మహాభారత కథలు-74: ఇంద్రుడు సురభి సంవాదం చెప్పిన వ్యాసుడు

0
2

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

ఇంద్రుడు సురభి సంవాదం చెప్పిన వ్యాసుడు

[dropcap]“మ[/dropcap]హారాజా! తల్లితండ్రులకి ఉండే అన్ని మమకార బంధాల్లోకి పుత్రులమీద ఉండే మమకారం చాలా ఎక్కువ. కొడుకులు లేనివాళ్లకి ఎంత సంపద ఉన్నా మనశ్శాంతి ఉండదు. సురభి ఇంద్రుడి మధ్య జరిగిన సంభాషణ చెప్తాను విను.

ఒకసారి అన్ని ఆవులకి తల్లి అయిన సురభి ఇంద్రుడి దగ్గరికి వెళ్లింది. ఇంద్రుడి వైపు చూస్తూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది. ఇంద్రుడికి అంత ధర్మవర్తనురాలైన సురభి ఏడుస్తుంటే ఆశ్చర్యం కలిగింది. అలాగే దాని ఏడుపుకి జాలి కూడా వేసింది. “ఎందుకు ఇంత బాధపడుతున్నావు? అందరూ క్షేమంగానే ఉన్నారా?” అని అడిగాడు.

సురభి ఇంద్రుడితో “మూడు లోకాల్ని ప్రకాశింపచేసే మహానుభావా! దేవేంద్రా! నీ వజ్రాయుధంతో నువ్వు రక్షిస్తున్నావు కనుక మూడు లోకాల్లో ఉన్న జీవకోటి క్షేమంగానే ఉన్నారు. ఒక్క నా సంతానమే క్షేమంగా లేదు” అని చెప్పింది.

దేవేంద్రుడు అదేమిటో చెప్పమన్నాడు. సురభి “దేవా! నేను చెప్పేదాన్ని సావధానంగా విను. బలం కలిగిన ఎద్దులతో బలం లేని ఎద్దుల్ని కూడా కాడికి కట్టి బరువులు మోయిస్తున్నప్పుడు, పొలాలు దున్నిస్తున్నప్పుడు బలం లేని ఎద్దులు బరువులు మోయలేక నాగళ్లు లాగలేక చాలా బాధపడుతున్నాయి. అంతే కాదు మనుషులు ఆ ఎద్దుల్ని కొట్టి, ములుకర్రలతో పొడిచి బాధిస్తుంటే చూడలేక దుఃఖం కలుగుతోంది” అని ఏడుస్తూ చెప్పింది.

సురభి మాటలు విని ఇంద్రుడు “సురభీ! నీకు ఎన్నో వందల సంతానం ఉంది. అన్నింటికీ ఒకే రకమైన దుఃఖం కలగదు కదా! బాధపడకు” అంటూ ఓదార్చాడు.

ఇంద్రుడి మాటలకి సురభి “దేవా! బలంలేని సంతానం బాధపడుతుంటే నేను ఎలా చూడగలను” అంది.

ఇంద్రుడు సురభి బాధని పోగొట్టాలని బాగా వర్షాలు కురిపించి గడ్డి బాగా పెరిగేటట్టు చేసి బలం లేని ఎద్దులకి బలం వచ్చేటట్టు చేశాడు. ఇది నేను చెప్పింది కాదు ఇంద్రుడు సురభి మాట్లాడుకోవడం వేదాల్లో కూడా ఉంది.

కనుక ధృతరాష్ట్ర మహారాజా! నీకు పుత్రులమీద ఉన్న ప్రేమ చాలా గొప్పది. అయినా అడవుల్లో కష్టాలతో మగ్గుతున్న పాండవులమీద దయ చూపించు” అన్నాడు. వ్యాసమహర్షి పరోక్షంగా సుఖాల్లో ఉన్న పిల్లల మీద కంటే, కష్టాల్లో ఉన్న పిల్లల మీద ఎక్కువ ప్రేమ చూపించాలి అని చెప్పాడు.

వ్యాసమహర్షి ధృతరాష్ట్రుడితో “రాజా! నువ్వు, పాండురాజు, విదురుడు మీ ముగ్గురి మీద నాకు సమానమైన ప్రేమ ఉంటుంది. అదే విధంగా గొప్ప కీర్తి కలిగిన నీ వందమంది కొడుకులు, పాండురాజు అయిదుగురు కొడుకులు నీకు సమానమే అని తెలుసుకోవాలి.

మంచివాళ్ల స్నేహం వల్ల, చెడ్డవాళ్లు కూడా మంచివాళ్లుగా మారతారు. ధర్మరాజుతో సహవాసం చేస్తే నీ కొడుకు కూడా ధర్మమార్గంలో నడుస్తూ ప్రశాంతంగా ఉండవచ్చు. రాజర్షి అయిన ధర్మరాజుతో దుర్యోధనుడు స్నేహంగా ఉండడం ప్రజలకి కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. దానివల్ల రెండు వైపుల వాళ్లకి మేలు కలుగుతుంది” అని చెప్పాడు.

వ్యాసమహర్షి చెప్పినది విని ధృతరాష్ట్రుడు వ్యాసమహర్షికి నమస్కరించి “మునీంద్రా! కురుకులాన్ని కాపాడాలనే కోరిక మీకు ఉంటే మీరే దుర్యోధనుడికి బోధించండి. అతడు నా మాట వినడు” అన్నాడు. మహానుభావుడైన మైత్రేయమహర్షి వచ్చి దుర్యోధనుడికి ధర్మాన్ని బోధిస్తాడని చెప్పి వ్యాసమహర్షి అక్కడనుంచి వెళ్లిపోయాడు.

వ్యాసమహర్షి చెప్పినట్టే ధర్మమూర్తి అయిన మైత్రేయ మహర్షి కామ్యకవనంలో ఉన్న పాండవుల్ని చూసి ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చాడు. ధృతరాష్ట్రుడు తనకి మంచి జరగాలని ఆశించి మైత్రేయమహర్షికి భక్తితో పూజించాడు. విశ్రాంతిగా కూర్చున్న మహర్షితో ధృతరాష్ట్రుడు “మహానుభావా! మీరు ఎక్కడినుంచి ఇక్కడికి వచ్చారు?” అని అడిగాడు.

మైత్రేయమహర్షి “కురువంశంలో పుట్టిన ఉత్తముడవైన మహారాజా! నేను తీర్థయాత్రలు చేస్తూ కురుక్షేత్రానికి సమీపంలో ఉండే అరణ్య ప్రాంతాలకి వెళ్లి అక్కడ నివసిస్తున్న పాండవుల్ని చూశాను. వాళ్లు కామ్యకవనంలో తపస్సు చెయ్యడం వల్ల పెరిగిన జడలతో, మోటుగా ఉండే నారబట్టలు కట్టుకుని కాయలు, కూరలు, పండ్లు ఆహారంగా తీసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పుడు నిన్ను నీ కుమారుణ్ని చూడాలని వచ్చాను” అన్నాడు.

మైత్రేయమహర్షి మాటలకి ధృతరాష్ట్రుడు తలవంచుకుని “అయ్యా! ఎప్పుడూ సత్యాన్నే పలికే పాండవులు క్షేమంగా ఉన్నారా? మమ్మల్ని ఎప్పుడైనా తలుచుకుంటున్నారా? యముడితో సమానమైన పరాక్రమం కలిగిన పాండవులు కురు, పాండవ సోదర భావానికి విఘాతం కలుగకుండా అంతకు ముందు తాము ఒప్పుకున్నదానికి కట్టుబడి ఉంటారు కదా?” అని అడిగాడు.

ధృతరాష్ట్రుడు అడిగినదానికి మైత్రేయమహర్షి “మహారాజా! అనేకమంది మహర్షులు వస్తూ దీవెనలు ఇస్తూ ఉండడం వల్ల, స్వతహాగా ధర్మబుద్ధి కలిగి ఉండడం వల్ల పాండవులు క్షేమంగానే ఉన్నారు. నువ్వు అడిగినట్టు పాండవులు తాము చేసిన ప్రతిజ్ఞని జవదాటితే సూర్యచంద్రులే గతులు తప్పుతారు. అటువంటి వాళ్లని నీ కొడుకు కారణం లేకుండానే శత్రువుగా మారి వంచించాడు” అన్నాడు.

మైత్రేయమహర్షి దుర్యోధనుడితో “బుద్ధికలవాడివైతే పాండవులతో విరోధం వదిలిపెట్టు. అలా చేశావంటే నీకూ, పాండవులకీ, కురువంశానికీ మేలు కలుగుతుంది. నా మాట విను. పాండవులు వజ్రంతో సమానమైన శరీరం కలవాళ్లు. మహాపరాక్రమం కలిగినవాళ్లు, ఉత్సాహవంతులు, ప్రతి ఒక్కళ్లు పదిలక్షల బలం కలవాళ్లు. భీకర యుద్ధాన్ని ఇష్టపడతారు.. వాళ్లల్లో భీముడు పదివేల ఏనుగుల బలం కలిగిన జరాసంధుణ్ని ఒంటరిగా ఓడించి చంపిన అద్భుత వీరుడు. బకుడు, హిడింబుడు, కిమ్మీరుడు మొదలైన రాక్షసుల్ని రాక్షసంగా చంపిన భీముణ్ని ఎదిరించగలిగిన యోధులు ఎక్కడ ఉన్నారు?

బంధువైన శ్రీకృష్ణుడు, దృష్టద్యుమ్నుడు పాండవులకి తోడుగా ఉంటారు. ముసలితనము, చావు కలిగిన మనుషులు ఎవరూ వాళ్లని ఎదిరించి బ్రతకలేరు. నువ్వు వాళ్లతో పొత్తు కుదుర్చుకోడం మంచిది” అని చెప్పాడు.

దుర్యోధనుణ్ని శపించిన మైత్రేయమహర్షి

దుర్యోధనుడు మైత్రేయమహర్షి మాటల్ని తిరస్కరించాడు. తన కాలి బొటనవేలిని నేలమీద రాస్తూ చేయెత్తి తన తొడలమీద చరిచి చప్పుడు చేస్తూ మైత్రేయమహర్షిని పరిహాసం చేశాడు.

మైత్రేయమహర్షికి కోపం వచ్చి “నువ్వు చేసిన ఈ అపరాధం వల్ల ఘోర యుద్ధం జరుగుతుంది. అందులో భీముడు తన గదతో కొట్టిన దెబ్బకి నీ తొడలు విరుగుతాయి” అని శపించాడు. మహర్షి ఇచ్చిన శాపానికి ధృతరాష్ట్రుడు భయపడి శాపాన్ని ఉపసంహరించుకోమని మహర్షిని వేడుకున్నాడు.

మైత్రేయ మహర్షి “దుర్యోధనుడు తను చేసిన పనికి బాధపడి, పశ్చాత్తాపం పొంది మంచి బుద్ధి ఏర్పరుచుకుంటే ఈ శాపం వర్తించదు. అలా కాకుండా అతడు అహంకారంతో ప్రవర్తిస్తే శాపాగ్ని ఫలితాన్ని తప్పకుండా అనుభవిస్తాడు” అని చెప్పాడు.

శాంతంగా ఉన్న మైత్రేయ మహర్షితో ధృతరాష్ట్రుడు “మహర్షీ! కిమ్మీరుడు అనే రాక్షసుడు భయంకరమైన అడవిలో భీముడితో చంపబడిన గొప్పదైన, అపురూపమైన ఆ విషయాన్ని వివరింగా చెప్పండి” అని అడిగాడు.

“నీ కొడుకు నేను చెప్పిన మాటలు వినలేదుకదా- నువ్వడిగిన విషయాన్ని నేను ఎందుకు చెప్తాను. పాండవులకి సహాయంగా ఉంటూ అరణ్యవాసం చేస్తున్న బ్రాహ్మణులు విదురుడికి భీముడు కిమ్మీరుణ్ని సంహరించిన గాథని చెప్పారు. ఆ విషయాన్ని నువ్వు విదురుణ్ని అడిగి తెలుసుకో” అని చెప్పి మైత్రేయమహర్షి వెళ్లిపోయాడు.

భీముడు కిమ్మీరుడు అనే భయంకరమైన రాక్షసుణ్ని ఎలా సంహరించాడో విదురుడు ధృతరాష్ట్రుడికి వివరించాడు..

అడవుల దారి పట్టిన పాండవులు మూడు రాత్రులు, పగళ్లు ప్రయాణం చేస్తూ కామ్యకవనం వైపు వెడుతున్నారు. ఆ సమయంలో ఒకనాటి అర్థరాత్రి అతి పెద్ద శరీరంతో; నోరు తెరుచుకుని బయటికి వచ్చిన కోరలతో; ఎర్రనైన మిడిగుడ్లతో; సూర్యుడి కిరణాలకి ప్రకాశిస్తున్న మేఘం గర్జిస్తున్నట్టుగా గర్జిస్తూ.. అడుగుల వేగానికి భూమి కంపిస్తుంటే ఎప్పుడూ చూడని భయంకరమైన ఆకారంతో ఒక రాక్షసుడు కనిపించాడు.

ఆ రాక్షసుడి పేరు కిమ్మీరుడు. ఎదురుగా బ్రాహ్మణుల గుంపుకి ముందు జింకతోళ్లు వస్త్రాలుగా ధరించి నడుస్తున్న పాండవుల్ని కిమ్మీరుడు చూశాడు. రాక్షసుణ్ని చూసిన ద్రౌపది భయంతో కళ్లు మూసుకుంది. పాండవులు అయిదుగురు ఆమెని పట్టుకుని ధైర్యం చెప్పారు.

పాండవుల వెంట ఉన్న పురోహితుడు ధౌమ్యుడు రాక్షసుడు ప్రయోగిస్తున్న మాయావిద్యల్ని ఆపుచేశాడు. ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్న రాక్షసుడు కోపంతో ఇంకా ఎర్రబడిన కళ్లతో పాండవుల వైపు చూస్తున్నాడు. అతణ్ని చూసి ధర్మరాజు “నువ్వు ఎవరు? నీకు సంబంధించినవాళ్లు ఎవరు? ఈ అడవిలో ఎందుకు ఉన్నావు?” అని అడిగాడు.

ఆ రాక్షసుడు ధర్మరాజుతో “నేను బకుడనే రాక్షసుడికి తమ్ముణ్ని. నా పేరు కిమ్మీరుడు. ఈ అడవిలో తిరుగుతూ అన్ని ప్రాణుల్ని చంపి తింటూ ఉంటాను. మాయా యుద్ధంలో గొప్పవాడిని. దేవతలు కూడా యుద్ధంలో నాతో గెలవలేరు. భయంతో ఈ కామ్యకవనం వైపు రాకుండా అందరూ చాలా దూరంలో ఉంటారు. ఇంతకీ మీరెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు మిమ్మల్ని చంపి భక్షిస్తాను” అన్నాడు.

కిమ్మీరుడు చెప్పింది విని ధర్మరాజు “నేను ధర్మరాజుని, ఇతడు భీముడు, అతడు అర్జునుడు, వాళ్లిద్దరు కవలలు నకుల సహదేవులు. మమ్మల్ని పాండవులు అని పిలుస్తారు. ఒక కారణం వల్ల అనుకున్న ఒప్పందం ప్రకారం మేము అడవికి రావలసి వచ్చింది” అన్నాడు.

ధర్మరాజు చెప్పిన మాటలు కిమ్మీరుడుకి ఆవేశం కలిగించాయి. పెద్దగా నవ్వుతూ “ ఏమిటీ.. నా అన్న బకుడిని, నా స్నేహితుడు హిడింబుణ్ని చంపిన భీముడు వీడేనా. వీడిని చంపాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను. ఇంతకాలానికి వీడే నాకు తారసపడ్డాడు. ఇప్పుడు వీణ్ని చంపి అగస్త్యమహర్షి వాతాపిని జీర్ణం చేసుకున్నట్టు నేను వీడిని ఆరిగించుకుంటాను” అని గర్జిస్తూ చెప్పాడు.

రాక్షసుడి మాటలకి ధర్మరాజుకి కోపం వచ్చింది. అతడి కోపం గ్రహించిన అర్జునుడు గాండీవాన్ని ఎక్కుపెట్టాడు. నకులసహదేవులు కత్తులు దూశారు.

కిమ్మీరుణ్ని చంపిన భీముడు

భయంకరమైన పరాక్రమం కలిగిన భీముడు, కిమ్మీరుడు పెద్ద పెద్ద చెట్లు పీకి చేత్తో పట్టుకుని పెడబొబ్బలు పెడుతూ యుద్ధం మొదలుపెట్టారు. యుద్ధం చేస్తున్న వాళ్లిద్దర్నీ చూస్తుంటే పెనుతుఫాను వస్తున్నప్పుడు వచ్చే గాలికి సముద్రం ఎలా ఉప్పొంగుతుందో అలా గర్వంతో ఉప్పొంగిపోతూ కనిపించారట.

వాళ్లు యుద్ధానికి ఆయుధాలుగా ఉపయోగిస్తున్న చెట్లు వాళ్ల తలలకి తగిలి ముక్కలుగా విరిగి పోతున్నాయి. దగ్గరలో ఉన్న చెట్లు అన్నీ అయిపోయాక రాళ్లతో కొట్టుకున్నారు. సూర్యుడు రాహువుని పట్టుకున్నట్టు భీముడు కిమ్మీరుణ్ని పట్టుకున్నాడు. కిమ్మీరుడి బలం తగ్గి పోయిందని గ్రహించాడు. అతడి కంఠాన్ని పట్టుకుని నేలమీద పడేసి బకుడిని చంపినట్టే మోకాళ్లతో పొడిచి పొడిచి చంపేశాడు.

చచ్చిపడిన కిమ్మీరుణ్ని చూసి బకుడు, హిడింబుడు చచ్చిపోయారని బాధపడ్డావు కదా! ఇప్పుడు నువ్వు కూడా వాళ్లని కలుసుకోడానికి నరకానికి వెళ్లు! అంటూ దారికి అడ్డు లేకుండా రాక్షసుడి కళేబరాన్ని దూరంగా విసిరేశాడు భీముడు.

కిమ్మీరుణ్ని సులువుగా చంపి పారేసి కామ్యకవనంలో నివసించేవాళ్లకి రాక్షసభయం లేకుండా చేసిన వాయుపుత్రుడైన భీముడ్ని ధర్మరాజు, అర్జునుడు, నకులసహదేవులు, ధౌమ్యుడు, బ్రాహ్మణులందరు పొగిడారు” అని విదురుడు ధృతరాష్ట్రుడికి కిమ్మీరుడి వధ గురించి వివరంగా చెప్పాడు. అది విన్న కౌరవులకి భయం కలిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here