అట్టపెట్టెలతో అందమైన వస్తువులు

0
3

[డా. కందేపి రాణీప్రసాద్ గారి ‘అట్టపెట్టెలతో అందమైన వస్తువులు’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]మ[/dropcap]నం ఏ వస్తువు కొన్నా ఏదో ఒక అట్టపెట్టెలో ప్యాక్ చేసి ఇస్తారు. మనం కొనే వస్తువు ఆకారాన్ని బట్టి ఆయా అట్టపెట్టెల ఆకారాలు మారుతూ ఉంటాయి. ప్రతి ఇంట్లో చాలా అట్టపెట్టెలు పేరుకుపోతూనే ఉంటాయి. వాటితో ఏదైనా పనికొచ్చే వస్తువులు తయారు చేసుకుంటే బాగుంటుంది. ఏసిలు, ఫ్రీజ్ఞులు, పరుపులు వంటివి కొన్నపుడు పెద్ద పెద్దవే ప్యాకింగులు వస్తాయి. షూస్, చెప్పులు, గాజు వస్తువులు కొన్నపుడు వచ్చే అట్టపెట్టెలూ పనికొస్తాయి. జాగ్రత్తగా చూసుకుంటే సంవత్సరాల కాలం మన్నుతాయి. నేను 30 ఏళ్ళ క్రితం చేసినవి ఇప్పటికీ బాగున్నాయి. ఒకటీ అరా పాడయి పోయాయి తప్ప. పాడయినా కొత్త, క్రియేటివిటీలో కొత్త వస్తువులు మరలా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడంతా ‘యూజ్ అండ్ త్రో’ సిద్ధాంతమే కదా! పెద్ద పెద్ద ఫర్నీచర్లు సైతం ఐదారేళ్ళు వాడుకుని మార్చేస్తున్నారు. మనం అట్టపెట్టెలతో అందమైన వస్తువులు చేద్దాం.

ఇప్పుడు అట్టపెట్టెలతో ఇల్లు కడదామా. మా ఇంట్లో మందులు ప్యాక్ చేసి వస్తాయి కాబట్టి చాలా అట్టపెట్టెలే ఉంటాయి. అలాంటి ఒక పెద్ద అట్టపెట్టెలో నేనీ రోజు ఇల్లు కట్టబోతున్నాను. జపాన్ దేశంలో అట్టలతో ఇళ్ళు కట్టుకుంటారట అని చిన్నప్పుడు ఆశ్చర్యంగా చెప్పుకునే వాళ్ళం. వాళ్ళు మనలా ఎందుకు కట్టుకోరు అని సందేహంగా అడిగితే అక్కడ భూకంపాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి ప్రమాదాలు నివారించటానికి అలా కట్టుకుంటారు అని సందేహ నివృత్తి చేసేవారు. జపాన్ వెళ్ళకుండానే మనమిక్కడ అట్ట ఇళ్ళు కట్టేసుకుందాం. దీని కోసం రెండు పెద్ద అట్ట పెట్టెలు దగ్గర పెట్టుకొవాలి. అట్టపెట్టె కున్న మూతలు తీసేసి ఇంటికి బేస్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు మరో అట్టపెట్టె నుంచి ముక్కలు కత్తిరించి బేన్ మీద ఏటవాలుగా అతికిస్తే ఇల్లు ఆకారం వస్తుంది. వాటికి మధ్యలో చిన్న చిన్న నలుచదరపు రంధ్రాలు చేస్తే కిటికీల వలె కనిపిస్తాయి. అలాగే ద్వారం కోసం కూడా కత్తిరించాలి. ఇంటి మీద ఇల్లు కూడా కట్టుకోవచ్చు. దాని కోసం మెట్లు కట్టుకోవాలి. అట్ట ముక్కల్ని సన్నగా కత్తిరించి మెట్లులా అమర్చుకోవాలి. చుట్టూ ప్రహరీగోడ, కుండీల్లో చెట్లు ఏమైనా మీ క్రియేటివిటీ చూపించండి. ఇంజనీరింగ్ చదవకుండానే ఇల్లు కట్టేయచ్చు.

 

షూరాక్‌ను అట్టపెట్టెలతో చేసేద్దాం. ఇప్పుడు చాలా మంది ఆన్‌లైన్‌ లోనే వస్తువులు తెప్పించుకుటున్నారు. కదా! ఆమెజాన్, ఫ్లిప్‌కార్టులలో మనం వస్తువులు ఆర్డర్ చేసినపుడు వాళ్ళు పక్కా ప్యాకింగ్‌తో పంపిస్తున్నారు. గట్టిగా ఉండే అట్టలతో ప్యాక్ చేయుబడి వస్తున్నాయి. ఆ అట్టపెట్టెలతో ఇలాంటివి చేసుకోవచ్చు. బాగా గట్టిగా ఉండే అట్టలు చెక్కలంత బలంగా ఉంటున్నాయి. అట్టపెట్టెలకు పై భాగాన నాలుగు మూతలుగా అట్టలుంటాయి కదా! వీటిలో రెండింటిని కత్తిరిస్తే సరిపోతుంది ఇప్పుడు అట్టపెట్టెను నిలువుగా నిలబెడితే అలమరలా కనిపిస్తుంది అట్టకు మొత్తం గిఫ్ట్ ప్యాకింగ్ రేపర్‌ను అతికించాలి. అలాగే ముందు తలుపుల్లా ఉన్న రెండు అట్టలకు చిన్న గుబ్బలు అతికించాలి. తలుపు తీయడానికి హ్యాండిల్ వలె పని కొస్తుంది. అలాగే లోపల రెండు, మూడు అట్టలను అడ్డంగా ఫిక్స్ చేసుకోవాలి. రెండు మూడు అరలుగా ఉంటే చెప్పులను పెట్టుకోవచ్చు. షూరాక్ తయారైనట్లే, ఒకవేళ అట్టలు చెప్పుల బరువు మోసేంత బలంగా లేకపోతే బరువు తక్కువుండే ఏదైనా సామాన్లు పెట్టుకోవచ్చు. అంటే సాక్సులు, షూ పాలిష్‌లు, స్ప్రే బాటిల్స్ వంటి దోమలు, కాక్రోచ్‌ల స్ప్రేలు ఎన్నో రకాలుగా పెట్టుకోవచ్చు.

షూ ప్యాకెట్లు బలంగా ఉంటాయి. వీటితో డస్ట్‌బిన్ కవర్ హోల్టర్ చేయవచ్చు. లేదంటే టిష్యూ పేపర్ హోల్డర్ కూడా చేయవచ్చు. బాత్‌రూమ్‌లో వాడే టాయ్‌లెట్ పేపర్ హోల్డర్‌గా కూడా వాడవచ్చు. ఇంట్లో చిన్నపిల్లలుంటే ఫ్రిజ్ ఆకారంలో చేయించవచ్చు. షూ ప్యాకెట్‌లో మధ్యలో అరల్లాగా అమర్చి ఫ్రిజ్‌లా అమర్చవచ్చు. ఆ అరల్లో పిల్లల వంట సెట్లులో ఉండే గిన్నెలు మూతలు పెట్టి అలంకారం చేయవచ్చు. పెద్ద పెద్ద అట్టపెట్టెలే కాదు చిన్న చిన్న అట్టపెట్టెలతో కూడా బొమ్మలు చేసుకోవచ్చు.

డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజర్‌ను చేసుకుందాం. లేదంటే టీపాయ్ మీద పెట్టుకునే అనేక సామాన్లను పెట్టుకోవచ్చు. ఇది మాత్రం గోడకు తగిలించుకోవచ్చు. అట్టపెట్టెల కుండే మాతలను విడిగా కత్తిరించి అన్నీ ఒకే సైజులో వచ్చేలా కత్తిరించకోవాలి. ఇప్పుడు ఒక అట్టను తీసుకొని త్రికోణాకారంలో అతికించుకుని చివర్లు పిన్ చేసుకోసుకోవాలి. ఒక పది త్రికోణాలు చేసుకుని ఉంచుకోవాలి. ఒకే దాని మీద ఒకటి అమర్చుకుంటే మళ్ళీ త్రికోణాకారం వస్తుంది. దీనిని గోడకు తగిలిస్తే మధ్యలో ఉండే కన్నాలలో సామాన్లు పెట్టుకోవద్దు. టివి రిమోట్లు, కత్తెర్లు, డ్రెస్సింగ్ డేబుల్ సామాన్లు, లేదంటే బొమ్మలు కూడా అలంకరించుకోవచ్చు.

పిల్లల చాక్లెట్ బాక్స్‌లా తయారు చేద్దామా! దీనికి ఫోన్ వైఫై బాక్స్ లాంటిది చాలు. వెడల్పు ఎక్కువగా లోతు తక్కువగా ఉంటే అట్టపెట్టెలు బాగుంటాయి. అయితే అన్నింటినీ కవర్ చేసినట్లుగా గిఫ్ట్ ప్యాకింగ్ పేపర్ తోనో, డ్రాయింగ్ పేపర్ తోనో డెకరెట్ చేయకూడదు. కొంచెం కొత్తగా చేద్దాం. ఈ అట్టపెట్టెకు పై భాగాన్ని అందంగా అలంకరించాలి. ఎలా చేద్దామంటే చంద్రుడు, తారకలు వచ్చేలా కత్తిరించాలి. చిల్లులుగా తయారైన భాగంపై వంటకాల మీద కప్పే రాపర్‌ను అతికించాలి. లోపుల పెట్టిన చాక్లెట్లు కనిపిస్తు ఉంటాయన్నమాట. మిగతా అట్టపెట్టెను బంగారు రంగు స్ప్రే కలర్‌తో స్ప్రే చేయాలి. బంగారు రంగు, జాబిల్లి, నక్షత్రాలు పిల్లల కిష్టమైన అలంకరణతో వాళ్ళ కిష్టమైన చాక్లెట్ల బాక్స్ చేస్తే బాగుంటుంది.

వాల్ హ్యాంగింగ్ చేసుకోవచ్చు. అట్టను అమ్మాయి ముఖంలా కత్తిరించి అతికించుకుంటే గోడును అలంకరించే వాల్ హ్యాంగిగ్ అవుతుంది. తలను గుండ్రంగా కానీ కోలగా గాని కత్తిరించి కళ్ళు, ముక్కు నోరు పెట్టుకోవాలి. తల కింది భాగం నలుచదరంగా కత్తిరించి అతికించాలి. డ్రెస్ వలె రంగురంగుల కాగితాయి కత్తిరించి అతికిస్తే, బాగుటుంది. తల, జడలు వచ్చేలా అన్ని పెట్టి రంగులు వేసి హ్యాంగింగ్ చేసుకోవచ్చు. అట్టపెట్టెను ఏమీ కత్తిరించకుండానే టీపాయ్ క్లాత్ చేసి పిల్లలకు చిన్ని టీపాయ్ లాగా అమర్చవచ్చు ఆలోచిస్తే ఎన్నో ఐడియాలు. ప్రయత్నించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here