జనన మరణ చక్రభ్రమణం

0
3

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘జనన మరణ చక్రభ్రమణం’ అనే రచనని అందిస్తున్నాము.]

శ్రీ భగవానువాచ:

అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః
(భగవద్గీత 2వ అధ్యాయం, 11వ శ్లోకం)

ఓ అర్జునా! ప్రజ్ఞను గురించిన మాటలను మాట్లాడుతునే మరొకవైపు మానవులు దుఃఖింపదగని విషయముల గురించి దుఃఖిస్తున్నావు. పండితులు, జ్ఞానులు జీవించిన లేక మరణించిన వారి గురించి ఎల్లప్పుడూ కూడా దుఃఖించరు అని పై శ్లీకం యొక్క భావం.

అర్జునా, నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడావనుకుంటున్నావు, కానీ నీవు అమాయకత్వంతో ప్రవర్తిస్తున్నావు. జీవితంలో ఎంత పెద్ద కారణం ఉన్నా శోకం అనేది మాత్రం ఎప్పటికీ తగదు. శోకం అనేది ఎల్లప్పుడూ రగిలే చితి వంటిది. మానవులను సమూలంగా దహించివేస్తుంది. పండితులు-వివేకము కలిగినవారు-ఎప్పుడూ శోకింపరు, అది బ్రతికున్నవారి కోసమైనా లేదా చనిపోయిన వారి కోసమైనా సరే. కాబట్టి బంధువులను సంహరించడంలో నీవు ఊహించుకునే దుఃఖం నిజానికి ఒక భ్రమ, మిథ్య మాత్రమే. అని శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునుడిని మందలించాడు.

ఈ శ్లోకం ద్వారా మానవులు అనివార్యములైన జనన మరణముల గురించి దుఃఖించరాదని, భయపడరాదని భగవానుడు హెచ్చరిస్తున్నాడు.

నిజానికి జననానికి పూర్వమూ ఉన్నాము మనం. మరణానంతరమూ ఉంటాము. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః – అని చాటుతున్నది భగవద్గీత. లేనిది రాదెప్పుడూ – ఉన్నది పోదూ. మహా అయితే అవ్యక్తం వ్యక్తమయి కనిపిస్తున్నది. వ్యక్తమే మరలా అవ్యక్తమై పోతున్నది. సూర్యాస్తమం తర్వాత సూర్యుడు లేకుండా లేదూ. మనకు కనిపించడు కానీ మరొక దేశంలో వారికి కనిపిస్తాడు. జనన మరణ చక్రభ్రమణం కూడా అంతే. ఒక జీవి జన్మించాడంటే వాడంతకు ముందు ఎక్కడా లేక అప్పటికప్పుడు ఆవిర్భవించాడని కాదు. అలాగే మరణించాడంటున్నామంటే ఎక్కడా లేకుండా సర్వనాశనమై పోతున్నాడని కాదు. అంతకు ముందు అసలే లేని ఆ జీవి ఎలా వచ్చాడు. ఉన్నాడప్పుడూ. అయితే అతి సూక్ష్మంగా ఉన్నాడు. అలాగే పోయాడంటే మరలా ఆ సూక్ష్మావస్ధలోనే ఉన్నాడనుకోవాలి. కనుక ఈ సత్యాన్ని ఆకళింపు చేసుకొని మనం జనన మరణములకు సంబంధించి అనవసర దుఃఖానికి లోను కాకూడదన్నదే ఈ శ్లోకం యొక్క అర్థం.

ఆదిశంకరాచార్య తన శంకరాద్వైతం అనే గ్రంథంలో –

“పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం
ఇహ సంసారే- బహు దుస్తారే
కృపయాపారే- పాహ మురారే!!”

“పుట్టుట గిట్టుట ఇది అంతులేని కథ, తప్పించుకొనడం సాధ్యం కాని చక్రభ్రమణం. జనన మరణముల నుండి తరింప సాధ్యము కాదు కాని దు:ఖ సాగరము నుండి కాపాడమని భగవంతుని ప్రార్థించడమే మేలు” అన్నారు. ఈ జనన మరణ చక్రంలో చిక్కుకోకుండా మోక్ష సాధనకు ధర్మాచరణ, భగవతారాధనలాంటి సత్కర్మలను ఇప్పటి నుండైన పాటించి తరించడమే మన ప్రధాన కర్తవ్యం. భగవంతునికి శరణాగతి చేసిన వారు, ఫలితాల చేత ప్రభావితం కాకుండా, అన్ని సందర్భాలలో తమ విధిని నిర్వర్తిస్తూ పోతుంటారు, అని ఉదాహరణగా చూపించాడు. అలాంటి వ్యక్తులు ఎప్పటికీ శోకింపరు ఎందుకంటే వారు ప్రతీదాన్నీ ఈశ్వర అనుగ్రహంలా స్వీకరిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here