చిరుజల్లు-136

0
3

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

ఇదేనా చెలియ కానుక?

[dropcap]స[/dropcap]రిత సిటీ సెంట్రల్ లైబ్రల్ తెరిచే వేళకు అక్కడ ఉంటుంది. ఆ లైబ్రరీ మూసే దాకా అందులోనే ఉంటుంది.

ఎక్కడ ఏ పుస్తకాలు ఏర్చి కూర్చి పెట్టి ఉంటారో ఆమెకు తెల్సు. కరెంట్ ఎఫైర్స్ ఉండే కొత్త పుస్తకాలతో పాటు, పాత పుస్తకాలు, రంగు మారిపోయి, చినిగిపోయే దశలోనున్న పురాతన గ్రంథాల దాక సరిత వేటినీ వదలదు.

ఆమెకు అవన్నీ ధ్యానంలోనున్న మౌన మునీశ్వరుల లాగా కనిపిస్తయి. వాటిని తెరిచి చూస్తే, మనసును ఆవరించిన అజ్ఞానమనే చీకటి తొలగిపోయి, లేత బంగారు కిరణాలు ఏవో మూసుకుపోయిన మంచు తెరలను చీల్చుకుని వచ్చి పాదాల ముందు వాలినట్లు అనిపిస్తుంది.

కొన్నిటినీ మనసు పొరల్లోనూ, మరి కొన్నిటిని తను తెచ్చుకున్న తెల్లకాగితాల పుస్తకంలోనూ రిజిస్టర్ చేసుకుంటుంది. ఒకసారి మెదడులోకి చొరబడిన ఏ విషయాన్నీ ఆమె బయటకు పోనివ్వదు. అర్ధరాత్రి నిద్రలో లేపి అడిగినా అప్పజెప్పేస్తుంది.

ఆ పుస్తకాల అరల మధ్య తిరుగుతుంటే, వాటి మధ్య ఆమెకు రోజూ గంటగంటకూ ఎదురుపడే మరో ఆరడుగుల పుస్తకాల పురుగు రాజేష్. ఆమె మూసేసిన పుస్తకాలను అతను తెరుస్తుంటాడు. అతను చదివి పక్కన పెట్టిన గ్రంథాలను ఆమె ముందుకు లాక్కుంటుంది.

చూపులు కోలాటాల మధ్యనే ఇద్దరి ఆరాటాలూ ఒకటేనని చెప్పకనే చెప్పినట్లు అయింది. చిరుదరహాసాలు వెలిగించడాలూ, పొడి పొడి మాటలు కలపటాలూ, ఆపైన అర్థవంతమైన అంతర్యాలు విప్పుకోవటాలూ జరిగి పోయాయి.

“సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారా?” అని అడిగాడు రాజేష్.

“అవును” అంది సరిత.

“మీరు?”

“గ్రాడ్యుయేషన్”

“సబ్జెక్ట్స్?”

“పొలిటికల్ సైన్స్, ఎకనమిక్స్..”

“మీకు రాంక్ గ్యారంటీ..”

“ఇంకా నయం. నేనో పిపీలికాన్ని..”

“పిపీలికం? సాహిత్యం కాచి వడబోశారా ఏంటి?”

“కొంచెం ఇంటరెస్ట్. అంతే..”

“రోజూ ఎన్ని గంటలు చదువుతున్నారు?”

“పది, పన్నెండు.. మీరు?”

“కోచింగ్ సెంటర్‍కి వెళ్తాను. అక్కడే చాలా టైం వేస్ట్ అవుతోంది.”

“కోచింగ్ సెంటర్‌కి వెళ్తారా? ఇంకేం.. మీకు గ్యారంటీ.”

“అలా అయితే అందరూ అక్కడే ఉండేవాళ్ళు. మీరూ చేరండి.”

“అంత అదృష్టం లేదులెండి. అక్కడ మీరు నేర్చుకున్నది కొంచెం రాలిస్తే..” నవ్వు.

“రాలిస్తే రాలేది, రాసుకుంటే అంటుకునేది ఎంత ఉంటుంది?”

“గుడ్డిలో మెల్ల కదా..”

పుస్తకాలు ఇచ్చి పుచ్చుకోవటాలూ, సాయంత్రాలు కాఫీలు తాగుతూ చర్చించుకోవటాలు, వెన్నెల్లో జంటగా నడుస్తూ కొత్త కొత్త అంశాలు నేర్చుకోవటాలు, అర్ధరాత్రి దాటినా సెల్‍ఫోన్‌లు చెవులకు అంటించుకునే కునుకు తీయటాలూ, అన్న పానీయాలూ మర్చిపోవటాలూ వంటివి ఎన్నో జరిగిపోతున్న సమయంలో, ఇంకా రెండు నెలల్లో పరీక్షలు అనగా సరితకు డెంగ్యూ ఫీవర్ వచ్చింది.

వారం రోజులు దాకా కోలుకోలేక పోయింది. ఆ తరువాత కూడా ఇంకో వారం దాకా మామూలు మనిషి కాలేక పోయింది. పోగొట్టుకున్న కాలాన్ని తిరిగి పొందలేకపోయినా, రాజేష్ సాయంతో చాలా వరకు ముండుకు దూసుకు పోగలిగింది.

“నీకు నేను చాలా రుణపడి ఉన్నాను” అన్నది సరిత.

“ఎవరి కెవరు రుణపడి ఉన్నారో ఇప్పుడే ఏం చెప్పగలం?” అన్నాడు రాజేష్.

***

తమ బ్యాచ్ వాళ్లే ఒక జంట పెళ్లి చేసుకుంటుంటే, సబ్-కలెక్టర్లుగా ఉన్న సరిత, రాజేష్ ఆ వివాహానికి హాజరైనారు.

ఆ ప్రేమ వివాహానికి పెద్దరికం వహించిన ఉన్నతాధికారి ‘మన బ్యాబ్ వాళ్లు ఇంకా ఎవరన్నా బ్యాచిలర్స్ ఉంటే, తొందరలోనే నిర్ణయాలు తీసుకోండి, ముందు ముందు బాగా బిజీ అయిపోతారు’ అని సూచించారు.

“మన స్నేహాన్ని ఇంకొక మెట్టు పైకి ఎక్కిద్దామా?” అని అడిగాడు రాజేష్ నవ్వుతూ.

సరిత అవుననీ అనలేదు. కాదనీ అనలేదు. ఇంకేదో అన్నది.

“మనుష్యుల మధ్య మూడు రకాల బాంధవ్యాలు ఏర్పడతయి. మొదటి బాంధవ్యం పుట్టుకతో ఏర్పడుతుంది. తల్లీ తండ్రీ, అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్లూ వగైరా.. రెండవ బాంధవ్యం వివాహంతో ఏర్పడుతుంది. భార్యా, అత్తమామలూ, బావ మరుదులు, మరదళ్లు వగైరాలు.. మూడవ బాంధవ్యం స్నేహం వల్ల ఏర్పడుతుంది. ప్రతి దశలోనూ ఎవరో ఒకరు దగ్గరగా వస్తారు. కొన్నాళ్ల పాటు కల్సిమెల్సి ఉంటారు. ఆ తరువాత విడిపోతుంటారు.. కొంతకాలానికి ఎవరెవరో కూడా గుర్తుండరు. ఎక్కడో, ఎప్పుడో ఒకరిద్దరి అదృష్టవంతులు మాత్రం చిరకాలం స్నేహబంధాన్ని నిలుపుకోగలుగుతారు..” అన్నది సరిత.

“నేనేం అడిగాను, నువ్వేం చెప్పావు?” అన్నాడు రాజేష్.

“స్నేహితులుగా జీవితాంతం కొనసాగటానికి కండిషన్స్ ఏవీ ఆక్కర్లేదు. కానీ భార్యభర్తలు మాత్రం ఒకరికొకరు చేయవల్సిన త్యాగాలు, కోల్పోవల్సిన అలవాట్లు ఎన్నో ఉంటాయి, స్నేహితులు విడివిడిగా ఉంటూ స్నేహం కొనసాగించవచ్చు. భార్యాభర్తల మధ్య అది కుదరదు. ‘నా భార్య, నా భర్త’ అనే ‘నా’ అనే పొసెసివ్‌నెస్ ఉంటుంది. వాళ్ల డిమాండ్స్ కూడా చాలానే ఉంటాయి. డెడికేషన్ అవసరం..”

“స్త్రీ పురుషుల మధ్య గల స్నేహంలో మోహం కూడా ఉంటుందని అంటారు.”

“వారి స్నేహంలో, మోహం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక ప్రేమ అంటూ ఉంటే అది ఒక ‘ఫ్లేమ్’ లాంటిది. భగ్గున వెలిగే మంట, అంత తొందరగానూ ఆరిపోతుంది.. ప్రేమ లేని వివాహం, ఆత్మ లేని రెండు శరీరాల కలయికే అవుతుంది..”

“నేను అడిగిన దానికి సమాధానం రాలేదు.”

“ఇప్పటి దాకా నేను చెప్పింది అదే. నీకు ఒక స్నేహితురాలిగా ఉండాలా? ఒక భార్యగా ఉండాలా? మన ఇద్దరం సమాన స్థాయిలో ఉంటాం. సమయం చాలా ముఖ్యమైనది అవుతుంది. భార్యగా చేయవల్సిన సేవలు, నేను నీకు చేయలేను. భర్తగా నూవ్వు చేయాల్సిన విధులు నువ్వు చేయలేవు. ఇక్కడ ‘ఇగో’ సమస్య తలెత్తుతుంది. నువ్వ్యూ సుఖపడలేవు. నేనూ సుఖపడలేను.. ఇప్పుడు మన మధ్యనున్న స్నేహానికి బదులుగా, అప్పుడు ద్వేషం అయినా ఏర్పడుతుంది. చులకన భావం అయినా ఏర్పడుతుంది. నువ్వు ఒక స్నేహితుడిగా చేయవల్సిన దానికన్నా ఎక్కువే చేశావు. నీ మీద నాకు ఆ గౌరవం అలాగే ఉండిపోనివ్వు.. అన్నది నా అభిప్రాయం. కాదూ అంటే, నీమాట నేను ఇవాళ్ళ వింటాను.. ఎప్పటికీ వింటూనే ఉంటానని మాత్రం అనుకోకు” అన్నది సరిత.

రాజేష్ ఎటో చూస్తూ ఉండిపోయాడు.

***

సరితకు వివాహం అయింది. భర్తతో చిత్తూరులో ఉంటోంది. రాజేష్‌‍కి వివాహం అయింది. భార్యతో విశాఖలో ఉంటున్నారు. కలెక్టర్ల సమావేశానికి ఇద్దరూ ఒక చోటుకి వచ్చారు, పక్క పక్కనే కూర్చున్నారు. హోటల్లో పక్క పక్క గదులలోనే ఉన్నారు.

రాత్రి ఎనిమిది గంటలప్పుడు అందరికీ విందు ఏర్పాటు అయింది. కొందరు సిగరెట్లు తాగుతున్నారు. కొందరు మందు తాగుతున్నారు. రాజేష్ కూడా సిగరెట్ తాగాడు. మందు తాగాడు. పక్కనే ఉన్న సరితతో ‘విత్ యువర్ పర్మిషన్’ అని అన్నాడు.

సరిత నవ్వింది.

మర్నాడు ఉదయం ఇద్దరూ ఒకే టేబుల్ దగ్గర కూర్చుని అల్పాహారం తీసుకుంటున్నారు.

“నిన్న రాత్రి నేనేమన్నా అనుచితంగా ప్రవర్తించానా?” అని అడిగాడు.

సరిత నవ్వింది.

“ఎందుకు నవ్వుతున్నావ్?”

“నేను నీ స్నేహితురాలిని గనుక, ఒకవేళ అనుచితంగా ప్రవర్తించి నొప్పించావేమోనన్న ఆలోచన వచ్చింది. సంతోషం, అదే నేను నీ భార్యను అయిఉంటే ఇంత మోడెస్టీతో ఈ ప్రశ్న వేసేవాడివే కాదు. అందుకే నవ్వొచ్చింది..” అన్నది సరిత.

“యూ ఆర్ ఆల్వేస్ మై గైడ్ అండ్ ఫిలాసఫర్..” అన్నాడు రాజేష్.

“నన్ను గైడ్ అని తిన్నావు గనుక గైడ్ చేస్తున్నాను. సిగరెట్లు తాగినా, మందు తాగినా ఏదీ తప్పు కాదు. నీ ఇష్టం. నీ ఆనందం నీది. కాకపోతే అది ఒక బలహీనత కాకూడదు, అదొక వ్యసనం అయి, దానికి నువ్వు బానిస కాకూడదు. నువ్వు ఒక ఉన్నత స్థానంలో ఉన్నావు. బాధ్యతతో కూడిన పదవిలో ఉన్నావు. నీకింద ఎంతో మంది పని చేస్తున్నారు. ఎంతోమంది వాళ్ల పనులు చేయించుకోవటం కోసం నిత్యం నీ చుట్టూ తిరుగుతుంటారు. నీకు ఒక విస్కీ బాటిల్ ఇస్తే సంతకం పెట్టేస్తావనే అప్రతిష్ఠ పాలుకాకుండా చూసుకో.. డబ్బు పోతే ఫర్వాలేదు. ఆరోగ్యం పోయినా తిరిగి పొందవచ్చు. కానీ తాగి కారెక్టర్ పోతే మాత్రం నువ్వొక గడ్డిపోచతో సమానం. ఆ స్థితి రానీకు. నువ్వు ఒక ఫ్రెండ్‌వని నేను గర్వంగా చెప్పుకునేటట్లు ఉండు” అన్నది సరిత.

“ఇవాళ నీకు వాగ్దానం చేస్తున్నాను. ఇక సిగరెట్టు గానీ, మందు గానీ ముట్టుకోను” అన్నాడు రాజేష్.

“నీ మాట మీద నాకు నాకు నమ్మకం ఉంది. ఎందుకనీ అంటే, ఆడా మగా మధ్య గల స్నేహంలో మోహం ఉంటుందని నీవు ఒకసారి అన్నావు. అది నిజం. ఎంతోమంది ఎన్నో వాగ్దానాలు చేస్తుంటారు. మర్చిపోతుంటారు. కానీ స్నేహితురాలికి ఇచ్చిన వాగ్దానం మర్చిపోలేరు. ఆ స్నేహం లోని మోహం మహిమ అది..” అన్నది సరిత.

***

సెక్రటేరియట్‌లో ఒకే శాఖలో రాజేష్ సెక్రటరీ. సరిత ప్రిన్సిపల్ సెక్రటరీ.

రాజేష్, సరితకు ఫోన్ చేశాడు .

“ఆ మైనింగ్ లీజు ఫైలు ఏం చేద్దాం?”

“కుదరదు అని రాసెయ్. దానికి రావల్సిన పర్మిషన్స్ రాలేదు..”

“పది కోట్లు ఆశ పెట్టాడు”

“వంద కోట్లు ఆశ పెట్టినా కుదరదు. వాళ్లు ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్లు. అధికారంలోకి వచ్చారు. వాళ్లకు అధికారం ఉండొచ్చు. కానీ ఆ అధికారం దుర్వినియోగం కాకూడదని వాళ్ల చట్టాలు చేస్తారు. ఇక్కడ కూర్చుని మళ్లీ వాళ్ళే చట్టాలను బేఖాతరు చేస్తారు. మీరు చేసిన చట్టాలే ఒప్పుకోవని చెప్పవల్సిన బాధ్యత మనది. మనం ఇక్కడ ఉన్నది అందుకే..” అన్నది సరిత.

***

రాజేష్ ఉదయం మాట్లింగ్ వాక్ చేస్తుంటే, వెనుక నుంచి ఒక లారీ వచ్చి గుద్దేసింది. రాజేష్ అక్కడికి అక్కడే చనిపోయాడు.

సరిత రాజేష్ పార్థివ శరీరం పక్కన కూర్చుని ఉన్నది. రాజేష్ భార్య ఏడ్చి, ఏడ్చి సొమ్మసిల్లిపోయింది. రాజేష్ కూతురు సుష్మ – సరిత పక్కన కూర్చుని ఉంది.

మంత్రిగారు వచ్చారు. రాజేష్ బాడీ మీద పుష్పమాల వేశారు. రెండు నిముషాలు మౌనంగా నిలబడ్డారు.

రాజేష్ శవాన్ని తీసుకుపోతున్నప్పుడు “నాన్నా” అంటూ సుష్మ దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ కింద పడిపోయింది. సరిత లేవదీసి, అక్కున చేర్చుకుంది.

***

అయిదేళ్లు గడిచాయి. సరిత రిటైర్ అయింది. కొడుకు, కోడలు, మనమరాలిని చూడటానికి అమెరికా వచ్చింది.

సుష్మ సరితకు మనమరాలిని అందించింది.

మనమరాలి లేత బుగ్గల మీద ముద్దు పెట్టుకుంటుంటే, రాజేష్ గుర్తొచ్చాడు.

రెండు కన్నీటి చుక్కలు రాలిపడినయి.

అదే చెలియ కానుక అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here