[దంత సంరక్షణ కోసం డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారు నిర్వహిస్తున్న ప్రశ్నలు జవాబులు ఫీచర్ – ‘దంతవైద్య లహరి’.]
పన్ను – కన్ను
ప్ర: డాక్టర్ గారూ! దంతం తీసేప్పుడు కంటి నరం కూడా దెబ్బ తింటుందని, తద్వారా, అంధత్వం వస్తుందని విన్నాను! ఇది ఎంతవరకూ నిజం?
– శ్రీ గోనుగుంట మురళీకృష్ణ, తెనాలి.
జ: మూఢ నమ్మకాలు ప్రచారం అయినంత త్వరగా, గొప్పగా, ఏ విషయమూ అంతగా ప్రచారం కాదు! పల్లెల్లో నిరక్షరాస్యుల్లో ఇది మరీ ఎక్కువ. అలా అని విద్యావంతులు సైతం దీనికి అతీతులు కారు. పన్ను – కన్ను, వాటి నిర్మాణం, వాటికి సరఫరా అయ్యే నరాలు, రక్తనాళాల గురించి, దంత వైద్యంలో శస్త్ర చికిత్సా విధానాల గురించి సరైన అవగాహన లేనివారు ఇలాంటి ప్రచారానికి కొమ్ముకాస్తుంటారు.
అందుచేత పన్ను తీస్తే కన్నుపోవడం అనేది నూరుశాతం మూఢ నమ్మకమే! గ్రామ వాతావరణంలో, ఇప్పటికీ చాలా గ్రామాలలో, తర్ఫీదు పొందిన దంతవైద్యులు లేకపోవడం వల్ల, వైద్యరంగం పూర్తిగా, నాటువైద్యుల చేతిలో చిక్కి ఉంటుంది. అక్కడ వుండే పరిస్థితులకు వారు చెప్పిందే వేదం! సాధారణంగా పన్ను తీసే విషయంలో, శాస్త్రీయమైన అవగాహన లేక తప్పుడు పద్ధతుల్లో పన్ను తీసే ప్రయత్నం చేస్తే కన్ను పోవడమే కాదు, ఎలాంటి సమస్య అయినా ఎదురుకావచ్చు. ఈ నేపథ్యంలో పంటినొప్పితో ఎవరైనా వచ్చి, పన్ను తీసేయమంటే, అది తప్పించుకోవడానికి మరో మార్గం లేక ‘పన్ను తీస్తే, కన్ను పోతుంది’ అనడమో లేక చూపు తగ్గిపోతుందని భయపెట్టడమో చేస్తుంటారు. అది ఈ నోటా.. ఆ నోటా.. బహుళ ప్రచారమై, ఒక సామాజిక సత్యంగా ముద్ర పడిపోతుంది. అంతే తప్ప పన్ను తీయించుకున్నవాళ్లందరికీ కంటి చూపు కరువయితే, పన్ను తీసిన దంతవైద్యుడు కళ్ళు, కంటి చూపు మిగులుతాయా? పై పళ్ళు తీసినందుకు కంటిచూపు పోవడం అసలు కరెక్ట్ కాదు. సరైన పద్ధతుల్లో పళ్ళు తీయకుంటే కళ్ళే కాదు, ఇతర సమస్యలు కూడా రావచ్చు. కళ్ళకు – పళ్లకు, మెదడునుండి సరఫరా అయ్యే నరాలు, రక్త నాళాలు వేరు-వేరు. దేని పని అది చేస్తుంది.
దంతవైద్య రంగంలో, పన్ను తీసే ఒక ప్రత్యేకమైన విభాగం ఉంటుంది. దీనిని ‘ఎక్సోడాన్షియా’ విభాగం అంటారు. చికిత్సకు అనుకూలంగా లేని పళ్ళను, తీసివేయడానికి, లేదా వైద్యపరంగా (ఆర్థోడోంటిక్స్) మంచి పళ్ళను తీసివేయడానికి, కాన్సర్ చికిత్సాపరంగా పళ్ళు తీసి వేయవలసినప్పుడు, ఈ విభాగం ఉపయోగపడుతుంది.
ఒకప్పుడు, పంటి నొప్పి వస్తే, పన్ను తీసివేయడమే వైద్యం. ఇప్పటి ఆధునిక దంతవైద్య సదుపాయాలు అందుబాటు లోనికి వచ్చాక, పన్నుతీసే పరిస్థితి చాలామట్టుకు తగ్గిపోయిందని చెప్పాలి. అవసరాన్ని బట్టి, ఇప్పుడే కాదు, ఎప్పుడైనా పన్ను తీయక తప్పదు. ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, పన్ను తీసిన తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలను మనం పాటించకపోయినా, ఇతర సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం వుంది. నైపుణ్యం గల, అనుభవం గల దంతవైద్యుడు పరిశుభ్రమైన ఉపయోగించే పరికరాలు, పరికరాలను ఉపయోగించిన విధానం తరువాత మనం తీసుకునే జాగ్రత్తలు, చికిత్స విజయానికి గీటురాళ్ళు. ఇందులో ఎక్కడ లోపం జరిగినా సమస్యలు తప్పవు. చివరగా చెప్పేదేమంటే ‘పన్ను తీయడానికి,కంటి చూపు పోవడానికి సంబంధం లేదు’.
~
టూత్ పేస్టులు – బ్రష్‍లు:
ప్ర: ఆర్యా, దంతధావనం గురించి వాడవలసిన బ్రష్‌లు -పేస్టుల గురించి దయచేసి వివరించండి.
– దర్భశయనం శేషాచార్య,తెలుగు పండిట్, కరీంనగరం.
జ: శేషాచార్య గారూ.. అసలైన ప్రశ్న అడిగారు. ఇది అందరికీ అవసరమైన అంశం. దంతసంరక్షణ విషయం లోనూ, నోటి పరిశుబ్రత విషయం లోనూ, రకరకాల దంత వ్యాధుల విషయం లోనూ, దంతధావనం, దాని కోసం ఉపయోగించే బ్రష్‌లు – పేష్టులు గురించి అందరికీ కనీస అవగాహన ఉండడం అవసరం.
నిజానికి దంత సంరక్షణ అనేది నోటి పరిశుభ్రత (ఓరల్ హైజీన్) మీద ఆధారపడి ఉంటుంది. నోటిపరిశుభ్రతకోసం మనం తీసుకునే జాగ్రత్తలలో ‘దంతధావనం’ (టూత్ బ్రషింగ్) ప్రధానమైంది. అంటే, మామూలు మాటల్లో చెప్పాలంటే, ‘పళ్ళు తోముకోవడం’ అన్న మాట!
ఆధునిక దంతధావన విధానాలు/సాధనాలు, మనకు అందుబాటులోనికి రాక పూర్వం, పళ్ళు తోముకోవడానికి బొగ్గు, ఇటుక పొడి, కచ్చిక వంటివి వాడేవారు.
వాటి స్థానంలో మెత్తని పళ్ళ పొడులు అవతరించాయి. అలాగే టూత్ బ్రష్‌లు వాడుక లోనికి రాకముందు, పళ్ళు తోముకోవడానికి పంటిపుల్లలు (పనుదోము పుల్లలు) వాడేవారు. దీని కోసం వేప, గానుగ పుల్లలు విరివిగా వాడేవారు. ఔషధపరంగా వీటి వాడకం పంటి చిగుళ్ల ఆరోగ్యానికి, పంటి పటిష్ఠతకు ఉపయోగపడేవి.
ఆధునికంగా, పంటి పుల్లల స్థానంలో టూత్ బ్రష్‌లను, పళ్ళ పొడుల స్థానంలో మనం ఇప్పుడు ‘టూత్ పేస్ట్’ లను చూస్తున్నాం. అలాగే ఎలెక్ట్రిక్ టూత్ బ్రష్‌లు కూడా అందుబాటులోనికి వచ్చాయి. వీటిని అంగవైకల్యం ఉన్నవారితో పాటు మామూలు జనంకూడా వాడుతున్నారు.
టూత్ బ్రష్‌లు:
ప్రపంచ వ్యాప్తంగా మనకు ముఖ్యంగా మూడు రకాల టూత్ బ్రష్ లు, విఫణిలో అందుబాటులో వున్నాయి. ఆయా వ్యక్తుల అభిరుచిని బట్టి ఆయా టూత్ బ్రష్‌లు వాడుతుంటారు. అవి 1) సాఫ్ట్ 2) మీడియం 3) హార్డ్. ఈ వర్గీకరణ పళ్ళు తోమడానికి ఉపయోగపడే బ్రష్ లోని కుచ్చు (బ్రిజిల్స్) మీద ఆధారపడి ఉంటుంది.
అయితే, ఈ మూడింటిలో ఏ బ్రష్ వాడడం దంతసంరక్షణ రీత్యా ఆరోగ్యప్రదం అన్నది అందరిలోనూ ఉదయించే సందేహం.
ఈ సందేహాన్ని నివృత్తి చేసుకునే ముందు, బ్రషింగ్ ఎలా, ఎంతసేపు, రోజుకు ఎన్నిసార్లు చేయాలన్నది తెలుసుకోవాలి. శాస్త్రీయ పద్ధతిలో రోజుకు ఒకసారి ఉదయం బ్రష్ చేసుకుంటే చాలు. తృప్తికోసం రాత్రి పడుకునేముందు పళ్ళు తోముకున్నా తప్పులేదు. దంతధావనానికి గంటలకొద్దీ సమయం వెచ్చించవలసిన అవసరం లేదు. మృదువుగా, బ్రష్ మీద ఒత్తిడి పెట్టకుండా, రెండు నుండి ఐదు నిముషాలు పళ్ళు తోముకుంటే చాలు. గట్టిగా రుద్ది పళ్ళు తోముకోవడం మూలాన పంటి పింగాణీ పొర (ఎనామిల్) త్వరగా అరిగిపోయి, పళ్ళు ‘జివ్వు’మని గుంజుతాయి. ఈ నేపథ్యంలో పళ్ళు తోముకోవడానికి మొదటి ప్రాధాన్యత ‘సాఫ్ట్ బ్రష్’ (కంపెనీ ఏదైనా) కు ఇవ్వవలసి ఉంటుంది. తరువాతి స్థానం మీడియం బ్రష్‌ది. చివరి స్థానం ‘హార్డ్ బ్రష్’ది.
అలాగే, ఎన్నాళ్ళకోసారి బ్రష్ మార్చుకోవాలన్నది కూడా సందేహమే! బ్రష్ లోని పళ్ళు తోముకునే కుచ్చు నిటారుగా, వంగిపోకుండా ఉన్నంత కాలం ఆ బ్రష్‌ను హాయిగా వాడవచ్చును. అయినా బ్రష్ మార్చుకోవాలన్నది వారి అభీష్టం మీద ఆధారపడి వుంటుంది. బ్రష్ ఏదైనా పంటి ఆరోగ్యం తోముకునే విధానం మీదనే ఆధారపడి ఉంటుందన్న విషయం మరువరాదు.
టూత్ పేస్ట్‌లు:
టూత్ పేస్ట్‌ల వాడకం విషయంలో, ఏ పేస్ట్ మంచిది? అన్నది ఒక చిక్కు ప్రశ్న.
దీని గురించి పెద్దగా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మార్కెట్‌లో చాలా రకాల టూత్ పేస్టులు, రకరకాల కంపెనీలు ఉత్పత్తి చేయగా, మనకు అందుబాటులో వున్నాయి. ఎవరికీ ఇష్టమైన బ్రాండు వారు వాడుకొనవచ్చును.
ఈ స్వేచ్ఛ పేస్టులు ఎంచుకోవడంలో మనకు నూరు శాతం వుంది. అయితే ప్రత్యేక ఔషధపరమైన టూత్ పేస్టులు ఉన్నాయి. పళ్ళు గుంజుతున్నప్పుడు, చిగుళ్ళనుండి రక్తం కారుతున్నప్పుడు, పళ్ళు మిలమిల మెరవడానికి, అవసరాన్నిబట్టి, దంతవైద్యులు ఆయా పేస్టులను సిఫారస్ చేస్తారు. ఇవి సందర్భాన్ని బట్టి వాడుకునే పేస్టులే కానీ, ఎప్పుడూ వాడుకునేవి కాదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అలాగే చిన్నపిల్లల కోసం కూడా ప్రత్యేకమైన పేస్టులు, టూత్ బ్రష్‌లు లభ్యం అవుతున్న విషయం మరచిపోకూడదు.
డా. కె. ఎల్. వి. ప్రసాద్, సివిల్ సర్జన్ (రిటైర్డ్), 9866252002
~
పాఠకులు తమ దంత సమస్యలకు సంబందించిన ప్రశ్నలు (ఎన్నైనా, ఇందులో ఎలాంటి నియమం లేదు) ‘సంచిక’ సంపాదకులకు kmkp2025@gmail.com అనే మెయిల్ ఐడికి, ప్రతి గురువారం లేదా అంతకంటే ముందు పంపవచ్చు. ప్రశ్నలు పంపేవారు విధిగా తమ పూర్తి పేరు, ఊరు, మొబైల్ నంబరు రాయాలి.