[మణి గారు రచించిన ‘ఆగిన క్షణాలు!’ అనే రచనని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]ఎ[/dropcap]న్ని సూర్యోదయాలు!ఎన్ని అస్తమయాలు!
ఎన్ని వెలుగులు! ఎన్ని చీకట్లు!
కాస్త కూడ వంగని క్షణాలు, పరిగెడుతూనే వున్నాయి.
నిరీక్షణమో, నిర్వేదమో, నిర్దేశమో!
ఏ క్షణం ఏ రంగు కురిపిస్తుందో,
ఎన్ని రంగులు పరుస్తుందో,
ఎన్ని అందాలు వెదజల్లుతుందో!
ఎన్ని ఋతువులు లాక్కు వెళ్ళుతుందో!
భారమో, చులకనో, కష్టమో, సుఖమో,
ఏ రంగు అయినా, ఎన్ని అందాలు పరిచినా,
హరివిల్లు అయినా, విరిజల్లు అయినా,
ఎంత సుఖమైనా, ఎంత దుఖం అయినా
ఆనందపు అనుభూతులయినా,
దుఖపు భారాలు అయినా,
ఏ క్షణమూ, ఆగలేదు సుమా!
కారు మబ్బులో,
కాంతి కిరణాలో,
మెరుపుల నగిషీలో,
ఉరుముల, పిడుగుల ఒత్తిళ్ళో,
ఏమి అయినా, ఏ క్షణమూ ఆగలేదు .
వాటి వెనుక నేను! వాటితో నేను!
నాకు ఓ ఆశ!
ఏ క్షణాన్ని అయినా గుప్పిడిలో, సీతాకోక చిలుకలా, బిగించి, అందాలన్నీ పదిలం చేసుకోవాలని!
ఊసులు చెప్పాలని, వినాలని.
“ఎక్కడనుంచి వస్తున్నారు? తుది గమ్యం ఏమిటి?” అని అడగాలని
ఆది, అంతాలు
ఏ క్షణానికి అయినా ఎప్పుడు, ఎక్కడ, అని తెలుసుకోవాలని.
కాని అవి పరిగెడుతూనే, వున్నాయి.
పలకరిస్తే, నవ్వుతాయిగాని, మారు పలకడానికి అయినా, ఆగవు.
గంటలు, రోజులు, ఋతువులు, సంవత్సరాలు, అన్నిటిని, లాక్కు వెళుతూనే వుంటాయి .
నన్ను కూడా, అని నాకు తెలియదు.
అందుకే,
చేతుల్లొ పొగుచేసుకున్న పూలు వాడిపోయింది తెలియదు.
క్షణాల రంగులన్నీ, పొదివి పట్టుకున్నా అనే అనుకుంటాను కాని, అది భ్రమ అని గుర్తించను . అందుకే ఆ భ్రమ లోంచి బయటకే రాను.
క్షణాలని కొల్లగొట్టి, ఎన్ని రంగులు పోగు చేసుకున్నా,
ఎన్ని పూలు పోగుచేసుకున్నా,..
పోగుచేసుకున్నా అనే సంబరం లో,
అవి రంగు పొయినదీ తెలియదు, వాడిపోయినదీ తెలియదు!.
తెలిసిన క్షణం ఫక్కుమని నవ్వింది.
ఇంతలోనే మరోక్షణం, “చాల్లే నవ్వింది” అంటూ ముందుకు తోసింది.
క్షణం, క్షణమే!
“ఏ క్షణమూ ఏది మోసుకుపోదు.
ఏమి రంగులైనా, ఏటువంటి పుష్పాలు అయినా, బరువు మోయలేము బాబు. అందుకే, అంతా ఖాళీ గానే వెళ్తాం.”
“అయిన నువ్వు చూసే ఏ రంగులు అయినా, ఏ పుష్పాలు అయినా, అవి మేము తెచ్చినవి కావు, నీలోంచి వచ్చినవే. మేము ఎప్పుడు ఖాళీయే.”
“మమ్మల్ని పట్టుకోవాలని, మా వెనుక పరుగులు పెడ్తున్న నీ పట్టుదలని చూసి నీ తో ఆడుకోవాలనీ సరదా పడి చెప్పలేదు, కానీ,
అన్నీ నీ లోనే వున్నాయి .
ఏ గారడీ అయినా నీదే! నవ్వుతూ పరిగెడుతున్నాయి.”
ఒకదాని వెనుక ఒకటి.. అన్నీ అదే మాట ప్రతిధ్వనిస్తూ .
ఆశ్చర్య పోవడం నా వంతు.
క్షణాలని పట్టుకోవాలనే నిరంతర ధ్యాస లోంచి నన్ను బయటకి తోసేసాయి ఆ మాటలు.
నేను కాస్సేపు కూలబడ్డాను నన్ను నేను తమాయించుకోవడానికి.
ఉత్సాహంగా క్షణాల వెనుక, ఎప్పటికి అయినా పట్టుకోలేకపోతానా అనుకుంటూ పరుగులు పెట్టే నన్ను,
వాటి మాటలు నా ధ్యేయాన్ని కొల్లగొట్టి నన్ను నిర్వీర్యుని చేసాయి చాలా సేపు.
నెమ్మదిగా ఆసక్తిగా, నా అంతరంగపు తలుపులు తెరిచాను.
లోపల అంతా చిత్రాలే.
రంగు రంగుల చిత్రాలు.
కొన్ని బూజు పట్టి,
కొన్ని రంగు పోయి,
కొన్ని కళలు పోయి,
కొన్ని క్రొత్త కాంతులు వెదజల్లుతూ,
ఎన్నిపొత్తరలు!
నేను ‘క్షణాలలో ‘చూసిన రంగులన్ని, చిత్రాలన్నీ నేను వేసినవేనా!
క్షణాలు శూన్యమేనా! వాటి శూన్యంలో ప్రతిఫలించింది నా చిత్రాలేనా!
నన్నుఆశ్చర్య పరిచిన గారడి నాదేనా!
నాకు కూడా తెలియని ఈ కళాకారుడు కనిపించని కుంచెతో ఎన్ని చిత్రాలు వేసాడు!
చాలా సేపు లోపల చిత్రాలు చూస్తు వున్న నాకు,
క్షణాల వేటలో ఎంత కాలాన్ని వ్యర్థం చెసానో అనిపించింది .
ఆలొచనలతో, ఆలస్యించకుడా అంతా శుభ్రం చేసాను. కల్లాపు చల్లి ముగ్గులు వేసాను.
నేను యజమానిని అని తెలియకుండానే ఎన్ని చిత్రాలు వేసాను. ఇంక తెలిసాక, ఎన్ని వేయొచ్చు.
ఎన్ని గారడీలు అయినా చేయొచ్చు. ఎన్ని మాయలు అయినా సృష్టించ వచ్చు!
నేను పట్టుకోవాలి అనుకున్న మాయా రంగుల ప్రపంచం నా ముందే వుందని, నేనే చిత్రించానని నాలోకి ఇంకాక,
“ఎన్ని గారడీలు చెయొచ్చు!” అనుకుంటూ, కుంచెతో రంగులు తీర్చి దిద్దడం మొదలు పెట్టాను.
క్రొత్త క్రొత్త రంగులు కలిపి అద్భుతాలని చిత్రాలుగా దిద్దడం మొదలుపెట్టాను .
అలసట లేకుండా ఎన్ని చిత్రాలు వేసాను!
ఒకదాని వెనుక ఒకటి. అలా ఎన్నో!
నన్ను నేనే మరచిపోయాను, ఆ రంగుల మాయా ప్రపంచంలో!
మాయలతో, గారడీ చేసే ఆ మాంత్రికుణ్ణి నేనే కదా.
రంగులు కలిపి కలిపి, వేసి వేసి వేసి, నాలో నేనే లీనమయ్యాను.
పరిగెడుతున్న క్షణాలు కుతూహలంగా నా దగ్గర అగి వెళ్తున్నాయి.
అది నాకు కూడా తెలియని అలౌకిక స్థితి.
ఒకదాని వెనుక ఒకటి ఎన్ని ఫలకాలు, పొత్తిళ్ళ గూటిలోకి చేరుతున్నాయి!
మరి ఒక కొత్త ఫలకాన్ని తీసుకొని రంగు వేయబోతూంటే, అకస్మాత్తుగా నా చేయి ఆగింది.
ఏ రంగూ లేని ఆ ఫలకం అద్భుత చిత్రం లాగ నన్ను అబ్బుర పరచింది.
ఆశ్చర్యంతో, నా చేతిలో కుంచె జారింది.
ఫలకం ఖాళీగా..
ఏ రంగులూ లేని, ఏ చిత్రమూ లేని, ఆ అద్భుత ఖాళీ చిత్రం చూస్తూనే వున్నా.
రంగుల పళ్ళెం కిందపడిందీ, గమనించలేదు.
నేను చూస్తూ వుండగానే ఆ ఫలకం విస్తరిస్తున్నట్లు, గోచరించింది.
అంతవరకు అంతట వ్యాపించి వున్న పొత్తరలని చెదరగొడుతూ విస్తరిస్తోంది. ..
గాలికి చెదిరే కాగితాల్లా,
చిత్రాల పొత్తరలు చెదిరి ఎగిరి పోతున్నాయి పక్షులలా.
ఆ ఒక్క ఫలకం మాత్రం అంతటా వ్యాపిస్తూ వుంది.
రంగులు లేని, చిత్రము లేని, ఆ ఫలకం సౌందర్యాన్ని, దాని విస్తారణని,..
ఆ అద్భుత దృశ్యం చూస్తూ, నన్ను నేనే మర్చిపోయాను.
అది నెమ్మదిగా, నన్నంతా కూడా వ్యాపించేస్తోంది.
ఫలకంలో, ఏమీ లేని ఆ లేనితనాన్ని శూన్యమంటారా?!
సౌందర్యమంటారా?
ఆ ఖాళీ ఫలకం, నన్ను శూన్యంతో నింపుతోందా?
సౌందర్యముతో నింపుతోందా?!
నేను పట్టుకోడానికి పరిగెత్తిన, క్షణాలు అన్నీ, ఆగి చూస్తున్నాయి, నన్ను కమ్మేస్తున్న ఆ సౌందర్య శూన్యాన్ని.
ఇప్పుడు, ఈ మాయా ప్రపంచం, ఈ గారడీ, నేనే సృష్టించినది అయినా,
ఈ గారడీ వాడు కూడా మాయమయ్యాడు.
క్షణాలు ఆగిపోయాయి.
అంతవరకు పరిగెట్టిన క్షణాలు ఆగిపోయాయి.