[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]
ఓ.. మనసా వినవేల
~
చిత్రం: గౌతమబుద్ధ
సంగీతం : శశిప్రీతమ్
సాహిత్యం: సిరివెన్నెల
గానం : శశిప్రీతమ్
~
పాట సాహిత్యం
పల్లవి:
ఓ మనసా వినవేల ఈ మమతే చెఱసాల
వీడదు నిన్ను ఈ నడిరేయి
చూడదు వెలుగును నీ కనుదోయి ॥వీడదు ॥
॥ ఓ మనసా ॥
చరణం:
వైశాఖ పౌర్ణమి బంగరు ఛాయ చీకటి చేసిన మాయ
కల్లని తెలిసి కన్నులు తెరిచి కలలోనే ఉంటావా నిదురలేపి నిజమును చూపే వేకువ వలదంటావా వెన్నెల ఒడిని వన్నెల వలని విడివడ లేనంటావా ॥ ఓ మనసా ॥
చరణం:
అనుబంధాలను అనుమతి కోరకు వెనుతిరగకు క్షణమైనా సందేహించకు సాగవె ముందుకు సత్యాన్వేషణలోన
సత్యాన్వేషణ సంకల్పించినా ఆరాటం ఆగేనా సంసారమ్మున సాగదు సాధన వ్యామోహం ఇంకానా
చరణం:
తడబాటెందుకు త్వరపడు ముందుకు సత్యాన్వేషణలోన
మోహములో పడి మిథ్యకు లోబడి సందేహం ఇంకానా
నిదురలేపి నిజమును చూసే వేకువలో చిరువేడి ముల్లని తెలిపి వలదని ఆపే రాతిరి వల విడలేవా
♠
అత్యంత ప్రశస్తమైన, ప్రాచీనమైన హిందూధర్మంలో వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు ఉన్నాయి. ఇవన్నీ మానవుడి సత్యాన్వేషణ నుంచి జనించినవే.
బృహదారణ్యకోపనిషత్తులో ప్రస్తావించిన శ్లోకం కూడా ఈ లోకంలో మనిషి స్థితిని, గతిని, చెప్పకనే చెబుతుంది. ఆదిశంకరాచార్యులు భాష్యం అందించిన ఈ శ్లోకం బహుళ ప్రాచుర్యం పొందింది కూడా.
అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతం గమయ
ఓం శాంతిః శాంతిః శాంతిః
అసత్యం నుండి సత్యం వైపుకు నడిపించు, చీకటి నుండి వెలుగు వైపుకు నడిపించు, మరణం నుండి అమృతత్వం వైపుకు నడిపించు అని అర్థం. మరి సత్యాసత్యాలు ఏమిటి?
సత్యానికి అసత్యానికి మధ్య తేడా ఏమిటి?? అసలు సత్యం అంటే ఏమిటి?? నిన్న ఉన్నది ఈరోజు ఉండదు, ఈరోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు. ఇలా నిరంతరం మారుతూ ఉండేది, అసత్యం.
ఈ సృష్టిలో ఎప్పటికి మారకుండా నిలిచి ఉండేది సత్యం. అదేమిటి? అన్ని ఎప్పుడో ఒకప్పుడు నశించేవిగా అనిపిస్తే, నశించనిది ఏది అనే ప్రశ్న వస్తే, ఆ ప్రశ్నకు సమాధానమే ఆ భగవంతుడు లేదా అఖండ చైతన్యం. అదే శాశ్వత సత్యం. ఆ మహా చైతన్యం వైపు నడుస్తూ దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ, ఈ సృష్టిని కూడా తెలుసుకుంటూ, నిన్ను నీవు ఆవిష్కరించుకుంటూ సాగడమే సత్యాన్వేషణ.
ఆత్మ సాక్షాత్కారం మానవ జీవిత పరమావధి. మనసు,శరీరం, ఆలోచన, క్రియలను ఏకీకృతం చేయగలిగే సాధనమే యోగా. యోగా అంటే కేవలం శారీరకమైన అభ్యాసాలు మాత్రమే కాదు.. మొత్తం ప్రపంచంతో, ప్రకృతితో మమేకమై.. మనలోని సత్యాన్ని కనుగొనే మార్గమే యోగా. అది భారతదేశపు పురాతనమైన భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక, అది భౌతిక అభ్యాసం. పతంజలి నిర్వచించిన యోగ సూత్రాలలో యోగాసనాలు ఒక భాగం. అష్టాంగ యోగంలో ‘యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, సమాధి’ స్థితులు ఉంటాయి. అలా అద్వితీయమైన సాధన చేసి, ఆత్మసాక్షాత్కారము పొంది, తాను తరించడమే కాక లక్షల మందిని తన మార్గంలో నడిపించాడు గౌతమ బుద్ధుడు.
ఆ మహనీయుడు, ఉత్కృష్టమైన తన జీవన పరమావధి వైపు అడుగులు వేయడానికి బయలుదేరే క్షణంలో, 28 ఏళ్ల నిండు యవ్వనంలో, బంధాలను పక్కకు నెట్టి, ముందుకు సాగవలసిన తరుణంలో తన మదిలో పెరిగిన అలజడిని, అంతరాత్మతో జరిగిన సంఘర్షణను సిరివెన్నెల ‘ఓ మనసా వినవేల’, పాట ద్వారా ఆవిష్కరించారు. ఆ పాట విశ్లేషణ ఒకసారి పరిశీలిద్దాం.
బౌద్ధ మతాన్ని స్థాపించి, అహింసను, శాంతిని ప్రతిపాదించి, అష్టాంగ మార్గంతో, జీవన సూత్రాలను ప్రతిపాదించిన బుద్ధుడు, నేపాల్ లోని లుంబిని వనంలో జన్మించాడు. ఇతని పేరు గౌతమ సిద్ధార్ధుడు. కపిలవస్తును పరిపాలించే శుద్దోధన మహరాజు, మాయాదేవిలకు కలిగిన ఏకైక సంతానము సిద్ధార్థుడు. ఆ రోజు వైశాఖ పౌర్ణమి, శుక్రవారం, విశాఖ నక్షత్రం. అదే ఓ అహింసామూర్తి ఇహలోక ఆగమనానికి శుభముహూర్తం.
పుత్ర జననవార్త విన్న శుద్దోధనుడు నగరమంతా ఉత్సవాలు జరిపించాడు. బంధుమిత్ర, పురోహితుల సమక్షంలో తన కుమారునకు ‘సిద్ధార్థుడు’ అని నామకరణం చేసాడు. సిద్దార్థుని జాతకచక్రం పరిశీలించిన జ్యోతిష్యులు శుద్ధోధనుడితో, “మహారాజా మీ పుత్రుడు ఈ సమస్త భూమండలాన్ని శాసించగల సార్వభౌముడయినా అవుతాడు లేదా వైరాగ్యా భావనతో ఈ ప్రపంచాన్ని సన్యసించి, జ్ఞానాన్ని భోదించే సన్యాసి అయినా అవుతాడు” అని చెప్పారు.
తను కుమారుడు రాజ్యాధికారానికి వారసుడు కాకుండా సన్యాసి అవ్వడం మహారాజుకు ఇష్టం లేదు. అందుకని శుద్దోధనుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రపంచం లోని కష్టాలు ఏవి తన పుత్రుడి దరి చేరకుడదని నిర్ణయించుకుని సర్వ సుఖ భోగ సమృద్దమైన ఓ భవనం నిర్మించాడు. పదునారు సంవత్సరాల ప్రాయంగల సుందరీమణులను సిద్దార్థుని సేవలకు నియోగించాడు. సిద్దార్థుని జీవితం సుఖసాగరంలో, ఆనందపుటలలపై రసరమ్య భరితంగా సాగిపోతుంది.
ఓ పండుగ రోజున బాహ్యప్రపంచాన్ని చూడటానికి విలాస వనానికి వెళ్ళాడు. వనానికి వెళ్ళే మార్గమద్యమంలో ఓ వృద్దుడు. ఓ రోగి; ఓ శవం; ప్రశాంత వదనంతో ఉన్న ఓ సన్యాసి ఆయన కంటపడ్డారు. అనుకోకుండా ఎదురయిన ఈ నాలుగు దృశ్యాలు సిద్దార్థునకు జీవితం మీద వెగుటు కలిగించాయి. సామాన్య జనం ఓలలాడే ఈ ఇంద్రియ సుఖాల కన్నా, జ్ఞానులు ఆనందం పొందే పరిత్యాగ విలువను అర్థం చేసుకున్న సిద్ధార్థుడు. శాశ్వత శాంతి కోసం సత్యాన్వేషణకై ఈ మామూలు ప్రపంచాన్ని విడిచి దూరంగా వెళ్ళాలని నిశ్శయించుకున్నాడు.
సుఖ భోగాలకు, మమతానురాగాలకు, బాంధవ్యాలకు దూరంగా, జ్ఞానాన్ని అన్వేషిస్తూ వెళ్ళాలన్న నిర్ణయం తీసుకునే సమయంలో, సిద్ధార్థుని మదిలో జరిగే అంతర్మథనాన్ని ఆవిష్కరిస్తూ, సిరివెన్నెల ఈ పాటను వ్రాశారు.
పల్లవి:
ఓ మనసా వినవేల ఈ మమతే చెఱసాల
వీడదు నిన్ను ఈ నడిరేయి
చూడదు వెలుగును నీ కనుదోయి ॥వీడదు ॥
॥ ఓ మనసా ॥
అజ్ఞానం అనే చీకటిలో అలాగే ఉండిపోతే, జ్ఞానం అనే వెలుగును చూడడం సాధ్యం కాదని మనసుకు బోధిస్తూ, దేన్ని మనం మమత అనుకుని, ఆనందిస్తూ, ఆ మొహమాయలో చిక్కుకున్నామో, నిజానికి, ఆ మమతే ఒక చెరసాల వంటిదని, అందులో నుండి స్వేచ్ఛ పొందగలిగితేనే, అసలైన సత్యాన్ని అన్వేషించే మార్గంలో నడవవచ్చని, పల్లవిలో తేట తెల్లం చేశారు సిరివెన్నెల.
చరణం:
వైశాఖ పౌర్ణమి బంగరు ఛాయ చీకటి చేసిన మాయ
కల్లని తెలిసి కన్నులు తెరిచి కలలోనే ఉంటావా? నిదురలేపి నిజమును చూపే వేకువ వలదంటావా?
వెన్నెల ఒడిని వన్నెల వలని విడివడ లేనంటావా?
అమావాస్య చీకటి నుండి నిండైన పౌర్ణమి వెలుగులోకి మానవాళిని నడవమనే సంకేతం ఇస్తుంది ప్రకృతి. శూన్యం నుంచి పూర్ణానికి జరిగే పయనమే జ్ఞాన వికాసం. ఇక్కడ చీకటి అంటే మనసులో ఉన్న అంధకారం. ఆ అంధకారం మూలానే జీవితంలో నిజమైన వెలుగు అంటే ఏమిటో చూడలేకపోతున్నాం. ఈ జీవితంలో నిజమైన వెలుగు చూడాలంటే ఒక్కసారిగా సాధ్యం కాదు, అదొక ప్రక్రియగా మొదలవ్వాలి. కఠోర సాధన కావాలి. జ్ఞానజ్యోతిని దృఢ సంకల్పంతో వెలిగించి అదే మార్గంలో ముందుకు సాగాలి. వైశాఖ పౌర్ణమి వెలుగులు ఆకాశంలో నిండి ఉన్నా, మనసులో చీకట్లు అలుముకోకూడదనీ, ఆ మాయల చీకట్లలో మనసు అసలు చిక్కుకోకూడదనీ సిద్ధార్థుడి మనసు హెచ్చరిస్తోంది, అని సిరివెన్నెల భావం. ‘అఘటనాఘటన పటీయసీ మాయ’, అంటారు. ఈ మాయ లేదా భ్రమ, జ్ఞానికి – జ్ఞానానికి మధ్య అడ్డుతెరలా నిలుస్తుంది.
ఏ రోజైతే సిద్ధార్థుని మనసులో, ఈ ప్రపంచం ఒక మాయ అన్న నిజం స్ఫురించిందో, కలలాంటి ఈ మిథ్యా జగత్తులో, కల్లలలో, కనులు తెచ్చుకున్న తరువాత కూడా కొనసాగుతావా? వెలుగును చూపే వేకువను వదులుకుంటావా? అని తన మనసును ప్రశ్నిస్తాడు. మొహంలో చిక్కుకొని, వెన్నెల ఆనందాలను, అందమైన యశోదర వన్నెలను అనుభవిస్తూ, ఈ చీకటిలోనే మగ్గిపోతావా? అన్న ప్రశ్నలు, సిద్ధార్థుని మదిలో చెలరేగినట్టు సిరివెన్నెల ఒక మనో చిత్రాన్ని మన ముందు ఆవిష్కరించారు.
చరణం:
అనుబంధాలను అనుమతి కోరకు వెనుతిరగకు క్షణమైనా సందేహించకు సాగవె ముందుకు సత్యాన్వేషణలోన
సత్యాన్వేషణ సంకల్పించినా ఆరాటం ఆగేనా సంసారమ్మున సాగదు సాధన వ్యామోహం ఇంకానా?
ఆ విలాస వనం నుంచి తిరిగి వచ్చిన తరువాత సిద్ధార్థునిలో మేధోమథనం ప్రారంభమైనది. సమాధానాలు తెలియని ఎన్నో ప్రశ్నలు అతన్ని నిరంతరం వేధిస్తూనే ఉన్నాయి. “మరణం అంటే ఏమిటి? మనిషికి ఎందుకీ కష్టాలు? దుఃఖ నివారణకు నిజమైన మార్గం ఏమిటి?” బందిఖానాలాంటి ఈ భవనంలో ఇంతకాలం గడిపిన జీవితం నిస్సారమని భావించాడు. ఈ చెర నుంచి బయటపడాలని నిశ్చయించాడు. అడుగు ముందుకు వేశాడు. అప్పుడే పుట్టిన పసిబిడ్డ ఏడుపు వినిపించింది. యశోదర ప్రసవించిందని తెలుసుకున్నాడు. తన ప్రతిబింబాన్ని ఒకసారి చూడాలని పితృ హృదయం తహతహలాడింది.. ఆ సందర్భంలో సిరివెన్నెల పలికించిన సందేశాత్మక చరణం ఇది.
పెంచిన తల్లి మహా ప్రజాపతి, తండ్రి శుద్ధోధనుడు, సౌందర్యవతి, అనుకూలవతి, అనురాగవతి అయిన భార్య, యశోధర, ఆమె జీవం పోసి కన్న ఒక శిశువు, రాహులుడు.. ఇవన్నీ సిద్ధార్థుని జీవితంతో పెనవేసుకున్న బంధాలు. జీవితంలో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఎంత స్థిరంగా ఉండాలో, ఎంత ఆచితూచి అడుగు వేయాలో, మనసు మాటను ఎంత గట్టిగా అదుపు చేయాలో, మనకు అర్థమయ్యేలా, సిద్ధార్థుని అంతరంగాన్ని మనకు తెలియజేస్తున్నారు సిరివెన్నెల. ఎవరి అనుమతి కోరకు, సందేహించకు, వెనుతిరగకు, సత్యాన్వేషణలో మున్ముందుకు సాగిపో!!
జననం, మరణం రెండూ నిజమైనవి. ఖచ్చితంగా జరిగేవి. దేనికి శాశ్వత స్థానం లేదు ఈ సృష్టిలో. కానీ మరణం నుండి శాశ్వతం వైపుకు నడిపించమని కోరుకోవడం అంటే ఈ దేహాన్ని ఇలాగే ఈ భూమి మీద ఎన్నేళ్లయినా ఉండేలా చేయమని అడగడం కాదు. శరీరానికి అంతం ఉంది కానీ ఆత్మకు లేదన్నది సత్యవచనం. అలాంటి ఆత్మజ్ఞానం గురించి తెలుసుకుంటే, అసలు మరణం అనే భయం కానీ దాని తాలూకూ ఆలోచనలు కానీ మనిషిని వెంటాడవు. ఈ శరీరం శాశ్వతం కాదన్న జ్ఞానాన్ని పొందినప్పుడు, మనిషి అమృతత్వమైన భావానికి లోనవుతారు, భౌతికమైన వాటి పట్ల మోహాన్ని వదులుకుంటాడు. అప్పుడే మనిషి పరిపూర్ణుడు కూడా కాగలడు. ఈ అన్వేషణే సత్యాన్వేషణ. దీన్ని ఇంగ్లీషులో ఇలా నిర్వచిస్తారు:
The pursuit of truth in philosophy is the search for reality and the nature of truth, and how to discover it. It’s a quest that connects observation, theory, and the world.
“సత్యాన్వేషణ సంకల్పించినా ఆరాటం ఆగేనా సంసారమ్మున సాగదు సాధన వ్యామోహం ఇంకానా?” సత్యాన్వేషణ కోసం సంకల్పం తీసుకుంటే సరిపోదు. మనసులో కలిగిన నిరంతర ఆరాటం తరిగిపోదు. ఇంకా ఏం చేయాలి? కఠోరమైన సాధన చేయాలి. బంధాలతో ముడిపడిన ఈ సంసార సాగరంలో కఠోర సాధన సాధ్యం కాదు! ఆ బంధాలపై ఉన్న వ్యామోహం మనసును దీక్ష నుండి వెనుకకు మళ్ళిస్తుంది. అందుకే వ్యామోహాన్ని వదులుకొని, సంకల్ప దీక్షతో సాగమన్న సంకేతాన్ని ఈ వాక్యాల్లో అందిస్తున్నారు సిరివెన్నెల. ‘మోహయతి అఖిలం జగత్!’ అన్నది ఉపనిషద్వాక్యం. పదార్థజాలం మీద పుట్టే మోహం, పరమాత్మ మీద పుడితే మోక్షం దొరుకుతుంది. కోట్లలో ఒకరు మాత్రమే అలాంటి ప్రయత్నం చేస్తారు! భగవంతుడిని అమ్మ అనుకుంటే, తల్లి ఇచ్చే వరాలు కావాలని ఏడ్చడం ఆపేసి, అమ్మే కావాలి! అని పట్టుబట్టి ఏడిస్తే, అమ్మ పాదాల దొరకవా? అంటారు భాష్యకారులు. ఈ వ్యామోహాన్ని ఇంగ్లీషులో delusion అంటారు.
Delusion is a false belief or judgment about external reality, held despite incontrovertible evidence to the contrary, occurring especially in mental conditions.
అయస్కాంత ఇనుప ముక్కను ఆకర్షించినట్టు, ప్రతిదానిలోనూ వ్యామోహం, ఆకర్షణ ఉంటుంది. అది మానవ సంబంధాల్లోనే కాదు, భౌతిక విషయాలకు కూడా అతుక్కుంటుంది. కానీ నిజానికి వ్యామోహం మరియు ఆకర్షణ ఉన్నంత వరకు కోరిక నుండి విముక్తి పొందలేడు. భగవంతునికి దగ్గరగా సాగాలంటే, కోరికలకు, వ్యామోహాలకు దూరం అవ్వాలి, అంటారు ఎన్నో ఆధ్యాత్మ గ్రంథాలు అవపోసన పట్టిన సిరివెన్నెల.
చరణం:
తడబాటెందుకు త్వరపడు ముందుకు సత్యాన్వేషణలోన
మోహములో పడి మిథ్యకు లోబడి సందేహం ఇంకానా
నిదురలేపి నిజమును చూసే వేకువలో చిరువేడి ముల్లని తెలిపి వలదని ఆపే రాతిరి వల విడలేవా
Truth is eternal, truth is God, Truthfulness is virtue, truth is Lord, Truth is life and death.. అంటారు ఓ ఆంగ్ల కవి.
మోహము, మిథ్యల నుండి బయటపడితేనే, సత్యం ప్రకటితమవుతుంది. ఉదాహరణకు, ఒక ఇంద్రజాలికుడు ఇంద్రజాలాన్ని ప్రదర్శిస్తున్నాడు అనుకుందాం. దాన్ని చూస్తూ మనం ఎంతో ఆశ్చర్యానికి లోనవుతాం, ఆనందానుభూతిని పొందుతాం. ఆ మాయతో మమేకమై పోవడాన్నే మిథ్య అంటారు. కానీ, ఏది సత్యం అని ప్రశ్నించుకుంటే, ఇంద్రజాలికుడు సత్యమో, ఇంద్రజాలం సత్యమో మనకు అర్థమవుతుంది.
ఆ మిథ్యా ప్రపంచాన్నే ‘రాతిరి వల’ అన్న అత్యంత అలతి పదాలతో వర్ణించారు సిరివెన్నెల. అత్యంత క్లిష్టమైన ఆత్మ విద్యను కూడా సులభమైన శైలిలో జన సామాన్యానికి అందించడంలో సిరివెన్నెలది అందవేసిన చేయి.
జ్ఞాని అయిన వాడు మాత్రమే పరమాత్ముడి మాయాజాలమైన ఈ సృష్టికి, పరమ సత్యమైన బ్రహ్మకు మధ్య తేడాను గుర్తించగలడు. ఆ మాయ వలను ఛేదించగలడు. సత్యాన్వేషణ స్వీయ అనుభవంతో, ఆత్మానందానుభవంతో, జ్ఞానవంతమై, శాస్త్రబద్ధమై, వేదాంతపరమై ఉంటుంది. ఋషులు, మహాపురుషులు, పరమ హంసల అన్వేషణ మార్గాలే వీటికి ఋజువులు.
సత్యాన్వేషణలో గమనాలు ఎన్ని ఉన్నా, గమ్యం ఒక్కటే. అదే అనంతమైన సత్యాన్ని తెలుసుకోవడం! పాలలో నుండి పుట్టిన వెన్న, నీళ్లలో కలిసిపోకుండా, నీటిపై తేలినట్టు, సత్యం అన్నిటికన్నా మిన్నగా, అన్ని ప్రభావాలకు భిన్నంగా, అన్నిటికీ అతీతంగా ఉంటుంది.
కాబట్టి ఆత్మ జాగృతమై, అనంత సత్యం వైపు పయనిస్తున్న ఆ క్షణాల్లో సందేహానికి తావియ్యవద్దని, అల్ప విషయాలపై ధ్యాస పోనివ్వవద్దని, సంకల్ప దీక్షతో ముందుకు సాగమని మనసును గట్టిగా హెచ్చరిస్తున్న సిద్ధార్థుడి మనోగతాన్ని ఈ పాట ద్వారా వినిపిస్తున్నారు సిరివెన్నెల.
ఇదే చిత్రంలో ఆయన మరో రెండు పాటలు కూడా వ్రాయడం జరిగింది.
1.బుద్ధ దయామృతమా, సర్వ శుభప్రదమా,
సిద్ధ మనోరథమా ధర్మ చక్ర పథమా..
సతతభయావహ జగతికి అభయము నందించే హితమా
నవ్య భవ్య భవితవ్య గమ్యమును చూపే దృక్పథమా
అభ్యుదయానికి సుపధమైన అష్టాంగ క్రియాన్వితమా బుద్ధ దయామృతమా
~
2.అంజలి గొనుమ అవ్యయ జ్యోతి
దీవెనలిడుమా దివ్య ప్రదీప్తి
………
అందరి యాతన నీదని తలచి
బంధ విమోచన అన్వేషించి
సాంద్రతమస్సును తపమొనరించి
పొందిన ఫలమును జనులకు పంచి
భవము తరించిన భువన హితార్థి
దీవెనలుడుమా దివ్య ప్రదీప్తి..
~
బుద్ధ భగవానుడి వంటి మహనీయుల చరిత్రలు చిత్రాలుగా తీసినప్పుడు, వారి మనోభావాలను, కీర్తిని, చరిత్రను, సేవలను, హృద్యంగా అక్షరీకరించి, తన వంతు సాహితీ సేవలను సంపూర్ణంగా అందించి, తెలుగు సాహిత్యానికి మరింత వన్నెలను కూర్చిన సిరివెన్నెల జ్ఞానసిరికి మనసా,శిరసా వందనం!!
ఆయన గడించిన అపారమైన జ్ఞాన సారాన్ని, ఆధ్యాత్మిక విలువలను తన పాటల ద్వారా మన కందించి శాశ్వత కీర్తిని పదిలం చేసుకున్నారు సిరివెన్నెల.
Images Source: Internet