నవలకు రాణింపు వచ్చినట్లయింది.
గత యాభై ఏళ్ళకు పైగానే రచనారంగంలో వుంటూ విజయలక్ష్మిగారు అనేక నవలలు, కథలు, వ్యాసాలు రాసి గ్రంథాలుగా వెలువరించారు. నేతవృత్తి గురించి నాకు తెలిసినదాని కంటే మరింత పరిచయం ఈ నవల ద్వారా నాకు అందింది. సామాజిక బాధ్యతతో పరిశోధనాత్మక నవలగా ‘చిలకలంచు జరీకోక’ను అందించారు యర్రమిల్లి విజయలక్ష్మిగారు.
***
చిలకలంచు జరీకోక (నవల)
రచన: యర్రమిల్లి విజయలక్ష్మి,
పుటలు: 152
వెల: ₹ 125/-
ప్రతులకు:
రవీంద్ర పబ్లిషింగ్ హౌస్, తణుకు.
నవోదయ బుక్ హౌస్, కాచిగూడ, హైదరాబాద్.
ఫోన్: 9440664610