[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘ఏ యాదైనా మనసు పొరల్లోంచే’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]గా[/dropcap]లికి తెలియదు పూలకు తలలూపే ఫ్రీ తఫ్రీ నిస్తున్నానని
పుష్పాలకూ తెలియకపోవచ్చు కొత్తగా
నెత్తావుల స్వచ్ఛ పరిమళం గాలికి జోడిస్తున్నాని
అలా అలా జవరాలి సుందర సిగలో మహాకావ్యం రాస్తున్నాని
రెండు జ్ఞాపకాలు పాడే ఒకే పాట చెలిమి నేల
బాణీ మారొచ్చేమోగానీ
సారం మాత్రం గట్టి మట్టి బుర్ర
భావం పాదరసం కాగితంపై నాట్యం
కానీ లోకం చుట్టేసే సృజన తీరు
పిలుపు మాండేటరీ యాది కచేరీకి కవిత్వయాత్రలో
నడిచిన అడుగులు కలిసి పనిచేసిన చేతుల జీవితం
లోపలి మనసూ బాహ్యాంతరంగం వేర్వేరు కాదు ఒకటే
అన్నీ మమేకమైన సహధ్యాయి తపనలే
రంగూ రుచి వాసనల త్రివేణి
ప్రవాహ గట్లు పారే మళ్ళూ
వేర్వేరు వైవిధ్య ఆలోచన జ్ఞప్తికి
ఏం నిమ్మలమో ఏమోగానీ
ఏ వాలూ నిటారూ తెలియని సంతులన తొవ్వల వదిలిన కాలం కథ
పడిలేచిన అనుభవాల అల్లకల్లోలాల సారూప్యం సమాంతర సాపేక్ష కలయిక
గీసిన కంటెంట్ బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ అక్షర క్రతువు
చిత్రం కదా చిత్రిక కాన్వాస్ పరిధి
లోతూ వైశాల్యం కమిటెడ్ కలాల సాధనలో
యాది ఏదైనా
జారేది మాత్రం మనసు పొరల్లోంచే