మరుగునపడ్డ మాణిక్యాలు – 97: విప్‌ల్యాష్

0
3

[సంచిక పాఠకుల కోసం ‘విప్‌ల్యాష్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

కొన్ని చిత్రాలలో ఒక్కో పాత్ర ఇతర పాత్రలకి ద్వేషం కలిగించేలా ఉంటుంది. ఉదాహరణకి ‘దంగల్’లో ఆమిర్ ఖాన్ పాత్ర అంటే అతని కూతుళ్ళకి ఇష్టం ఉండదు. కానీ ప్రేక్షకులకి ఆ పాత్ర నచ్చుతుంది. మామూలుగా దుష్ట పాత్రలు ప్రేక్షకులకి నచ్చవు. ఇలాంటి పాత్రలు చాలానే ఉంటాయి. ‘విప్‌ల్యాష్’ (2014) చిత్రంలో ఫ్లెచర్ పాత్ర అలాంటిదే. కానీ చిత్రం మొదటిసారి చూసినపుడు కలిగిన ద్వేషం మళ్ళీ చూసినపుడు నాకైతే కలగలేదు. నాలాంటి వారే వేరే ప్రేక్షకులు కూడా ఉంటారు. ఇలా ద్వేషం మాయమవటం చాలా అరుదుగా జరుగుతుంది. ఇలాంటి పాత్రని సృష్టించిన దర్శకుడు డేమియన్ చజెల్‌ని అభినందించకుండా ఉండలేం. అతను కాలేజిలో ఉన్నప్పుడు సంగీతం క్లాసులో టీచరు కఠినంగా ఉండేవాడు. ఆ టీచరంటే అందరికీ భయం. ఆ టీచరుని ఆధారంగా చేసుకుని ఇంకాస్త కఠినంగా మార్చి ఫ్లెచర్ పాత్రని సృష్టించాడు. ఈ పాత్ర పోషించిన జే.కే.సిమన్స్‌కి ఉత్తమ సహాయనటుడిగా ఆస్కార్‌తో పాటు ఎన్నో అవార్డులు వచ్చాయి. ఈ చిత్రం యూట్యూబ్‌లో నామమాత్రపు అద్దె చెల్లించి చూడవచ్చు. అయితే ఒక హెచ్చరిక – ఈ చిత్రంలో అసభ్య పదజాలం ఎక్కువగా ఉంటుంది.

మామూలుగా గురువు కాస్త కఠినంగా ఉండటం మామూలే. కళలో కానీ క్రీడల్లో కానీ శిష్యుల ప్రతిభని సాన పెట్టటానికి కఠినంగా ఉండాలి. కానీ ఆ కాఠిన్యం మోతాదు మించితే ఎలా ఉంటుంది? శిష్యుడిపై ఒత్తిడి పెంచితే అది న్యాయమేనా? పుటం పెడితే కానీ బంగారంలో మెరుగు రాదు. అది శిష్యుడికి కూడా వర్తింపజేస్తే ఆ క్రమంలో ఆ శిష్యుడికి హాని జరిగితే ఎవరిది బాధ్యత? ప్రపంచానికి మంచి కళాకారులని లేదా క్రీడాకారులని అందించటానికి గురువు ఆ భారాన్ని మోయవలసిందేనా? ఆ నిందలు మోయటం గురువుకి తప్పని శాపమా? ఈ రోజుల్లో విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతోందని అందరూ అంటున్నారు. ఇష్టం లేని విద్య నేర్చుకోమని ఒత్తిడి చేయటం తప్పే. కానీ విద్యార్థికి ఇష్టమైన విద్యలో రాణించటానికి ఒత్తిడి అవసరమా? ఈ ప్రశ్నలకి తేలిక జవాబులు ఉండవు. ఈ చిత్రం విషయంలో కూడా అందరూ గురువుని సమర్థించకపోవచ్చు. కానీ ఈ చిత్రం ఆలోచింపజేస్తుంది. కళ పరమార్థమే అది కదా! ఇంతకీ చిత్రానికి ‘విప్‌ల్యాష్’ అనే పేరు ఎందుకు పెట్టారు? విప్‌ల్యాష్ అంటే కొరడా దెబ్బ. అంతే కాక తల, మెడ ఒక్కసారిగా వేగంగా కదిలితే కలిగే నొప్పిని కూడా విప్‌ల్యాష్ అంటారు. కారు ప్రమాదంలో కారు ఎక్కడైనా ఢీకొంటే ముందు తల, మెడ వేగంగా కదులుతాయి. అది కొరడా దెబ్బలా ఉంటుందని విప్‌ల్యాష్ అంటారు. హ్యాంక్ లెవీ అనే సంగీతకారుడు రూపొందించిన ఒక సంగీతఖండికకి ‘విప్‌ల్యాష్’ అని పేరు పెట్టాడు. ఆ సంగీతఖండిక ఈ చిత్రంలో చాలా చోట్ల వస్తుంది.

ఆండ్రూ అమెరికాలో పేరున్న ఒక సంగీత కళాశాలలో విద్యార్థి. జాజ్ సంగీతంలో డ్రమ్మర్‌గా శిక్షణ పొందుతూ ఉంటాడు. ప్రఖ్యాత డ్రమ్మర్ బడ్డీ రిచ్ లా పేరు సంపాదించాలని అతని స్వప్నం. బడ్డీ రిచ్ డ్రమ్స్ వాయించటంలో కౌశలానికి, వేగానికి ప్రసిద్ధి. ఆండ్రూ కళాశాలకి ప్రాతినిధ్యం వహించే సంగీత బృందానికి నిర్వాహకుడు (మ్యూజిక్ కండక్టర్) టెరెన్స్ ఫ్లెచర్. అతనంటే అందరికీ హడల్. అతని బృందంలో చోటు సంపాదించాలని ఆండ్రూ ఆశ. ఒకరోజు ఆండ్రూ కాలేజీలో ఒంటరిగా ప్రాక్టీస్ చేస్తుంటే ఫ్లెచర్ డ్రమ్స్ శబ్దం విని ఆ గదిలోకి వస్తాడు. ఆండ్రూ డ్రమ్స్ వాయించటం ఆపేస్తే “ఎందుకు ఆపేశావు?” అంటాడు. మళ్ళీ మొదలుపెడితే కాసేపు విని “ఎందుకు ఆపావని అడిగాను కానీ మళ్ళీ వాయించమన్నానా?” అంటాడు. ఇలా మాటలతో కంగారుపెట్టి వెళ్ళిపోతాడు. డ్రమ్స్ వాద్యం నచ్చిందో లేదో చెప్పడు. ఆండ్రూ అవకాశం పోయిందని నిరాశపడతాడు.

కొన్నాళ్ళకి ఫ్లెచర్ అకస్మాత్తుగా ఆండ్రూ క్లాసులోకి వస్తాడు. అప్పటికే టీచర్ ట్రంపెట్, ట్రోంబోన్, శాక్సఫోన్ (ఇవన్నీ వివిధ రకాలైన బాకాలు), డ్రమ్స్ వాద్యకారుల చేత అభ్యాసం చేయిస్తూ ఉంటాడు. మిగతా వాయిద్యాలకు ఇద్దరేసి, ముగ్గురేసి వాద్యకారులుంటే డ్రమ్స్‌కి ఒక వాద్యకారుడు, ఒక ప్రత్యామ్నాయ వాద్యకారుడు ఉంటారు. రయన్ డ్రమ్స్ వాయిస్తుంటే ఆండ్రూ ప్రత్యామ్నాయంగా ఉంటాడు. ఫ్లెచర్ రావటంతో అందరూ అప్రమత్తం అవుతారు. అతను అందరినీ ఒక్కొక్కరిగా వారి వారి వాయిద్యాలు వాయించమంటాడు. కొందరు బాగా వాయిస్తారు, కొందరు కంగారులో తడబడతారు. చివరికి రయన్, ఆండ్రూ డ్రమ్స్ వాయిస్తారు. ఫ్లెచర్ ఆండ్రూని పక్కకి పిలిచి మర్నాడు తన బృందంలో చేరమని చెబుతాడు. ఆండ్రూ ఉబ్బితబ్బిబ్బవుతాడు. ఫ్లెచర్ ఆండ్రూ ప్రతిభని మొదటే గుర్తించాడు. అతను క్లాసు బయట ఉండి వింటూ ఉండేవాడు. ఆండ్రూ వాయించినపుడు అతని టీచరుకి నచ్చదు, కానీ వెంటనే ఫ్లెచర్ క్లాసు లోపలికి వచ్చి అందరికీ పరీక్ష పెడతాడు. ఆండ్రూ తానెలాగూ ఫ్లెచర్‌కి నచ్చడు అని ఎప్పటిలాగే వాయిస్తాడు. అదే అతనికి కలిసొచ్చింది. శిష్యులని హడలెత్తిస్తే వారి ప్రతిభ బయటపడుతుందా? తర్వాత ఒక సందర్భంలో ఫ్లెచర్ ఒక వాద్యకారుడిని “నువ్వు శ్రుతి తప్పావా లేదా?” అని అడిగి కంగారుపెడతాడు. అతను “తప్పాను” అంటాడు. అతన్ని బయటికి పంపించి “నిజానికి శ్రుతి తప్పినది అతను కాదు, ఇతను. కానీ అతను శ్రుతి తప్పానని అనుకోవటం తప్పు” అంటాడు! తాను శ్రుతి తప్పలేదని తెలుసుకోలేని వాడు మంచి వాద్యకారుడు ఎలా అవుతాడు? తన మీద తనకి నమ్మకం ఉండాలి కదా! ‘నీ మీద నీకు నమ్మకం లేకపోతే నా సమయం వృథా చేయవద్దు’ అన్నటు ఉంటుంది ఫ్లెచర్ పద్ధతి.

ఆండ్రూ స్వతహాగా నెమ్మదస్థుడు. అతని తండ్రి ఒక స్కూల్లో టీచరు. తల్లి చిన్నప్పుడే వారిని వదిలి వెళ్ళిపోయింది. ఆండ్రూకి అమ్మాయిలతో మాట్లాడాలంటే బెదురు. అతని వయసు వారికి గర్ల్ ఫ్రెండ్స్ ఉండటం అక్కడ మామూలు విషయం. కానీ అతను సినిమాకి వెళ్ళాలన్నా తండ్రితో వెళతాడు. సినిమా హాల్లో పాప్‌కార్న్ కౌంటర్లో పాప్‌కార్న్ అమ్మే నికోల్ అనే అమ్మాయి అంటే అతనికి ఇష్టం, కానీ బెరుకు. ఆమె చదువుకుంటూ సినిమా హాల్లో పని చేస్తూ ఉంటుంది. ఫ్లెచర్ తనని ఎంపిక చేయగానే అతనిలో ఆత్మవిశ్వాసం కొండంత పెరుగుతుంది. నికోల్‌ని డేట్‌కి రమ్మని అడుగుతాడు. ఆమెకి కూడా అతనంటే ఇష్టమే. ఒప్పుకుంటుంది. డేట్‌కి వెళ్ళినపుడు మాటల్లో ఆమె తాను ఏ కోర్సు అభ్యసించాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని చెబుతుంది (కొన్ని కాలేజీల్లో కోర్సు ఎంపిక చేసుకోవటానికి గడువు ఇస్తారు). “అయితే గాలివాటంగా ఈ కాలేజీలో చేరావా?” అంటాడతను. ఆమె నొచ్చుకుంటుంది. అతనికి తాను మంచి కాలేజీలో చేరానని గర్వం. తన లక్ష్యం ఏమిటో తనకు తెలుసని దర్పం. ఆమె అతని మాటని పెద్దగా పట్టించుకోకుండా మాట మారుస్తుంది. నవ్వుతూ మాట్లాడుతుంది. నిజానికి ఆండ్రూ తండ్రికి కూడా ఆండ్రూ పద్ధతి నచ్చదు. తాను ఇతరుల కంటే ఉన్నతుడనని ఆండ్రూ అనుకుంటాడని అతని భావన. గొప్ప సంగీతకారుడు కాకపోతే కొంపలేం మునిగిపోవని అంటూ ఉంటాడు. ఆండ్రూ ఆ మాటలని తీసి పారేస్తాడు.

ఫ్లెచర్ మొదట్లో ఆండ్రూతో సౌమ్యంగా మాట్లాడతాడు. “నీలో దమ్ముంది” అంటాడు. ఆండ్రూ సంతోషపడతాడు. ఫ్లెచర్ ప్రసిద్ధ శాక్సఫోన్ వాద్యకారుడు చార్లీ పార్కర్ గురించి చెబుతాడు. “చార్లీ పార్కర్ అంత గొప్పవాడు ఎలా అయ్యాడో తెలుసా? జో జోన్స్ అతని తల మీదకి సింబల్ (డ్రమ్స్‌తో పాటు ఉపయోగించే పెద్ద పళ్ళెం లాంటి వాయిద్యం) విసిరేశాడు కాబట్టి. అర్థమయిందా? ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒత్తిడి లేకుండా వాయించటం” అంటాడు. అతను అన్న మాటలకి పొంతన ఉండదు. చార్లీ పార్కర్ కసితో గొప్పవాడయ్యాడని చెబుతూనే ఒత్తిడి పడొద్దంటాడు. ఆండ్రూ డ్రమ్స్ వాయించటం మొదలు పెట్టినపుడు ఫ్లెచర్ మెచ్చుకోలుగా తలాడిస్తాడు. కానీ కాసేపటికి వేగం పెరిగిందని, వేగం తగ్గిందని ఆక్షేపిస్తాడు. ఒక ఇనప కుర్చీ ఎత్తి అతని మీదకి విసిరేస్తాడు. అసభ్య పదజాలంతో అందరి ముందూ దూషిస్తాడు. ఆండ్రూ కన్నీరు పెట్టుకుంటే అపహాస్యం చేస్తూ మరింత దూషిస్తాడు. ఆండ్రూ బదులు ట్యానర్ అనే అతన్ని డ్రమ్స్ వాయించమంటాడు. ఆండ్రూ అవమానభారంతో తన గదికి వెళ్ళి కసిగా ప్రాక్టీస్ చేస్తాడు. చెయ్యి బొబ్బలెక్కి రక్తం వస్తుంది. ఫ్లెచర్ అవమానించి ఉండకపోతే అతను అలా ప్రాక్టీస్ చేసేవాడా? ఆండ్రూ లో కసి రేపటానికే తాను అలా ప్రవర్తించానని తర్వాత ఫ్లెచర్ అంటాడు. ఇది సరైన పద్ధతా? హద్దు దాటితే శిష్యులు మరీ నిరుత్సాహపడరా? నిజమైన కళాకారులు ఏ పరిస్థితులలోనూ నిరుత్సాహపడరని ఫ్లెచర్ అభిప్రాయం. ఉన్నత శిఖరాలు అందుకోవాలంటే కఠోర శ్రమ చేయాలని అంటాడు. కఠోర శ్రమ చేయటానికి గురువు ప్రేరేపించాలంటాడు. తలిదండ్రులు ఈ పద్ధతులని ఒప్పుకుంటారా? ఈ కాలంలో గట్టిగా తిడితేనే తలిదండ్రులు ఊరుకోవట్లేదు. విద్యార్థులు ఇలా సుకుమారంగా పెరగటం వల్లే ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయేమో!

డేమియన్ చజెల్ ఈ కథతో ముందు ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు. తర్వాత స్క్రీన్ ప్లే రాసి ఈ చిత్రం తీశాడు. ఈ చిత్రం విడుదలయ్యే సమయానికి అతని వయసు 29 మాత్రమే. తర్వాత ‘లా లా ల్యాండ్’ (2016) చిత్రానికి అతను ఉత్తం దర్శకుడిగా ఆస్కార్ గెలుచుకున్నాడు. ఆ చిత్రం కూడా జాజ్ సంగీతం ఆధారంగా రూపొందిన చిత్రమే. ఈ చిత్రంలో ఆండ్రూగా మైల్స్ టెలర్, ఫ్లెచర్ గా జే.కే.సిమన్స్ నటించారు. మైల్స్ టెలర్ డ్రమ్స్ వాయించే సన్నివేశాలలో నిజమైన డ్రమ్మర్‌లా అనిపిస్తాడు. అతను చాలా సాధన చేశాడనిపిస్తుంది. ఇక జే.కే.సిమన్స్ ఒక రాక్షసుడే అనిపిస్తుంది. ఈ చిత్రానికి ఎడిటింగ్ చేసిన టామ్ క్రాస్ కి ఆస్కార్ వచ్చింది. చిన్న చిన్న షాట్లతో కథలో ఎక్కడ ఏం జరుగుతోందో చెబుతూనే అవసరమైన చోట కథని నెమ్మదిగా నడిపించాడు. సౌండ్ మిక్సింగ్ కి కూడా ఆస్కార్ వచ్చింది.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

మొత్తానికి ఆండ్రూ ఫ్లెచర్ బృందంలో కుదురుకుంటాడు. కాకపోతే ట్యానర్‌కి ప్రత్యామ్నాయ వాద్యకారుడిగా ఉంటాడు. ఒక జాజ్ పోటీకి ఫ్లెచర్ బృందం వెళుతుంది. స్టేజి మీదకి వెళ్ళేముందు ట్యానర్ సంగీతపు నొటేషన్స్ ఉన్న ఫైలు పట్టుకోమని ఆండ్రూకి ఇస్తాడు. ఆ ఫైలు కుర్చీ మీద పెట్టి ఆండ్రూ పక్కకి వెళతాడు. ఫైలు మాయమవుతుంది. నొటేషన్స్ చూడకుండా తాను వాయించలేనని ట్యానర్ ఫ్లెచర్‌తో అంటాడు. ‘విప్‌ల్యాష్’ అనే సంగీతఖండిక వాయించాలి. ఆండ్రూ తనకు ఆ సంగీతఖండిక నొటేషన్స్ ఙాపకం ఉన్నాయని, తాను వాయించగలనని అంటాడు. ఫ్లెచర్ ఆండ్రూని వాయించమంటాడు. చివరికి ఫ్లెచర్ బృందానికే మొదటి బహుమతి వస్తుంది. దాంతో ఆండ్రూని ముఖ్య వాద్యకరుడిగా నియమిస్తాడు ఫ్లెచర్. ఆండ్రూ గాల్లో తేలిపోతూ ఉంటాడు. ఇంతకీ ఫైలు ఎవరు తీశారు? ఫ్లెచరే తీసి ఉంటాడు. అతనికి అన్నీ పద్ధతిగా ఉండాలి. ఫైళ్ళు అక్కడా ఇక్కడా పెట్టటం అతనికి నచ్చదు. అసలు ఫైలు అవసరం లేకుండా వాయించగలగాలని అతని ఉద్దేశమేమో! ఆండ్రూకి ఆ సత్తా ఉంది.

ఒకరోజు అండ్రూ తండ్రి ఇంట్లో బంధువులు భోజనానికి వస్తారు. ఆండ్రూ వయసు కుర్రాళ్ళు ఇద్దరు ఉంటారు. వారు ఫుట్‌బాల్ ఆటగాళ్ళే కాక చదువులో కూడా ముందుంటారు. అందరూ వారిని పొగుడుతుంటే ఆండ్రూకి అసహనంగా ఉంటుంది. మాటల్లో ఆండ్రూ చార్లీ పార్కర్ లాగా గొప్పవాడినవ్వాలని ఉంది అంటాడు. ఇంతకు ముందు బడ్డీ రిచ్ లాగా అవాలనే వాడు ఇప్పుడు చార్లీ పార్కర్‌ని ఆదర్శంగా తీసుకున్నాడు. ఆండ్రూ తండ్రి “చార్లీ పార్కర్ 34 ఏళ్ళ వయసులో డబ్బు లేక, డ్రగ్స్‌కి బానిసై చచ్చిపోయాడు. అది గొప్పతనమా?” అంటాడు. “90 ఏళ్ళ దాకా బతికి అనామకంగా చావటం కంటే చార్లీ పార్కర్‌లా ఖ్యాతి గడించి 34 ఏళ్ళకే మరణించినా మంచిదే” అంటాడు ఆండ్రూ. కళాకారులు వ్యక్తిగత జీవితాల్లో ఎలా ఉన్నా మనకి అనవసరం, నేరం చేయనంతవరకు. వారి కళే వారి ఆస్తి, మన ఆస్తి. జీవితంలో తప్పు చేశాడని కళ విలువ తగ్గిపోతుందా? సమాజం చాలావరకు తప్పులే చూస్తుంది. ఆండ్రూ కళే ముఖ్యం అంటాడు. అసలు విషయం ఏమిటంటే కళాకారుల కీర్తి వలనే వారి వ్యక్తిగత జీవితం మీద దృష్టి పెరుగుతుంది. కళాకారులు కానివారు తప్పులు చేయరా?

ఆండ్రూ తాను మరింత సాధన చేయాలని, అందుకోసం సమయమంతా కేటాయించాలని, నికోల్‌కి సమయం ఇవ్వలేనని, అది ఆమెకి తన మీద ద్వేషం కలిగిస్తుందని చెప్పి ఆమెతో తెగతెంపులు చేసుకుంటాడు. ఆమె అతని మాటలకి ఖిన్నురాలవుతుంది. అతను తన లక్ష్యం మీద దృష్టి పెట్టాలని ఆమెని వదులుకున్నాడు. ఇందులో తప్పు లేదు. అతని ప్రాధమ్యాలు అతనికి తెలుసు. ఆమె “నేను నీకు అడ్డు వస్తానా?” అంటుంది. ఇలాంటి సందర్భాల్లో అమ్మాయిలు (లేక అబ్బాయిలు) తమని అవమానించినట్టు అనుకుంటారు. అలా ఎందుకు అనుకోవాలి? అవతలి వారి లక్ష్యం వేరని ఊరుకోవచ్చుగా! అలా అనుకోవటానికి అహంకారం అడ్డు వస్తుంది.

కొన్నాళ్ళకి ఫ్లెచర్ రయన్ (ఆండ్రూ పాత క్లాసులో డ్రమ్స్ వాద్యకారుడు) ని కూడా తన బృందం లోకి తీసుకుంటాడు. ఆండ్రూ, ట్యానర్ కాకుండా రయన్ కూడా డ్రమ్స్ వాయిస్తూ ఉంటాడు. ఒక పెద్ద సంగీతపు పోటీకి సాధన చేస్తున్నపుడు ఫ్లెచర్‌కి ఒక వార్త తెలుస్తుంది. తన పాత విద్యార్థి ఒకరు కారు ప్రమాదంలో మరణించాడని. ఫ్లెచర్ ఉద్విగ్నతకి గురవుతాడు. ఆ రోజు ఆండ్రూని, ట్యానర్‌ని, రయన్‌ని మార్చి మార్చి డ్రమ్స్ వాయించమని రాత్రి పొద్దుపోయే దాకా కూర్చోబెడతాడు. వేగంగా వాయించమని వారిని ఒత్తిడి చేస్తాడు. ఎవరూ సరిగ్గా వాయించటం లేదని దూషిస్తాడు. పాత విద్యార్థి మరణం గురించిన భావోద్వేగమే దీనికి కారణం అనిపిస్తుంది. చివరికి ఆండ్రూనే ముఖ్య వాద్యకారుడిగా ఎంపిక చేస్తాడు. పోటీకి వేరే ఊరికి వెళ్ళాలి. ఆండ్రూ బస్సులో వెళుతుంటే టైరు పంక్చరవుతుంది. ఆండ్రూ వేరే బస్సులో ఆ ఊరు చేరుకునే సరికి సమయం మించిపోతుంటుంది. కారు అద్దెకి తీసుకుని పోటీ జరిగే చోటికి వెళతాడు. ఆలస్యం అయినందుకు ఫ్లెచర్ కోపంతో “నీ బదులు రయన్ వాయిస్తాడు” అంటాడు. ఆండ్రూ తానే వాయిస్తానని పట్టుబడతాడు. అయితే అతను తన డ్రమ్స్ కర్రలని కారు అద్దెకి తీసుకున్న చోట మర్చిపోయాడు. రయన్ కర్రలు తీసుకుంటానని అంటాడు. ఫ్లెచర్ ఒప్పుకోడు. కర్రలు తీసుకొస్తానని ఆండ్రూ హడావిడిగా వెళతాడు. తిరిగి వస్తుంటే కారు ప్రమాదానికి గురై తలకిందులవుతుంది. ఆండ్రూ తలకి గాయమవుతుంది. అయినా అతను పరుగెత్తుకుంటూ ప్రదర్శన జరిగే చోటికి వెళతాడు. అప్పటికే అందరూ స్టేజి మీద ఉంటారు. ఆండ్రూ తన స్థానంలో కూర్చుని డ్రమ్స్ వాయిస్తాడు. రయన్ అభ్యంతరం చెప్పబోతాడు కానీ సమయం మించిపోవటంతో ఫ్లెచర్ ప్రదర్శన మొదలుపెడతాడు. గాయాల వల్ల ఆండ్రూ ఎక్కువ సేపు వాయించలేకపోతాడు. కర్రలు జారవిడుస్తాడు. చివరికి ఫ్లెచర్ ప్రేక్షకులకి క్షమాపణ చెబుతాడు. ఆండ్రూ కోపంతో ఫ్లెచర్ మీద పడి కొడతాడు. కారు ప్రమాదం జరిగాక ప్రదర్శనలో పాల్గొనటం ఆండ్రూ తప్పు. అంత పట్టుదల పనికిరాదు. హుందాగా తప్పుకుంటే సరిపోయేది. ఫ్లెచర్ సొంత కర్రలు లేకపోతే వాయించొద్దనటం కఠినంగా ఉంటుంది. కానీ ఫ్లెచర్‌కి అన్నీ పద్ధతి ప్రకారం జరగాలి. ఫ్లెచర్ వల్లే తనకి ప్రమాదం జరిగిందని ఆండ్రూ అక్కసు. కానీ తర్వాత తన అభిప్రాయం మార్చుకుంటాడు.

ఫ్లెచర్ తన పాత విద్యార్థి కారు ప్రమాదంలో చనిపోయాడని చెప్పాడు కానీ అతను నిజానికి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దాని మీద విచారణ జరుగుతుంది. ఫ్లెచర్ దగ్గర సంగీతం అభ్యాసం చేస్తున్నపుడే ఆ విద్యార్థిలో కుంగుబాటు మొదలయిందనే నిర్ధారణ జరుగుతుంది. విచారణ క్రమంలో విచారణాధికారిణి ఆండ్రూ దగ్గరకి వస్తుంది. ఆండ్రూ తండ్రి కూడా అక్కడ ఉంటాడు. “ఫ్లెచర్ వల్ల నాకు ప్రమాదం జరగలేదు” అంటాడు ఆండ్రూ. తనదే తప్పని అతనికి తెలిసింది. సమయం దాటిపోతుందని తెలిసీ అతను తానే డ్రమ్స్ వాయిస్తానని పట్టుబట్టాడు. ఎందుకు? అవకాశం వదులుకోకూడదని. త్వరగా ఖ్యాతి సంపాదించాలని. ఈ అవకాశం పోతే మరో అవకాశం వస్తుంది. జరుగుతున్న పరిణామాలని స్వీకరించాలి కానీ ఎలాగైనా మార్చాలి అనుకుంటే ఎదురుదెబ్బలు తప్పవు. ‘నా ప్రయత్నం నేను చేశాను, సమయం కలిసి రాలేదు’ అనుకోగలిగితే ప్రశాంతంగా ఉంటాం. ఆండ్రూకి ఇది అర్థమయింది. అతని తండ్రి మాత్రం ఊరుకోడు. “నా కొడుకుని యాతన పెట్టినవాడు నిర్దోషిగా బయటపడితే నేను చూస్తూ ఊరుకోను” అంటాడు. విచారణాధికారిణి “ఫ్లెచర్ ఇంకే విద్యార్థినీ బాధ పెట్టకూడదంటే నువ్వు అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలి. నీ పేరు బయటకి రాదు” అంటుంది. ఆండ్రూ అయిష్టంగానే ఒప్పుకుంటాడు. తన కోసం కాదు, ఒత్తిడి తట్టుకోలేని సున్నిత మనస్కులైన విద్యార్థుల కోసం. కానీ సున్నిత మనస్కులైన విద్యార్థులని ఫ్లెచర్ నిజంగా బాధపెట్టాడా? ప్రతిభ ఉందని, మనోధైర్యం ఉందని నమ్మినవారినే ఒత్తిడి చేసేవాడేమో అని ఎవరూ ఆలోచించరు. చివరికి ఫ్లెచర్ తన ఉద్యోగం కోల్పోతాడు. ఆండ్రూ కూడా సంగీతం వదిలేసి వేరే కోర్సులో చేరతాడు.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

కొన్నాళ్ళకి ఆండ్రూ ఒక చిన్న క్లబ్ బయట ఫ్లెచర్ పేరు చూసి లోపలికి వెళతాడు. అక్కడ ఫ్లెచర్ పియానో వాయిస్తుంటాడు. ఆండ్రూని చూసి పలకరిస్తాడు. ఇద్దరూ మాట్లాడుకుంటారు. “నా పాత విద్యార్థి కేసులో అతని స్నేహితుడెవరో నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు. నా ఉద్యోగం పోయింది. నేను ప్రతిభని లోకానికి పరిచయం చెయ్యాలనే ప్రయత్నించాను. చార్లీ పార్కర్ మీద జో జోన్స్ సింబల్ విసిరేశాడు కాబట్టే కసి పెరిగి అతను మళ్ళీ ఎప్పుడూ అలాంటి అవమానం జరగకూడదనే ఏకైక లక్ష్యంతో సాధన చేశాడు. ఏడాది తర్వాత ఉత్తమ సోలో (ఏకవాద్య ప్రదర్శన) వాయించాడు. జో జోన్స్ ‘పర్వాలేదు’ అని ఉంటే అది జరిగేది కాదు. ఇంగ్లిష్ భాషలో ‘గుడ్ జాబ్’ (బావుంది) అనే పదాల కంటే ప్రమాదకరమైన పదాలు లేవు” అంటాడు. అంటే శిష్యులని పొగడకూడదని అతని ఉద్దేశం. ‘చాణక్య నీతి’లో చాణక్యుడు కూడా ఇదే చెప్పాడు. సంతానాన్ని, శిష్యులని ఊరికే పొగడకూడదు. ఆండ్రూ “కానీ ఒత్తిడి హద్దు దాటితే తట్టుకోలేక కాబోయే చార్లీ పార్కర్ నిరుత్సాహపడి చార్లీ పార్కర్ అవకుండా ఉండిపోయే ప్రమాదం లేదా?” అంటాడు. “లేదు. కాబోయే చార్లీ పార్కర్ ఎప్పటికీ నిరుత్సాహపడడు” అంటాడు ఫ్లెచర్. అంటే నిజమైన కళాకారుడు ఎన్ని అవాంతరాలు వచ్చినా కళను వదలడని అతని ఉద్దేశం. మళ్ళీ అతనే “ఇంకో చార్లీ పార్కర్‌ని నా చేతులతో మలచాలని ప్రయత్నించాను. ఆ సంతృప్తి చాలు నాకు. నా పద్ధతులు తప్పని మాత్రం చస్తే ఒప్పుకోను” అంటాడు.

ఆండ్రూ వీడ్కోలు తీసుకుని వెళ్ళబోతుంటే ఫ్లెచర్ తానొక ప్రదర్శన ఇస్తున్నానని, డ్రమ్మర్‌కి సత్తా లేదని, డ్రమ్మర్‌గా ఆండ్రూని రమ్మని అడుగుతాడు. ‘విప్‌ల్యాష్’ లాంటి ఖండికలని గుర్తుపెట్టుకునే డ్రమ్మర్ కావాలని అంటాడు. “రయన్‌ని తీసుకోవచ్చుగా” అంటాడు ఆండ్రూ. “అప్పట్లో రయన్‌ని కేవలం నీలో స్పర్ధ రగిలించటానికి తీసుకున్నాను” అంటాడు. “మరి ట్యానర్?” అంటే “ట్యానర్ డాక్టర్ అవ్వాలనుకుంటున్నాడు. కారణం నిరుత్సాహమేమో” అంటాడు. ఆండ్రూ ఆలోచిస్తానంటాడు. ఫ్లెచర్ ‘అసలైన కళాకారుడు కళని వదలడు’ అన్న అర్థం వచ్చేలా మాట్లాడటంతో ఆండ్రూ ఆలోచనలో పడతాడు. తాను అసలైన కళాకారుడిని అని నిరూపించుకోవాలనే ఆశ కలుగుతుంది. అంతకు ముందు కొన్నిసార్లు పాత గర్ల్ ఫ్రెండ్ నికోల్‌కి ఫోన్ చేద్దామనుకున్నాడు కానీ చేయలేదు. ఇప్పుడు నికోల్‌కి ఫోన్ చేసి క్షమాపణ చెబుతాడు. తాను ప్రదర్శనలో పాల్గొంటున్నానని చెప్పి ఆమెని రమ్మంటాడు. ఆమెకి ఇప్పుడు వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. “నా బాయ్ ఫ్రెండ్‌కి చెబుతాను. అతనికి జాజ్ ఇష్టం లేదు. అయినా చూస్తాను” అంటుందామె. ఆండ్రూ సరే అని ఫోన్ పెట్టేస్తాడు. ఆండ్రూ నికోల్‌కి ఫోన్ చేయటం వెనక ఉద్దేశం ఆమె సానుకూలంగా లేకపోతే తన మనసంతా సంగీతం మీద పెట్టాలని అనుకోవటమే అని నాకనిపించింది. అదొక సంకేతంగా తీసుకోవాలని అతను అనుకున్నాడు. అతను ఫోన్ పెట్టేసిన తర్వాత చాలాసేపు అతని ముఖం మీద క్లోజప్ షాట్ ఉంటుంది. అతని ఆలోచనలని చదవమని ప్రేక్షకులని సవాల్ చేసినట్టుంటుంది. చిత్రంలో చాలా భాగాల్లో షాట్లు త్వరత్వరగా మారిపోతున్నట్టు ఉంటుంది, కానీ ఇక్కడ ఒకే షాట్ ఎక్కువ సేపు ఉంటుంది. అదే ఎడిటింగ్ లోని గొప్పతనం. కథకి అవసరమైనట్టుగా ఎడిటింగ్ ఉండాలి.

ప్రదర్శనకి ఆండ్రూ తన తండ్రిని ఆహ్వానిస్తాడు. స్టేజి మీదకి వెళ్ళాక ఫ్లెచర్ ఆండ్రూ దగ్గరకి వచ్చి “నేను మూర్ఖుడిని కాదు. నువ్వే సాక్ష్యం చెప్పావని నాకు తెలుసు” అంటాడు! ఆండ్రూ ఖంగు తింటాడు. అతను తేరుకునే లోగా ఫ్లెచర్ “మొదట కొత్త సంగీతఖండిక ‘అప్‌స్వింగ్’ వాయిస్తాము” అని ప్రేక్షకులకి ప్రకటిస్తాడు. ఆ ఖండిక ఆండ్రూకి తెలియదు. ఇతర వాద్యకారులు వాయించటం మొదలుపెడతారు. ఆండ్రూ గత్యంతరం లేక తనకి తోచినదేదో వాయిస్తాడు. ప్రేక్షకులకి నచ్చదు. ఖండిక ముగిశాక ఫ్లెచర్ “నీలో చేవ లేదనేదే నిజమేమో” అంటాడు. ఆండ్రూ నిరాశగా స్టేజి దిగి పక్కకి వెళతాడు. అతని తండ్రి పరుగున వచ్చి అతన్ని కౌగిలించుకుంటాడు. అయితే ఆండ్రూ తిరిగి స్టేజి మీదకి వెళతాడు. ఫ్లెచర్ తర్వాతి ఖండిక ప్రకటిస్తుండగానే ఆండ్రూ డ్రమ్స్ వాయించటం మొదలుపెడతాడు. ఇప్పుడు ఆండ్రూది పైచేయి అవుతుంది. ఫ్లెచర్ ఉక్రోషపడతాడు కానీ ప్రేక్షకుల ముందు ఏమీ చేయలేక ఊరుకుంటాడు. కాసేపటికి ఆండ్రూ కౌశలానికి ముగ్ధుడై అతనికి నిర్దేశాలు ఇస్తాడు. ఈ సన్నివేశం చూడాలి కానీ చెబితే సరిపోదు. ఆండ్రూ ముగించిన తర్వాత ఫ్లెచర్ వంక చూస్తాడు. ఫ్లెచర్ సంతృప్తిగా చిరునవ్వు నవ్వుతాడు. ఆండ్రూ కూడా సంతోషంగా చిరునవ్వు నవ్వుతాడు. ఆండ్రూ మళ్ళీ డ్రమ్స్ వాయించటం మొదలుపెట్టటంతో చిత్రం ముగుస్తుంది.

ఫ్లెచర్ ఆండ్రూని అవమానించాలనే అతన్ని ప్రదర్శనకి రమ్మన్నాడు. ఆ అవమానమే ఆండ్రూలో కసి రగిలించింది. ఆండ్రూ మళ్ళీ స్టేజి మీదకి వెళ్ళి డ్రమ్స్ వాయిస్తూ ఫ్లెచర్‌కి అర్థమయ్యేలా మౌనంగా పెదవులు కదుపుతూ  దూషిస్తాడు. ఫ్లెచర్ అతని దగ్గరికి వచ్చి “నీ కళ్ళు పీకేస్తాను” అంటాడు. ఒకరి మీద ఒకరికి పీకల దాకా కోపం ఉంటుంది. కానీ కాసేపటికి ఆండ్రూ దృష్టంతా తన కళ మీదకి మళ్ళుతుంది. అతని ప్రతిభని చూసి ఫ్లెచర్ కోపం కరిగిపోతుంది. ఫ్లెచర్ చేసిన అవమానం వల్లే తాను అద్భుతంగా వాయించగలిగానని ఆండ్రూకి అర్థమవుతుంది. గురువులు ప్రతిభ గల శిష్యుల మీద అసహనం చూపించినా అతని శిష్యుల మంచికే. కళ అయినా, క్రీడలైనా. నేరం స్థాయికి వెళ్ళనంతవరకు గురువులకి స్వేచ్ఛ ఇవ్వాలి. కాఠిన్యానికి, దుర్వ్యవహారానికి మధ్య గీత చాలా సన్నగా ఉంటుంది. కాదనను. కానీ ఉద్దేశం గమనించాలి. నిఘా కూడా ఉండాలి. ఎఫ్ అక్షరంతో మొదలయ్యే అసభ్య పదం భారతీయులకి కఠినంగా ఉంటుంది. కానీ అమెరికాలో అసహనం ఎక్కువైనప్పుడు ఆ పదం వాడితే పెద్దగా పట్టించుకోరు. ఈ చిత్రంలో ఆ పదం వెనుక దురుద్దేశం ఏమీ ఉండదు. కఠిన పరిస్థితులను ఎదుర్కొంటేనే సహనం పెరుగుతుంది. ఉదాహరణకి టెన్నిస్ క్రీడాకారుడు నదాల్ కోచ్ అతని చిన్నప్పుడు ప్రాక్టీస్ అయ్యాక కోర్టు పక్కన ఉన్న చెత్తంతా తీయమనేవాడట. అది క్రీడాకారుడి పని కాదు. కానీ దాని వల్ల అతని సహనం పెరిగింది. ఎందరో టెన్నిస్ క్రీడాకారులు ఓడిపోయే సందర్భాలలో అసహనంతో ర్యాకెట్లు విరగ్గొడుతూ ఉంటారు. నదాల్ ఎప్పుడూ ఆ పని చేయలేదు. అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకడిగా నిలబడ్డాడు. సహనం చాలా గొప్పది. అది అలవడాలంటే కఠిన పరిస్థితులను దాటాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here