[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]
[అనుకున్న ముహూర్తానికి శ్రీ మహాలక్ష్మమ్మ ఆలయంలో నరసింహశాస్త్రి.. పాండురంగ.. రాఘవ, విజయనగరం నుంచి వచ్చిన ఘనాపాటీలు కలిసి నరసింహశాస్త్రిగారి ఆధ్వర్యంలో వేదమంత్రాలతో సశాస్త్రంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠని జరుపుతారు. రెడ్డిగారి కుటుంబ సభ్యులు, శాస్త్రి గారి కుటుంబ సభ్యులు ఆ వేడుకను నేత్రానందంగా తిలకిస్తారు. కార్యనిర్వాహకులకందరికీ రెడ్డిగారు ఘనంగా సత్కరించారు. నైవేద్య దీపారాధనలు ఎంతో ఘనంగా జరిగుతాయి. రెడ్డిగారు వచ్చిన వారందరికీ విందు భోజనాలను ఏర్పాటు చేస్తారు. అందరూ సంతుష్టులై రెడ్డిగారికి, నరసింహశాస్త్రి గారికి చెప్పి వెళ్ళిపోతారు. కాసేపయ్యాకా, నరసింహశాస్త్రిగారు, రెడ్డిగారూ అర్చకునకు జాగ్రత్తలు చెప్పి వారి వారి ఇండ్లకు చేరుతారు. విగ్రహ ప్రతిష్ఠ జరిగిన మర్నాడు రాఘవ భద్రాచలం బయలుదేరడానికి సిద్ధమవుతాడు. నరసింహశాస్త్రి, వసుంధర, సావిత్రి గోపాల్ శర్మగారికి ఆరోగ్యం సరిగా లేదని విని వారిని చూడడానికి వెళ్తారు. పాండురంగ ఒక వివాహాన్ని జరిపించడానికి వెళ్తాడు. ఇంట్లో సుమతి, సీత, రాఘవ మాత్రమే ఉంటారు. సీత విషయం తెలుసుకదా, నీవు సీతను జాగ్రత్తగా చూసుకోవాలని రాఘవ సుమతితో అంటాడు. జాగ్రత్తగా చూసుకుంటానని చెప్తుంది. రాఘవని ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దని చెప్తుంది సీత. రాఘవ వెళ్ళాకా, తనకి వారం రోజుల నుంచి కడుపులో అదోలా ఉంటోందని అంటుంది. కొన్ని ప్రశ్నలు వేశాకా, సుమతికి విషయం అర్థమవుతుంది. వీలైనంత తొందరగా డాక్టరు వద్దకు తీసుకువెళ్తుంది సీతను. డాక్టర్ పరీక్ష చేసి, సీత గర్భవతి అని చెప్తుంది. ఇంటికి వచ్చకా, సీత బాధపడుతూంటే సుమతి ఓదారుస్తుంది. తనకీ అద్వైత్‍కి పెళ్ళి జరిగిందన్న విషయన్ని అప్పుడు చెప్పి, మాంగల్యం చూపిస్తుంది సీత. అత్తయ్య మామయ్యలకు విషయం తెలిస్తే వారికి యథార్థాన్ని చెబుతానంటుంది సీత. – ఇక చదవండి.]
అధ్యాయం 49:
[dropcap]ఆ[/dropcap]టవీకుల వేట విల్లు బాణాలతో.. ఆంగ్లేయుల వీర విహారం తుపాకులతో.. స్వార్థంతో రాక్షసతత్వంతో దేశాన్ని ఆక్రమించిన వారిపై ఎదురు దెబ్బ తీయాలంటే వారి వద్దన వున్న తుపాకులు తమకూ అవసరమని వన్యవాసులతో రాజుగారు 1922 ఆగస్టు యిరవై రొండున చింతపల్లి పోలీస్ స్టేషనుపై.. వారి సహచర్యులతో మొదటిసారి దాడి చేశారు. తుపాకులను దోచుకొన్నారు. రాజుగారికి గం సోదరులుగా పిలువబడే గంమల్లు దొర.. గం గంటదొర నమ్మిన బంట్లుగా వుండేవారు. రాజుగారు వారి లక్ష్యసాధనకు తన కార్యకలాపాలను ప్రక్క ప్రాంతాలకు కూడా విస్తరింపజేసి కృష్ణదేవుపేట, రాజవొమ్మంగి, పోలీస్ స్టేషన్లపై దాడి చేశారు. వారి ఆయుధాలను తమ వశం చేసికొన్నారు. పాతిక సంవత్సరాల ప్రాయపు శ్రీరాజుగారు ఆంగ్లేయులకు సింహస్వప్నంగా మారిపోయారు.
శ్రీ అల్లూరి సీతారామరాజుగారి ఆ చర్యలు ఆంగ్లేయులకు అశాంతిని తలవంపును కలిగించాయి. వారికి రాజుగారిపై కసి పెరిగింది. సాయుధ పోలీసు బలగాలను రాజుగారిని పట్టుకొనే దానికి పంపారు. ఆ దండుకు స్కాట్ కవార్డ్, హేటస్ నాయకులు.
ఆంగ్లేయులు పన్నిన.. పన్నాగాన్ని ముందుగానే తెలిసికొన్న రాజుగారు దామనపల్లె ఘాట్ వద్ద పొంచి వుండి, వచ్చిన పోలీస్ బలగాలపై మెరుపుదాడి జరిపి ఆ యిరువురు దండ నాయకులను చంపేశారు. ఆంగ్లపోలీసులు శ్రీరాజుగారి, వారి అనుచరుల ధాటికి తట్టుకోలేక.. తమ నాయకులు చచ్చినందున భయంతో తమ ఆయుధ సామాగ్రిని వదలిపెట్టి.. వెనకకు పారిపోయారు.
శ్రీ రాజుగారి దాడులను ఎదుర్కొనేటందుకు ఆంగ్లపాలకులు మలబారు నుంచి ప్రత్యేక పోలీస్ దళాన్ని ఆంధ్రకు రప్పించింది. 1922 డిసెంబర్ 6న.. పెద్దగడ్డపాలెం వద్ద ఆ పోలీసులు శ్రీ రాజుగారిపై ఆకస్మిక దాడిని నిర్వహించారు.
శ్రీ రాజుగారు వారికి దొరకలేదు. చాకచక్యంతో తప్పించుకొన్నారు.
ఆ తర్వాత రాజుగారు తన దాడులను కొంతకాలం ఆపి వేశారు. ఆంగ్లేయులకు రాజుగారి జాడ తెలియలేదు. ఆంగ్ల ప్రభుత్వం మలబారు పోలీసులను వెనక్కు పంపేసింది.
మరలా.. 1923 ఏప్రిల్ పదునెనిమిదవ తేదీన శ్రీ రాజుగారు.. అన్నవరం పోలీస్ స్టేషన్‍పై దాడి జరిపి.. వారి ఆయుధాల కోసం.. చూచారు. ఆ స్టేషన్లో వారికి తుపాకులు.. ఏ యితర ఆయుధములూ లభించలేదు.
కాంగ్రెస్ కార్యవర్గం.. శ్రీ సీతారామరాజుగారి చర్యలకు.. వాదనకు.. వ్యతిరేకులు. కానీ స్థానిక ప్రజలే కాకుండా ప్రభుత్వాధికారులైనా డెప్యూటీ తహసీల్దారు.. పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ వంటి వారు కూడా శ్రీ రాజు గారికి.. విజయోత్సాహంతో స్వాగతం పలికారు.
1923 సెప్టెంబరు పదునెనిమిదవ తేదీన నడింపల్లి వద్ద గంమల్లు దొర ఆంగ్ల పోలీసులకు పట్టుబడటంతో శ్రీ రాజుగారికి మొదట పర్యాయం ఎదురు దెబ్బ తగిలింది.
ఆంగ్లేయులు పోలీస్ స్టేషన్లలో ఆయుధాలను వుంచేవారు కాదు. శ్రీ రాజుగారిని ఎలాగైనా పట్టుకోవాలనే నిర్ణయంతో ఆంగ్ల ప్రభుత్వాధికారులు రొండు అస్సాం రైఫిల్సు దళాలను రప్పించింది. రూథర్‌ఫర్డ్‌ను ప్రత్యేక కమీషనరుగా నియమించి శ్రీ రాజుగారిని పట్టుకొనవలసిన బాధ్యతను వారికి అప్పగించింది.
రూథర్‌ఫర్డ్.. కర్నల్ రాబర్ట్‌ను కలుసుకున్నాడు..
“వాట్ మ్యాన్!.. హౌ ఆర్ యూ!,..”
“ఫైన్ సార్!..”
“వాట్ అబౌవుట్.. అల్లూరి సీతారామరాజు!.. వై కాంట్ యు క్యాచ్ హిం!..”
“ఐ యాం ట్రయింగ్ మై లెవల్ బెస్ట్ సార్!..”
“బట్ నో రిజల్ట్.. హౌలాంగ్ యువిల్ ట్రయ్ దిస్ వే!..”
“టిల్ ఐ సక్సేడ్ సార్..”
“ఆఫ్టర్ ఆల్ ఎ జంగిల్ క్రీచర్.. వు హావ్ ఫెయిల్డ్ టు క్యాచ్..”
రాబర్ట్ మౌనంగా తలదించుకొన్నాడు.
‘ఒరేయ్! లూధర్.. వాడు జంగిల్ క్రీచర్ కాదురా!.. లయన్..’ అనుకొన్నాడు మనస్సున రాబర్ట్.
“వు కాల్ ఆల్ యువర్ లోకల్ సపోర్టర్స్.. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఏ మీటింగ్ విత్ దెమ్!.. దె షుడ్ బి ఫెయిత్‌ఫుల్ టు అజ్..” రూథర్‌ఫర్డ్, రాబర్ట్‌ను ఆదేశించాడు.
“యస్ సార్!..” అన్నాడు రాబర్ట్.
“వుయ్ విల్ మీట్ టుమారో మార్నింగ్ బై నైన్..”
“ఓకే సార్!..”
రూథర్‌ఫర్డ్ వెళ్లిపోయాడు.
రాబర్ట్.. తనకు సన్నిహితులైన లోకల్ వ్యక్తులను నలుగురిని పిలిపించాడు. వారికి మందును పోశాడు. వారం రోజుల లోపల అల్లూరి సీతారామరాజు ఏ ప్రాంతంలో వున్న విషయాన్ని కనిపెట్టి తనకు తెలియజేయవలసిందిగా వారిని ఆజ్ఞాపించారు.
నీతి, న్యాయం, ధర్మానికి అతీతంగా ఆంగ్లేయుల పంచన చేరి వారి సరదాలకు వినోదాలకు దలారులుగా వర్తించే కండ బలం వున్న స్వార్ధపరులు.. రాబర్ట్‌కు హితులు. వారి ఆదేశాన్ని పాటించే దానికి తలలను ఆడించారు. తప్ప త్రాగి వెళ్ళిపోయారు.
మరుదినం.. రూధర్‌ఫర్ట్ చెప్పిన సమయానికి రాబర్ట్ అతని కుసంస్కార హితులు రూథర్‌ఫర్డ్‌ను కలిసికొన్నారు. వారిని తన నమ్మిన బంటులుగా రాబర్ట్.. రూథర్‌ఫర్డ్‌కు పరిచయం చేశాడు. శ్రీ సీతారామరాజుగారి ఆచూకీ తెలిపితే.. మంచి బహుమానాన్ని యిస్తానని.. రూథర్‌ఫర్డ్ వారికి చెప్పాడు.
ఆ బహుమానం మీది ఆశతో వారు.. తప్పక శ్రీ రాజుగారు ఎక్కడ వున్నదీ కనుగొని.. తెలియజేస్తామని చెప్పి వారు వెళ్ళిపోయారు. రాబర్ట్ రూథర్‌ఫర్డ్ శ్రీ సీతారామరాజుగారిని పట్టుకొనే విధానాన్ని గురించి చర్చను సాగించారు.
ఎలాగైనా బ్రతకాలనే భావంతో వర్తించే వారికి స్వపర విచక్షణ వుండదు. వారి బ్రతుకే వారికి ముఖ్యం. మంచి చెడ్డల విచక్షణ వారికి వుండదు. రూథర్‌ఫర్డ్, రాబర్ట్ లాంటి వారి తియ్యని మాటను వారు చూపే ఎరలకు ఆశపడి తాము మనుషులమనే విషయాన్నే మరచిపోయారు కొందరు.
అధ్యాయం 50:
రాబర్ట్ అనుచరులలో ఒకడైన కరీమ్.. శ్రీమహాలక్ష్మి బంగారు విగ్రహ ప్రతిష్ఠను గురించి.. ఆ ఆలయానికి రామిరెడ్డిగారు ఏర్పాటు చేసిన కట్టుదిట్టాలను గురించి తెలియజేశాడు.
బంగారు విగ్రహం.. అన్నమాట రాబర్ట్‌కు ఆశ్చర్యాన్ని కలిగించింది.
వెంటనే కరీమ్‌తో కలసి వెళ్ళి మాత బంగారు విగ్రహాన్ని చూచాడు ఆశ్చర్యంతో కొన్ని నిముషాలు.
తర్వాత.. మౌనంగా కరీమ్‌తో కలసి వెళ్ళిపోయాడు. తన నిలయం చేరాడు.
సుల్తాన్.. క్రొత్తగా వచ్చిన రెవిన్యూ అధికారి (తహసిల్దార్) మార్చన్ వద్దనే వుండిపోయాడు.
రాబర్ట్.. అతన్ని తనతో రమ్మన్నాడు. కానీ అతని తత్వం.. చర్యలు నచ్చని సుల్తాన్ అతని కోర్కెను నిరాకరించాడు.
సుల్తాన్ తత్వానికి.. కరీమ్ తత్వానికి ఎంతో వ్యత్యాసం.. సుల్తాన్ న్యాయవాది.. కరీమ్ అవకాశవాది. రాబర్ట్ మన్ననలను పొందేటందుకు అతను రాబర్ట్ ఏది చెప్పినా చేసేటందుకు సిద్ధం.. కారణం.. రాజ్యంగ విధానం తెల్లవారి చేతుల్లో చిక్కుకొని వున్నందువల్ల.
వరండాలో కూర్చొని కొన్ని నిముషాలు ఆలోచించిన రాబర్ట్..
“కరీమ్!..”
“యస్ సార్!..”
“నాకు ఆ బంగారు విగ్రహం కావాలి!..”
“ఆ విగ్రహం హిందువులు పూజించే దేవత సార్!..”
“నీవు పూజిస్తావా!..”
“లేదు సార్!..”
“నేను పూజిస్తానా!..”
“మీరు క్రైస్తవులు కదా సార్!..
“అంటే నీవూ పూజించవు.. మేము పూజించము కదా!..” నవ్వాడు రాబర్ట్.
“అవును సార్!..”
“కాబట్టి.. మన ఆ విగ్రహాన్ని తీసుకోవడంలో తప్పు లేదు!..” వికటాట్టహాసంతో నవ్వాడు రాబర్ట్. కరీమ్‌కు మనస్సులో భయం..
‘ఎందుకు నేను వీడికి ఆ విగ్రహాన్ని గురించి చెప్పాను. వీడి వాలకం చూస్తూ వుంటే నన్నే ఆ విగ్రహాన్ని తెమ్మని చెప్పేలా వున్నాడు. అల్లా ముఝే బచావ్!..’ తన దైవాన్ని వేడుకొన్నాడు కరీమ్.
“కరీమ్!..”
“సార్!..”
“ఏమిటో ఆలోచిస్తున్నావ్!..”
“ఏం లేదు సార్!..”
“ఆఁ.. ఏం లేదా!..”
“అవును సార్!..”
“నో.. వుంది.. విగ్రహాన్ని ఎలా తేవాలా అని ఆలోచిస్తున్నావ్ కదూ!..” వ్యంగ్యంగా నవ్వుతూ అడిగాడు రాబర్ట్.
“నో.. నో.. సార్!.. నేను ఆ విషయాన్ని గురించి ఆలోచించడం లేదు సార్!..” తత్తరపాటుతో చెప్పాడు కరీమ్.
“మరి ఏ విషయాన్ని గురించి నీ ఆలోచన.. చెప్పు!..” రాబర్ట్ కంఠ తీవ్రతకు కరీమ్ వులిక్కిపడ్డాడు.
‘యా అల్లా!.. ఏ షైతాన్ కా పంజా సే ముఝే బచావ్!..’ దీనంగా అనుకొన్నాడు.
“సీ.. కరీమ్!.. నీవు ఏం చేస్తావో.. ఎలా చేస్తావో మాకు తెలియదు. బాగా ఆలోచించు. ప్లాన్ వేయ్.. వన్ మంత్ లోపల నాకు ఆ విగ్రహం కావాలి. నీకు మేము మంచి బహుమానం యిస్తామ్!.. సరేనా!.. కాదన్నావో కాల్చి పారేస్తాన్!.. ఆలోచించు.. ఆలోచించు.. బాగా ఆలోచించు” చిరునవ్వుతో లోనికి వెళ్ళిపోయాడు రాబర్ట్.
కరీమ్ తలపై పిడుగు పడినట్లయింది. నేల కూలబడ్డాడు.
(ఇంకా ఉంది)