ఆచార్య దేవో భవ

1
3

[శ్రీమతి లక్ష్మీ పద్మజ దుగ్గరాజు రచించిన ‘ఆచార్య దేవో భవ’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]అ[/dropcap]క్షరాలను ఉలిగా చేసి
పదాలను అందంగా చెక్కి
అద్భుతమైన ఆకృతిని
గావించడానికి,
అంకురార్పణ చేసేది గురువు!
భావ ప్రకటనలకి పంచెవన్నెలద్ది
హరివిల్లుగ జేసి..
పాఠాల బాణాలను ఎక్కుపెట్టి
మన జీవిత లక్ష్యం నిర్దేశించేది గురువు!
జీవితాశయ శిఖరం చేరుకునే వరకూ
వెంటవుండి నడిపించి..
ప్రతీక్షణం శిష్యుడికి తన జీవితం
అర్పించేది గురువు!
తల్లిదండ్రులు జన్మనిచ్చి,
సంస్కారం నేర్పగా..
మనలో జ్ఞానజ్యోతిని
వెలిగించి,
శిష్యుని జీవితంలో వెండి
వెలుగులు నింపి
జీవన మార్గాన్వేషణ సజావుగా
సాగేలా చూసేది గురువు!
మన జ్ఞానం, దుష్ట భూయిష్టం కాకుండా
ఆపద్భాంధవుడిలా అనుక్షణం వెన్నంటి
ఉండి చేయూతనిచ్చేది గురువు!
వివేచన, విచక్షణ, విజ్ఞతలతో కూడి
జీవిత గమనంలో అసాధ్యాన్ని సుసాధ్యం
చేయించేది గురువు!
మన మదిలో విజ్ఞానకుసుమాలు
వికసింప చేసి..
జీవితాన్ని ఓ నందనవనంలా మార్చి
సుగంధ చందన పరిమళాలు వెదజల్లేలా
మన జీవిత దిశా నిర్దేశం చేయగల
ప్రత్యక్ష శక్తి గురువు!
తల్లికి బిడ్డైనా, దేశానికి రాజైనా..
విద్యాభ్యాసానికి మోకరిల్లాల్సింది
గురువుకే..!
విలువలతో కూడిన విద్య,
సామాజికాభివృద్దికి మార్గాలు వేస్తుందని,
మానవత్వానికి, వ్యక్తిత్వ వికాసానికి,
నైతిక విలువలు కలిగిన నవసమాజ నిర్మాణానికి,
సామాజికాభివృద్దికి దోహద పడుతుందని
కొత్త భాష్యాన్ని ఇచ్చి.. గురుబాధ్యతలను..
కొత్త పుంతలు తొక్కించిన వారెందరో..
జగతిలోని గురువులందరికి
శిరసాభివందనం..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here