చదువరీ నువ్వెక్కడ?

0
3

[శ్రీ శ్రీనివాస్ జోకట్టె గారి ‘గోళద సుత్త ఉల్కెగళు’ అనే కన్నడ కథని ‘చదువరీ నువ్వెక్కడ?’ అనే పేరిట అనువదించి అందిస్తున్నారు చందకచర్ల రమేశ బాబు.]

[dropcap]ఉ[/dropcap]దయం నుండి ఇది మూడోసారి నారాయణరావుగారు ఫోను చెయ్యడం! బహుశా ముంబై ఏర్‌పోర్టులో దిగుండాలి. అవును. రిసీవ్ చేసి మాట్లాడితే “ముంబైలో దిగాము. ఇంకో గంటలో ఇంట్లో ఉంటాము” అన్నారు.

ఉడుపి నుండి బయలుదేరేటప్పుడు, మంగళూర్‌లో ఏర్‌పోర్టు నుండి ఇప్పటికప్పుడే రెండు సార్లు ఫోన్ చేసి మాట్లాడారాయన. ఆయన ముంబై ఫ్లాటులో ఉన్న పుస్తకాలకు ఏదైనా ఏర్పాటు చేయాలి. అందుకోసమే ఆయన ఈసారి ముంబైకి వస్తున్నారు.

“ముంబై ఫ్లాట్ అలానే ఖాళీగా పడుంది. ఇంకోసారి వచ్చినప్పుడు దాన్ని అద్దెకివ్వాలని ఉంది. కానీ అందులోని పుస్తకాలను ఏదో విధంగా వదిలించుకోవాలి. కర్నాటక సంఘానికి ఇద్దామంటే దాని లైబ్రరీ కొన్ని సంవత్సరాలనుండి మూసేశారు. నేనిక ఈ ముంబై ఇంట్లో ఉండను. అద్దెకైనా ఇవ్వాలి లేదా అమ్మనైనా అమ్మాలి. ఇక నా తరువాతి జీవితమంతా మా అమ్మాయితోనే..” అన్నారు నారాయణరావుగారు క్రితం సారి ఉడుపికి బయలుదేరేటప్పుడు.

ఒక సంవత్సరం తరువాత ఈ రోజు తాళం వేసి ఉంచిన చెంబూరులోని తమ ఫ్లాట్‌కు వస్తున్నారాయన.

ఈ నారాయణ రావుగారు ఒక సమయంలొ కర్నాటకలోని ఏ సాహిత్య గోష్ఠికి వెళ్ళినా పుస్తకాల అంగళ్ళకు వెళ్ళి ఇన్ని కథా సంకలనాలు, నవలలు, ప్రవాస కథనాలు, విమర్శలు.. అంటూ అనేక రకాల పుస్తకాలను ముంబైకి తీసుకు రావడం అలవాటు చేసుకున్నారు. అలా తెచ్చిన పుస్తకాలను ఆయన, ఆయన శ్రీమతి చదివి ఆనందించడం జరిగిన తరువాత అవి గుట్టగా పేరుకుపోవడం జరిగింది. ముంబైలో చదివిన ఆయన పిల్లలు కన్నడ భాష ఇంట్లో మాట్లాడినా, చదవను రాయను వాళ్ళకు రాలేదు. ఇప్పుడేమో కొడుకు ఆస్ట్రేలియాలో ఉంటే, కూతురు పెళ్ళి చేసుకుని ఉడుపిలో ఉంది. కొడుకు ఇండియాకు తిరిగి వచ్చే లక్షణాలేమీ కనబడడం లేదు. రావుగారికి ఈ ఇంటిపైన మోహం తగ్గిపోసాగింది. కానీ పుస్తకాలు చదువుకుంటూ శ్రీమతితో కాలం గడపేస్తున్నారు రావుగారు.

కానీ ఒక రోజు ఆయన శ్రీమతి అనారోగ్యం పాలయ్యారు. అన్ని ఆస్పత్రులకు తిరిగారు. అడ్మిట్ చేశారు. కొడుకేమో శ్రీమతితో ఆస్ట్రేలియానుండి రావడం కష్టమవుతుందన్నాడు. కొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఎలాగో కష్టపడి గడిపినాక కొద్దిగా నయమయిందనిపించి ఇంటికి తీసుకువచ్చారు. ఆమెకు వచ్చిన జబ్బేమిటో ఇదమిత్థమని తేలే లోపలే ఒక రోజు ఆమె చనిపోయారు. కూతురు భర్తతో పాటు విమానంలో వచ్చి చేరుకుంది. కొడుకు, కోడలు రావడం రెండు రోజులు ఆలస్యమై రెండు రోజులు శవాన్ని కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టాల్సివచ్చింది.

తరువాత అంత్యసంస్కారాలు, వైకుంఠసమారాధన.. ఇవన్నీ ముగిసాక “మరి తరువాత ఎలాగ?” అనే అంశం చర్చకు వచ్చింది.

ఎక్కువ రోజులు సెలవులు దొరకవని కొడుకు వెళ్ళిపోయాడు. కూతురు మరిన్ని రోజులు తోడుండి ఉడుపికి వెళ్ళిపోయింది. వెళ్ళేముందు “నాన్నా! మీరు ఎక్కువ రోజులు ఇక్కడ ఒంటరిగా ఉండకండి. నాతో పాటు ఉందురుగానీ!” అన్నది. “సర్లే చూద్దాం!” అని తలాడించారు రావుగారు.

ఆ రోజునుండి ఆ ఫ్లాటులో ఒంటరయ్యారాయన. కానీ పుసకాలున్నాయి కదా! వాటిని చదువుతూ కొన్ని రోజులైతే ఎలాగో గడిపారు. కానీ పత్నీ వియోగం ఆయనను చింతాక్రాంతుణ్ణి చేసింది. ఇంట్లో ఒంటరితనం పీడించసాగింది.

ఆరు నెలల తరువాత ఉడుపిలోని కూతురు “నాన్నా! ఇక మీరు అక్కడ ఒంటరిగా ఉండకండి. నేను వచ్చి మిమ్మల్ని తీసుకొస్తాను. ముంబై ఫ్లాటును అద్దెకివ్వడమో లేదా అమ్మేయడమో చేద్దాం. అవన్నీ తరువాత చూద్దాం. వెంటనే మీరు నాతో పాటు మా ఇంటికి వచ్చేయండి” అని డిక్లేర్ చేసి ఒక రెండు రోజుల్లో వచ్చేసింది. ఒక వారం రోజుల్లో ఫ్లాటులోని తమకు కావలసిన సామాన్లనన్నిటినీ ప్యాక్ చేసి లారీకెక్కించేశారు. అవసరం అనిపించని కొన్నింటిని అమ్మేశారు. చివరికి మిగిలింది పుస్తకాలే. నాలుగు బీరువాల నిండా పుస్తకాలే కనిపిస్తున్నాయి. వాటిని ఏం చెయ్యాలో తెలియక ఇద్దరూ ప్రస్తుతానికి అలా వదిలేద్దామనుకుని ఉడుపికి వెళ్ళిపోయి సుమారు ఒక సంవత్సరం గడిచింది.

***

ఉడుపికి వచ్చేసినాక కూతురి ఇంట్లో సౌకర్యంగా ఉన్నా, రావుగారికి తమ ఫ్లాట్లో ఉన్న పుస్తకాల గురించే ఆలోచన. ఎవరైనా చదివే వాళ్ళకు ఇస్తే మంచిది కదా! కానీ వాళ్ళను వెతకడమెలా? వాళ్ళకు చేరవేయడమెలా? కూతురేమో కరాకండిగా చెప్పేసింది. ఆ పుస్తకాలను ఇక్కడికి తీసుకురాకండి అని. అలాగయితే ఆ పుస్తకాలను ఎక్కడ పెట్టడం..? ఏ సంస్థకైనా దానంగా ఇచ్చేద్దాం అంటే చుట్టు పక్కల ఉన్న కన్నడ సంస్థలకు స్వంత కట్టడాలు లేవు. పుస్తకాలను ఇలా దానం చేస్తున్నారు అని తెలిసిన కొంత మంది వ్యక్తులు వచ్చి ఒకటో రెండో పుస్తకాలు తీసుకువెళ్ళారు. వాళ్ళ ఇళ్ళు కూడా చిన్నవి, అక్కడ కూడా జాగా లేదు అన్నారు. కానీ బీరువాలలో కట్టలు కట్టలుగా పడున్న పుస్తకాలను ఏం చెయ్యాలి? అనే ప్రశ్న మిగిలిపోయింది.

అలా నారాయణ రావుగారి ఇంట్లోని పుస్తకాల సంఖ్య తరగనే లేదు. లైబ్రరీ వాళ్ళు కూడా ‘ఇప్పటికే మా వద్ద చాలా పుస్తకాలు ఉన్నాయి. అదీగాక ఈ మధ్య చదివేవాళ్ళు తగ్గిపోతున్నారు. మేం కూడా తెప్పించడం మానేశాం’ అని తప్పుకున్నారు. ఒకాయన మాత్రం ఇంటిదాకా వచ్చి చూసి “సమకాలీన మార్కెట్లో చర్చనీయంగా ఉన్న రచయితలదైతే తీసుకోవచ్చు కానీ మీ వద్ద ఉన్నవన్నీ పాత కాలం నాటివి. వద్దులెండి” అని వెళ్ళిపోయారు.

ఇన్ని జరిగినా రావుగారు తన పట్టు వదల్లేదు. తను ఇష్టపడి, ఖర్చుపెట్టి కొన్న పుస్తకాలు సరైన చోటుకు చేరాలి, అవి ముందు తరాల వారికి ఉపయోగపడాలి. అంతవరకూ నేను ప్రయత్నిస్తూనే ఉంటాను అని గట్టిగా నిర్ణయించుకున్నారు.

కూతురు మాత్రం “నాన్నా! మీరు ఆ పుస్తకాల గురించి ఆలోచించడం మానేయండి. మీ ఆరోగ్యం సంగతి చూసుకోండి. ఏదో ఒకటి జరుగుతుంది లెండి..” అని చెప్తూనే ఉన్నా ఆయనకది ఊరటనివ్వలేదు.

ఉడుపికి వచ్చి ఏడాది కావస్తోంది. ఆ పుస్తకాలేమై పోయాయో! ఎలా ఉన్నాయో.. అన్న ఆలోచనలు మనసును కొరుక్కు తింటున్న సమయంలో అనుకోకుండా ముంబైకి వెళ్ళే ఒక అవకాశం వచ్చింది. చిరకాల మిత్రుడి కొడుకు పెళ్ళికి వచ్చి తీరాలని ఫోను చేసి పిలుస్తూ, తామే స్వయంగా ఆయనను విమానంలో ముంబైకి రప్పించుకున్నారు. ఆయనే ఇద్దరికీ టికట్లు పంపేటప్పటికి రావుగారికి, ఆయన కూతురికి తప్పలేదు.

***

ముంబైలోని తన యువ మిత్రుడు, సాహిత్యం పట్ల ఆసక్తి కనబరచే అవినాశ్ వద్ద తన గోడును అక్కడున్నప్పుడే వెళ్ళబోసుకున్నారు నారాయణరావుగారు. ఈ ఒక్క సంవత్సరంలో ఆ పుస్తకాలను ఏదో విధంగా వదిలించుకోవాలని చాలా సార్లు అతడితో అన్నారు.

అవినాశ్ కూడా ఈ పుస్తకాలను ఎలా ఎవరికైనా ఇవ్వాలి అని అర్థం కాలేదు. ఒక సాహిత్య సంఘాన్ని అడిగితే వారు తమ ఆరు అంతస్తులు కూడా నిండిపోయాయి. ఏడో అంతస్తు కడితే అప్పుడు మీ పుస్తకాలు తీసుకుంటాం అన్నారు. అవినాశ్‌కు ఇది అయ్యే పని అనిపించలేదు. ఏడో అంతస్తుదాకా వెళ్ళి ఎవరు పుస్తకాలు చదువుతారు? తనకు తానే వేసుకున్న ప్రశ్నకు సమాధానం రాకపోగా మరేం చెయ్యాలో అర్థం కాలేదు. తన ఇల్లు కూడా చాలా చిన్నది. ఆ పుస్తకాలు తన ఇంట్లో పెట్టుకోవడం అసలు వీలు కాదు. మరి ఈ పుస్తకాలను ఎక్కడ పెట్టాలి? దీనికి పరిష్కారం ఏమిటి? అవినాశ్‌కు తలనెప్పిగా తయారయ్యింది.

ప్రస్తుతానికి నారాయణ రావుగారి ఇంట్లోనే ఒక మూలలో ఉంచితే ఏమవుతుంది? అనిపించింది. కాని, ఆయన అమ్మాలనుకున్నాను అని చెప్పినట్టు గుర్తు.

“మా బిల్డింగులో చాలా మంది తమ్మ ఇళ్ళను అమ్మకానికి పెట్టే సీజన్ ఉన్నట్టుంది అవినాశ్! ఎందుకంటే అన్ని ఫ్లాట్లలోనూ పెద్దవాళ్ళే ఉన్నారు. పిల్లలు విదేశాల్లో ఉన్నారు. కొందరు వలస వెళ్ళిపోయారు. కాబట్టి ఈ ఫ్లాట్లు వాళ్ళకెందుకు?.. అందరూ వాళ్ళు ఉన్నచోటే ఇళ్ళు కొనుక్కుంటున్నారు. కొంతమంది తలిదండ్రులను తమ వద్దకు పిలిపించుకుంటున్నారు. మరి ఇక్కడున్న ఫ్లాట్లు అమ్మాలని నిర్ణయించినట్లు కనబడుతుంది..” అంటూ రావుగారు చెప్పుకొచ్చారు.

“అదీగాక కరోనా అల తరువాత పుస్తకాలు కొని చదవడం బాగా తగ్గిపోయినట్టు కనిపిస్తుందయ్యా! ఏమున్నా ఆన్‌లైన్ పుస్తకాలు, ఆన్‌లైన్ పత్రికలు. వీటినే గట్టిగా పట్టుకున్నట్టుంది ప్రజలు. మరి ఈ పుస్తకాలని ఏం చెయ్యాలో?” అంటున్న రావుగారి ఆందోళనను తను కూడా పంచుకున్నాడు అవినాశ్.

***

నారాయణ రావుగారు ముంబై విమానాశ్రయంలో దిగగానే అవినాశ్‌కు ఫోన్ చేశారు. “మేము ముంబైలో దిగాము. ఇంకో అరగంటలో ఇల్లు చేరుకుంటాము. వీలైతే ఈ రోజు సాయంత్రం ఇంటికి వచ్చెయ్యి. లేదా ఎల్లుండి రా. ఎందుకంటే రేపు మేము పెళ్ళికి వెళుతున్నాము” అన్నారు.

రావుగారు ఈసారి మాత్రం తనను వదలరు అనుకున్నాడు అవినాశ్. ఆయన పుస్తకాలకు ఏదో ఒక ఏర్పాటు చేసితీరాలి అని అవినాశ్ కూడా అనుకున్నాడు. ఇటీవల ముంబైలో కన్నడిగుల ఇళ్ళల్లో పెద్దవారు చనిపోయిన తరువాత వాళ్ళ ఇంట్లో పుస్తకాలను కర్నాటక సంఘంలో ఇవ్వడానికి రావడం మామూలై పోయింది. అడిగితే తమ ఇంట్లో కన్నడ చదివేవాళ్ళు లేరు. అందుకే ఈ పుస్తకాలు మావద్ద ఉంటే వ్యర్థం అనేవారు.

ఇప్పుడు కర్నాటక సంఘం బిల్డింగ్ కూల్చి కొత్తగా కడుతున్నారు. అది ఎప్పటికి తయారవ్వాలి?.. మరి ఈ పుస్తకాలను ఎవరికివ్వాలి?.. అవినాశ్‌కు కూడా తోచడం లేదు. నారాయణ రావుగారు అన్ని పుస్తకాలను జమ చెయ్యడమే తప్పేమో..? ఇలాంటి సంధిగ్ధ స్థితిలో అవినాశ్ కొట్టుమిట్టాడుతుండగా నారాయణరావుగారు తమ చెంబూరు ఫ్లాటుకు చేరుకున్నారు.

ఇంట్లోకి వెళ్ళగానే రావుగారు ముందుగా బీరువాలను తెరిచి తమ పుస్తకాలు ఎలా ఉన్నాయో తడిమి చూసుకున్నారు. వాటిని మృదువుగా స్పృశించారు.

క్రితం వారం మంగళూరులో తమ బంధువు వెంకటేశ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన తన పరిచయస్థుడైన ఒక సాహితి కథ గుర్తుకొచ్చింది. ఆయన తన సంగ్రహంలో ఉన్న అన్ని పుస్తకాలను ముంగిలిలో వేసి ‘ఎవరు ఏ పుస్తకమైనా తీసుకుని వెళ్ళవచ్చు. ఇక నా ఇంట్లో వీటికి స్థానం లేదు. నేను చదివేశాను. మీలో ఎవరైనా చదవాలనుకుంటే తీసుకెళ్ళండి. ఒక వారంపాటు ఇలా ఉంచుతాను.’ అన్నాడట. నారాయణ రావుగారు అది తలచుకుని విరక్తిగా నవ్వుకున్నారు.

బహుశా తను కూడా అలానే చేసుండాల్సిందేమో! కానీ వచ్చినవాళ్ళు ఒకట్రెండు పుస్తకాలు మాత్రం తీసుకువెళ్తే మళ్ళీ అదే పాత పాటే కదా! ప్రతి సభకూ తను తప్పకుండా హాజరై, ప్రతి సారి పుస్తకాల పెద్ద మూటలను మోసుకుని తెస్తున్న తనకు ఆ రోజు అవి బరువనిపించలేదు. కానీ ఇప్పుడు వాటిని వదిలించుకోవడం బరువనిపిస్తోంది..!

అదే రోజు అవినాశ్ రావుగారి ఇంటికి వచ్చాడు. ఒక్కసారి ఆయనను కలిస్తే ఆయనకు కొద్దిగా ఊరట లభించవచ్చు అని అతడి ఆలోచన.

“రావయ్యా! నీ కోసమే చూస్తున్నా..” అంటూ రావుగారు ఆహ్వానించారు. “అవినాశ్! చూశావా ఈ ఇల్లు ఎలా దుమ్ము కొట్టుకుపోయిందో? అందుకే ఈసారి ఇంటిని అద్దెకు ఇవ్వదలచాను. ఒక రాజస్థానీ కుటుంబం వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకు కన్నడం రాదు. అందుకే ఈ పుస్తకాలను ఎలాగైనా ఇక్కడినుండి సాగనంపి తీరాలి. ఇప్పుడు నాకనిపిస్తోంది.. ఎందుకైనా ఇన్ని పుస్తకాలను కొన్నాను అని? మనమంతా హైస్కూలునుండే సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను చదివే వాళ్ళం. ఇప్పటి పిల్లలకు అది అర్థమే కాదు. ఎంతసేపూ మొబైల్ ఉంటే అయిపోయింది. ఏ పుస్తకమూ అక్కరలేదు వాళ్ళకు..” అని వాపోయారు. అవినాశ్‌కు ఆయన ఫ్లాటును అమ్మడం విరమించుకున్నట్టుంది అనిపించింది.

అవినాశ్ కూడా ఆయన మాటలకు ఏం చెప్పాలో తెలియక ఊరకున్నాడు. “ఏదైనా చేద్దాం” అని భరోసా ఇస్తూనే ఒక అరగంట సేపు కబుర్లు చెప్పి, మళ్ళీ రెండు రోజుల్లో వచ్చి కలుస్తానని చెప్పి బయలుదేరాడు.

***

రావుగారి ఫ్లాటును అద్దెకని అడిగిన రాజస్థానీ కుటుంబంవాళ్ళు చూడడానికి వచ్చి ఇల్లంతా పరికించి చూసి, తాము వచ్చి చేరతామన్నారు. “అంతా బాగుంది. మరి మీరు ఈ పుస్తకాల బీరువాలను ఎప్పుడు ఖాళీ చేస్తారు? నాలుగున్నాయి కదా! అవే స్థలం తినేస్తున్నాయి” అన్నారు. తను వాటిని ఎలాగైనా తీసేసి కానీ తను ముంబైనుండి కదలనని రావుగారు వాళ్ళకు భరోసా ఇచ్చారు. ఇంతకు ముందే కావలసిన సామాన్లు తీసుకెళ్ళారు కాబట్టి మిగిలిన సామాన్లను చెత్త సామాన్ల వాడికి అమ్మేశారు. అలాగని పుస్తకాలను పాత పుస్తకాల అంగడికి వేయడానికి రావుగారికి మనసొప్పలేదు. వాటిని సరైన స్థలానికి చేర్చాలని ఆయన తపన. కానీ ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు.

నాలుగు రోజుల తరువాత అవినాశ్ మరోసారి రావుగారి ఇంటికి వెళ్ళాడు. ఈ పుస్తకాల విషయంలో ఏం చెయ్యాలో తెలియక పోయినా వచ్చాడులే అనుకుని రావుగారు కూర్చుని కబుర్లు చెప్పసాగారు. అప్పుడు రాజస్థానీ కుటుంబం వాళ్ళు కూడా వచ్చారు. టీ తాగిన తరువాత “ ఎప్పుడు ఊరికి వెళ్తారు? మరి మేము మా సామన్లు తెచ్చుకోవాలి.” అంటూ రావుగారి వైపు చూశారు.

“సామాన్లు తెచ్చేసుకోండి. కానీ ఈ పుస్తకాల సంగతి ఇంకా తేలలేదు.. అదొక్కటే ఉండిపోయింది.” అంటూ రావుగారు మాటలు నాన్చారు. “మీరు ఈ పుస్తకాలను మీ ఊరికి తీసుకుని వెళ్ళరా?” అని వచ్చినవాళ్ళలో ఒకాయన అడిగారు.

“లేదు. అలా తీసుకెళ్ళే పనయితే అప్పుడే లారీకి ఎక్కించేవాణ్ని. ఇక్కడే ఎవరికైనా ఇచ్చేయాలని అనుకుంటున్నాను. ఎవరికివ్వాలని ఇంకా తేలలేదు.”అన్నారు రావుగారు.

వచ్చిన వాళ్ళు తమలో తామే చర్చించుకుని “ఒక పని చెయ్యండి. మేము ఇప్పుడున్న ఇల్లు ఖాళీ చెయ్యాల్సుంది. అందుకే మేము సామాను తెచ్చేసుకుంటాము. కొన్ని రోజులు కావలిస్తే ఈ పుస్తకాల బీరువాలు ఇక్కడే ఉండనీ. మాకేమి అంత ఇబ్బంది కాదు. కానీ సాధ్యమైనంత తొందరగా అయితే పుస్తకాలను ఇక్కడినుండి తీసెయ్యండి.”అన్నారు.

నారాయణ రావుగారికి ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చినట్టయింది. పుస్తకాలకు ఒక మంచి స్థలం దొరికినట్టయింది. ఇల్లు అద్దెకూ కుదిరింది. పుస్తకాల గురించి ఆలోచించడానికి కొన్ని రోజుల వ్యవధి దొరికినట్టూ అయింది. కొద్దిగా ఆలోచించి దీనికో పరిష్కారం కనుక్కుందాం అనుకుని ఒక తాత్కాలికమైన నిట్టూర్పు విడిచారు. అవినాశ్‌కు కూడా కొద్దిగా తెరపి కలిగింది. ఈ పుస్తకాలకు ఒక శాశ్వతమైన పరిష్కారం దొరకడమయితే కష్టమే అనిపించింది అవినాశ్‌కి.

***

రాజస్థానీ వాళ్ళు రావుగారి ఫ్లాటులో దిగిపోయారు. ఆయన ఉడుపిలోని కూతురి ఇంటికి చేరిపోయారు. అందరికీ కాస్త ప్రశాంతత.

అంతా సవ్యంగా సాగుతుందని అనిపిస్తుండగానే నారాయణ రావుగారు హార్ట్ అటాక్‌తో ఆస్పత్రి పాలయ్యారు. ఒంటి పైన తెలివి లేకుండా ఏదేదో మాట్లాడడం చేస్తుండడంతో ఆయనను ఇంకో ఆస్పత్రికి షిప్ట్ చేసారు. కానీ పది రోజుల తరువాత ఆయన ఇక లేరన్న వార్త ముంబైకి కూడా వచ్చింది.

రావుగారి ఇంట్లో ఉన్న రాజస్థానీయులు వార్త తెలిసి, ఆయనకు శ్రద్ధాంజలి అర్పించారు.

ఎలాగూ రావుగారు తమకు పుస్తకాలు అక్కర్లేదు అన్నది వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు దాని గురించి తామే ఏదో చేయాలనుకుని తమకు తెలిసిన ఒక పాత పుస్తకాల అంగడికి వాటిని అమ్మేసి వచ్చిన డబ్బును రావుగారు అమ్మాయికి పంపేస్తే సరిపోతుందనే నిర్ణయానికి వచ్చారు.

ఆ ప్రకారమే, ఒక పాత పుస్తకాల వాడిని పిలిపించి, పుస్తకాలను చూపించి, రేటు మాట్లాడుకుని అవన్నీ బయటకు పంపించేసి జాగా ఖాళీ చేసుకున్నారు.

అటు రావుగారి వైకుంఠ సమారాధన ముగిసిన కొన్ని రోజులకు ఆయన కూతురు రాజస్థానీ కుటుంబం వాళ్ళకు ఫోన్ చేసింది. “ఆ పుస్తకాలు మాకొద్దు. మీరే మీకు తెలిసిన ఎవరికైనా వాటిని అమ్మెయ్యండి. బీరువాలను మీరే వాడుకోండి. వచ్చే నెలలో మేము ముంబైకి వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తాము” అని అనిందామె.

రాజస్థానీ కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు. “మేమూ అదే అడుగుదామనుకున్నాము. మీరే అన్నారు. అలాగే చేస్తాం లెండి” అన్నారు. అంతకు ముందే తాము పాత పుస్తకాల వాడికి అమ్మడమూ, బీరువాలలో తమ సామాన్లు పెట్టుకోవడమూ జరిగిపోయింది. ఆమె ఫోన్ రావడంతో వారికి కొంత ఊరట కలిగింది.

ఈ మధ్య అవినాశ్ తనకు తెలిసిన వారికంతా రావుగారి పుస్తకాల గురించి చెపుతూ తన ఫేస్‌బుక్‌లో దీని గురించి పోస్ట్ పెట్టాడు. ఏ సంఘ సంస్థలైనా కొత్తగా ప్రారంభించేటట్టయితే తెలపమని, తను వాటికి పుస్తకాలు ఇవ్వగలననీ అందులో రాశాడు. దానికి జవాబుగా ఫేస్‌బుక్‌లో మైసూరు జిల్లాలోని ఒక గ్రామంలో ఒక కన్నడ సంస్థ గ్రంథాలయాన్ని ప్రారంభిస్తోందనీ, దానికి కావలసిన పుస్తకాలను ఎవరైనా ఇవ్వవచ్చనీ ఒక పోస్ట్ వచ్చింది. అవినాశ్ సంతోషపడి, ఆ సంఘ కార్యదర్శికి ఫోన్ చేసి, తను ఒక లారీలో పుస్తకాలు పంపుతానని చెప్పాడు. ఆ సంతోషంతో అవినాశ్ ఆ రోజు సాయంత్రమే రావుగారి ఫ్లాటుకు వెళ్ళి అక్కడి పుస్తకాలను పంపడానికి చెంబూరు వైపు ఆటో ఎక్కాడు.

కన్నడ మూలం: శ్రీ శ్రీనివాస్ జోకట్టె

తెలుగు అనువాదం: చందకచర్ల రమేశబాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here