శివశివమూర్తివి గణనాథా!

1
4

[2024 సెప్టెంబర్ 07 వినాయక చవితి పర్వదినం సందర్భంగా – ‘శివశివమూర్తివి గణనాథా!’ అనే కథని అందిస్తున్నారు డా. వెలువోలు నాగరాజ్యలక్ష్మి.]

[dropcap]“శి[/dropcap]వశివమూర్తివి గణనాథా! నీవు శివునీ కుమారుడవు గణనాథా!” భజన భక్తి శ్రద్ధలతో సాగుతుంది. అది ఆ గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు కోలాహలంగా జరుపుకుంటున్న వేదిక.. యువకులు, నడిమి వయసువాళ్ళు అందరూ కలసి లయబద్ధంగా చేస్తున్న చెక్కభజన, వారు అలపించే పదాలు ప్రేక్షకశ్రోతల హృదయాలలో నూతనోత్తేజాన్ని నింపుతున్నాయి.

యువకులు మరింత ఉత్సాహంగా చిందేస్తున్నారు. కాస్త నెమ్మదిగా కదులుతున్న మధ్యవయసు వారిని ఆటపట్టిస్తున్నారు.

“బాబాయ్! కాస్త గట్టిగా వెయ్ చిందు, పిన్ని నీకు ఇవాళ కుడుములు, ఉండ్రాళ్ళు బాగా పెట్టలేదా?” ఒక చిలిపి యువకుడి ప్రశ్న.

“పెట్టిందిరా అబ్బాయ్! వినాయకుడి పొట్టలాగా పెరిగింది పొట్ట. అందుకే పాదం విసురుగా పడటం లేదురా!”

వృద్ధులు, స్త్రీలు దూరంగా కూర్చొని భజన నృత్యం చూస్తూ ఆనందిస్తున్నారు.

“అమ్మాయ్ సీతా! మా మనవడు బాగా పదం అందుకుంటున్నాడే! ఇంట్లో నీ దగ్గర చలాకీగా ఉంటున్నాడటే!” కొత్తగా పెళ్ళి అయిన సీతను పక్కింటి బామ్మగారు ప్రశ్నించారు చిలిపిగా.

“పో బామ్మా! నువ్వు మరీనూ” అంటూ సిగ్గుల మొగ్గ అయింది సీత.

భక్తి, రక్తి, మురిపెం, వినోదం అన్నిటినీ మిళితం చేసుకుంటూ సాగిపోతున్న ఆ వేడుకని చూస్తూ లిఖిత అశ్చర్యం, అనందంతో కూడిన వింత అనుభూతికి లోనవుతుంది. కళ్ళు విప్పార్చుకొని చూస్తూ ఉండిపోయింది.

***

లిఖిత అప్పటికి 15 రోజుల క్రిందట అమెరికా నుండి తండ్రితో కలసి ఆంగలకుదురు వచ్చింది. తండ్రి పుట్టి పెరిగిన ఊరు అది. వాసుదేవరావు గుంటూరు వైద్యకళాశాలలో వైద్యవిద్యను అభ్యసించి 25 సంవత్సరాల క్రితమే అమెరికా వెళ్ళిపోయాడు. హ్యూస్టన్ నగరంలో స్థిరపడ్డాడు. అప్పుడప్పుడూ తను మాత్రమే వచ్చి తల్లిదండ్రులను చూసి వెళ్ళటమే కాని భార్యా, పిల్లలను ఎప్పుడూ తీసుకురాలేదు. భార్య అమెరికా మహిళ కావటంతో ఆమెకు కూడా భర్త పుట్టిన ప్రదేశాన్ని చూడాలనే ఆసక్తి అంతగా కలగలేదు.

తల్లిదండ్రులిద్దరు వాసుదేవరావుకు చాలాసార్లు చెప్పిచూశారు. తమకు అండగా ఇక్కడకు వచ్చి ఉండమని, ఇక్కడే ఆసుపత్రి కట్టుకోమని. ఆ కోరిక తీరకుండానే తండ్రి గతించాడు. తల్లి సుందరమ్మ భగవంతుడి పిలుపు కోసం ఎదురుచూస్తూ కూతురు సుభాషిణి దగ్గర కాలం గడుపుతుంది.

వాసుదేవరావుకి ఒక్కగానొక్క కూతురు లిఖిత. అమెరికాలోనే పుట్టి పెరగటంవలన తనకి ఇక్కడి సంప్రదాయాలు, సంస్కృతి, పండుగల గురించి కాని, వాటి నేపథ్యం గురించి కాని బొత్తిగా తెలియకుండా పెరిగింది. లిఖితకు ఇప్పుడు 20 సంవత్సరాల వయసు నిండింది.

శ్రావణమాసంలో తన కుమార్తె వివాహానికి తప్పక వచ్చితీరాలని సుభాషిణి తన అన్నగారు వాసుదేవరావును పదే పదే ప్రాధేయపడింది. వదినను, లిఖితను కూడ తీసికొని నెలరోజులైనా ఇక్కడ ఉండే విధంగా ప్రణాళిక సిద్ధం చేసికొని రావలసినదిగా ఫోన్ల మీద ఫోన్లు చేసింది. ఆమె ఆహ్వానాన్ని కాదనలేక వాసుదేవరావు లిఖితను వెంటబెట్టుకొని అంగలకుదురు వచ్చాడు.

పెళ్ళి వేడుకలన్నీ పూర్తయిపోయాయి. వాసుదేవరావు తన తిరుగు ప్రయాణానికి ఆలోచన ప్రారంభించాడు. కాని తను పూర్తి చేయాలనుకున్న పని ఒకటి మిగిలిపోయింది. దాన్ని ఎలా ప్రారంభించాలా? అని ఆలోచిస్తున్నాడు.

“నాయనా! వాసూ! భాద్రపదం రానే వస్తోంది. ఇంకెంత నాలుగు రోజులు. వినాయక చవితి ఇక్కడ బాగా చేస్తారురా. అది చూసి వెళ్ళండిరా!” బ్రతిమాలింది తల్లి సుందరమ్మ.

ఇది కూడా మంచిదే అనుకున్నాడు వాసు. తన మనసులో మాట తల్లికి చెప్పటానికి కొంత సమయం దొరికింది. 15 రోజుల తరువాత ఒక తేదికి అమెరికా టిక్కెట్లు బుక్ చేసుకున్నాడు.

“అమ్మా! నువ్వు కోరినట్లే వినాయకచవితికి ఇక్కడే ఉంటాం. మన ఇంటి వెనుక నా పేరు మీద ఉన్న 300 గజాల స్థలం అమ్మేద్దాం అనుకుంటున్నాను” నెమ్మదిగా తన మనసులో మాట చెప్పాడు.

“ఇప్పుడు దాన్ని అమ్ముకోవలసిన అవసరం ఏం వచ్చింది వాసూ!” తల్లి అనుమానంగా అడిగింది.

“ఏం లేదమ్మా! ఊరికే పడి ఉంటుంది కదా. పిచ్చి మొక్కలు పెరిగిపోతున్నాయి. డబ్బు రూపంలో ఉంటే దేనికైనా ఉపయోగపడుతుందని” నీళ్ళు నమిలాడు వాసు.

“పండుగలకు, పబ్బాలకు ఊళ్ళోవాళ్ళు ఎవరైనా అడిగితే వాడుకోవటానికి ఇస్తున్నానయ్యా! వాళ్ళే శుభ్రం చేసి ఉపయోగించుకుంటున్నారు. మనకే పుణ్యమే కదా వాసూ!”

మౌనంగా ఉండిపోయాడు వాసుదేవరావు. కాని దాన్ని ఎలాగైనా అమ్మివేసే మార్గం కోసం ఆలోచిస్తూనే ఉన్నాడు.

లిఖిత ఇక్కడ జరిగే ప్రతి వేడుకను చక్కగా ఆస్వాదిస్తూ అందరితోనూ కలివిడిగా తిరుగుతూ ఉంది. ప్రతి విషయం గురించి నాయనమ్మ సుందరమ్మను రకరకాల ప్రశ్నలు వేస్తుంది. సుందరమ్మ తన మనుమరాలు ఆసక్తికి మురిసిపోతూ అన్నిటికీ ఓపికగా సమాధానాలు చెప్తుంది.

వినాయక చవితికి నాలుగు రోజులు ముందు నుండి గ్రామంలో హడావిడి మొదలయింది. ఎప్పటి లాగానే ఖాళీ స్థలంలో విగ్రహం నిలబెట్టాలని పదిమంది యువకులు సుందరమ్మ ఇంటికి వచ్చి అనుమతి కోరారు. సుందరమ్మ సంతోషంగా అంగీకరించింది. వాసుదేవరావు తల్లి మాట కాదనలేక మిన్నకుండిపోయాడు.

గణేశ చతుర్థి రానే వచ్చింది. లిఖిత నిద్రలేచి రెడీ అయి వచ్చేసరికి ఇంట్లో పూజకు అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. ఇల్లంతా పచ్చి ఆకుల పరిమళాలతో, పిండివంటల ఘుమఘుమలతో, చేమంతి పూల అలంకరణతో నవ్యతను సంతరించుకుంది. బొజ్జ గణపతి నిండైన మట్టి ప్రతిమ ముందు కుడుములు, ఉండ్రాళ్ళు, పులిహోర, చక్కెర పొంగలి నైవేద్యాలు నోరూరించేస్తున్నాయి.

సుందరమ్మ ఎత్తుపీట మీద కూర్చొని శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమం ప్రారంభించింది. ఇంటిల్లిపాదీ చాపల మీద కూర్చొని ఒక్కొక్క పత్రిని గణేశ విగ్రహానికి సమర్పిస్తున్నారు. సుందరమ్మ మధ్యమధ్యలో ఆ పత్రి విశిష్టతను వివరించసాగింది. ఇలా పూజంతా పూర్తి కావటానికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది.

“గ్రాండ్‍మా! మన ఫెస్టివల్‍లో చాలా హెల్త్ టిప్స్ ఉన్నాయి కదూ!” అంది లిఖిత.

“అవునమ్మా! మన ఆచారాలు, సంప్రదాయాలు అన్ని ఆరోగ్య సూత్రాలతో నిండి ఉంటాయి తల్లీ!” చెప్పింది సుందరమ్మ.

“బామ్మగారూ! మన పందిట్లో రాత్రికి చెక్కభజన కార్యక్రమం ఉంది తప్పక రండి” – కబురు చెప్పి వెళ్ళిపోయాడు వినాయక చవితి సంఘ కార్యదర్శి.

లిఖిత ఉత్సుకతతో ఎదురు చూడసాగింది.

రాత్రి 8 గంటలు. పరిసర ప్రాంతాలలోని వారంతా సాయం సమయ పూజావిధులు ముగించుకొని గణేశ విగ్రహం పందిట్లో ఆసీనులయ్యారు. లిఖిత, వాసుదేవరావు దూరంగా రెండు కుర్చీలలో ఆసీనులై తిలకిస్తున్నారు.

12 మంది పురుషులు తమ భజన చెక్కలతో వృత్తాకారంతో నిలబడ్డారు. పంచెకట్టు, పైన ఎరుపురంగు చొక్కా, నడుము చుట్టూ గట్టిగా కట్టుకున్న పైకండువాతో- అందరూ ఒకే రకమైన వేషధారణలో కన్పిస్తున్నారు. ఒకరినొకరు వరుసలు పెట్టి పిలుచుకుంటూ భజన ప్రారంభించారు.

‘శివశివమూర్తివి గణనాథా’ – జట్టు నాయకుడు పల్లవి అందుకున్నాడు. బృంద సభ్యులంతా ఆ పల్లవిని అనుసరిస్తున్నారు. చెక్కలకు అమర్చబడిన గుండ్రటి చిన్న చిన్న రేకులు ఒకే లయలో శబ్దం చేస్తున్నాయి. ఆ లయకు అనుగుణంగా జట్టు అంతా పాదం కదుపుతూ నృత్యం చేయసాగారు.

కొద్దిసేపటికి పాట వేగమూ, చిందు వేగమూ పెరిగాయి. తిలకిస్తున్న యువత అంతా ఈలలు వేస్తూ ఆనందిస్తున్నారు. స్త్రీలు కూడ ‘శివశివమూర్తివి’ అంటూ లోలోపల పదం అందుకుంటున్నారు. ఎటు చూసినా గణేశనామం మారుమ్రోగిపోతోంది.

“రషీద్ భయ్యా! ఏంటీ ఆలస్యం – రావాలి – మాతో గొంతు కలుపు” ఒక కంఠం వినపడింది.

“వత్తండా భయ్యా!” అంటూ రషీద్ వారితో పదం కలిపాడు.

అంతవరకూ విడ్డూరంగా చూస్తున్న లిఖిత లేచి నిలబడి తనకు వచ్చినట్లుగా నృత్యం చేయసాగింది. భజన బృందం పదంలో పాదంలో వేగం తగ్గింది.

శివ-శివ- మూర్తివి గణనాథా-

నీవు – శివునీ – కూమారుడవు గణనాథా!

నెమ్మదిగా పదం అగింది.

“పొద్దుతిరుగుడు పువ్పూకంటె ముద్దుగున్నావే సామీ!” అంటూ నాయకుడు మరో భజన కీర్తన అందుకున్నాడు.

లిఖిత నాయనమ్మ దగ్గరకు పరుగున వచ్చింది.

“గ్రాండ్‌మా! గణపతి అనే పేరు ఎలా వచ్చింది?” ప్రశ్నించింది.

“నా తల్లే!” అని సుందరమ్మ మనుమరాలిని ముద్దాడింది. వినాయకుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణ నమస్కారాలు చేయటం ద్వారా లోకాల్లోని పుణ్యనదులన్నింటిలోనూ మునిగి వచ్చిన పుణ్యం సంపాదించుకున్న వృత్తాంతాన్ని వివరించింది.

“మన సంస్కృతిలోనే మనం పాటించవలసిన ఆచారాలు దాగి ఉన్నాయి తల్లీ! తల్లిదండ్రులను పూజించటం అంత గొప్పది అన్నమాట” చెప్పింది.

లిఖిత ఆశ్చర్య పోయింది

పేద, ధనిక వర్గభేదాలు, కుల, మత భేదాలు లేక అందరూ ఐకమత్యంతో ఆడిపాడుతున్న దృశ్యం లిఖిత అంతరంగంలో చెరిగిపోని వర్ణచిత్రంగా ముద్రపడిపోయింది.

వినాయక చవితి సంబరాలు ముగిశాయి.

***

“అమ్మా! లిఖితా! ఏదో మా పల్లెటూరి వంటలు, ఆచారాలు, అలవాట్లు నీకు నచ్చాయో లేదో? ఏం తిన్నావో?” సుందరమ్మ ప్రేమగా చెప్పింది.

“నో గ్రాండ్‌మా! చాలా బాగున్నాయి. అయితే మరి వినాయకుడి మనం ఎందుకు వర్షిప్ చెయ్యాలి గ్రాండ్‌మా?” అడిగింది లిఖిత.

“మనిషి శరీరంలో మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకు 6 చక్రాలుంటాయని యోగ సాధకులు చెప్తారు తల్లీ! ఈ షట్చక్రాలలో సాధన చేసిన మనిషి వీటిపైన ఉండే సహస్రారం చేరుకొని సిద్ధి పొందుతాడని చెప్తారు.

మొదటిదైన మూలాధారచక్రం భూమి తత్వం కలిగిన చక్రం, గణపతి దానికి అధిపతి. మనిషి నిజ జీవితంలో సాధన ద్వారా గమ్యం చేరుకోవటానికి ప్రారంభ దశలో గణపతి ఉంటాడు గణపతి జయసిద్ధికి, బుద్ధికి మారురూపు. భూమితత్త్వానికి అధిపతి కనుక భూమి నుండి పుట్టిన ఔషధ గుణాలతో నిండిన పత్రినే స్వామికి సమర్పిస్తాం తల్లీ! ప్రకృతి మాతే మనకు ఆరోగ్య సూత్రాలను తెలిపింది. క్రమశిక్షణను బోధిస్తుంది. ప్రకృతిని ఎలా కాపాడుకోవాలో నేర్పుతుంది.”

“గ్రాండ్‌మా! నువ్వు చెప్పింది నాకేం తెలియలేదు. కాని గణపతి చాలా గ్రేట్ అనుకుంటున్నా గ్రాండ్‌మా!” అంది లిఖిత.

“డాడీ! మనం ఆ స్థలం అమ్మద్దు డాడీ! ఇలాంటి పండగలు జరుపుకోటానికి ఇచ్చేద్దాం డాడీ!” అంది.

వాసుదేవరావులో ఆలోచన ప్రారంభం అయింది. ‘రెండు చేతులా డాలర్లు సంపాదించుకొనే నాకు ఈ స్థలం అమ్ముకోవలసిన అవసరం ఏముంది?’ అనుకున్నాడు.

“చెప్పండి డాడ్!”

“అమ్మా! లిఖిత చెప్పింది కరెక్ట్ అమ్మా! ఇకనుండి ఏ పండుగైనా, ఉత్సవం అయినా మన స్థలంలోనే జరుపుకొమ్మని ఊరివాళ్ళతో చెప్పమ్మా!” అన్నాడు తల్లితో.

స్థలం అమ్మవద్దని కొడుకుతో ఎలా చెప్పి ఒప్పించాలా? అని ఆందోళన చెందుతున్న సుందరమ్మ ఆనందానికి అవధులు లేవు.

“అంతేకాదమ్మ! అక్కడ ఒక వేదిక, ప్రేక్షకులు ఎండ, వానలకు ఇబ్బంది పడకుండా ఒక హాలు మనమే నిర్మించి ఇద్దాం అమ్మా! ఒక సాంస్కృతిక కేంద్రంగా, కళాకేంద్రంగా దాన్ని ఎవరైనా ఏ రుసుమూ చెల్లించనవసరం లేకుండా ఉపయోగించుకోవచ్చని మన ఊరిలో సంఘానికి చెప్పమ్మా!” వాసుదేవరావు మనస్ఫూర్తిగా తన నిర్ణయాన్ని వెలిబుచ్చాడు.

“థాంక్యూ డాడ్! నేను ఇక్కడి ఈవెంట్స్ అన్ని వీడియో తీశాను. మామ్‌కి తప్పకుండా నచ్చుతాయ్. గ్రాండ్‌మా! ఇక నుంచి నేను ఎవ్విరి ఇయర్ ఈ ఫెస్టివల్‍కి నీ దగ్గరకే వస్తాను గ్రాండ్‌మా!” అంది లిఖిత.

“మా అమ్మే! బాలా మంచి మాట చెప్పావు తల్లీ! ఇలా రాకపోకలు ఉంటేనే అనుబంధాలు, సంప్రదాయాలు అడుగంటి పోకుండా ఉంటాయ్ తల్లీ!” అంటూ లిఖిత బుగ్గలు పుణికి ముద్దాడింది సుందరమ్మ మురిసిపోతూ.

‘శివశివమూర్తివి గణనాథా! నీవు శివుని కుమారుడవు గణనాథా!’ తనలో తాను పాడుకుంటూ ప్రయాణానికి అన్ని వస్తువులు సర్దుకోసాగింది లిఖిత.

సుందరమ్మ తన ఆయుష్షు రెండింతలు పెరిగినట్లుగా పొంగిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here