మహాప్రవాహం!-42

0
3

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[సోమవారం నాడు బయల్దేరి బెంగుళూరు చేరుతారు కేదార, పద్మనాభయ్య, మీనాక్షమ్మ. అక్కడే ఉన్న పుండరి, అఖిలమ్మలతో కలిసి కోరమంగళలోని మంజునాధరావు ఇంటికి పెళ్ళి చూపులకి వెళ్తారు. అమ్మాయి పేరు అలేఖ్య. పలహారాలు, డ్రింకులు అయ్యాకా, అలేఖ్య వస్తుంది. చుడీదార్‍ వేసుకుంది.  చామనచాయ. పెదిమలకు రంగు వేసుకుంది. జుట్టు భుజాల వరకు కత్తిరించుకుంది. అందరి ఎదుట కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది. కాసేపు ఏకాంతంగా మాట్లాడుకోమని పెద్దలు చెప్తే, ఆమె గదిలోకి వెళ్తారు కేదార, అలేఖ్య. గది చిందరవందరగా ఉంటుంది. పెళ్ళయ్యాకా, మీ అమ్మానాన్నలు మనతోనే ఉంటారా అని అడుగుతుంది. అవునంటాడు. ఏ సంగతి తెలియజేస్తామని చెప్పి, బయల్దేరుతారు కేదార వాళ్ళు. ఆ రాత్రికే కేదార బెంగుళూరు నుంచి విమానంలో పూణె చేరుకుంటాడు. తాను చూసిన ఇద్దరు అమ్మాయిల వ్యక్తిత్వాలను అంచనా వేసుకుంటాడు. ఆ రాత్రి అతనికి సరిగా నిద్రపట్టడు. కలో/మెలకువో తెలియని స్థితిలో మంచం పక్కన ప్రభుదత్త మహారాజ్ కనిపించి – ఇది నీకు ఉద్దేశించినది కాదు, లౌకిక విషయాలలో తగులుకోవద్దని చెప్పినట్టనిపిస్తుంది. మర్నాడు వైద్యనాథన్ తమిళనాడు నుంచి వస్తాడు. తన అనుభవం అతనికి చెప్తే, దాన్ని సీరియస్‍గా తీసుకోవద్దని, అది భ్రమ అనీ అంటాడు.  ఆ వారంతంలో ఆశ్రమానికి వెళ్తాడు. మహారాజ్ జన్మదినం కావడంతో అక్కడంతా కోలాహలంగా ఉంటుంది. అయన శిష్యుల మధ్యకు వచ్చి ఆశీర్వదిస్తుంటాడు. కేదార కూర్చున్న చోటుకు వచ్చి, అతని తలపై చేయి ఉంచి – తికమకు లోనుకావద్దు, ఆ రాత్రి నా మాటులు విన్నది భ్రమ కాదు. మరింత జ్ఞానం కోసం నా వద్దకు రా – అని చెప్పి వెళ్ళిపోతారు. భోజనాల దగ్గర ఒక బెంగాలీ యువకుడు పరిచయమవుతాడు. దేబీబ్రత ముఖర్జీ అతని పేరు. తన గురించి చెప్పి, నువ్వెంతో అదృష్టవంతుడివి అని అంటాడు. ప్రస్తుతం తాను నాసిక్ ఇన్‍చార్జ్‌ అని చెప్తాడు. ఒక శిష్యుడు వచ్చి, గురువు గారి ఉండిపొమ్మన్నారనీ, రాత్రి ఎప్పుడైనా పిలుస్తారనీ కేదారకు చెప్తాడు. పది గంటలకు మహారాజ్ కేదారను పిలుస్తారు. సన్యాస మార్గంలో ప్రవేశించేందుకు ఒప్పిస్తారు. ఇక చదవండి.]

[dropcap]‘రి[/dropcap]నన్సియేషన్ ఓత్’ తీసుకున్నాడు. కేదారను ఒరిస్సాలోని ‘కటక్’ వద్ద ఉన్న ఆశ్రమానికి ఇన్‌చార్జ్ మహరాజ్‌గా నియమించినారు. ‘నిశ్చలానంద మహారాజ్’ అని పేరు పెట్టినారు.

ఒక్కసారి ఇంటికి వెళ్లి తల్లి తండ్రులను చూసి చెప్పివస్తానని, అనుమతి ఇవ్వమని అడిగినాడు. ఉద్యోగానికి రాజీనామా చేసినాడు.

పుణె నుంచి రైలులో డైరెక్ట్‌గా గుంతకల్‍కు వచ్చి అక్కడి నుంచి రైలు మారి అనంతపురం చేరుకున్నాడు కేదార. ఉదయం ఏడు గంటలవుతుంది. పద్మనాభయ్య లోపల దేవతార్చన చేస్తూన్నాడు. మీనాక్షమ్మ వంటకు చిక్కుడుకాయలు వలుచుకుంటూ ఉంది.

“అమ్మా!” అని పిలిచినాడు నిశ్చలానంద మహరాజ్!

మీనాక్షమ్మ బయటికి వచ్చి చూచింది. కొడుకును గుర్తుపట్టల్యా. లేత  ఆకుపచ్చ రంగు పైజమా, అదే రంగు లాల్చీ వేసుకున్నాడు. ఆకుపచ్చ రంగు కుంకుమ నుదుట ధరించినాడు. దానిని అశ్రమము లోనే ఏవో ఆకుపసర్లు ఎండించి తయారు చేస్తారు. ఎడంవైపు ఆశ్రమం బ్యాడ్జి. ఆకుచెప్పులు. భుజానికి ఒక జోలెసంచి. మీసాలు తీసేసి, క్లీన్ షేవ్ చేసుకుని జుట్టంతా వెనక్కి ఎగదువ్వినాడు. ముఖంలో ఒక తేజస్సు. పెదిమలపై దరహాసం.

ఎవరో స్వామి భిక్షకు వచ్చినాడనుకుంది తల్లి. “ఉండండి స్వామి. ఒక్క నిమిషం!” అంటూ లోపలికి వెళ్లబోతే, “అమ్మా! నేను! మీ కేదారను” అన్నాడు – గొంతు వణకలేదు. స్థితప్రజ్ఞత్వమంటే అదీ!

మీనాక్షమ్మ స్థాణువైపోయింది. “నాయనా, కేదారా, ఇదేమి అవతారమురా” అని అరిచింది. “ఏమండీ! మన కేదార! మన కేదార!” అంటూంది.

పద్మనాభయ్య ఆందోళనతో లేచి వచ్చినాడు. భార్య పరిస్థితిని చూచినాడు. కొడుకు ఇంత అకస్మాత్తుగా, చెప్పాపెట్టకుండా రావడం, అదీ ఈ విచిత్ర వేషధారణలో! ఆయనకే అంతుబట్టలేదు. “ఏమిటిరా నాయనా ఇదంతా!” అని అనగలిగినాడు కష్టం మీద.

కేదార ముఖంలో చిరునవ్వు చెరగలేదు. “లోపలికి పోదాము పాండి. అంతా చెబుతాను” అన్నాడు. బాతురూముకు పోయి స్నానం చేసి వచ్చినాడు. కట్టుకున్న బట్టలు తానే ఉతుక్కొని దొడ్లో తీగ మీద ఆరేసినాడు. మళ్లీ అలాంటి దుస్తులే సంచిలోంచి తీసి వేసుకున్నాడు.

“అమ్మా, నాకు కాఫీ ఇవ్వవా?” అని అడిగినాడు. “త్వరగా వంట చేయి, నాకు ఆకలైతుంది” అన్నాడు.

మీనాక్షమ్మ గుండె చెరువైనాది. వంటింట్లోకి వెళ్లి కాఫీ పెడుతుంటే ఆమె చేతులు వణుకుతున్నాయి.

కాఫీ తాగి, ఇద్దరినీ దగ్గర కూర్చోబెట్టుకొని జరిగినదంతా చెప్పినాడు. ఇద్దరూ జరిగిన దానిని జీర్ణించుకోలేకపోయినారు. ఇదంతా ఒక వేళ కలేమో! అని కూడా అనిపిస్తూంది. కానీ కాదనీ, నిజమేననీ తెలుస్తూ ఉంది స్పష్టంగా.

తన సన్యాసనామం ‘నిశ్చలానంద మహరాజ్’ అనీ, ఇక నుంచి తన కార్యస్థానం ‘కటక్’ అనీ చెప్పినాడు. ఫోన్ చేసి పుండరినీ, అఖిలమ్మనూ పిలిపించినాడు పద్మనాభయ్య. వాండ్లు ఏం జరిగిందో అర్థం కాక పరిగెత్తుకుని వచ్చినారు. మీనాక్షమ్మ ఏడుస్తూ మరిదితో, చెల్లెలితో అంతా చెప్పింది. పుండరి కేదారను తిట్టినాడు. “అంత చదువుకొని ఇదేం పోయే కాలం రా నీకు” అని అరిచినాడు. “ఏం కుదరదు, నీవుండు. నేను పోయి ఆ స్వామీజీ ఎవరో ఆయనకు చెప్పి వస్తా, మా వాడు రాడని!” అన్నాడు.

“ఉద్యోగం వద్దు, ఏమీ వద్దు! మా దగ్గర ఉండరా చాలు!” అనింది తల్లి.

అన్నింటికీ చిరునవ్వే సమాధానం.

రెండు రోజులు గడిచినాయి. మొదట్లో బాధపడినా, పద్మనాభయ్య, శాస్త్రాలూ, పురాణాలూ చదివినవాడు గనుక, కొడుకు సామాన్య మానవుడు కాకుండా విశ్వమానవుడు కావాలనుకుంటున్నాడనీ గ్రహించినాడా పండితుడు. ‘ప్రకృతి సేవకుడు’ అన్న భావనే గొప్పదని ఆయనకు అవగతమైంది. జగమంతా నా కుటుంబమే అన్న విస్తృత, ఉదాత్తమైన సిద్ధాంతానికి తన కొడుకు కేదార కట్టుబడినాడని గర్వపడినాడు. రాత్రి ప్రదోష పూజలో తాను ఆరాధించే లలితా పరమేశ్వరిని ప్రార్థించినాడు. ఆ తల్లి మందహసంతో “కేదార తీసుకున్ననిర్ణయం పరమార్థమైనది. విశ్వశ్రేయస్సుకు అతన్ని అంకితం చెయ్యి” అని ఆనతిచ్చినట్లు స్ఫురించింది. ఆయన మనస్సు నిమ్మళించింది. భార్యతో చెప్పి ఒప్పించినాడు.

మర్నాడు పొద్దున కేదారను పిలిచి, “నిశ్చలానంద మహారాజ్ గారూ!” అని సంబోధించినాడు. కేదార ఆశ్చర్యపోలేదు. తండ్రి మానసిక పరిపక్వత అతనికి తెలుసు. తల్లి కూడ అంగీకరించింది. తానిక అపరాధభావన అనేది లేకుండా తానెన్నుకున్న పథములో సాగిపోవచ్చు. తల్లిదండ్రుల పాదాలకు ప్రణమల్లి ఇల్లు దాటినాడు కేదార. కాదు, కాదు, నిశ్చలానంద మహరాజ్! మమత్వాన్ని దాటినాడు!

కాలమహాప్రవాహం మరో కుటుంబాన్ని నిష్కామంగా, నిస్వార్థంగా, పరహితం కోసం సమాయత్తం చేసింది. దాని లీలలు అనూహ్యం!

***

ఖాజా హుసేన్ పండ్ల దుకానం మింద గూసొని ఉన్నాడు.

ఒక సీసాలో నీళ్లు బోసి, దాని మూతకు సన్నని చిల్లులు ఐదారు సూదితో పొడిసి, సీసాను ఒత్తితే, నీళ్లు శిలకరించినట్లుగా పండ్ల మింద పడతాండాయి. ఒక వెదురు కట్టెకు తెల్లని బట్టి సివర్న గట్టి  ఈగలు వాలకుండా అప్పుడప్పుడూ పండ్ల మింద ఇసురుతాండాడు.

విబూతి రేకలు, గందము కుంకమ బెట్టుకోని, ఒకాయన వచ్చినాడు. ఆయన్ను చూచి ఖాజా “సలామ్ అయ్యగారు! ఈ మద్దన మా అంగడి దిక్కు రావడంల్వా, బోలియే! ఏం కావాలో చెప్పండి. దానిమ్మపండ్లు నిన్ననే దెచ్చినాము. తాజా మాల్ సామి” అన్నాడు. వచ్చినాయన పేరు పరాశరమూర్తి. గద్వాలలో పురోహితము చేస్తాడు. ఖాజా దగ్గరే పండ్లను కొనుక్కుంటాడు.

“నీ దగ్గర ఎప్పుడు తాజా మాలే లే సాయిబూ! ఇప్పుడు పండ్లేమో వద్దు గాని, వచ్చేవారము మా బిడ్డ పెండ్లి ఉన్నాది మన ఊర్లోనే. టి.టి.డి వాండ్ల సత్రంలో. పెండ్లికొచ్చిన వాండ్లకు తాంబూలంలో పెట్టి ఇయ్యడానికి ఐదు నూర్ల కమలాపండ్లు గావాల. ముందే చెప్తే తెప్పిస్తావని..”

“బహుత్ ఖుష్ ఖబర్ సునాయా ఆప్నే!” అన్నాడు ఖాజా. “అల్లునిది యా ఊరు? ఏం చేస్తాడు?”

“అల్లుడు రైల్వేలో పనిచేస్తాడు. దేవరకద్రలో అసిస్టెంట్ స్టేషను మాస్టరు. మాకు దూరం బందువులే ఖాజా.”

“శానా మంచిది. తెప్పిస్తాను మాబునగరం నుంచి”

సంచి లోంచి వెడ్డింగ్ కార్డు తీసి ఖాజాకిచ్చినాడు పరాశరమూర్తి. “నీవు, బూబమ్మ, పిల్లలూ అంతా తప్పకుండా రావాల సాయబూ” అన్నాడు.

ఖాజా ముకం చాటంతయింది.

“సరేగాని కమలాపండ్లకు ఎంతవుతుంది? ముందు కొంచెం సంచకారమేమన్నా ఇమ్మంటావా?”

“చ్చొచ్చాచ్చా” అని నాలికతో సద్దు చేసినాడు ఖాజా. “ఏమి జరూరత్ లేదు సామి! మీది మాటే అడ్డుమాన్సన్నట్లు. మన పాప పెండ్లికి నేను పండ్లు తెచ్చియ్యలేనా ఏంది? ఎంతో కొంత ఇద్దురు. దాందేముంది?” అన్నాడు.

సరే అని చెప్పి ఎలబారి పోయినాడా బ్రాహ్మడు. ఎప్పుడో దేశవిభజన జరిగినప్పుడు జరిగిన మత కలహాలు, నిజాం పాలనలో రజాకార్ల అరాచకాలు, ఇవన్నీ ఉండిన్నాయేమో గాని, హిందువులు, ముస్లిములు కలిసిమెలిసి సామరస్యంగా బతుకుతారు. ఏవైనా తేడాలంటూ వస్తే అవి రాజకీయ నాయకులు సృష్టించినవే. ఒక పురోహితుడు పండ్లమ్మే సాలుబును బిడ్డ పెండ్లికి పిలుస్తున్నాడంటే, ఎంత కలిసిపోయి ఉండాల. మనిసి ముందు పుట్టి, దీనమ్మ మతం తర్వాత పుట్టినాది. ఎవరు ఏ మతంలో పుడ్తారో ఎవరి చేతిలో ఉంది గనక.

దూరంగా కొడుకు తొందర తొందరగా నడుసుకుంట రావడం చూసినాడు ఖాజా. దగ్గిరికి రాంగనే “క్యా బేటా, అచానక్ కైసా ఆనా హువా?” అని అడిగినాడు కొడుకును.

“అబ్బా, ఏర్ బార్ ఉతరోనా దుకాన్ సే” అన్నాడు జహంగీర్. ఆ పిల్లోని ముకం సంతోశంతో ఎలిగిపోతుండాది.

“ఏమైంది రా” అంటూ అంగడి మించి దిగినాడు. జహంగీర్ నాయిన కాల్లకు మొక్కి, బలంగా కరుచుకున్నాడు.

“అబ్బా. మేరా నౌకరీ పర్మనెంట్ హోగయా” అన్నాడు.

“యా అల్లా!” అని ఆకాశం పక్కకు చేతులెత్తి మొక్కినాడు ఖాజా. “బహుత్ అచ్ఛీ ఖబర్ లాయారే, తు, జహంగీర్!” అన్నాడు.

“మనకు పి.ఎఫ్, గ్యాట్యుటీ, ఇన్సురెన్సు అన్నీ వస్తాయి అబ్బా. జీతం శానా పెరుగుతాది. పైగా దిన్నెదేవరపాడు దగ్గర మా కార్బైడ్ కంపెనీ వాండ్లు కార్మికుల కోసరం కట్టించిన క్వాటరు గూడ్క మనకు జల్దీ అలాట్ చేస్తారు. అప్పుడు అమ్మను నిన్నూ నా కాడ పెట్టుకుంటాను.”

“అరే, పాగల్! మరి ఈ యాపారం..”

“ఇంకా ఎన్ని రోజులు చేస్తావు నాయినా? నీకు అరవై ఐదు సంవత్సరాలు. అమ్మీజాన్‌కు అరవై ఒకటి. ఇస్ ఉమర్ మీ ఆప్‌కో ఆరామ్ కర్‌నా!”

“బేటా! ముందు నీకు నిక్కా జేయాల. మాకింకా ఒంట్లో శగితి ఉంది. నీకాడికొచ్చి ఊకె తిని కూసుంటే ఏం బాగుంటాది చెప్పు? పని చేస్తాంటీ పానం గుడ్క మంచిగుంటాది”

“సరే అబ్బా! నేను పోయి బహాన్‌కీ, బావకూ చెప్పొస్తా. రాత్రి అందరం దావత్ చేసుకుందాము.”

రాత్రి అంగడి కట్టేసి పండ్లు గంపలన్నీ ట్రాలీ రిచ్చాలో ఏసుకోని ఇంటికి బోయినాడు ఖాజా. అప్పటికే బిడ్డ అల్లుడు, మనుమరాలు వచ్చి ఉన్నారు.

హసీనా కూతురికి అయిదేండ్లు. దానికి మామ జహంగరే ‘చాందిని’ అన్న పేరు బెట్టినాడు. “మేరీ చాంద్ కా టుకడా” అంటాడు తాత. ఫాతింబీ “మీరే ప్యారీ ప్యారీ మున్నీ” అంటుంది.

తాతను చూసి ఎగురుకుంటూ వచ్చింది చాందినీ. మనమరాలిని ఎత్తుకున్నాడు ఖాజా. “తాతా! మేరే లియే క్యా లాయా?” అనడిగింది ముద్దుగా. కుర్తా జేబు అంచి ఫైవ్ స్టార్ చాక్‍లెట్ తీసిచ్చినాడు. “ఇతనీ ఛోటీ? బడీ లానా థా! తాతా, తుమ్సే దోస్తీ కటీఫ్” అని బెదిరించినాది.

“కటీఫ్ కర్నీ కే పహలే తాతా కో ఏక్ పప్పీదేనా జరూరీ హై” అన్నాడు తాత. కిలకిల నవ్వి చెంప మింద ముద్దు పెట్టి దిగి ఉరికినాది.

హసీనా మళ్లీ కడుపుతో ఉంది. మూడో నెల. ఈసారి కొడుకు పుడితే బాగుంటుందని సోచాయిస్తున్నారు. ఖాదర్ వ్యాపారం బాగా నడుస్తూంది. షాపులో ప్రిజ్జు పెట్టించినాడు. పక్కనే చెరుకు రసం మిశన్ గూడ్క పెట్నాడు. హీరో హోండా బండి సెకండు హ్యండుది కొనుక్కున్నాడు. ఇంటి మింద రేకులు తీయించి పక్కా మిద్దె లేపినాడు.

దావత్ నేనిస్త అంటే నేనిస్త అని బావ బావమరిది కొట్లాడుకోబట్నారు. “ఎవరిస్తే ఏమి లేరా” అనింది హసీనా.

“వానికి నౌకరి పర్మనెంటయినాది గాబట్టి వాటిచ్చేదే సబబ్” అనింది ఫాతి౦బీ. “కాని, బైట ఓటల్ల కొద్దు. మనమే అన్నీ ఇంట్లో చేసుకుందాము. నేనా, హసినా అన్న ఇస్తేమాల్ చేసిపెట్నాము. జహంగర్ కల్ సుభా జానా” అనింది.

మగవాండ్లు నిరుత్సాహపడినా, సరే అన్నారు. మటన్ బిర్యాని, రైతా, ఆలూ కూర్మా, ఉద్ది వడలు చేసినారు తల్లీ బిడ్డా. అన్నము, పాలక్ దాల్ చేసినారు. కొన్ని వడలు పెరుగు ఏసి తిరగమాత పెట్టి దహీ వడ చేసినారు. సేమ్యా ఖీర్ భీ!

జహంగీర్ బయటికి పోయి అందరికీ మీఠా పాన్లు కట్టించుకోని వచ్చినాడు. నాయినకూ బావకు హాఫ్ బాటిల్ బ్రాందీ తెచ్చినాడు. వానికి మందు అలవాటు గాల్యా.

ఏడో నెలలో హసీనాను పుట్టింటికి పిల్చుకొచ్చుకున్నారు. చాందినీ కాన్వెంటులో యు.కె.జి చదువుతాంది. స్కూలు పక్క వీధిలోనే. మద్యానం అమ్మో, అమ్మమ్మో పోయి అన్నం బెట్టి వస్తారు.

హసీనాకు నెలలు నిండినాయి. గద్యాల లోని వైద్యవిదాన పరిశత్తులో  చూపిచ్చుకుంటాండారు. డాక్టరమ్మ ఒలివియా. శానా మంచిది. అంతా నార్మల్‌గా ఉందని, ఏం భయం లేదని చెప్పింది. కాన్పు వచ్చే డేట్ కూడా చెప్పింది.

ఒక రోజు రాత్రి హసీనాకు నొప్పులు మొదులైనాయి.

భాదర్ గుడ్క ఈడనే పండుకుంటాన్నాడు. ఎంట్నే ఆటో తీసుకొచ్చి, ఆస్పత్రికి ఏసకపోయినారు. డాక్టరమ్మ డ్యూటీలో లేదు. హసీనాను నర్సు లోపలికి తీస్కబోయినాది. “డాక్టరమ్మకు పోను చేయండి” అనడిగితే, “అట్లా చేయకూడదు. ఇప్పుడామె డూటీ కాదు. డూటీ డాట్టరు రాజమోహన రెడ్డి ఉండాడు. ఆయన కాన్పు చేస్తాడు” అని చెప్పినారు.

అయినా సరే ఆత్రానికి ఖాదర్ డాక్టరమ్మ ఇంటికి బండేసుకుని పోయి బయట బెల్లు కొట్టి ఆయమ్మను లేపినాడు. డాక్టరమ్మ గుడ్క ఖాదర్ పరేశానీని అర్థం చేసుకుని, బండి మింద ఎలబారి ఆసుపత్రి కొచ్చినాది.

రాజమోహన్ రెడ్డి, ఒలివియా లోపల లేబరు రూములో ఉన్నారు. హసీనా అరుపులు బైటికి ఇనపడతాన్నాయి. డాక్టరమ్మ బైటికొచ్చి లోపల పిల్ల అడ్డం తిరిగినాదని, ఆపరేషను చేసి బయటకు తీయాలని, అయినా ఏం బయం లేదని, ఇట్లాంటివి ఎన్నో చేసినామనీ చెప్పి ఒక పారం మింద ఖాదర్ తోని సంతకం పెట్టించినాది.

గంట తర్వాత బిడ్డ ఏడుపు ఇనపడింది. బయటున్న అందరి ముకాలు ఇచ్చకున్నాయి. డాక్టరమ్మ బైటికి వచ్చింది. ఆమె ముకం శానా ఇశారంగా ఉంది. ఖాదర్ ఒక ఉదుట్ను ఆమె కాడికి బోయినాడు.

“ఖాదర్ మియా, ఐ యామ్ వెరీ సారీ! నీ బీబీని కాపాడలేకపోయినాము. రక్తస్రావం కంట్రోలు గాలేదు. బిపి శానా డవునయినాది. టేబుల్ మిందే పానం బోయింది. పిల్లవాడు మాత్రం సేఫ్. హమే మాఫ్ కర్నా భయ్యా. పూరా కోశిష్ కియే హమ్. ఫిర్ భగవాన్ కా మర్జీ అలగ్ థా” అనింది.

“యా అల్లా!” అని ఆక్రోశించినాడు ఖాదర్ “అత్తా, మామూ, ఆప్ కీ బేటీ హమ్ కో ఛోడ్ కర్ చలీ గయీ” అని నెత్తిన కొట్టుకుంటా ఏడ్వబట్నాడు. ఖాజా, ఫాతింబీ గోలుగోలున మొత్తుకున్నారు. అమ్మమ్మ మీద నిద్రబోతున్న చాందినీ లేచి, ఏం జరుగుతుందో అర్థంగాక తాను ఏడ్వబట్టింది.

తెల్లవారిన తర్వాత హసీనా శవాన్ని అప్పగించినారు. పుట్టిన మగబిడ్డకు, తనకింక అమ్మ ఉండదని తెలిసిందేమో ఒకటే ఏడుపు. హసీనా పోయిన దుఃఖములో వీండ్లెవరూ వాడిని పట్టించుకోలేదు. హసీనాను ఇంటి ముందు అరుగు మింద పడుకోబెట్టినారు.

పిల్లోని ఏడుపు చూడలేక ఒకాయమ్మ శాపులో గులుకోజు పెట్టె తెచ్చి, నీల్లలో కలిపి తాపిచ్చినాది. స్పూనుతో ఒకటి రెండుసార్లు వాని బుల్లి పెదిమెలకు గులుకోజు నీల్లు తగలంగానే వానికి అర్తమై, సప్పరిస్తూ తాగబట్నాడు. ఏడుపు ఆపేసినాడు. ఒక చిన్న గలాసుడు తాగి కండ్లు మూసుకోని నిద్రపోబట్నాడు.

బీబీ మింద బడి ఖాదర్ ఏడుస్తాంటే, చూసేటోల్లకు గుడ్క దుక్కం నిలబడల్యా. కడుపు మింద, నెత్తి మింద కొట్టుకుంటా ఖాజా, ఫాతింబీ మొత్తుకుంటాన్నారు. కొందరు బందువులు కబరస్తాన్‌కు హసీనాను తీస్కపోనీకె ఏర్పాట్లు శురు చేసినారు.

కర్నూలు నించి జహంగీరు వచ్చినాడు. “అక్కా, ఇట్ట చేసిపోయినావేమే, ఖుదా, మై క్యా కరూ” అని వాడు ఏడుస్తూంటే శానా బాద అయినాది సూసెటోల్లకు.

కబరస్తాన్ (శ్మశానం) ముల్లా సాయిబు వచ్చి హసీనా ఆత్మకు శాంతి కలగాలని దువా చేసినాడు. హసీనాను గుంతలో పెట్టి మన్ను కప్పినారు. ఒక్కసారిగా రోదనలు మిన్నుకు తాకినాయి.

ఇంటికి వచ్చి అందురు స్నానాలు చేసినారు. చచ్చిపోయిన వెంటనే ఉన్న దుక్కము ఇప్పుడు తగ్గినాది. దుక్కానికీ ఆకలికీ ఏం సంబదము! బతికినన్నాల్లు తినక తప్పదు గదా!

బందువు ఒక తల్లి అందురికి ఇంత ఉప్పమ జేసినాది. బలవంతంగ కొంచెము తిని పిచ్చినాది. గులుకోజు నీల్లతోనే ఇగ్గుకొస్తా ఉన్నాడు పుట్టిన పిల్లాడు.

మెల్లగ పాతింబీ ఆవుపాలు వర్తన పెట్టుకోని, బాగా కాచి చల్లార్చి, పాలసీసాలో పోసి పిల్లోనికి తాగించబట్నాది. ఒక పది రోజులు యాపారాలు మానేసినారు మామ, అల్లుడు. పండ్లు చెడిపోతాయని బందువులకిచ్చి పంపినారు. జహంగీరు నాల్రోజులుండి ఎలబారిపోయినాడు కర్నూలుకి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here