[box type=’note’ fontsize=’16’] కావలి లోని రెడ్‌ఫీల్డ్స్ హైస్కూల్‍లో తొమ్మిదో తరగతి చదువుతున్న పి. శరణ్ వ్రాసిన కథ “మోసం“. గ్రామీణులకు జబ్బుల పట్ల, వైద్యం పట్ల అవగాహన ఉండదనే దురుద్దేశంతో వారిని మోసం చేయాలనుకున్న ఓ డాక్టరుకి బుద్ధి చెప్పిన రైతు కథ ఇది. బాల/యువ రచయితలను ప్రోత్సహించే పథకంలో భాగంగా ఈ కథను అందిస్తున్నాము. [/box]
[dropcap]అ[/dropcap]నగనగా ఒక ఊర్లో ఒక పేద రైతు, అతని భార్యా ఉండేవారు. రైతు పేరు వెంకయ్య. వాళ్ళ ఆవిడ పేరు సునీత.
ఒకరోజు వెంకయ్య పొలానికి వెళ్ళాడు. పనయ్యేసరికి మధ్యాహ్నం అయింది. భోజనానికి వెంకయ్య ఇంటికి వచ్చాడు. సునీత కనబడలేదు. చూస్తే సునీత కింద పడిపోయి ఉంది. వెంటనే పక్క ఊర్లో ఉన్న హస్పిటల్‌కి తీసుకొని వెళ్ళాడు.
వెంకయ్య సునీతతో “నువ్వు ఇక్కడే కూర్చో. నేను వెళ్ళి డాక్టర్‌తో మాట్లాడి వస్తాను” అన్నాడు.
ఆ డాక్టర్ పేరు శంకర్. ‘శంకర్ దాదా ఎం.బి.బి.యస్.’ వెంకయ్య లోపలికి వెళ్ళగానే డాక్టర్ శంకర్ “బయట అడ్వాన్స్ కట్టావా?” అని మొదట్లోనే డబ్బుతో మొదలుపెట్టాడు. ఇక్కడే మీకు అర్థమై ఉంటుంది ఇంక ఎన్నిసార్లు డబ్బు అడుగుతాడో అని.
వెంకయ్య తన ఆవిడకి ఏమైందో చెబుతూ వున్నాడు. కాని శంకర్ అది వినకుండా బ్లూటూత్ పెట్టుకొని ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇద్దరిది ఒకేసారి అయిపోయింది. అప్పుడు శంకర్, వెంకయ్యతో “వెళ్ళి మీ ఆవిడని పిలుచుకొనిరా” అని చెప్పాడు. వెంకయ్య బయటకు వెళ్ళి, సునీతతో “మన దగ్గర ఎంత డబ్బు ఉందో మొత్తం తీసుకొనిరా” అన్నాడు. సునీత లోపలికి రాగానే, శంకర్ “అడ్వాన్స్ కడితేనే నా దగ్గరికి రా. వచ్చి నీ సమస్య ఏంటో చెప్పు” అన్నాడు.
అప్పుడు వెంకయ్య “నేను ఇందాక చెప్పాను కదా డాక్టర్” అన్నాడు.
“ముందు మీ ఆవిడకి కొన్ని ఎక్స్‌రేలు తీయాలి, పరీక్షలు చేయాలి. అప్పుడే మనము ఏం చెయ్యాలో చూద్దాము.”
కాసేపటికి ఎక్స్‌రేలు, ఇంకొన్ని రిపోర్టులు వచ్చేసాయి. దాంట్లో సునీతకి బ్రెయిన్ కాన్సర్ అని ఉంటుంది. కాని శంకర్ అది వెంకయ్యతో చెప్పడు.
శంకర్ వెంకయ్యతో “ముందు నువ్వు ఈ ఎక్స్‌రేలకి 5,000 రూపాయలు కట్టాలి. ఒక వేళ నువ్వు గాని డబ్బులు కట్టకపోతే ఈ ఎక్స్‌రేలలో ఏం ఉందో నేను చెప్పను” అన్నాడు.
అప్పుడు వెంకయ్య “మేము తెచ్చుకుందే 500 రూపాయలు. అది కూడా అప్పు చేసి ఈ డబ్బులు తెచ్చుకున్నాను” అన్నాడు.
కుదరదన్నాడు శంకర్.
వెంకయ్యకు కోపం వచ్చింది. ‘ఏ మాట ఎత్తినా డబ్బు, డబ్బు, డబ్బు…’ ఇక తట్టుకోలేక వెంకయ్య కోపంతో శంకర్‌ని తిట్టేసాడు.
“ఓయ్ ఇంక చాలు. నీ యాక్షన్ ఇంక ఆపు. ఇంక ఎంత మందిని మోసం చేస్తావు” అని చాలా కోపంగా తిట్టాడు.
“నువ్వు నేను చెప్పేది ఏమి వినలేదు. నువ్వేమో ఫోన్ మాట్లాడుకుంటున్నావు. అది నాకు ఎలా తెలిసింది అంటే నేను ఏమీ చెప్పకముందే ‘ఆ సరే, నేను చూసుకుంటాను’ అని అన్నావు. ఇప్పుడు నువ్వు తెచ్చిన ఎక్స్‌రే కూడా మీ కాంపౌండరుతో వేరే వాళ్ళది తెప్పించావు. అది నేను చూశాను” అంటూ భార్యతో బయటకు నడిచాడు.
తరువాత వాళ్ళు ఇద్దరు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి కంప్లయింట్ ఇచ్చారు. వాళ్ళు ఇద్దరు వేరే హాస్పిటల్‌కి వెళ్ళి చూపించుకున్నారు. పాత ఆసుపత్రి నుంచి వాళ్ళ డబ్బులు తిరిగి వచ్చేశాయి.
నీతి : “ఎప్పుడు మోసపోకండి, చుట్టూ గమనించుకోండి”.