తెలుగుజాతికి ‘భూషణాలు’-27

0
3

[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]

~

హృద్రోగ శస్త్ర చికిత్స నిపుణులు డా. పి. వేణుగోపాల్ (6 జూలై 1942):

1994లో భారతదేశంలో మొట్టమొదటి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసిన వైద్యనిపుణులు డా. పి. వేణుగోపాల్. 1992లో పుట్టపర్తిలో సత్యసాయి సంస్థల ఆధ్వర్యంలో హాస్పిటల్ స్థాపించినవుడు శని, ఆది వారాలలో ఢిల్లీ నుండి పుట్టపర్తి వచ్చి సంవత్సర కాలంలో వందలాది గుండె ఆపరేషన్లు చేశారు. ప్రధాని శ్రీ పి. వి. నరసింహారావు చేతుల మీదుగా సాయిబాబా గారి సమక్షంలో స్వర్ణ కంకణ బహుకృతులు కావడం నేను ప్రత్యక్షంగా చూశాను. రాజమండ్రిలో రైతు కుటుంబంలో జన్మించి 1963లో ఢిల్లీలోని AIIMS నుండి యం.బి.బి.యస్ చేశారు. చండీఘడ్‌లో యం.యస్., ఆపైన హృద్రోగ శస్త్రచికిత్సలో అద్యయనం, పరిశోధనలు చేశారు.

AIIMS ఢిల్లీలో కార్డియాలజీ విభాగంలో డాక్టరుగా, 1992 నుండి శస్త్రచికిత్స విభాగాధిపతిగా సంవత్సరానికి మూడు వేల గుండె ఆపరేషన్లు జరిగేలా చూశారు. ఒక వేయికు పైగా ఓపెన్ హార్ట్ సర్జరీలు జరిపారు. వంద మంది కార్డియోథొరాసిక్ సర్జన్లను తయారు చేశారు. వీరి శిష్యులలో ఒకరైన డా. ఆర్. వి. కుమార్ ప్రస్తుతం తిరుపతిలో SVIMS డైరక్టరుగా, వైస్ ఛాన్సలర్‌గా పని చేస్తున్నారు.

నేణుగోపాల్ 1997లో భారత రాష్ట్రపతి గౌరవ హృద్రోగ నిపుణులుగా నియమితులయ్యారు. 2008లో AIIMS డైరక్టరుగా అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి అంబుమణి రామదాసుతో సిద్ధాంతపరంగా విభేదించి రాజీనామా చేశారు. అంతర్జాతీయ హృద్రోగ సంస్థలకు సలహాదారు. 1994లో గుండె మార్పిడి తొలిసారిగా చేసినప్పుడు పట్టిన సమయం వంద నిముషాలు.

అవార్డులు:

  1. డా. బి. సి. రాయ్ అవార్డు
  2. పద్మ భూషణ్ – 1998
  3. శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డు, హైదరాబాదు 2010
  4. ఇందిరా గాంధీ ప్రియదర్శినీ అవార్డు

ఇలా దాదాపు ఇరవై అవార్డులు అందుకున్నారు.

‘Heart Felt’ అనే గ్రంథాన్ని డా. వేణుగోపాల్, వారి సతీమణి ప్రియా సర్కార్ రచించారు. స్వీయ జీవితానుభవాలు జోడించారు. యన్.టి.ఆర్. ఆరోగ్య విశ్వవిద్యాలయం, రాజస్థాన్ విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్‍లు ప్రదానం చేశాయి. 55వ ఏట వివాహం చేసుకున్నారు. రోజుకు 18 గంటలు పని చేయడంలో ఆయన దిట్ట.

నాట్యాచార్యులు వెంపటి చిన సత్యం (15 అక్టోబరు 1929 – 27 జూలై 2012):

కూచిపూడి నాట్యకళను అంతర్జాతీయ స్థాయికి తెచ్చిన గురువు చిన సత్యం. కూచిపూడి (కృష్ణా జిల్లా) వీరి స్వస్థలం. కూచిపూడి నృత్యాన్ని తాడేపల్లి పేరయ్య శాస్త్రి, అన్నగారు వెంపటి పెద్ద సత్యం వద్ద అభ్యసించారు. ఆ కళకు నాట్య శాస్త్ర లక్షణాలను సమన్వయం చేసి శోభానాయుడు వంటి ఎందరో శిష్యులను దేశానికి అందించారు. 1963లో మదరాసులో కూచిపూడి ఆర్ట్ అకాడమీ స్థాపించి 150 సోలో ఐటములు, 15 డాన్స్ ప్రోగ్రాములు స్వరపరచి ప్రదర్శన యోగ్యం చేశారు.

‘శ్రీకృష్ణ పారిజాతం’ తొలి ప్రయత్నం. ‘క్షీరసాగర మథనం’లో ఆయన శివుని పాత్ర ధరించేవారు. ఎందరో శిష్యులను తీర్చిదిద్దారు. ఆయన రూపొందించిన నృతరూపకాలు: పద్మావతీ శ్రీనివాస కల్యాణం, విప్రనారాయణ చరిత్రం, మేనకా విశ్వామిత్ర, శివధనుర్భంగం, శాకుంతలం, భామాకలాపం, చండాలిక, రుక్మిణీకల్యాణం, హరవిలాసం.

చినసత్యం జీవన రేఖలను అండవల్లి సత్యనారాయణ, సూర్యారావులు రచించారు. కూచిపూడి నృత్యానికి శాస్త్రీయతను సమకూర్చి దేశ విదేశాలలో ప్రచారం చేశారు. తమిళంలో కుమార సంభవం, పద్మావతీ పరిణయం, శ్రీకృష్ణ పారిజాతం తయారు చేశారు. 1971లో తన శిష్య బృందంతో ఇంగ్లండ్, ఫ్రాన్సు దేశాలు తొలిసారిగా వెళ్ళి ప్రదర్శన లిచ్చారు. 1973లో దక్షిణ అమెరికా, కరేబియన్ దీవులకు వెళ్ళారు. కూచిపూడిని కేవలం నృత్యంగానే కాక నృత్య నాటకంగా తీర్చిదిద్దారు. కూచిపూడి గ్రామంలో యువకులకు శిక్షణనిచ్చి వారిని ప్రోత్సహించారు. ఎన్.టి. రామారావుకు కుమార్తె దగ్గుబాటి పురంధరేశ్వరి ఆయన శిష్యురాలు. ‘నర్తనశాల’ సినిమాకి చినసత్యం నాట్య సహకారం అందించారు. ‘పాండవ వనవాసం’, ‘శ్రీకృష్ణ విజయం’ సినిమాలలో హేమమాలినికి నృత్యం అవకాశం కల్పించారు. యస్వీ భుజంగరాయ శర్మ, సంగీతరావు, చినసత్యం – త్రయం కలిసి ఎన్నో నృత్య రూపకాలకు కల్పన చేశారు.

గౌరవ పురస్కారాలు:

  • తిరుమల తిరుపతి దేవస్థానముల ఆస్థాన నాట్యాచార్య పదవి
  • మదరాసు మ్యూజిక్ అకాడమీ వారి స్మారక అవార్డు
  • రాజా-లక్ష్మి అవార్డు
  • ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ
  • కేంద్ర సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్
  • కాళిదాస పురస్కారం – మధ్యప్రదేశ్ ప్రభుత్వం.
  • కలైమామణి – మదరాసు ప్రభుత్వం
  • పద్మ భూషణ్ – 1998
  • శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం డాక్టరేట్ – 1980

రాజారెడ్డి (6 అక్టోబర్ 43) రాధారెడ్డి (15 ఫిబ్రవరి 55) దంపతులు:

భారతీయ నృత్య సంప్రదాయానికి అఖండ ఖ్యాతిని తెచ్చిపెట్టిన రాజారెడ్డి రాధారెడ్డి దంపతులు తెలంగాణకు చెందినవారు (ఆదిలాబాదు జిల్లా). రాజారెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదివారు. రాజారెడ్డి రాధను, ఆమె, చెల్లెలు కౌసల్యలను వివాహమాడారు. వారి పిల్లలు యామిని, భావనలు కూడా నృత్య కళాకారిణులు. చిన్నతనంలో కూచిపూడి భాగవతులు వారి గ్రామానికి వచ్చి ప్రదర్శన లిచ్చారు. అందులో వైజయంతి మాల నాగిని ప్రదర్శన ఆయనను ఆకర్షించింది. ఏలూరులో వేదాంతం ప్రహ్లాదశర్మ వద్ద దంపతు లిద్దరు నృత్య శిక్షణ పొందారు.

1966లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ స్కాలర్‍షిప్‍తో ఢిల్లీలో గురు మాయారావు వద్ద శిక్షణ పొందారు. 1970లో వీరి తొలి ప్రదర్శన తమిళనాడులో బహుళ ప్రచారం పొందింది. టూరిజం మంత్రి కరణ్ సింగ్, ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ వీరి ప్రదర్శనలు చూసి వీరికి ఢిల్లీలో గృహావసతి కేటాయించారు. విదేశాలలో ఈ దంపతులు అనేక నృత్య సంబంధ ఉత్సవాలలో ప్రదర్శన లిచ్చారు.

ఢిల్లీలోని సాకేత్‌లో నాట్య తరంగిణి సంస్థను ప్రారంభించి ఎందరినో శిష్యులను తీర్చిదిద్దారు. కేవలం నృత్యమే గాక సంగీతం, యోగా, సంస్కృతాలలో శిక్షణ ఇచ్చారు. సంస్థకు మినీ అడిటోరియం, గ్యాలరీ, హాస్టలు సౌకర్యాలున్నాయి. ఏటా ఈ సంస్థ సంగీతోత్సవాలు, నృత్యోత్సవాలు ‘పరంపర’ శీర్షికతో నిర్వహిస్తుంది.

కేవలం కూచిపూడి నృత్యానికే గాక యావత్ కళారంగానికి రాజారెడ్డి దంపతులు సుపరిచితులు. జంటగా దంపలిద్దరూ ప్రదర్శన లివ్వడం ప్రత్యేకత. 81 ఏళ్ల వయస్సులో రాజారెడ్డి ఎందరికో మార్గదర్శకులు.

అవార్డులు:

  • పద్మ శ్రీ 1984
  • పద్మ భూషణ్ 2000
  • సంగీత నాటక అకాడమీ అవార్డు
  • నృత్య చూడామణి అవార్డు
  • హైదరాబాదు విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్

2000 సంవత్సరంలో హైదరాబాదు – DRDO శాస్త్రవేత్త రామ్ నారాయణ్ అగర్వాల్‌కు కూడా పద్మ భూషణ్ ఆవార్డు లభించింది. అగ్ని క్షిపణి తయారీకి ఆద్యుడాయన. ఏరోస్పేస్ శాస్త్రవేత్తగా గణనీయమైన కృషి చేశారు.

ప్రఖ్యాత కవి బోయి భీమన్న (19 సెప్టెంబరు 1911 – 16 డిసెంబరు 2005):

సామాజిక చైతన్యం కోసం సాహితీ వైభవాన్ని చాటి చెప్పిన కవి భీమన్న. దళిత పాలేరు ఇంటి పుట్టి అసంఖ్యాకమైన గౌరవ పురస్కారాలందుకునే రచనలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో నిరుపేద కుటంబంలో జన్మించారు. పేదరికము, అంటరానితనం ఆయనను వెన్నంటాయి. చిన్నతనం నుండి దురాచారాల పట్ల వ్యతిరేకతను పెంచుకొని ఎదిగారు. అనుభవం నేర్పిన పాఠాలతో రచనలు చేశారు. పంచ పాండవులవలె ఐదుగురు పిల్లల్లో ఆయన మూడోవాడు. భీమన్న అని పేరు పెట్టారు. 1937లో బి.ఏ. తర్వాత బి.ఇడి పూర్తి చేశారు.

భీమన్న వ్రాసిన ‘పాలేరు’ నాటకం లోను, ‘రాగవాసిష్ఠం’ నాటకం లోను కులాంతర వివాహాలను ప్రతిపాదించారు. వృత్తిరీత్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనువాద విభాగం డైరక్టరుగా చాలాకాలం పనిచేశారు. హైమవతి గారిని వివామాడారు. బోయి భీమన్న సమగ్ర సాహిత్యం పేర తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రథమ సంపుటిని ప్రచారించారు. 1988 నాటికి పాలేరు నాటక రచన చేసి 50 ఏళ్లు పూర్తి అయినాయి. 1973లో ‘గుడిసెలు కూలిపోతున్నై’ కావ్యంలో దళితులపై అఘాయిత్యాలను చిత్రించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో బోయి భీమన్న సాహిత్య పీఠం నెలకొల్పారు. ఆకాశవాణిలో ప్రసారానికి ఎన్నో భావగీతాలు వ్రాశారు.

‘గుడిసెలు కూలిపోతున్నై’ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1975లో లభించింది.

ఆయన ఇతర రచనలు:

కవితలు: రాగ వైశాఖి, రాఖీలు, భీమన్న ఉగాదులు, భీమన్న కావ్యకుసుమాలు, మోక్షం నా జన్మ హక్కు, చివరి మెట్టు మీద శివుడు, రాగోదయం, మధుబాల, మధుగీత, దీపసభ

నాటకాలు: పాలేరు (1938), కూలిరాజు, అసూయ, ప్రగతి, పడిపోతున్నాయి గోడలు, రాగ వాసిష్ఠం, ఆదికవి వాల్మీకి, వేదవ్యాసుడు, ధర్మవ్యాధుడు, బాలయోగి, చండాలిక, చిత్రకళా ప్రదర్శనం

వచన రచనలు: ఏక పద్యోపాఖ్యానం, ఇదిగో ఇదీ భగవద్గీత, జన్మాంతర వైరం, దర్మం కోసం పోరాటం, అంబేద్కరిజం, జానపదుని జాబులు

పురస్కారాలు:

  • ఆంధ్ర యూనివర్శిటీ కళా ప్రపూర్ణ – 1971
  • పద్మ శ్రీ – 1971,
  • పద్మ భూషణ్ – 2001
  • కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు – 1975
  • కాశీ విద్యాపీఠం గౌరవ డాక్టరేట్ – 1976
  • నాగార్జున యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్
  • తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం – 1991

Images Credit: Internet

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here