[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[నరేశ్ అనే అసిస్టెంట్‌ని పిలుస్తాడు రజనీశ్. అతను రాగానే, జయంతి ఆర్ట్స్‌ది ఎన్నో షెడ్యూల్‍లో ఆగిందని అడుగుతాడు. రెండదని అతను చెప్తాడు. హీరో కె.కె. రాడా అని అడిగితే, హీరో నుంచి జవాబు లేదని చెప్తాడు నరేశ్. తనతో రమ్మని నరేశ్‍కి సైగ చేసి, సమీర్‍తో పాటు కారులో బయల్దేరుతాడు రజనీశ్. ఎప్పుడొచ్చావ్, ఎక్కడుంటున్నావ్ అని వివరాలు కనుక్కుని, సమీర్‍ని తన గెస్ట్ హౌస్‌లోకి వచ్చేయమంటాడు. నా సినిమాలు చూస్తావా అని సమీర్‍ని అడుగుతాడు. చూస్తానని చెప్పి, రజనీశ్ సినిమాలోని ముఖ్యాంశం గురించి చెప్తాడు సమీర్. వీళ్ళు ఆఫీసుకు చేరేసరికి అక్కడ నిర్మాత సిద్దయ్య ఉంటాడు. నరేశ్ ఏవో సద్దేసి వెళ్లిపోతాడు. తమ సినిమా గురించి కంగారుపడుతుంటాడు సిద్దయ్య. ఆ రోజు పేపర్లో వచ్చిన ఓ వార్తని చూపి, రజనీశ్‍ని వివరణ అడుగుతాడు. తమ సినిమాలో హీరో కె.కె.ని మార్చేస్తున్నాని చెప్తాడు రజనీశ్. తన మీద నమ్మకం ఉంచమంటాడు. ఈలోపు సమీర్ అక్కడున్న ఉన్న వాష్ బేసిన్ వద్దకు వెళ్ళి ముఖం కడుక్కుని రజనీశ్ వైపు తిరుగుతాడు. సమీర్‍ని సిద్దయ్యకి చూపిస్తూ, ఇతనే మన కొత్త హీరో అని అంటాడు రజనీశ్. – ఇక చదవండి.]
[dropcap]జ[/dropcap]రిగిన దాని మీద నాకు నమ్మకం కలుగలేదు. క్షణంలో పరిస్థితులు మారిపోయాయి. రజనీశ్ అధీనంలో ఉన్న గెస్ట్ హౌస్ లోకి వచ్చేసాను. రకరకాల రచయితలు వచ్చి కథ వినిపిస్తున్నారు. అక్కడక్కడ పాయింట్లు వ్రాసుకుంటున్నాను.
ఒక రోజు ఓ పెద్దాయన వచ్చాడు. చేతిలో ఓ కర్ర, పెదవుల దగ్గర సైప్ పెట్టుకునున్నాడు. నేను కాళ్లు టీపాయ్ మీద జాపుకుని టివీ చూస్తున్నాను. షెడ్యూల్ ఎప్పుడైనా వేస్తారు, సిద్ధంగా ఉండమని కబురు వచ్చింది. ఇదంతా ఎలాగా అని అలోచిస్తున్నాను. రజనీశ్‍తో కలవటం, చివరిసారి ఆ నిర్మాత సమక్షంలోనే. ఆ తరువాత అసిస్టెంట్స్‌కు అప్ప జెప్పి ఆయన ఎక్కడికో వెళ్లిపోయాడు. ఆ జరుగుతున్న సినిమా తాలూకు షూటింగ్ అయిపోయిన తరువాత నా సంగతి చూస్తారని అందరూ అన్నారు.
నాకు తెలియకుండానే పేపర్లలో, పత్రికలలో నా ఫొటోలు వచ్చేస్తున్నాయి..
కాళ్లు క్రిందకి దింపాను. ఈయన తలుపు దగ్గర నిలబడి నన్నే తదేకంగా చూస్తున్నాడు.
“అయామ్ జహీర్” అన్నాడు.
“ఓ. రండి, కూర్చోండి.”
కొద్దిగా ఇబ్బందిగానే నడుచుకుంటూ వచ్చాడు. కర్రని సోఫాకి ఆన్చి కూర్చున్నాడు.
“అయితే మీరు సమీర్ అన్నమాట”, గంభీరమైన గొంతుతో పలికాడు.
అదే సమస్య అన్నట్లు చప్పరించాను.
“రజనీశ్ ఎలా పని చేస్తారో తెలుసా?”, అడిగాడు.
“మీరేం చేస్తూ ఉంటారు?”, అడిగాను.
కోపం వచ్చినట్లుంది. అటూ ఇటూ చూసాడు. వరండాలో ఎవరో వెళుతుంటే ఇలా రమ్మని సైగ చేసాడు. అతను చేతులు కట్టుకుని నిలబడ్డాడు.
“ఈ అబ్బాయికి నేనెవరో చెప్పు.”
అతను మా ఇద్దరినీ వింతగా చూసాడు.
“సార్, ఈయన జహీర్ గారు. ముంబయిలో పెద్ద పెద్ద దర్శకులకు, హీరోలకు ఈయనే సలహాదారు. ఈయన చెయ్యి పడకుండా ఏ ప్రాజెక్టు పూర్తి కాదు.”
“ఓ. నమస్కారం సార్.”
తల చిన్నగా ఊపాడు. ఆ వచ్చినతన్ని వెళ్లిపోమన్నాడు..
“నేను ఏమీ చెయ్యను..” చెప్పాడు, “..నా ముందర అన్నీ నా చేతుల మీదుగా జరిగిపోతాయి.”
నేను చాలా సేపు ఏమీ మాట్లాడలేదు. ఆయనే కొద్దిగా దగ్గాడు.
“చూడండి సమీర్, ఇక్కడ కష్టపడాలి. పెద్ద, చిన్న గౌరవాలన్నీ పాటించాలి. అదే పద్ధతి. రజనీశ్ దగ్గర పని చెయ్యటం అంటే సామాన్యమైన విషయం కాదు. అందులోనూ ఒకళ్లని బయటికి పంపి ఇంకొకరిని తీసుకురావటం, అందులోను ఒక పేరు మోసిన సినిమాలో అంటే నీ మీద ఎన్నో ఆశలు, ఆశయాలు అందరూ పెట్టుకున్నారని అర్థం.”
“అదే భయంగా అంది సార్.”
“ఈ భయాలకు ఇక్కడ చోటు లేదు. రజనీశ్‍కి ఒక పద్ధతి ఉంది. ఒక పాత్ర గురించి తెలుసుకోవాలంటే దానికి ముందు, వెనుక గల వ్యవహారమంతా అవగాహనలోకి మీరు తెచ్చుకోవాలి. కొన్ని పుస్తకాలు చదవాలి, కొన్ని సినిమాలు చూడాలి, చర్చలు జరపాలి. ప్రశ్నలు అడగాలి, సమాధానాలు తెలుసుకోవాలి.”
“నేను స్క్రిప్ట్ చదువుతున్నాను. కానీ పాత్ర పూర్తిగా అర్థం కావటం లేదు.”
“అందుకే నేను వచ్చింది. జీవితంలో ఎవరినైనా ప్రేమించావా?”
“లేదు. ఆ ప్రేమ అనే దినుసు ఎలా ఉత్పన్నమవుతుందో కూడా తెలియదు.”
“ఊ.. ఇదొక విచిత్రమైన ఒరవడి గల పాత్ర. ప్రేమిస్తాడు కానీ అమ్మాయి ఒప్పుకోకపోయినా ఫరవాలేదనే వ్యక్తి.”
“కారణం?”
“నేను ప్రేమించటం నా చేతిలో నున్న వ్యవహారం, దానికి ఎవరి పెత్తనంతో పని లేదు. ఆ ప్రేమను ఇంకొకరి మీద రుద్దటం భావ్యం కాదంటాడు. అమ్మాయి కూడా ప్రేమిస్తున్నాను అని చెప్పిన తరువాత నేను ప్రేమించాను, లేదా ఇష్టపడ్డాను కాబట్టి నన్ను ఇష్టపడ్డావా లేక నిజంగా నన్ను ప్రేమించావా అని అడగటంతో కథ ప్రారంభం అవుతోంది.”
నాకు నవ్వొచ్చింది.
“పిచ్చి మాలోకం అని అమ్మాయి ప్రక్కకు ఎందుకు వెళ్లలేకపోయింది?”
“అమ్మాయి, అబ్బాయి.. ఇద్దరు పోటీదారులే. కాలేజీలో ఆకతాయితనంలో జరిగిన వాటిని జీవితంలోకి తీసుకొని వచ్చి ఒకరినొకరు నాశనం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కక్షలు సాధిస్తూనే ఛాలెంజ్‌గా తీసుకొని తరువాత జీవితంలో స్థిరపడాలనుకున్నారు.”
“కథలో కొంత వెర్రితనం కనపడుతోంది.”
“అదే ప్రధానం, మనం అనుకున్నట్లు సమాజంలో అందరూ ఎవరినో ఒకరిని ఇష్టపడి పెళ్లి చేసుకొని స్థిరపడిపోవాలనుకోరు. రకరకాలుగా ఉంటారు.”
“అయితే ఈ మనిషి బైపోలార్ సమస్య ఉన్నవాడా?”
“కాదు. అదే తిరకాసు. అలా కావాలని నటిస్తాడు.”
“అది సాధ్యమా?”
“ఏది? నటన లోనా లేక నిజజీవితంలోనా?”
“పోనీ రెండూ అంటే?”
ఆయన కుర్చీలో వెనక్కి వాలాడు.
“సమీర్, గోవా మీ ప్రాంతం అన్నారు. గోవా లాంటి ప్రదేశం నుండి వచ్చి, అమ్మాయిల గురించి తెలియదు అంటే ఎలా?”
చెయ్యి అడ్డు పెట్టాను.
“మీకు గోవా గురించి ఏం తెలుసు?”
ఆయన నవ్వాడు.
“ఓకే, తెలియదు. చెప్పు.”
“ఇది సమయం కాదు. కానీ ఒక ముక్కలో చెబుతాను. గోవా విలాసాల కోసం ఏర్పడిన ప్రాంతం కాదు. ఒక దివ్యమైన చరిత్ర ఉంది. అక్కడి మహిళలు పోరాటం చేసారు. మీ రాష్ట్రంలో కలసిపోతారా, అంటే మేము నో అన్నాం. మాది గర్వించ దగ్గ చరిత్ర. చాలా మందికి మా గురించి తెలియదు.”
పైపును రెండు మార్లు చప్పరించాడు.
“ఓకే. మనకి ఈ చర్చతో పని లేదు. మనం ఆలోచించవలసింది ఈ కథ గురించి. నా పని అంత మటుకే. ఈ భూమి మీద జన్మించిన ప్రతి వాడికీ బైపోలార్ ఉంటుంది. ఒప్పుకుంటావా?”
“తేలిగ్గా ఒప్పుకోలేను.”
“అన్నీ కరెక్ట్ పనులే చేస్తారా అందరూ?”
“అంత మాత్రం చేత..”
“నో. ఇష్టమైన పని అందరూ చేస్తారా? లేదు కదా? రెండూ ఉంటాయి.”
“నా పాత్ర గురించి ఇంకా చెప్పండి. మిగతావి నేను ఆలోచించుకుంటాను.”
“బాగుంది. మనిషి ఎప్పుడైనా మారుతాడా?”
“నో. అవసరాన్ని బట్టి అలా నటిస్తాడు అని నేను నమ్ముతాను.”
“ఒకరిని పూర్తిగా ప్రేమించాలంటే వ్యక్తిత్వాన్ని పూర్తిగా కరిగించుకోవటం అని అర్థం. యస్ ఆర్ నో?”
“నో. ఒకరిని ప్రేమించాను అంటే నాకు గల వ్యక్తిత్వం లోంచి కదా ఆ ప్రేమ వచ్చింది?”
“అది ఫలించాలి అంటే?”
“అలా వ్యక్తిత్వాన్ని పూర్తిగా పోగొట్టుకొమ్మని అడగటం ఎవరో శాడిస్టులు మాత్రమే చేస్తారు.”
“గుడ్. అసలు గమ్మత్తు ఇక్కడే ఉంది. సినిమా భాషలో పారాబోలా అని అంటాం. హీరో హీరోయిన్ల జంటను ముందర పెట్టి ఎంతో ఆసక్తికరమైన ఒక ఆట, మరో పెద్ద జంట వ్యాపారం కోసం ఆడుతుంది ఇక్కడ. నీ వ్యవహరం ఊహకు అందనట్టుగా ఉంటుంది. ఇది ఈ రోజుకి చాలు, లైన్ ఆర్డర్ చదువుతూ అందులో నీ పాత్రకు రంగులు నింపుకో. ట్రీట్‌మెంట్ మెల్లగా చర్చించుకుందాం.”
ఆయన లేచాడు.
“సార్.”
“యస్?”
“ఒకటి అడగవచ్చా?”
“యస్?”
“ఈ ప్రాజెక్ట్ లోంచి పాత హీరో ఎందుకు నిష్క్రమించాడు?”
“అతను నిష్క్రమించలేదు. ఈయన పొమ్మన్నాడు.. కాకపోతే పొమ్మనకుండా పొగ పెట్టాడు.”
“ఎందుకు?”
“అతనికి కథ అర్థం కాలేదు.”
“ఓ, ఆ మాటకొస్తే నాకు తెలిసీ ఎవరికీ ఈ కథ తేలిగ్గా అర్థం కాదు.”
“డిస్నీ కార్పోరేషన్ వాళ్ళు స్క్రిప్ట్ వ్రాసే వాళ్ళతో ఏమంటారో తెలుసా?”
“తెలియదు.”
“స్క్రిప్ట్ చిక్కు ముడిలా ఉండాలి. అర్థమయితే ముందరకెళ్లి లోతుగా చిత్రీకరణ చెయ్యలేము. స్క్రిప్ట్ నవల కాదు. నమలటం కష్టంగా ఉండాలి. కానీ గొంతులోకి దిగుతున్నప్పుడు ఆనందం కలగాలి.”
“మరి అర్థం కాకపోవటంలో ఆ హీరో తప్పేముంది?”
“అర్థం కాకపోవటం వేరు, అందుకోలేకపోవటం వేరు. ఇంకా అనేకమైన కారణాలుంటాయి. అది వదిలెయ్. నోట్స్ వ్రాస్కో.”
ఆయన బాల్కనీ లోకి వెళ్లాడు. మెట్ల దాకా వెళ్లాను.
“బై..”, అన్నాడు. “..అవునూ, ఒక్కసారి సారికను కలు.”
సారిక హీరోయిన్ అని తెలుసు.
“ఎందుకు?” వద్దనుకున్నా నోట్లోకి వచ్చేసింది.
అయిన ఏమీ చెప్పలేదు. చిన్నగా తల ఆడించి వెళ్లిపోయాడు.
(ఇంకా ఉంది)